30, జూన్ 2015, మంగళవారం

బంధీలుగా చేయలేక...!!

నిశ్చలత కదులుతోంది అటు ఇటూ
మనసు మౌనానికి మాటలు వస్తే
రెప్పల మాటున కదిలే కలలకు
రూపం తెలియక...

అలజడికి విరామమే తెలియక  
అంతరంగానికి ఆలోచనల సంద్రాన్ని
అమర్చిన విధాత రాతకు విస్మయాన్ని
చిందించడం తప్ప...

ఒలికిన కన్నీటిలో వేల భాష్యాలు
మది భారాన్ని మోస్తున్నందుకేమో
దిగులు బరువుకు ఒరుగుతూ
నిండు చెలమలుగా...

పొందిక లేని భావాలు దొరకక
అల్లాడుతున్నాయి అక్షరాలు
ఎదలో నిండిన అసంతృప్తికి
జ్ఞాపకాలను బంధీలుగా చేయలేక...!!

27, జూన్ 2015, శనివారం

అభినందనల శుభాకాంక్షలు....!!

అవార్డులు అంటే అడిగితే వచ్చేవి కాదని ప్రతిభకు ఇచ్చే గౌరవం అని మరోసారి నిరూపించారు శ్రీ కొండ్రెడ్డి వెంకటరెడ్డి
గారు ... ఎవరు సాహసించని కత్తి మీద సాము వంటి విమర్శనా రంగంలో తెలుగు విశ్వ విద్యాలయం వారి నుంచి కీర్తి పురస్కారం అందుకున్న శుభ సంధర్బంలో ఇవే నా అభినందనల శుభాకాంక్షలు....!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది ఎనిమిదవ భాగం....!!

గత ముప్పది ఏడు వారాలుగా నిరంతరాయంగా సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో అ ఆ ల నుంచి ఱ వరకు నాకు తెలిసిన నేను తెలుసుకున్న అన్ని ముచ్చట్లు చెప్పేసాను.. క్రిందటి వారం ఎర్రని సాహిత్యం విప్లవ సాహిత్యం గురించి నాలుగు మాటలు చెప్పుకున్నాం.. ఈ వారం మన జీవితంలో అతి మధురమైన బాల్యం మనల్ని ఎప్పటికి వెన్నాడుతున్నట్లే ఉండే ఆ జ్ఞాపకాల మధురాలను గుర్తు చేసుకుంటూ బాల సాహిత్యం గురించి కొద్దిగా చూద్దాం...
ఈ లోకానికి పరిచయమవుతూనే అమ్మ లాలి పాటలు, జోల పాటలతో పాటల సాహిత్యానికి మైమరచే అద్భుతమైన బాల్యం మనకు ఆ దేవుడు ఇచ్చిన వరం... పుడుతూనే అమ్మ పాటతో మన పసితనం మొదలై సాహిత్యానికి శ్రీకారం చుడుతుంది... చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బాలజ్యోతి.. మొదలైన కథల పుస్తకాలతో దిన దిన ప్రవర్ధమానం చెందుతూ ఆటల పాటల బాల సాహిత్యం అలరాలుతుంది పసితనంలో...

ప్రతి పత్రికలోనూ బాల సాహిత్యానికి ఓ ప్రత్యేకత ఉంటుంది... దాని బట్టే మనకు అర్ధం అవుతుంది .. బాల సాహిత్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో... చాలా మంది రచయితలు / రచయిత్రులు బాల సాహిత్యానికి పెద్ద పీట వేశారు... నాటకాలు, నాటికలు బాలలకు సంబంధించి ఎన్నో వచ్చాయి... ఈనాడు బాల రచయితలు కూడా చక్కని సాహిత్యాన్ని అందిస్తున్నారు... తరాలు మారుతూ పోతున్నాయి.. నాగరికత కొత్త పుంతలు తొక్కుతోంది.. ఆధునికత, సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినా పసితనాన్ని వదలని జ్ఞాపకాలు మన జీవితంలో ఎప్పుడు మనతోనే ఉంటాయి.. వెన్నెల్లో ఆరుబయట అందరు పడుకుని చెప్పుకున్న కథలు, పాడుకున్న పాటలు, ఆడిన ఆటలు మరచి పోయేవారు ఎవరు ఉండరు... తిరిగిరాని బాల్యాన్ని మళ్ళి మన కళ్ళ ముందుకు తెచ్చేది ఈ బాల సాహిత్యమే... అందమైన బాల్యాన్ని అందించే బాల సాహిత్యం ఎప్పటికి అజరామరమే...

గత ముప్పది ఏడు వారాలుగా మీ అందరితో నాకు తెలిసిన నేను తెలుసుకున్న తెలుగు సాహిత్యపు కబుర్లను ... తెలుగు సాహితీ ముచ్చట్లుగా మీ అందరితో పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చిన సాహితీసేవకు కృతజ్ఞతలతో... నా ముచ్చట్లను ఆదరించిన మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు... !!

జ్ఞాపకాలు వెళిపోతున్నాయి...!!

జ్ఞాపకాలు వెళిపోతున్నాయి రోదిస్తూ
అమ్మ చేతిని వదలి వెళ్ళే పసికూనలా
నాన్న వేయించిన అడుగులను వదలలేని
బుడి బుడి నడకల తడబాటులా
నవ్వులు మరచి అలసిన ఆనంద భైరవిలా
గతాన్ని నిలువరిస్తూ గాయాన్ని రేపుతూ
కన్నీటిలో కరుగుతూ పన్నీరై చిప్పిల్లుతూ
రాలిన చుక్కల వెలుగులా మాసిన రేపటి పొద్దులా
శీతలానికి వణుకుతూ వెచ్చదనానికై పరుగులు పెడుతూ
తరలిపోతున్నాయి అపనిందల తాకిడికి తట్టుకోలేక
రాలిపడుతున్నాయి రెక్కలు తెగిన పక్షుల్లా
రుధిరాన్ని వర్షిస్తున్నాయి రక్తాశ్రువులను దాయలేక
చెలిమిని వీడి చితికి చేరుతున్నాయి కాలుతున్న జీవితాలకు
సాక్ష్యాలుగా నిలుస్తూ శిధిలాలలోనైనా చిరంజీవులుగా
మిగిలిపోవాలన్న చరమ గీతానికి చేదోడు వాదోడుగా....!!

24, జూన్ 2015, బుధవారం

మీ ధీమా గెలిచింది...!!

ముఖ పుస్తక నేస్తాలకు,
                                 గత కొన్ని రోజులుగా జరుగుతున్న వాదోపవాదాలు మీ అందరికి తెలిసినవే.. దీనికి అసలు మూల కారణమైన రమణ శ్రీ ఎవరో ఇంత వరకు తెలియలేదు కాని ఆయన పెట్టిన పోస్ట్ ల మూలంగా ఆయన అసభ్యంగా మాట్లాడిన ఆడ కూతుళ్ళనే కాకుండా సదరు కొందరు ఆడ కూతుళ్ళే అంత కన్నా ఘోరంగా అనడం కూడా చూశాము.. దీని మూలంగా కొందరు చిన్నపిల్లలు పాపం వాళ్లకి ఏమి తెలియదు లెండి మమ్మల్ని అన్నప్పుడు తెలియలేదా అని అడిగారు .. నిజమే అది మీరు అలా అడిగే చనువు ఎందుకు ఇచ్చారు.. అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు.. తప్పుని ఎప్పుడు ఎవరు సమర్ధించరు... ఇద్దరి మధ్యలో గొడవ వచ్చినప్పుడు చాతనయితే సరిదిద్దాలి లేదా పక్కకు వెళ్లిపోవాలి అంతే కాని ఆజ్యం పోసి అందరి మనసులను చిన్నాభిన్నం చేయకూడదు.. ఒకప్పుడు కవితల పోటీలకు బహుమతుల విషయంలో గొడవ ... ఇప్పుడు ఇలా ... దీని మూలంగా కొన్ని ప్రాణాలు విల విలలాడుతున్నాయి .. వాటికి ఏదైనా నష్టం జరిగితే ఎవరు బాధ్యులు.. సదరు ఈ గొడవకి ఆద్యులు రమణ శ్రీ నా.. లేక స్పందించిన మాలాంటి వారా.. లేక రమణ శ్రీ నే అని అనుమానపడుతున్న వారా.. చక్కని సాహిత్యం వెల్లి విరియాల్సిన ముఖ పుస్తకంలో ఈనాడు చదుకున్నా  సంస్కారం మరచిన మాటలు చూడాల్సి వస్తోంది.. అయ్యా రమణ శ్రీ గారు మీరు ఎవరో తెలియదు కాని ప్రతి ఒక్కరిని మనస్తాపానికి గురి చేసిన మీ తెలివికి అభినందనలు... ఎవరు మిమ్మల్ని కనుక్కోలేరనే మీ ధీమా గెలిచింది... మీ తెలివిముందు  మా చాతకాని తనం తలను వంచింది... మీ కోరిక నెరవేరింది.... మంచి చెడు ఆలోచించలేని మా విచక్షణా రహిత ఆవేశాల ముందు...
అంతే కదా నేస్తాలు... !!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner