27, జూన్ 2024, గురువారం

హైకూలు

 1.  ఎన్నో వ్యథలు

రాయని అక్షరాలు

కాగితంపై..!!

2.  తన మానసం

మూగబోయింది

మాటల తూటాలతో..!!

3.  మానసానికా

మమతల బంధానికా

అడ్డుగోడలు..!!

4.  తుంటరితనమే

ఒంటరి పయనంలో

తుషారమై..!!

5.  తన ద్వేషమూ

మర్చిపోని తనమే

మది అరల్లో..!!

6.  భరించలేని

బాధ కల్గినప్పుడే

రాతకి రూపం..!!

7.  ఆత్మాభిమానమే

ఆమె ఐశ్వర్యమైంది

అలంకారం..!!

8.  రేపటి ఆశ

నిన్నల గమనింపు

జీవితపాఠం..!!

9.  మనసులను

కుదిపేసిన మాట

శిలాక్షరాలై..!!

10.  మది పొరల్లో

తచ్చాడే జ్ఞాపకాలు

నెమలీకలు..!!

11.  మలిపొద్దులో

మబ్బుల మాటున

రాతిరి తాయిలం..!!

12.  ఎన్నో బంధాలు

కొన్నే అనుబంధాలు

కాలం కొసలు..!!

13.  కలనైపోయా

కలత నిదురలో

వెన్నెలగువ్వ..!!

14.  మనసుపడ్డ 

బంధాలే కొన్ని ఇలా

గాయపడ్డాయి..!!

15.  ఎంత ఆనందం

కాగితాల నడుమ

అక్షరయానం..!!

16. ఎంత విధ్వంసం 

వాస్తవ ప్రపంచంలో

రుధిర వర్ణం..!!

22, జూన్ 2024, శనివారం

ఏక్ తారలు..!!

1.  మనసు ఛాయ దొరికింది_గతాన్ని వెదికే వాస్తవంలో..!!

2.  కదిలించే కథనాలే అన్నీ_కరకురాయిని సైతం కన్నీరు పెట్టిస్తూ..!!

3.  వదిలేస్తే విడిపోయేవే బంధాలన్నీ_తృణప్రాయపు వ్యామోహాల్లో పడి..!! 

4.  శూన్యాన్ని ఛేదించే శరమేగా బంధమంటే_వెలితిని పూడ్చే వెసులుబాటుగా..!!

5.  మనసు రాతలన్నీ మౌనంతోనే_భాష అక్కర్లేని భావాలను పంచుతూ..!!

6.  నినదించడమే నిత్యకృత్యమైంది_ఎద పదాలను ఏరుకుంటూ..!!

7.  నింగికెగసినా నేలరాలిన జ్ఞాపకాలే కొన్ని_మనసు పొరల్లో తడుముతూ..!!

8.  శూన్యానికి చుట్టానౌతున్నా_ఆఖరి మజిలీలో ఆనందాన్నివ్వమంటూ..!!

9.  బంధాలు బలహీనమే_బాధ్యతలు ధనత్వానికి కట్టుబడినప్పుడు..!!

10.  కథగా కంచికి చేరానిలా_కలల దుప్పటి కమ్మేస్తే..!!

11.  ముగింపునెరుగని వాక్యాలు కొన్ని_కథలోని కలలకు అనుసంధానమౌతూ..!!

12.  చీకటి చుట్టాలందరూ_నావాళ్ళే..!!

13.  బాల్యాన్ని ఆస్వాదిస్తున్నాం_భవిత భయం లేకుండా..!!

14.  కలవాలన్న తపన చాలదూ_ఏ దారి లేకున్నా..!!

15.  కన్నీరెక్కడ?_కలలింకిన చీకటిలో..!!

16.  అమ్మెప్పుడూ ఆటవస్తువే_ఏ యుగంలోనైనా..!!

17.  నన్ను నేను కోల్పోయా_నీవంటూ తెలిసాక..!!

18.  కథలన్నింటా విశేషాలే_వినగలిగే మనసు మనదైనప్పుడు..!!

19.  ఆశగా చూస్తున్నా..ఒక్కసారైనా మరలి చూస్తావని..!!

20.  మలివయసు పసిదనమిది_పుడమి సహనానికి ధీటుగా..!!

21.  నా సర్దుబాట్లు ఎప్పుడూ వుండేవే_నీతో సహవాసం చేస్తున్నంత కాలమూ..!!

22.  జ్ఞాపకమని తడుముతున్నా_గతం మిగిల్చిన గాయమని మరచి..!!

23.  పొడిబారిన మనసులే కొన్ని_దరిజేరే బంధాలకై ఎదురుచూస్తూ..!!

24.  మనసుకు ఎంత ఓపికో_కాగితాన్ని కలాన్ని అనుసంధానం చేయడానికి..!!

25.  తెరలు తెరలుగా వెన్నెల జలతారులు_నీ చెలిమి సహవాసంలో..!!

26.  మనసు పగుళ్లు_ఆకాశానికి అద్దేస్తూ..!!

27.  మనిషితనం కోసమే కదా_ఈ వెదుకులాటల వెతలు..!!

28.  వారిస్తున్నా మనసుని_వేదనకు చోటివ్వద్దంటూ..!!

29.  శాంతిపాఠాలు ఎదుటివారికి చెప్పడానికి బావుంటాయి_నొప్పి మనది కానప్పుడు..!!

30.  మాలిమయ్యేది అక్షరాలే_మనసు భావాలతో అనుసంధానమైతే..!!


21, జూన్ 2024, శుక్రవారం

ఓ మాట..!!

 నేస్తం,

         “ఓడలు బండ్లు అవడం, బండ్లు ఓడలు అవడంఅన్న నానుడి మన అందరికి తెలుసు. ఇప్పటికే చాలాసార్లు ప్రత్యక్షంగా చూసాము, చూస్తున్నాము కూడా. కాలాన్ని మన చేతిలో ఉంచేసుకుందామనుకుంటే ఎలా కుదురుతుంది? కాలం చేతిలో మనం కీలుబొమ్మలమే కాని కాలాన్ని శాసించే శాసకులం కాదు. విషయం తెలిసి కూడా మిడిసిపడితేచివరకు మిగిలేదిఏంటన్నది మన కనుల ముందున్న ఫలితాన్ని చూస్తే అర్థం అవుతుంది. వ్యవస్థకు, వ్యక్తిగతానికి ముడిబెడితే ఫలితం ఇలానే ఉంటుందని చరిత్ర చెప్పిన సత్యాన్ని భవిష్యత్తులో మరెవరూ మరువకూడదు. తప్పుటడుగులు వేయకూడదు.

            అది చేసాం, ఇది చేసాం అని చెప్పుకోవాల్సింది మనం కాదు. ప్రజలు వేన్నోళ్ళ పొగడాలి. మన అతితెలివి జనానికి తెలియదనుకోవడం ఎంత పొరబాటో ఇప్పటికయినాఅర్థమయ్యిందా రాజా!”. విలాసాలు మనకి, మన అనుయాయులకు, ప్రజలకు మాత్రం చెత్తపన్ను నుండి మెుదలెట్టి ప్రతి పైసా మన జల్సాలకు వాడుకోవడం సబబేనా మరి? తమరు చేసిన అభివృద్ధి, రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళిన పనితనం, ప్రతి ప్రాజెక్టును మీరు చెప్పిన సమయంలో పూర్తి చేసి మాట నిలబెట్టుకున్న తీరు, ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో ఎంత విలువైన స్థానంలో నిలబెట్టాయో మీకూ తెలుసు కదా. మీ పరిపాలన ఎంత సవ్యంగా జరిగిందో అందరికి తెలుసు

              ఆర్థిక నేరగాడికి ఇచ్చిన ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ ను ఎంత అధఃపాతాళానికి నెట్టిందో పోలవరాన్ని చూస్తే తెలుస్తుంది. ఐదేళ్ళలో కనీసం రోడ్ల గుంటలు పూడ్చడానికి కూడా ఎన్నికల ప్రచారానికి మీ రాక కోసం ఏదో మమ అనిపించారు తప్పించి ఏమైనా చేసారా? పారదర్శక పాలన, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ అన్నారు కాని అవినీతి సహిత ఆంధ్రప్రదేశ్ ని చేసారు. ఒక కులం గురించి ప్రజావేదికల మీద బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. కులం అన్నది మనకు జన్మతః వస్తుంది అన్న విషయం మీకు తెలియదా! ఎందుకు మీకు కులం మీద అంత కక్ష? ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీ అహంకారంతో అధికారాన్ని దుర్వినియోగం చేసారు

               మీకు మనసనేది ఉంటే నిజాయితీగా మీ మనస్సాక్షిని అడిగిచూడండి, మీరెందుకు ఇంత ఘోరంగా  ఓడిపోయారో! ఇప్పటికయినా మారండి. లేదా మీకు బాగా తెలిసిన మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. అంతేకానీ చాతకాని వాటిల్లో తలదూర్చి మీ పరువుతో పాటుగా మా పరువు కూడా తీయకండి. ముందు మిమ్మల్ని గెలిపించిన పులివెందుల ప్రజలకు ఎం ఎల్ గా న్యాయం చేసి అనుభవాన్ని సంపాదించుకోండి. లేదూనేనింతేఅంటారా సరే మీ ఇష్టాన్ని మేమెందుకు కాదనాలి. కర్మ ఫలితాన్ని అనుభవించడమే

       “ ముఖ్యమంత్రి నుండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ ఎం ఎల్ గా మారిన మీ రాజకీయ చరిత్ర ప్రతి ఒక్కరికి గుణపాఠంగా చరిత్రలో మిగిలిపోతుంది ఎప్పటికి. ఇది మీ చేతులారా మీరు రాసుకున్న రాత. మన వ్యక్తిగత కక్షలకు ప్రజా జీవితాలను బలి చేయాలనుకునే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఎన్నికల ఫలితాలు హెచ్చరిక

చివరిగా మాట పప్పు ఆరోగ్యానికి మంచిది. గన్నేరుపప్పు జీవితాలకు హానికరం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మనిషి ఎలా బతకాలో, బతకకూడదో చాలా వివరంగా తెలిపారు మీరు, మీ అనుయాయులు. అందుకు మాత్రం విషయంలో మీకు మీ భజన గణాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.


10, జూన్ 2024, సోమవారం

రెక్కలు..!!

 1.  వరమైన 

శాపమిదేనేమో

బాల్యాన్ని

పరికిస్తూ


మలిపొద్దు

మందహాసం..!!

2.  అధికారం

రాజసౌధం

అహంకారం

అధఃపాతాళం


నిజం

ఇజం..!!

3.  నలుపు

తెలుపు

అసలు

నకలు


గుర్తింపు

ముఖ్యం..!!

4.  అలంకరణ

అందమే

అక్షరాలకు

భావాలతో


నేర్పరితనమూ

ఓ వరమే..!!

5.  పెరుగుతున్నాయి

తప్పులు

పేరుకుపోతున్నాయి

అప్పులు


గత వైభవ

చిహ్నాలు..!!

6.  మాటల

మౌనాలు

మనసు

గాయాలు


ఓదార్పు

అక్షరంతో..!!

7.  గౌరవసభ

సంస్కారం

కౌరవసభ

కుతంత్రం


తడబాటు

తప్పదు..!!

8.  మాజీలు

తాజాలు

తాజాలు

మాజీలు


నేర్పు

చదరంగానిది..!!

9.  యుద్ధం

అనివార్యం

మనసుకు

మనిషికి


(అంత)రంగం

ఏదైనా..!!

10.  బంధమో

బలహీనత

బాధను

భరించడమే


మూల్యానికి

మూల్యాంకనమే..!!

11.  బురద

గుంట

పన్నీటి

చెలమ


వచ్చిన

చోటికే..!!

12.  ఆత్మీయత

అభాసుపాలు

హేయమైన 

చర్యలు


మానసిక జాడ్యం

కొందరిది..!!

13.  ఆస్తుల

పంపకాలు

అనుబంధాల

అంపకాలు


నేటి

చరిత..!!

14.  మనం 

చేయకూడదు

మనకి మాత్రం

ఉపయోగపడాలి


నిబంధనలు

మారుతుంటాయి..!!

15.  మనసు

ఆరాటం

మాట

మౌనం


పరిస్థితుల

ప్రభావం..!!

16.  ఇష్టాలు

మారిపోతుంటాయి

ఇప్పటి

మనుష్యుల్లానే


ఏది

శాశ్వతం కాదు..!!

17.  ప్రకటన

ఏదైనా కావచ్చు

భావం

ముఖ్యం


వ్యక్తీకరణ

అనుభవం..!!

18.  వస్తువు

ఒకటే

ద్వంద్వ 

వైఖరి


ప్రకృతి

మనిషి..!!

19.  రాతిరి

ఆశ్రయమిస్తోంది

వేకువ

బతుకునిస్తోంది


కాలం

మాయ..!!

20.  తరలి వచ్చింది

వసంతం

చిరునవ్వుల

పొదరింటికి


ఆశల

సముద్రం..!!

21.  అద్దం

అబద్ధం చెప్పదు

నైజం

నిజం ఒప్పుకోలేదు


సమన్వయం

కష్టమే..!!

22.  సందిగ్ధాలన్నీ

మనసుకు

కలతలన్నీ

కలలకు


అవస్థ

మనిషికి..!!

23.  ఖరీదైన 

రోగాలు

తారతమ్యాలు

తమకు లేవంటాయి


సమానత్వం

చక్కగా పాటిస్తాయి..!!

24.  సహనము

అసహనము

అనుబంధాలు

ఋణపాశాలు


అమ్మకు 

అవనికి శాపాలు..!!

25.  అక్కరకు 

రాలేవు

మక్కువ

తీరనీయవు


అర్థం కానివే

ఈ పాశాలు..!!

26.  మాటల

తేనెలు 

మనసున

గరళము


ఈనాటి

ప్రేమలు..!!

27.  దేవుడు

దెయ్యం

ప్రసాదం

ప్రలోభం


కాదేదీ

రాజకీయాలకు అనర్హం..!!

28.  ఘనమైనది

గతం

భారమౌతున్నది

భవిత


నిర్వికారమైనది

కాలం..!!

29.  గతమో

గాయమో

ఊరడింపో

వేదనో


కాలంలో

వెదుకులాట..!!

30.  బెదిరింపు

అదిలింపు

బతకడం

అవసరం


సమస్యలకు

సమాధానం..!!

6, జూన్ 2024, గురువారం

కొత్త పుస్తకాలు..!!






 నా కొత్త పుస్తకాలు రెండు. అవి చదువుతూ అమ్మ, అమ్మమ్మ. పుస్తకాలు ప్రింట్ అవడానికి సహకారమందిస్తున్న ప్రియమైన నేస్తాలకు మనఃపూర్వక ధన్యవాదాలు..

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner