26, నవంబర్ 2013, మంగళవారం

మనసులో మనం... మనలో మనసు....!!

మనసొక మధుకలశం పగిలే వరకే అది నిత్య సుందరం....ఈ పాటలోని మాటలు, భావం ఎంత నిజం...!! కొన్ని పాటలు
వింటుంటే అనిపిస్తుంది...ఇంత బాగా ఎలా రాస్తారా అని...!! మన మనసు మనం ఏది దానికి ఇస్తే అది తీసుకుంటుంది... మనలోని తనలో దాచుకుంటుంది...పాపం మనం ఏది ఇచ్చినా వద్దు అనకుండా పుచ్చేసుకునేది మన మనసు ఒక్కటేనేమో ఈ ప్రపంచంలో...!! ఒక్కోసారి ఎదురు తిరిగినా మనం దాని నోరు నొక్కేసి మన ఇష్టం వచ్చ్సినట్టే దానిని ఉండమని చెప్పేస్తాం...వినక చస్తుందా మరి..!! మనం మన మనసుకు మాత్రమే నియంతలం కదా...!! అందుకే దాన్ని మాత్రమే మన మాట వినేటట్లు చేసుకుంటాం..ఒకవేళ అది వినక పోయినా మనం పట్టించుకోము...అచ్చు మనని మన వాళ్ళు పట్టించుకోనట్లే...-:).
మనసు నిజంగా మధుకలశమే..!! కాకపొతే దానిలో మనం కాని మన చుట్టూ మనం అల్లుకున్న లేదా పెంచుకున్న బంధాలు అనుబంధాలు వెదజల్లే పరిమళాల అనుభూతుల మీద ఆధారపడి ఆ సున్నితత్వం ఉంటుంది...నిన్ను నీకు చూపించే నీ మనసు అద్దంలో అన్ని నిజాలు స్పష్టంగా కనిపిస్తాయి...ఒప్పుకునే మంచి మనసే నీది కావాలి మరి..!! ఎవరికీ తెలిసినా తెలియక పోయినా నీ మనసుకు నువ్వేంటో తెలుసు...అది ఏం చెప్తుందో నీకు తెలుసు...!! అందుకే నిన్ను నీకు చూపించే నీ నిజమైన నేస్తాన్ని నిర్లక్ష్యం చేయక నీ మాటే నీది కాకుండా ఓసారి అది చెప్పేది కూడా వింటే పోయేదేం ఉంది.. మహా అయితే అది చెప్పే మంచి నీకు నచ్చుతుంది అంతే కదా...!! లేదా ఎలానూ దాన్ని నోరు మూసుకుని ఓ పక్కన పడి ఉండమని చెప్పే అధికారం ఉండనే ఉందాయే...!!
చూసారా...మనలోని మన మనసుతోనే మనం ఎన్ని ఆటలు ఆడుకుంటున్నామో...!! పగలని అద్దం లో కనిపించేది ఒక రూపమే...అదే ముక్కలైన అద్దంలో లెక్కకు రాని రూపాల్లానే...ముక్కలైన మనసు అద్దంలో లెక్కకు దొరకని ఆలోచనా సంద్రాలెన్నో..!! మెలి తిప్పే మనసు సుడిగుండాలెన్నో...!!  ఈనాటి మన అతుకుల అవసరపు బతుకుల్లానే మనసు ముక్కలు దాచేసుకుని ఓ రకంగా చెప్పాలంటే మనసనేది ఉందని మరిచి పోయి అవసరం కోసమో...భాద్యతల బంధాల కోసమో...సమాజంలో మనకంటూ ఓ గుర్తింపు కోసమో...బతికేస్తూ...నలుగురితో పాటు మనతో మనం కూడా నటించేస్తూ జీవిత నాటకాన్ని దిగ్విజంగా వెళ్ళదీసేస్తున్నాం...కాదంటారా...!! 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

మన మనసు అద్దం లో కనిపించేది ఒక రూపమే! కానీ ముక్కలైన మనసు అద్దంలో లెక్కకు దొరకని ఆలోచనా సంద్రాలెన్నో..!! మెలి తిప్పే మనసు సుడిగుండాలెన్నో...!
మనసులో .... మనం కాని మన చుట్టూ అల్లుకున్న అనుబంధాల పరిమళాల అనుభూతుల సున్నితత్వం ఉంటుంది. మనసు అద్దంలో అన్ని నిజాలు స్పష్టంగా కనిపిస్తాయి.
భావన బాగుంది. మంచి తర్కం విశ్లేషణ లో గొప్ప స్పష్టత .... కనిపిస్తున్నాయి.
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

మీ దొడ్డ మనసుకు వందనాలు చంద్ర గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner