4, నవంబర్ 2013, సోమవారం

సోదర సోదరీ బంధానికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు...!!


సోదర సోదరీ బంధానికి  ప్రత్యేకమైన రోజు ఈ రోజు... దీపావళి మరుసటి రోజున భగినీ హస్తం అని పిలుస్తారు... ఈ రోజున ప్రతి సోదరుడు తన సోదరి ఇంటికి పిలవకుండానే వెళ్ళి పీట వాల్చుకుని కూర్చుని భోజనం చేస్తే చాలా మంచిదని చెప్తారు....ఆడపడుచుకి  తగిన విధంగా  పసుపు కుంకుమ ఇస్తే చాలా మంచిదట. కనుమరుగై పోతున్న బంధాలు అనుబంధాలు కలకాలం నిలిచి ఉండటానికి ఇలాంటి పద్దతులు చక్కగా దోహదపడుతున్నాయి మన సంస్కృతి సంప్రదాయాల్లో....నిజంగా ఇలాంటి మన ఆచారాలు, సంప్రదాయాలు మన పూర్వీకులు మనకు ఇచ్చిన వరం వెలకట్టలేని సంపద....ఇలాంటి ఆచారాలు సంప్రదాయాలు కనుమరుగై పోకుండా కలకాలం మన బంధాలను నిలబెట్టుకుంటూ మానవతా విలువలను కాపాడుకుందాం...మన పూర్వీకులు మనకుచ్చిన వెలకట్టలేని ఈ సంపదకు చేతులెత్తి మొక్కుతూ మన తరువాతి తరాలకు ఈ విలువల బంధాల ఆనందాన్ని పంచుదాం....!!

ఈ రోజు విశేషం హరిసేవ నుంచి సేకరించిన సమాచారం మీ అందరి కోసం ....
కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగను
జరుపుకుంటారు.

ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా
దేవి (నది)ని స్మరించి పూజించాలి.

సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి
ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు
వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక
చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా
యమధర్మరాజుగారు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజు
కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి
పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమే తన చేత్తో చక్కని వంట
చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో ఏదైనా
వరం కోరుకోమనగా. యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి
ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి,
అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు
ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ
క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన
చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా
పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు.
అందువలనే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చింది.  తరవాత యమునమ్మను
పరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని
షడ్రసోపేతమైన విందు చేసి సారె పెట్టి పంపాడు.

దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అనీ ఈశాన్య, ఉత్తర,
పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ.

అందువలన అవకాశం లేనివారికెలాగూలేదు, ఉన్నవారందరూ ఈ పండుగను జరుపుకొని,
రక్త సంబంధాలనీ, ఆత్మ సంబంధాలనీ, కుటుంబ బాంధవ్యాలనీ పెంపొందించెదరు గాక.
తరవాత సోదరుడు తన సోదరిని పరివారంతో సహా తన ఇంటికి మరునాడు ఆహ్వానించి
అంతే ఆప్యాయంగా సోదరీమణులను ఆదరించి ఇతోధికంగా కానుకలిచ్చి గౌరవించి
పంపడం ఆచారం ఈ రోజును సోదరీ తృతీయ అని పిలుస్తారు.

(యమ ద్వితీయ కున్న ప్రచారం సోదరీ తృతీయకు లేదెందుకనో)
  హరిసేవ నుంచి సేకరించిన సమాచారం ... వారికి ధన్యవాదాలు  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner