30, మే 2020, శనివారం

భూతల స్వర్గమేనా... 12


           మన తెలుగు పండుగలన్నీ కూడా అందరం కలిసి బాగా చేసుకునేవాళ్ళం. ఎక్కువగా శ్రీను సంధ్య వాళ్ళింట్లోనే అందరం కలిసేవాళ్ళం. ఓ రెండు నెలలు గడిచే సరికి నేను కాలే దంపతులతో కలిసి ఉండలేక వేరే మెాటల్ చూసుకుంటుంటే సంపత్ మారిన ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ ఉన్న చోటే రూమ్ ఉందంటే అక్కడ చూసుకుని మారిపోదామని అనుకున్నా. ఆఫీస్ అయ్యాక శ్రీను, అబ్బు బయటకు వస్తామంటే నా లగేజ్ తీసుకుని వాళ్ళు రాకముందే బయటకు వచ్చి నిలుచున్నా. కాసేపటికి వాళ్ళు వచ్చి లగేజ్ కార్ లో సర్ది నా కొత్త రూమ్ కి తీసుకువెళ్ళారు. నేను తీసుకున్న మెాటల్ రూమ్ లో బెడ్, టివి, చిన్న టేబుల్, చైర్, కాసిని వంట సామాన్లు ఉండేవి. బట్టలకు వాషర్, డ్రయర్ వేరే చోట ఉండేవి. రోజు మధ్యాహ్నం లంచ్ సంపత్ కి, అబ్బుకి మా ఇంట్లోనే. సాయంత్రం ఎవరి తిండి వారిది. నన్ను, అబ్బుని సంపత్ రోజూ ఆఫీస్ కి తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఎవరి పనుల్లో వాళ్ళు అలా జరిగిపోతోంది. ఓ రోజు మా మేనేజర్ క్రిష్ జాబ్ మానేస్తున్నానని చెప్పాడు. మా కంపెనీ ఓనర్ పేరు కూడా బాబ్. మా ప్రాజెక్టు పేరు చెప్పలేదు కదా లోయస్ట్ బిడ్స్ డాట్ కాం. బిడ్ బార్ డిజైనింగ్, ASP పేజ్ లింక్స్ బిడ్ బార్ లో పెట్టడం నా పని. బిడ్ బార్ డిజైనింగ్ అంతా క్లయింట్ సైడ్ VC++ లోనే. సర్వర్ సైడ్ సాకెట్ ప్రోగ్రామింగ్ అంతా క్రిష్ ఫ్రెండ్ పేరు సరిగా గుర్తు లేదు మైక్ అనుకుంటా తను చేసేవాడు. మిగతావాళ్ళంతా ASP, Administration, testing చేసేవారు. ప్రాజెక్ట్ లైవ్ అంతా చూసుకునేవారు. ఇష్యూష్ వస్తే ఎవరిది వారు సాల్వ్ చేసేవారు. అలాంటిది సడన్ గా క్రిష్ కి, బాబ్ కి క్లాష్ వచ్చి క్రిష్, క్రిష్ ఫ్రెండ్ జాబ్ కి రిజైన్ చేసేసారు. బాబ్ మీటింగ్ పెట్టి మా అందరికి జాబ్ పర్మెనెంట్ చేసి తన కంపెనీ నుండి వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేస్తానని చెప్పారు. 
      మేం ఆలోచించుకుని చెప్తామని చెప్పాము.సాకెట్ ప్రోగ్రామింగ్ గురించి నన్ను చూడమని నాకు మైక్ సిస్టమ్, కాబిన్ ఇచ్చారు. కంపెనీ ఆఫర్ పర్మెనెంట్ తీసుకుంటే మనకున్న H1 కాన్సిల్ అవుతుంది. వీళ్ళు పర్మెనెంట్ అని కూడ తర్వాత జాబ్ తీసేస్తే మనకు స్టేటస్ ఉండదు. కొంత టైమ్ ఉంటుంది. ఆ టైమ్ లోపల H1 ఫైల్ చేయించుకోవాలి లేదంటే ఇల్లీగల్ అయిపోతాము. 
ఇలా పర్మెనెంట్ ఆఫర్ తీసుకుంటే మధ్యలో వేరే ఎవరు ఉండరు. డైరెక్ట్ క్లయింట్ తో మనకు లావాదేవీలుంటాయి. మధ్యలో వెండర్స్ ఉండరన్న మాట. నాలుగు రోజులయ్యాక అందరం సరేనని మా పని మేం చేసుకుంటున్నాం. ఈ మధ్యలో శ్యామ్ ఫ్రెండ్ కూడా మా ప్రాజెక్ట్ లోనికే వచ్చాడు వెంకట్ ఎంప్లాయర్ ద్వారా. నాకు కాస్త తమిళ్ కూడా అర్థమవుతుంది. శ్యామ్ అతన్ని తీసుకురావడానికి ఇక్కడ ఉన్నవారిలో ఎవరినైనా తీసేయించాలని ట్రై చేయడం, నాకు తమిళ్ తెలియదని తను తమిళ్ లో మాట్లాడటం, నేను వీళ్ళకు చెప్పడం జరిగింది. అసలే ప్రాజెక్ట్ ఉంటుందో, పోతుందో అన్న టెన్షన్ మాది. మధ్యలో ఈ గోల. అంటే అన్నానంటారు కానండి మన ఆంధ్రా వాళ్ళు మనవాళ్ళకి అసలు హెల్ప్ చేయరు. మిగతావాళ్ళు అలా కాదు. ఎంతయినా ఒక్క ఆంధ్రా వాళ్ళకు లేనిది మిగతావారికందరికి ఉన్న యూనిటితో శ్యామ్ తన ఫ్రెండ్ ని కూడా మా ప్రాజెక్ట్ లోనికి తెచ్చేసాడు సాకెట్ ప్రోగ్రామింగ్ మీద. 
3 నెలలు నాకు సాలరి పే చేసిన HNC కంపెని తర్వాత పే చేయడం మానేసింది. అడుగుతుంటే క్లయింట్ దగ్గర నుండి రాలేదని చెప్పడం మెుదలుబెట్టారు. మనకి క్లయింట్ తో సంబంధం లేదు, క్లయింట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మన ఎంప్లాయర్ మనకి పే చేయాలి. సరే ఇస్తారులే అని మరో 3 నెలలు ఊరుకున్నాను. ఈ క్లయింట్ పని చేయించుకుంటున్నాడు కాని మా పేపర్స్ అడగడం  లేదు ఫైలింగ్ కి. ఎనిమిది నెలలు చూసాక ఇక మానేద్దామని నిర్ణయించుకుని, ఎంప్లాయర్ బాబ్ ని అడిగితే సమాధానం చెప్పడం లేదు. వినయ్ గారికి ఫోన్ చేస్తే అడగండి అంటారే కాని ఉపయెాగం లేదు. ఓ నెల రోజులు అలానే ఉన్నా. అబ్బు వాళ్ళ అన్నయ్య దగ్గరకి అప్పుడే వెళ్ళనంటే, సరేనని నాతో ఉండమన్నా. షణ్ముఖ్ కూడ ఫోన్ చేసేవాడు అప్పుడప్పుడు. ఈ విషయం చెప్తే ఇక్కడికి వచ్చేయండి, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు అని చెప్పాడు. అప్పటికే తర్వాత నెలకు కూడా మనీ పే చేసేసా. అబ్బు ఉంటానంటే తనకి అప్పజెప్పి, బస్ లో రెండునర్ర రోజులు నెవెడా స్టేట్  కార్సన్ సిటీ నుండి చికాగోలోని అరోరా HNC కంపెనీ గెస్ట్ హౌస్ కి వచ్చాను. అక్కడ విజయ్ అనే అతను ఉన్నాడు. తను ఇండియాకి వెళిపోతున్నాడు. ఓ వారం, పది రోజులున్నాక బాబ్ ఇండియా టికెట్ ఇస్తాను, ఇండియాకి వెళ్ళమన్నాడు. నాకు H1 కూడా వీళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయలేదు. నేను పక్కన షాప్ కి వెళితే అక్కడ కనబడిన కాప్(పోలీస్ ని కాప్ అంటారు) కి జరిగిన విషయం అంతా చెప్పాను. కాప్ బాబ్ నంబర్ అడిగితే ఇచ్చాను. బాబ్ కి కాల్ చేసి తిట్టాడనుకుంటా. ఆ సాయంత్రం బాబ్ గెస్ట్ హౌస్ కి వచ్చి వాడిష్టం వచ్చినట్టు తిట్టి, గెస్ట్ హౌస్ నుండి వెళిపొమ్మన్నాడు. ఆ విజయ్ బాగా భయపడిపోయాడు. రావాల్సిన డబ్బులు ఇమ్మన్నాను నేను. ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. షణ్ముఖ్ కి కాల్ చేసి చెప్పాను జరిగింది. వాళ్ళ రూమ్ లో పూజారి గారు, తనతో పాటు ఉండమని చెప్పాడు. నేను కార్సన్ సిటిలో ఉన్నప్పుడు మా స్కూల్ అల్యూమిని వెబ్ సైట్ లో నేను యాడ్ అయ్యాను. గోవర్ధన్ బొబ్బా అని అవనిగడ్డ అతను, చిన్నప్పుడు మా స్కూల్ లోనే తను కూడా, కాకపోతే నా పేరు తెలుసు కాని నన్ను చూడలేదెప్పుడూ. తను ఓ రోజు కాల్ చేసాడు. తన వివరాలు చెప్పి అప్పటి నుండి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. ఇలా నా ప్రాజెక్ట్ అయిపోయిందని, కంపెని వాడు బెదిరించాడని చెప్పాను. గోవర్ధన్ ఇండియానా లో ఎమ్ ఎస్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరకు రమ్మని చెప్పాడు. మరుసటి రోజు విజయ్ ఇండియా వెళిపోయాడు. షణ్ముఖ్ వాళ్ళ రూమ్ లో ఉన్నాను ఆ రోజు. రెండు మూడు గాస్ స్టేషన్స్ కి జాబ్ అడగడానికి కూడ తీసుకువెళ్ళాడు. మన పరిస్థితి ఏంటా అని దిగులుతో ఆ రాత్రంతా నిద్ర పోలేదు. మరుసటి రోజు గోవర్ధన్ ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ తో వచ్చానని, నన్ను వాళ్ళతో రమ్మని చెప్పాడు. అడ్రస్ చెప్తే వచ్చి ఇండియానా నన్ను కూడా తీసుకువెళ్ళారు. ఓ సూట్కేస్ ఇక్కడే వదిలేసాను. 

మళ్ళీ కలుద్దాం... 

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో...



నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..





ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో...

29, మే 2020, శుక్రవారం

మన చరిత్ర...!!

      నీలం సంజీవరెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని తెలియగానే రాజీనామా చేసిన ఘన చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ది ఒకప్పుడు. 
మరి మన ఇప్పటి చరితేమిటయా అంటే ముద్దాయిలు పాలించే పరిస్థితి. కోర్టులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చినా తమని కాదని దులిపేసుకునే రకాలని అర్థం అయ్యిందా ఇప్పటికయినా.  
మరిలా ఎంత కాలమెా... ప్రభుత్వం మీద వ్యతిరేకంగా 60 పైబడి కేసులు, వ్యతిరేక తీర్పులు...తన తీరు మార్పు రాని, మార్చుకోని ప్రభుత్వం ..మరి కోర్టు తీర్పుల ఫలితం ఏమిటి...? 

27, మే 2020, బుధవారం

ఏక్ తారలు

1.  ఓదార్చే అక్షరాలను నీకందిస్తున్నా_వేదనకు వీడ్కోలిమ్మంటూ..!!
2.     రంగుల మాయ అలాంటిది మరి_మార్పు కాలానికేం తెలుసు పాపం..!!
3.  అమ్మ కడుపున పుట్టలేదుగా దైవం_నవ మాసాల విలువ తెలియలేదందుకే...!!
4.  తరాజు తూయలేనంటోంది_భారమైన కలల బరువును..!!
5.  మదికెప్పడూ మెామాటమే_మౌనం వీడితే మాయమౌతావేమెానని..!!
6.  గురుతులెప్పుడూ జ్ఞాపకమే_కాలమెంత వేగంగా పరుగులిడినా..!!
7.  తోలు మందమైంది_అవమానమని తెలిసినా ఒప్పుకోలేని అహంతో.. !!
8.  నిరీక్షణకు చోటు లేదు_మనసంతా రాయిలా మారిపోతే...!!
9.   ఆ రాయిని పూజించే రోజు రాకమానదు_ఓటమి విజయమై చేరితే..!!
10.   కొన్ని రాళ్ళు కరగవంతే_నిబద్దతయినా నిజాయితైనా వాటికొకటే...!!
11.  స్వప్నాలకు స్థోమత అక్కర్లేదు_నిదురకు మనసునిస్తే చాలు..!!
12.  కన్నీటి కథలెన్నయినా కానీ_అక్షరాల్లో చేరాక అవి పన్నీటి చినుకులే...!!
13.   వాలే పొద్దులో వర్ణాలు చూస్తున్నా_మనసు కాన్వాసుపై రంగుల లోకం చిత్రిద్దామని...!!
14.   క్షణాలెప్పుడూ పదిలమే_కాలమెలా సాగిపోతున్నా...!!
15.   అలకలదెప్పుడూ అల్ప సంతోషమే_క్షణాల్లో కోపాన్ని మర్చిపోతూ...!!
16.   నలుపు రంగుది విశాల హృదయం_రంగులన్నింటిని తనలో ఇముడ్చుకుంటూ...!!
17.   కలలెన్ని సేదదీర్చాయెా కదా_కన్నీళ్ళను తుడుస్తూ...!!
18.  మనసునేమార్చే మెళకువ తెలియాలి_కన్నీటిని పన్నీరుగా మార్చడానికి...!!
19.   మరుపునే మరిపించాయి_జ్ఞాపకాలను వీడలేని మనసుందని గుర్తుజేస్తూ..!!
20.  గుప్పెడు గుండెతో గంపెడాటలు_అలవాటైన వ్యసనమే కొందరికి...!!
21.   వర్ణనదేముందిలే_వాచకం బావుంటే చాలట..!!
22.  ఓటమి ఆహ్వానాన్ని తిరస్కరించు_గాయాన్ని విజయగీతంగా మార్చుతూ...!!
23.   అలవాటైన ఆట కదా_మనసుతో మనిషితనానికి...!!
24.   పరిపాటేనని పాత పాటే పాడితే ఎలా_ఏమరుపాటుకి మూల్యం చెల్లించాలేమెా...!!
25.   ఏదీ మిగలదేమెా_వెలి వేయడమంటూ మెుదలైతే..!!
26.   నిస్సత్తువు నీకేలా_చీకటిలో వెలుగు నింపే చెలిమి నీతోనుంటే...!!
27.  నిస్సత్తువు నీకేలా_చీకటిలో వెలుగు నింపే చెలిమి నీతోనుంటే...!!
28.  పోగొట్టుకున్న గతాన్ని వెదుక్కుంటున్నా_రాశులుగా పేరుకున్న జ్ఞాపకాల్లో..!!
29.  మరుక్షణమే మరిచిపోయి వుంటుంది మానవాళి_కాల్చిన దేహం సాక్షిగా...!!
30.   గ్రహణం వీడిన శకునం బావుంది_ఆషాడపు చినుకులతో...!! 

25, మే 2020, సోమవారం

పట్టలేని సంతోషం...!!

నేస్తం, 

         ఈమధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పాలని చాలా రోజుల నుండి అనుకుంటూనే ఉన్నాను కాని కుదరలేదు. యాభైల్లో పడుతున్న వయసుకి చిన్నప్పటి నేస్తాల పలకరింపులు, అదీ ఎన్నో ఏళ్ళ (1985 నుండి 2020) తరువాత అయితే ఆ సంతోషం ఎలా ఉంటుందంటావ్? నేను చెప్పనా... నాకిష్టమైన సముద్రం దగ్గర నిలుచుని, ఆ అలలతో ఆడుకున్నంత సంతోషమన్న మాట.
            సరదాగా చూసే యుట్యూబ్ ఛానల్ లో జాతకం రేపటి రోజుది వింటే మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు అని చెప్తే, అసలే కరోనా కాలమని ఎలా జరుగుతుందని తీసిపారేయకండని కూడా చెప్పారు. నవ్వుకున్నా అప్పుడు. మరుసటి రోజు పొద్దున్నే నా మెసెంజర్ లో నా ఫ్రెండ్ లిస్ట్ లో లేని వారి దగ్గర  నుండి మెసేజ్. తనెవరో వివరంగా పెట్టారు. మాతో కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రుడు మంగారావు. వెంటనే ఫేన్ నెంబరడిగి ఫోన్ చేసి మళ్ళీ బాల్యాన్ని పలకరించేసాం. మరో బస్ ఫ్రెండ్ శ్రీదేవి మంగారావు వాళ్ళ వదిన. తన నెంబర్ కూడా తీసుకుని తనతో కూడా కబుర్లు పంచేసుకున్నా. బాగా  చిన్నప్పటి ఫ్రెండ్ గత 7,8 ఏళ్ళుగా మాట్లాడని మా అల్లరి బాచ్ సత్యన్నారాయణ కూడా పలకరించేసాడీ మధ్యనే.
         అనుకోని మరో కబురేంటంటే జొన్నవలస స్కూల్ లో మా సీనియర్ పార్వతి వా నెంబర్ వాళ్ళ ఫ్రెండ్ ఎర్రయమ్మని అడిగి మరీ నాకు ఫోన్ చేసింది. ఎన్ని కబుర్లు చెప్పేసుకున్నామెా... కార్తీకం మాసంలో పులిహోర చేయించుకుని వన భోజనాలకి వెళ్ళడం, టిటిడి వారి పరీక్ష రాసేసి సినిమాకి వెళ్ళడం, భీమ్ సింగ్ బ్రిడ్జ్ పై చిరంజీవి గూండా సినిమా షూటింగ్ కి స్కూల్ ఎగ్గొట్టి, నాతోపాటు మరో నలుగురిని కూడా తీసుకువెళ్ళి, మరుసటిరోజు ప్రేయర్ లో అందరి ముందు హెడ్ మాస్టారితో తిట్లు... నన్నేం అనలేదు కాని..." ఎంతో తెలివి గల ఈ పాప కూడ వెళ్ళింది " అనే అన్నారు. కాకపోతే మా హిందీ టీచర్ బాగా తిట్టారనుకోండి క్లాస్ లో...ఇలా మా చిన్నప్పటి జ్ఞాపకాలనన్నింటిని గుర్తు చేసేసుకున్నాం..మనకి అందరు గుర్తున్నా మనం కూడా కొందరికి గుర్తుండటం భలే బావుంటుంది...అదీ సీనియర్స్ కూడా గుర్తుంచుకోవడం ఇంకా బావుంటుంది. కాని నాతో కలిసి ఆడుకున్న ఒకరు నన్ను మర్చిపోయారు...నా పేరు చెప్తే గుర్తు రావాలి కదా... ఎప్పటికో గుర్తు వచ్చిందట... 😊
పనిలో పని మీకు ఓపాలి గతాన్ని పలకరించి రారాదు...ఎంత బావుంటుందో తెలుస్తుంది...
           

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner