15, ఫిబ్రవరి 2024, గురువారం

మనమెక్కడున్నాం..!!

         వ్యక్తిగత స్వేచ్ఛ లేని సమాజంలో మనం బతుకుతున్నామిప్పుడు. మాట్లాడే స్వేచ్ఛ కాని, తప్పుని ప్రశ్నించే హక్కు కాని లేని వ్యవస్థగా మారిపోయిన సమాజమిది. అధి’కారం, అహం’కారం మాత్రమే రాజ్యమేలుతున్న చోట మనిషి మనుగడే కాదు, వ్యవస్థ కూడా సర్వ నాశనమౌతుందనడానికి సాక్ష్యం మన ముందే వున్నా ఒప్పుకోలేని తెలివిగల మేధావులున్న ప్రాంతం మనది. 

      నువ్వు మాట్లాడాలంటే నాకు నచ్చినట్టు మాట్లాడు. నువ్వు సోషల్ మీడియాలో ఏదైనా రాయాలంటే నాకు నచ్చినట్టు రాయి. నువ్వు సినిమా తీయాలన్నా, డాక్యుమెంటరీ తీయాలన్నా, రీల్ చేయాలన్నా ఏదైనా సరే నీకంటూ స్వతంత్రత లేదు. ఇక్కడ ప్రతిదీ నాకు నచ్చినట్టే జరగాలి. లేదంటే కేసులు, కుళ్ళబొడవడాలు, ట్రోల్ చేయబడాలి వగైరా వగైరా చాలా జరుగుతాయి. ఆడ, మగ అన్న విచక్షణ కాని ముసలి, ముతక,పసిపిల్లలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు అన్న ఆలోచన కాని ఏదీ మన మానిఫెస్టోలో ఉండదు. ఇదే ప్రజాస్వామ్యం. నచ్చితే వుండు లేదంటే దొ..య్. ఇదే మన అధికారభాష.

     13న ఆన్ లైన్ లో ట్రెండ్ సెట్ మాల్ విజయవాడ లో స్క్రీన్1 లో 10.40 కి “రాజధాని FILES” సినిమా టికెట్లు బుక్ చేసుకుని, ఈరోజు సినిమాకి వెళితే సగం సినిమా వేసి ఆపేసారు. కోర్టు ఆర్డర్ వచ్చింది ఆపేయమని అని ఇంటర్వెల్ లో చెప్పారు. మేము ముందు స్నాక్స్ ఆర్డర్ కోసం వచ్చారనుకున్నాం. మేం సగం సినిమా చూసాం కదా, పూర్తిగా చూడనిదే వెళ్ళము అన్నాం. ముందు ఎంఆర్వో వచ్చి ఆపేయమన్నారు అన్నారు, కోర్ట్ ఆర్డర్ చూపించమన్నాం. సదరు ఎంఆర్వో అని చెప్పి తీసుకు వచ్చినాయన పటమట విఆర్వో గారట. ఆర్డర్ చూపించండి వెళిపోతామన్నాం. వాట్సప్ మెసేజ్ చూపించారు. మాకు ఆర్డర్ కాపి ప్రింట్ పేపర్ చూపించండి అంటే వారు బయటికి వెళ్ళారు తేవడానికి. 12.10 సినిమా ఆపేసారు. వీరు 1.10 కి కష్టపడి ఏవో సంతకాలు చేసిన ఆర్డర్ తెచ్చారు. ఈమధ్యలో కొసమెరుపుగా ఓ పోలీసాయన కూడా వచ్చి వారేదో చెప్పి, మీరు కేస్ వేసుకోండి అని, అక్కడే కాపలాగా నిలబడ్డారు. థియేటర్ వారిని జరిగినది రాసి సంతకం చేసి ఇవ్వమంటే వారు ఇవ్వలేదు. మెుత్తానికి సగం సినిమానే చూసాం.

        ఈ సంఘటన చాలామందికి పెద్దగా ఏం అనిపించక పోవచ్చు. నా ఈ సగం జీవితంలో ఇప్పటి వరకు ఇలా థియేటర్ లో సగం సినిమా చూసిన రోజు లేదు. ఇక్కడ సినిమా ఆపగలరు. ఇంకెక్కడా ఆపలేరు కదా. జరిగిన నిజాలు చూడకపోయినా అందరికి గుర్తే వున్నాయి. సినిమా ఆపినంత మాత్రాన జరిగేది ఆపలేరన్న నిజం ఇప్పటికయినా తెలుసుకోండి సదరు పెద్దలు. 

       నిజాలను తెరకెక్కించడానికే కాదు ధైర్యముండాల్సింది. దానిని చూడాటానికి కూడా అంతకన్నా ఎక్కువ ధైర్యం కావాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మన ఘనత నెరగనివారు లేరు. అన్నానంటే అన్నానంటారు కానండి ఈ సినిమా చూడనివారు…! 

      సగం సినిమా చూసినా చాలా చాలా సంతోషమనిపించింది.అదే క్షణంలో జరిగినవి, జరుగుతున్నవి గుర్తుకువచ్చి బాధ కూడా వేసింది. రైతు లేనిదే ప్రపంచానికి ఆకలి తీరదు. కాని ఆ రైతుకు, రైతు కష్టానికి విలువ లేదు. మనమే కాదు, మన భవిష్యత్ తరాలు కోల్పోయినదేమిటో, కోల్పోతున్నదేమిటో మన మూసుకుపోయిన కళ్ళు తెరిపించడానికి చేసిన ఓ గొప్ప ప్రయత్నమిది. మేం చూడలేక పోయినా చూడగలిగిన అవకాశమున్న ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా “రాజధాని FILES”. 

       2000 సంవత్సరంలో నాకు తెలిసిన రవిశంకర్ గారు ఆబ్జెక్ట్ వన్ సిఈవో. అప్పట్లో జావా నేర్చుకోవడానికి అమీర్పేటలో వెళుతుండేదాన్ని. అప్పుడే “తెలుగు వన్” కు శ్రీకారం చుట్టారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు, తర్వాత ఈ “ తెలుగు వన్” తెలియని వారు అక్కడ లేరంటే అతిశయోక్తి కాదు. మెున్నీమధ్యన మారుమోగిన హైటెక్ సిటీ విజయఢంకాలో వీరి మాటలు కూడా విన్నాను. ఇప్పుడు వీరి ప్రెస్ మీట్ కూడా చూసాను. వాస్తవాలు చెప్పారు. భానుగారు కూడా బాగా చెప్పారన్నీ. స్క్రీన్ ప్లే ఎంత బావుందంటే సినిమా చూసి తీరాల్సిందే. హాట్సాఫ్ భానుగారు.

       “రాజధాని FILES”  సినిమా మెదటి నుండి అద్భుతంగా తీసారు. భూమి విలువ, రైతు విలువను చెప్పిన సినిమా. ఇంతకు ముందు రైతుల గురించి చాలామంది చాలా సినిమాలు తీసారు. కమర్షియల్ గా గెలిచి వుండవచ్చు. సమస్యను చెప్పడం చాలామంది చేస్తారు. ఈ సినిమాలో సమస్యకు చెప్పిన పరిష్కారం చూడలేక పోయాను మన హైలీ రెస్పెక్టెడ్ వారి వల్ల. ఏదేమైనా సదరు హైలీ రెస్పెక్టెడ్ వారికి మనమే కాదు ఈ సినిమా యూనిట్ మెుత్తం కూడా థాంక్స్ చెప్పాలి. ఓ మంచి సినిమాతో బోణి చేసిన రవిశంకర్ గారికి, ఇంత మంచి సినిమా కు సహకరించిన సినిమా యూనిట్ అందరికి హృదయపూర్వక అభినందనలు. 


12, ఫిబ్రవరి 2024, సోమవారం

మన వెధవల సంస్కారం..!!

     ఒకావిడ ఏదో తన పుట్టినరోజున వాళ్ళాయన బయటికి తీసుకువెళుతున్న ఆనందాన్ని తన రీల్ లో పంచుకుంటే మన దిక్కుమాలిన వెధవల కామెంట్లు చూసి చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి ఏమనలేదు ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పలేదు అని అంది. దానికి ఈ వెధవలు మీ ఆయన మీ నాన్నలా వున్నాడు, నువ్వు చాలా యంగ్ అంటూ ఇంకా చాలా చెప్పలేని విధంగా కామెంట్లు. ఈ వెధవలకు మరి ఆడవాళ్ళు అస్సలు తెలియదు కాబోలు. ఆ కామెంట్లలో నా లిస్టులో వున్న వెధవలని కూడా పీకేసాను. పాపం ఆవిడ పుట్టినరోజన్న సంస్కారం కూడా లేని ఈ దిక్కుమాలిన దరిద్రులు మరి ఓ అమ్మకు, అబ్బకు పుట్టారో లేదో వారికే తెలియాలి.

6, ఫిబ్రవరి 2024, మంగళవారం

జీవన మంజూష 02/24


 నేస్తం,

         ఈరోజుల్లో చాలామందికి అవసరం “రేపటిపౌరులు” సినిమాలో చాలా విషయాలు. ఆ పిల్లలను చూసి చాలామంది పెద్దలు నేర్చుకోవాల్సిన విషయాలు బోలెడు. మన ఇంట్లో తప్పులను ఎత్తి చూపలేనప్పుడు, మనకు ఎదుటివారి వ్యక్తిత్వాన్ని విమర్శించే హక్కు ఉందంటారా! తల్లిదండ్రులు అందరికి దైవ సమానులే కాని మన తల్లిదండ్రులు మనకెంతో ఇతరుల తల్లిదండ్రులు వారికి అంతేనన్న చిన్న విషయాన్ని మనమెందుకు మర్చిపోతున్నట్టో!

           పంపకాలు, అంపకాలు వాటిలో నిజానిజాలు చెప్పడానికి దివి నుండి భువికి దిగిరావాల్సిన అవసరముంది ఇప్పుడు. కాని అవి జరగని పనులు కనుక మన నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సబబు కాదు. అది నాయకుడైనా, సామాన్యుడైనా ఒకటే నీతి. ఇక పోషించడాలు, పెద్దవారిని చేయడాలు వెనుక ఎంత నాటకీయత నడిచిందన్నది జగ’మెరిగిన సత్యం. ఏ కుటుంబంలోనైనా ఈ విషయాలు జగ’ద్విదితమే. నేను చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమవదు. గొంతు చించుకుని నలుగురి దగ్గర చెప్పినంతనే అబద్ధం నిజమవదు. 

            బంధాలకు అర్థం, అనుబంధాలకు రూపం మనమేనని ఒళ్లు విరుచుకుంటే, రేపటి రోజున మనమే నలుగురిలో నవ్వులపాలు కావచ్చు. కష్టం మన ఇంటిది కాదని తోడబుట్టినవారిని అవమానిస్తే, ఆ లెక్కలు సరిజేయడానికి ఓ మాస్టారు బెత్తంతో మన పక్కనే ఉంటాడని చరిత్ర చెబుతోంది. మనమనే ప్రతి మాటకు ఎదుటివారు సమాధానం చెప్పగలరు. కాని మనం ఓసారి ఆత్మ విమర్శ చేసుకుంటే నిజం ఏమిటన్నది తేటతెల్లమౌతుంది. 

              రెండిళ్ల మధ్యన దూరం ఎప్పుడూ మారదు. దగ్గరతనం లేని అనుబంధాన్ని తెంచుకోవడమే ఉత్తమం. అవసరార్థం నటించే మనసులున్న మనుష్యులం మనమై పోతున్నప్పుడు, నిజాయితీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది. మన ప్రవర్తన మనకు బావున్నప్పుడు, ఎదుటివారిది వారికీ బావుంటుంది. ఎందుకంటే “ సూర్యుడు తూర్పున ఉదయించును” అన్నంతగా అన్న మాట. మనస్సాక్షి అనేది మనకు గుర్తుంటే కనీసం మన జీవితంలో ఓ క్షణమయినా నిజాన్ని ఒప్పుకుందాం..!!



            

28, జనవరి 2024, ఆదివారం

అసహనం..!!

 

బాధ్యతల్లేని

బంధనాలను

భరిస్తున్నందుకు


శూన్యమైన

చిత్తానికి

చిరునామాగా మారినందుకు


నిస్సహాయతకు

నిలువుటద్దంగా మిగిలిన

నాలోని మనసుకు


వెకిలి చేష్టలకు

వెసులుబాటు అందిస్తున్న

వికృతాకారాను చూస్తున్నందుకు


అబద్ధాలకు

అందమైన రంగులు వేస్తున్న 

అవకాశవాదులకు అవకాశమిచ్చినందుకు


సహనం కోల్పోనివ్వని

ఓరిమితో స్నేహం కాదనుకోలేనందుకు 

నేనంటే నాకే అసహనం..!!




27, జనవరి 2024, శనివారం

ప్రత్యామ్నాయం..!!


 మనసుకు

మనిషికి

బంధానికి

అనుబంధానికి

కోపానికి

దుఃఖానికి

ప్రేమకు 

ద్వేషానికి

స్నేహానికి

శత్రుత్వానికి

విశ్వానికి

భగవంతునికి

అనుసంధానమైన

ఈ సృష్టిలో

ప్రత్యామ్నాయం

సాధ్యమేనా..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner