9, నవంబర్ 2013, శనివారం

ఆహ్వానించే మనసు కోసం...!!

అదేమిటి నిజం గతంగా మారి
జ్ఞాపకంగా మిగిలి పొయిందేమిటి....??
నిప్పుల కొలిమిలో వేసినా బూడిదగా మారకుండా
నిలువెత్తు సాక్ష్యంగా నిలబడే ఉందేమిటి...??
సింధూరపు రంగు పులుముకుని దరి చేరలేరెవ్వరని
నన్ను చూసి పగలబడి నవ్వుతోందా అన్నట్టుగా అనిపిస్తోందేమిటి...??
మండుతున్న మనసుకు అద్దం పడుతూ
వెలుగుతున్న కుంపటిలో కనిపిస్తున్న నుసి ఎక్కడిది...??
అబద్దాల జాడలు కనిపించకుండా పోయాయనడానికి
నిన్ను దహిస్తున్న ఈ జ్వాలల వేడిమి సరిపోవడంలేదా...??
హిమాగ్ని కాలుతోంది ఆరిపోకుండా కన్నీటికి కరగకుండా
ఆ మంటలు మనసులోని మాలిన్యాన్ని కాల్చే సమిధలుగా మారిపోయాయి...!!
అగ్ని ప్రక్షాళనతో పునీతమైన మది వాకిలి ఎదుట
నిజం నిర్భయంగా నిలబడి ఎదురు చూస్తోంది ఆహ్వానించే మనసు కోసం...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

అదేమిటి గతంగా మారిన నిజం నిలువెత్తు సాక్ష్యంగా నిలబడి వుందేమిటి...?? .... వెలుగు కుంపటిలో కనిపిస్తున్న నుసిలా...!? హిమాగ్ని కాలుతోందేమిటి? మనసు మాలిన్యాన్ని కాల్చే సమిధగా మారి...!! .... అదేమిటి అగ్ని ప్రక్షాళన పునీత ఆ సీతమ్మ లా .... నిజం, నిర్భయంగా ఎదురు చూస్తూనే ఉంది .... ఇంకా ఆహ్వానించని ఆ రామయ్య కోసం...!!
కవిత కవితకూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఒక గొప్ప సామాజిక కవయిత్రి లక్షణాలన్నీ భావనల ద్వారా పంచుతూ పురోగమిస్తున్న కవయిత్రికి అభివాదాలు. చాలా చాలా బాగా వ్రాసారు "ఆహ్వానించే మనసు కోసం...!!" కవిత మంజు గారు! హృదయపూర్వక అభినందనలు.

చెప్పాలంటే...... చెప్పారు...

మీ అభిమానానికి శిరస్సు వంచి చెప్పడం తప్ప ఎం చేయగలను చంద్ర గారు....చక్కని విశ్లేషణలను అందిస్తున్న మీకు ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner