9, జనవరి 2020, గురువారం

ఇదేం న్యాయమదెచ్చా...!!

ప్రజా ప్రతినిధులకన్నీ వెసులుబాట్లే... ప్రజలకు మాత్రమే ఆంక్షల వెతలు, శిక్షలు... 
పరీక్షలకు ఓ నిమిషం ఆలశ్యం అనుమతించని దొర..తన సమావేశానికి ఆలశ్యంగా వస్తున్నారని కోపం చేసుకుంటే సరిపోతుందా..మరి అసెంబ్లీ సమావేశాలకు ఆలశ్యంగా వచ్చే వారిపై ఏ చర్యలు ఉండవా అదెచ్చా..!!

జీవన 'మంజూ'ష (జనవరి2020)

నేస్తం,
     హింస మానసికమైనా, శారీరకమైనా ఫలితం మాత్రం మరణమే అవుతోంది. ఆ మరణం బలవన్మరణం కావడానికి వ్యవస్థ, వ్యవస్థలోని మనం ఎంత వరకు కారణమన్నది ఆలోచించాలి. ఒంటరితనం, ఆర్థిక అవసరాలు, అధికారిక వేధింపులు, ప్రేమ వైఫల్యాలు, కోపతాపాలు ఇలాంటి మరెన్నో కారణాలు పేదా గొప్ప తేడా లేకుండా ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయి. క్షణాల నిర్ణయాలు ఎన్నో జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అధికార దాహం, ఆర్థిక అవసరాలు, కులమత విభేదాల వంటి సవాలక్ష కారణాలు హత్యలకు కారణాలౌతూ ఎన్నో ప్రాణాలను అవలీలగా తీసేస్తున్నాయి. లింగ వివక్ష భ్రూణ హత్యలకు మరో కారణం.
        పైశాచిక, పాశవిక హత్యలకు ఎన్ కౌంటర్లు సమాధానం కాదు, తాత్కాలిక ఊరట మాత్రమే. ఈ ఎన్ కౌంటర్లు హైలీ రెస్పెక్టెడ్ దోషులకు మినహాయింపుగా ఉన్నాయి. చట్టం దృష్టిలో అందరు సమానమయినప్పుడే సమ న్యాయం జరుగుతుంది సామాన్యులకు. సమస్య మూలాలను నాశనం చేయగలిగినప్పుడే వ్యవస్థలో నేరాలు తగ్గుతాయి. తప్పు చేయాలంటే చట్టం వేసే శిక్ష ముందు గుర్తు రావాలి. చట్టం, న్యాయం అధికారానికి తలొగ్గినప్పుడు సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షే అవుతుంది.
      చనిపోవడానికి కావాల్సిన ధైర్యంలో ఓ వంతు ధైర్యం చాలు దివ్యంగా బతికేయడానికి. సమస్య జీవితకాలం మన జీవితకాలంతో పోల్చుకుంటే చాలా చిన్నది. సమస్యలు వస్తూపోతూ ఉంటాయి. క్షణికావేశంలో తీసుకునే ఈ ఆత్మహత్యల నిర్ణయాల వలన ఎన్ని అవమానాలు కుటుంబానికి ఎదురౌతాయెా అని ఓ క్షణం ఆలోచిస్తే ఈ నిర్ణయం తీసుకోరు. సమస్యను అధిగమించడానికి చావు పరిష్కారమనుకుంటే ఈ ప్రపంచంలో మనిషి మనుగడే ఉండకూడదు. ఏ సమస్యా లేని మనిషి ఒక్కడు కూడా ఉండడు. సమస్యకు భయపడుతూ బతకకూడదు. సమస్యను భయపెడుతూ బతకాలి.
      చావు పుట్టుకలు సహజం. అలాగే మనిషన్నాక ప్రతి వారికి సమస్యలూ సహజమే. సమస్యను అధిగమించడానికి ప్రయత్నించాలి కాని చావు పరిష్కారమని మన తరువాతి తరాలను తప్పు దోవ పట్టించకూడదు. చావు సహజ మరణం కావాలి కాని కారణమేదైనా బలవన్మరణం కాకూడదు.  మరో మనిషికి బతకడానికి ఆదర్శం కావాలి మన జీవితం. అంతేకాని అర్ధాంతర ముగింపుకి అంకురం కాకూడదు. గొప్పదనం చావుతో రాదు. బతకడంలో వస్తుంది. బతికించడంలో వస్తుంది...!!

8, జనవరి 2020, బుధవారం

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి...!!

నేస్తం, 
         నా చిన్నప్పుడు పత్రికలన్నా, రచయితలన్నా,  జర్నలిస్ట్లన్నా చాలా గొప్పగా ఉండేది. కాని ఇప్పటి రోజుల్లో మనం ఈ ముఖపుస్తకంలో వారి వారి వృత్తి, ప్రవృత్తిని,వయసుని బట్టి ఒక అంచనాకి రావడం చాలా కష్టమనిపిస్తోంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడు ఉంటాయి. ఆడవారందరు మంచివారూ కాదు, అలా అని మగవారందరూ చెడ్డవారూ కాదు. కొందరు చాలా హుందాగా వ్యవహరిస్తే, మరి కొందరు చాలా నికృష్టంగా ఉంటారు. దీనిలో పిన్నలు, పెద్దలు అనే తేడా లేదు. కొందరు కులాన్ని టార్గెట్ చేస్తే మరి కొందరు రాజకీయాలు అంటగడతారు తప్పితే నిజం ఏంటన్నది ఆలోచించరు. ఎదుటివారి అభిప్రాయం మనకు నచ్చనప్పుడు పక్కకు వెళిపోవడం పద్దతి. అంతేకాని బూతుల పురాణం వచ్చు కదా అని అది ఇదీ వాగకూడదు. మన మతం, కులం, రాష్ట్రం మనకెంత ముఖ్యమెా పక్కవారికి కూడా అంతే అభిమానముంటుందని మర్చిపోయి ప్రవర్తిస్తే, వాళ్ళు ఊరుకోరని గుర్తుంచుకోవాలి. ప్రాంతీయాభిమానం లేకుండా ఎవరూ ఉండరు. 
       ఇక పిలుపుల విషయానికి వస్తే నోటి నుండి వచ్చిందా, నాభి నుండి వచ్చిందా అని తెలుసుకోగలిగితే బావుండు. అమ్మ, అక్క, చెల్లి అని పిలుస్తారు కాని కొందరు ఆ పిలుపులను కూడా కలుషితం చేస్తూ బంధాలపై ఉన్న నమ్మకాన్ని చెడగొడుతున్నారు. అమ్మా అని పిలుస్తూ అమ్మని బ్రోకర్ గా మార్చడానికి ప్రయత్నించే వెధవలు, అక్కా అని అంటూనే అడ్డమైన వాగుడు వాగే త్రాష్టులు ఇలా నానా రకాలైన దరిద్రులు ఈ ముఖపుస్తకంలో ఉన్నారు. 
       ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే చాలు ఇక మెదలు... మనమేమెా మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారని యాక్సెప్ట్ చేస్తే కొందరు ఎంత ఛండాలంగా ప్రవర్తిస్తారంటే చెప్పడానికి కూడ అసహ్యంగా ఉంటుంది. అలాంటి వెధవలను బయటపెట్టడం సెకను పని. కానీ ఎందుకులే అని బ్లాక్ చేసుకునే ఆప్షన్ వాడుకుంటారు చాలామంది. ముఖపుస్తకంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరితో చాటింగ్ చేయడమే పని కాదు, అందరితో స్నేహం చేయడమూ కాదు. కొందరు మన సహనాన్ని ఎంత పరీక్షిస్తారంటే..ఎందుకు చాట్ చేయవు, ఫ్రెండ్ గా ఉండొచ్చు కదా అంటూ పనికిమాలిన ప్రశ్నలు వేసి విసిగిస్తారు. 
       ఏదో నాలుగు ముక్కలు రాసుకునే మాలాంటి వారిని దయచేసి విసిగించకండి. మీకు కావాల్సిన బాపతు ఈ ముఖపుస్తకంలో చాలామంది ఉన్నారు. అందరు మీలాగా ఉండరు. కాస్త గమనించి మసలుకోండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏదనుకున్నా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి..!!

1, జనవరి 2020, బుధవారం

అమ్మవొడి.!!

రెక్కల చాటున
రెప్పల తడి
మౌనం మాటున
మనసు అలజడి

కలల పక్కన
కలతల ఉరవడి
అలలతో కలిసిన
కన్నీటి చిత్తడి

చుక్కల పక్కన
ఆశల హడావిడి
పెదవి అంచున
మాటల గారడి

జ్ఞాపకాలతో నిండిన
గతపు గుప్పిడి
జీవితపు అంచున
అనుభవాల రాపిడి

పదాలకు అందిన
భావాల సందడి
అక్షరాలకు దక్కిన
అరుదైన అమ్మవొడి ..!!


 
 


దశాబ్ది శుభాకాంక్షలు..!!

నా చిన్ననాటి నేస్తం అన్నట్టుగా.. అవును ఎందుకనకూడదూ... నూతన దశాబ్ది అని.. 
అందుకే ముందుగా శత్రువులతో మెుదలుబెట్టి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా నూతన దశాబ్ది శుభాకాంక్షలు కూడా.. 
😍
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner