5, నవంబర్ 2026, గురువారం

జీవన మంజూష 11/26

 


నేస్తం,

          అమ్మ బొజ్జలో వున్నప్పుడే అన్నీ విని నేర్చుకోవడానికి మనమేమన్నా అభిమన్యులమా! పుట్టక మునుపో, పుడుతూనో  ప్రపంచంలో విషయాలన్నీ నేర్చుకోవడం మనకు సాధ్యమా! మనకు తెలిసినది గోరంత, తెలియనిది కొండంత. దీనికే ఇంత మిడిసిపడితే ఎలా? ఏదో అదృష్టం కలిసివచ్చి నాలుగు రాళ్ళు వెనకేసినంత మాత్రాన మనమేమీ తోపులం కాదు. అవకాశం కలిసొస్తే అందరూ అందలాలు ఎక్కేస్తారు. దీనికోసం పెద్ద తెలివితేటలు అవసరం లేదు. సంపాదనదేముంది ఏ రకంగా అయినా సంపాదించుకోవచ్చు. 

           సాయం చేయాలని అనుకున్నప్పుడు, ఎదుటివారి లోపాలతో పనేముంది? మనం సాయం చేయగలిగినప్పుడు, ఏవిధంగానైనా సహాయం అందించవచ్చు. పై పై మాటలు చెప్పినప్పుడే ఎదుటివారి లోపాలు వారికి కాకుండా, నలుగురికి చెప్పి నవ్వులపాలు చేయాలని చూసే మన సంస్కారం ఈరోజు కాకపోయినా రేపయినా ఆ నలుగురికి తెలుస్తుంది. ఈరోజు మనదైనప్పుడు మరోరోజు ఎదుటివారిది తప్పకుండా అవుతుంది. ఇది జగమెరిగిన సత్యం.  

               ఈ ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకటిగా వుండరు. ఒకొక్కరికి ఒక్కో ప్రతిభ వుంటుంది. మనకున్న ప్రతిభే గొప్పదని మనం భావిస్తే, ఎదుటివారిలో ప్రతిభ మనకెప్పటికీ కనిపించదు. మన సాయం కోరిన మనిషిని తక్కువ చేయడం, మనలోని అసలైన మనల్ని చూపెడుతుంది. మన స్థాయిని గొప్పగా చూపించడానికి, ఎదుటివారికి ఏమి తెలియదని చెప్పడం, అది రాదు, ఇది రాదు అనడం సరికాదు. మనమీ స్థాయికి ఒక్కసారిగా వచ్చేసామా! అని తరచి చూసుకుంటే సత్యం బోధపడుతుంది. 

                ఏ పనైనా అనుభవంతోనే నేర్చుకుంటారు. మన అనుభవంతో సాయమందించడం మన విజ్ఞత. ఉదాహరణకు ఓ గొప్ప సంస్థలో మనం పెద్ద పొజిషన్ లో వుంటే, చిన్నాచితక ఉద్యోగాలు తెలిసిన వారికి దక్కేలా చేయడానికి కూడా..అది రాదు, ఇది రాదు అని సాకులు చెప్పి వారిని డిస్కరేజ్ చేయడం మన చేతిలో పనే. అదే పనిని వారికి ఉద్యోగం దక్కేలా చేస్తే..! చేయాలన్న ఇంటెన్షన్ మనకు వుంటే ఏదయినా చేయగలం. చేయవద్దు అనుకున్నప్పుడే సవాలక్ష కారణాలు చెబుతాం. 

            “నవ్విన నాపచేనే పండుతుంది”. అన్న నానుడి ఎంత నిజమో మన అందరికి తెలుసు. ఏదీ రాదు, చాతకాదు అన్న వారితోనే అన్నీ చేయగలరు అనిపించే సమయం మనకు రాకుండాపోదు. కాస్త ఓపికగా వుంటే అందరికి,అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. ప్రతిభ, సమర్థత ఏ ఒక్కరి సొత్తు కాదు. అవకాశం కలిసివచ్చే సమయం ఆసన్నమైతే చాలు. ప్రపంచానికి మనం పరిచయం కావడానికి ఓ క్షణం చాలు. ఆ క్షణకాలమే చరిత్ర లిఖిస్తుంది..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner