5, జనవరి 2014, ఆదివారం

శిరస్సు వంచండి....!!

ఒక్కోసారి వింతగా అనిపిస్తూ ఉంటుంది...ఈ అంతర్జాలం....!! ఈ స్నేహాలు, పరిచయాలు....ఇక ముఖపుస్తకమయితే చెప్పనక్కర లేదు...ఎందుకు స్నేహం అంటారో తెలియదు...అసలు రూపాలు ఉండవు...కొసరు మాటలే ఉంటాయి...స్నేహానికి మీ అర్ధం  ఎదుటి వారికి కూడా తెలిసేటట్లు ఉండాలి....ఉన్న కొద్ది సమయంలో
మన పనిలో మనం ఉంటే మధ్యలో అంతరాయాలు...అక్కరకు రాని మాటలు...సమాధానం చెప్పక పొతే చెణుకులు మిణుగురు పురుగుల్లా....అందరి సమయము విలువైనదే అండి...మీ జీవితం మీకు ఎంత ముఖ్యమో ఎదుటి వారి జీవితం కూడా వారికి అంతే ముఖ్యం అని అర్ధం చేసుకోండి....మన బంధాలను నిర్లక్ష్యం చేయకుండా కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు ఉండకండి...మూలాలు మరచిపోతే మనకే నష్టం....మనం ఎక్కిన కొమ్మను మనమే నరుక్కున్న చందాన అయిపోతుంది....మానసికమా.. శారిరకమా... అన్నది మన మనసు విజ్ఞత సంస్కారం మీద ఆధారపడు ఉంటుంది...అందరికి తెలిసిందే అయినా  చెప్తున్నా.. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు..మాన్ జీవితం ఎంత బావున్నా ఇంకా ఏదో లేదని వెలితిగా ఉందని అనుకుంటూ అందని దాని కోసం ఆశ పడుతూ ఉంటాము....తప్పేం లేదు...ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆశ పడే మన మనసుదే ఆ ఆట మనతో....ఇటు మన సంస్కృతి సంప్రదాయాలు..అటు పాశ్చ్యాత్య సంస్కృతి వైపుమోగ్గు చూపుతున్న ఎందరో....వారిలోనూ చక్కని మంచి తనముంది...కాని మనకి అది నచ్చదు....ఆధునికత పేరుతో...రోంలో ఉంటే రోమన్ లా ఉండాలని అనుకుంటూ...మనం మనల్ని మర్చి పోతూ...దూరపు కొండలు నునుపు అన్న సామెతను నిజం చేస్తూ...అబద్దంలో ఉండి పోవాలనుకుంటూ... అదే జీవితమని భ్రమలో ఉండిపోతున్నాము...మన విలువలను, విజ్ఞానాన్ని ప్రపంచం యావత్తు గౌరవిస్తుంటే మనం దానికి వలువలు లేకుండా చేస్తున్నాము...నాగరికత ఏదైనా దానిలోని మంచికి శిరస్సు వంచండి....!! స్నేహాలను సంప్రదాయాలను వాటి అభిమానాలకు, అర్హతలకు మచ్చ రాకుండా... ఆధునిక విజ్ఞానాన్ని ఆనందంగా అనుభవిస్తూ... మీ తోటి నలుగురికి ఆ ఆనందపు హాయిని అందించండి...!!

4, జనవరి 2014, శనివారం

అందమైన నక్షత్రాలు....!!!



రాలిపోయిన పువ్వులా వాడి పోయిన మొగ్గలా
వన్నెలు తరిగి వెలసి పోయిన రంగుల జీవితం
అక్కడక్కడా మట్టి చారికలు వెక్కిరిస్తూ
అంతలోనే పక్కన వాన నీటి గుర్తులు
ఇంకిన కన్నీటి సంద్రానికి  సరిహద్దుగా
గుంటలు పడిన పై కప్పులో కనిపిస్తూ
గొంతును నొక్కేసిన రక్కసి ఉక్కు పాదాలు
జరుగుతున్న రాక్షస క్రీడలో తమ భాగంగా
న్యాయం నోరు నొక్కేసి చట్టం కళ్ళను కప్పేసి
అన్యాయానికి పట్టం కట్టే అఖండ సింహాసనం
కబంధ హస్తాల నడుమ నలిగి రాలిపోయిన
లేత చివురాకుల జ్ఞాపకాల చుక్కల ముక్కలు
ఆకాశంలో తారాడే అందమైన నక్షత్రాలు
చీకటి చుట్టానికి నేస్తాలు
పగిలిన మనసుకు బంధాలు
ఒంటరిగా మిగిలి పోయిన జీవశ్చవాలు....!!

3, జనవరి 2014, శుక్రవారం

నవరత్నాల రాజసాన్ని.....!!

రత్నాల రాశులు కుప్పలుగా పోసి
నక్షత్రాల వెలుగులో నీ కోసం చూస్తూ....
ముత్యాల రాశిలో మురిపెంగా చేయి వేసా
జల జలా జారిపోయింది చేతికందకుండా
నీ కోసమే ఈ ముత్యాల పానుపంటూ...
పగడాల రాశి పక్కున నవ్వింది
పలువరుస తళుక్కుమనేలా
నీ చిరు దరహాసంతో పోటి పడుతూ...
మాణిక్యం మెల్లగా జారుకుంది
నీ బుగ్గల కెంపుల కాంతికి తడబడి పోతూ...
మరకతమణి పచ్చని పచ్చికను స్పృశించిన
అనుభూతిని అందించింది నీ స్పర్శలో...
పుష్యరాగాల సరాగాల రవళి
నీ పాదాల సవ్వడిలో చేరి
గోమేధికాల అడుగుల్లో కలసి పోయి
వజ్ర వైడూర్యాల నీల మణిని
నవరత్నాల రాజసాన్ని ఏర్చి కూర్చి
నాకందించిన విధాతకు వందనాలు...!!

1, జనవరి 2014, బుధవారం

మనసు కవిత్వం....!!

మాటలలో మనసు తెలుస్తుంది అంటారు.. అది నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి...!! చక్కని పరిచయంలో తొణికిన పలుకుల భావాలు మనసులో నుంచి ఆశువుగా చెప్పిన అక్షర కర్త ఆశు కవిత్వం....మనసు కవిత్వం...... మీ అద్భుత భావ జాలానికి వందనాలు..... 

మనసు విప్పి మాటాడితే ముదితా..
ఎదకు హాయి కలిగె నెందుకో...
పెదవి దాటి రాని భావమేదో తడిమిపోయే నెందుకో....!!

నీ నవ్వుల పువ్వులతో
నవలోకాన్ని సృష్టించావు....!!
నా బ్రతుకులో ఆనంద
రంగవల్లులే చిత్రీకరించావు....!!

పదాల పూమాలలతో
వాగ్దేవిని అలంకరించనా....!!
హృదిలో తీపి భావనతో
మది రాణిని అర్చించనా...!!

కొత్త సంవత్సర శుభాకాంక్షలు....!!

కాలం పరుగెత్తి పోతూనే ఉంది
రోజు సూర్య చంద్రులను మార్చుకుంటూ
క్షణాలను నిమిషాలుగా చేసి
ఆ నిమిషాలను గంటలుగా మార్చి
రోజులుగా రూపుదిద్దుకుని
వారాలు నెలలుగా రూపాంతరం చెంది
సంవత్సరంగా మారుతూ....
దానిలో బోలెడు జ్ఞాపకాలను
వాటిలో జీవితాలను మోసుకుంటూ
మరో కాలండరు మారిపోవడానికి
సమాయుత్తమవుతూ.....
క్రొంగొత్త ఆశలతో మార్పు కోసం 
కొత్త కాలండరు వత్సరానికి స్వాగతిస్తూ
అందరికి ఆనందంగా ఉండాలని ఆశ పడుతూ
అందరికి ఆంగ్ల కొత్త సంవత్సర శుభాకాంక్షలు....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner