31, జులై 2014, గురువారం

కరిగేదెన్నడో...!!

వేల కధల వెతల కన్నీటి చినుకుల్లో
ఓ చినుకుగా ఉండిపోయిన సశేషాన్ని
వెలిసిపోయిన రంగుల్లో వెదుకుతున్నా 
సంతోషాన్ని చిరునామాగా చూడాలని..!!

అందరాని చందురుని అందుకోవాలని
ఆశపడుతున్నా అందుకోవాలని ఆరాటమే
అంబరాన్ని తాకాలన్న తపన వీడని
అక్షరాల పయనం ఇలా సాగుతోంది...!!

లెక్కలేయని అనుబంధాల్లో మిగిలిపోయిన
బాంధవ్యాలు నాతోపాటుగా రాలేమంటూ
దూరంగా పారిపోతుంటే పట్టుకోవాలన్నా
జారిపోతున్న జీవితానికి అంటని చెలిమిలా....!!

ప్రళయంలో వెదికినా ప్రణయంలో చూసినా
మనసులో దాగిన మాటలు పెదవిపై చేరి
గుండె గొంతుకను విప్పి చెప్పినా వినని
కరకురాయి కాఠిన్యం కరిగేదెన్నడో...!!

30, జులై 2014, బుధవారం

మధ్యలో ఎప్పటికి...!!

మనుష్యుల మధ్య దూరాన్ని తగ్గించి దగ్గర చేసే మంత్రం ఒక్కటే అదే ఆప్యాయత...కొంత మంది దగ్గరే ఉన్నా
మనసుకు మనకు దగ్గరగా రాలేరు...దూరాన్ని దగ్గర చేసి పంచే ఆ ప్రేమకు ఇష్టానికి దాసోహం కాక తప్పదు...దగ్గరలోకి వచ్చి కూడా దగ్గరగా రాలేని అనుబంధాలు ఎన్నో...!! మాటల వరకే పరిమితం కొన్ని... డబ్బుల వరకే సరి చూసుకునేవి కొన్ని.... అవసరానికి నటించేవి మరికొన్ని...!! అమెరికా నుంచి గుంటూరు వచ్చినా పక్కన ఊరు రాలేక ఫోన్ లో పలకరించి అబ్బా పలకరించానులే పని అయిపొయింది సరి పెట్టుకుంటే సరిపోతుంది.. .చూడాలని మనసు ఉంటే మార్గం అదే వస్తుంది...మనమేమో అబ్బో అమెరికా నుంచి వచ్చి గుర్తు ఉంచుకుని ఫోన్ చేసి పలకరించారు చూసావా అని తృప్తి పడే అల్ప సంతోషులం...!! మనుష్యులు మమతలు ఎక్కడ ఉన్నా అవే కదా..!! మరి ఎందుకీ తేడాలు...!! ముక్కు మొహం తెలియని ఎందరో పలకరించే పలకరింపు మనం ఎందుకు పలకరించుకోలేక పోతున్నాం...?? ఎందుకీ దూరం...మన అంతరంగంలో దాగిన అభిమానం అనంత దూరంగా అందకుండా చేసుకోవాల్సిన అవసరం ఉందా..!!  పేరుకి మాత్రం పలకరింపులు ఎందుకు..?? చిన్నప్పటి స్నేహాలు కల్మషం లేనివి ఇక తరువాత స్నేహాలు అంటారా మనకు నచ్చిన మనము మెచ్చిన బాంధవ్యాలు అనుకుంటాము కాని వాటిలో కొన్నే నిజమైనవి అని కాలంతో పాటు మనకున్న డబ్బు, హోదాని బట్టి వస్తూ ఉంటాయి...ఎన్ని రోజుల స్నేహం అన్నది కాదు ఎన్నాళ్ళ నుంచి అలానే ఉన్నాయి ఆ ఆప్యాయతలు అన్నది ముఖ్యం,,,, కొందరికేమో తీరికే ఉండదు మరికొందరేమో తీరిక చేసుకుని కొద్ది సమయమైనా చూడాలని కలుస్తారు... మనసులో లేకుండా మాటలతో సరిపెడితే సరిపోదు... దేనికైనా మనసుతో కలిపి ఉంటేనే అది చిరకాలం నిలుస్తుంది.... అది ఏ అనుబంధమైనా...!! మనం కావాలనుకునే అనుబంధాలను దూరం చేసే దూరాన్ని దూరంగా ఉంచితే అన్ని మనకు దగ్గరగా మన అందుబాటులోనే ఉంటాయి.....!! కొన్నిటిని డబ్బుతో కొనలేము.... కోట్లు పోసినా సంతోషాన్ని తేలేము... జరిగిపోయిన కాలాన్ని గుర్తు చేసుకోగలం కాని మళ్ళి ఆ కాలాన్ని వెనక్కు తీసుకురాలేము...!! విరిగి పోయిన మనసుని అతుకు వేసినా అది అతుకుల విస్తరే కాని నిండు విస్తరి కాదు... ఎప్పటికి కాలేదు...!! మనసులో ఉంటే ఇరవై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు అయినా గత జ్ఞాపకాల అనుభూతుల గురుతులు మదిలో పదిలంగానే ఉండిపోతాయి.... వదిలేసుకుంటే ఏది మనతో ఉండదు... కొందరేమో వదులుకోలేరు మరికొందరేమో విదుల్చుకుంటారు..... అదే చిన్న తేడా మనసుల మనుష్యుల మధ్యలో ఎప్పటికి...!! 
నా అల్ప సంతోషాన్ని అధికమైన ఆనందంగా మార్చుతున్న కొందరు ఆత్మీయులకు ఈ రాత అంకితం...!!

27, జులై 2014, ఆదివారం

కాలుతున్న జ్వాల....!!

నిశబ్ధం మాటాడేస్తోంది తన గుండె చప్పుడు
వినిపిస్తూ ఎన్ని మాటల మౌనాలో దానిలో
దాచుకున్న భారమంతా వదిలేస్తూ చెప్పిన
ఆ ఆనకట్ట లేని ప్రవాహాన్ని అడ్డుకోవాలని
అడ్డుపడక వింటూనే ఉండిపోయాను ఎందుకో....
ఇన్ని కాలాల సంగతుల కబుర్లు చెప్పిన
సత్యాల సమాధుల ఇటుకల అలజడి
రేపిన గాలి ధుమారంలో అక్కడక్కడా
మిగిలిపోయిన ముక్కల జ్ఞాపకాలు ఎక్కడో
చెరిపేసిన అక్షరాలుగా తెర చాటుగా దాగుండి
శిధిలమైన మనసు శిలగా నిలిచిపోయి వ్యధశిలగా
మారిన తరుణం మరచిపోయిన మరుక్షణం
నేను అందరిలా ఓ మనిషినే అని గుర్తు చేసుకుంటూ
కాలుతున్న చితిలో పేర్చబడ్డ మరో కట్టెగా మారిన
ఈ శరీరం కోరికల రణరంగంలోనికి నెట్టబడిన
కాలని కట్టెగా మిగిలిపోతున్న మండుతున్న జ్వాల....!!

పుట్టినరోజు శుభాకాంక్షలు


నాకు ఆప్తురాలు నా పేరుని తనలో దాచుకున్న నా సన్నిహితురాలు ఇంజనీరింగ్ లో ఎప్పుడు అడిగినా పాటలు పాడి అలరించిన నా నేస్తం ఇప్పటికి అదే ప్రేమతో పలకరించే మంజుకి ప్రేమతో హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షల శుభాశీస్సులు
                                                        ప్రేమతో
                                                     మంజు అక్క

24, జులై 2014, గురువారం

క్షమాపణలు చెప్తోంది ఇలా అయినా...!!

ఒక్కోసారి మనం ఎంతగా అనుకున్నా అది చేయలేము... నా విషయంలో అది బాగా జరుగుతుంది. పిల్లలకు కూడా అలానే అయ్యింది....బాగా చేద్దామనుకున్న మా వాళ్ళ అందరి కోరిక తీరకుండానే ఎవరిని పిలువకుండానే మొన్నటి ఉగాది రోజున పంచెలు కట్టబెట్టేసాము..... నాకు ఓ పాట గుర్తు వస్తోంది... " ఎంతగా అనుకున్నాను... ఏమిటి చూస్తున్నాను...." మా వాళ్ళను నా పెళ్లి చూడనివ్వని చందానే నా కొడుకుల పంచెల సరదా తీరకుండానే అయిపొయింది....పాపం వాళ్ళు బోలెడు సరదా పడ్డారు... కాని వాళ్ళ సంతోషం కూడా చూడకుండానే జరిగిపోయింది.....
ఆహ్వానపత్రిక కొట్టించి చాలా వరకు అందరికి చెప్పిఅన్ని సిద్ధం చేసి కొన్ని అనివార్య కారణాల వలన పిల్లలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయాను.... కొన్ని కోట్లు ముందు రాశులుగా పోసినా మళ్ళి ఆ సంతోషాన్ని తిరిగి తేగలమా....!! ఈ తప్పు నా జీవితాంతం వెన్నాడుతూనే ఉంటుంది....ఏమి చేయలేని ఈ అమ్మ పిల్లలకు క్షమాపణలు చెప్తోంది ఇలా అయినా...!! మనకు జరగక పోయినా పిల్లలకు అన్ని బాగా జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.... అతి కొద్ది మంది మాత్రం ఈ లెక్క లోనికి రాకుండా ఉంటారు... !! పోనిలెండి బాగా జరపాలనుకున్న మా కోరిక తీరక పోయినా జరగనీయవద్దు అనుకున్న వారి కోరిక తీరినందుకు మేము అందరం చాలా సంతోషిస్తున్నాము.....!!

నీ చెలిమిని వీడునా....!!



కారుమబ్బులు సహవాసం చేస్తుంటే
కాలమేఘాలు కమ్ముకు వస్తుంటే
నా ఏకాంతానికి నీ జ్ఞాపకాలు జతగా
చేరిన అందమైన ఈ ఒంటరితనంలో
పచ్చని పచ్చిక పానుపు సుతిమెత్తగా
హత్తుకుంటూ హాయి హాయిగా అనిపిస్తుంటే
గర్జించిన మేఘాల రాపిడి మధురస్వరాలాలపిస్తే
మనసున భయమెందులకోయి మరపురాని
నీ చెలిమి చెంత నుండగా మౌనమైనా
మాటలు పలుకదా పరవశించే ప్రకృతి
జీవశ్చవానికైనా జీవం పొయదా
మరల జన్మకు మరణం సరిపోవునా
ఎన్ని జన్మలకైనా నీ చెలిమిని వీడునా....!!

22, జులై 2014, మంగళవారం

హృదయ ఘోష....!!

మంచు తెరల్లా తాకుతోంది నన్ను
నీ చెలిమి చల్లదనం అనుకుంటా....!!

మనసు పొరల్లో దాగిన నిజాన్ని
విప్పి చెప్పాలని ఎదురు చూస్తున్నా..!!

గొంతు దాటని మాట పెదవికి
అందక మది తల్లడిల్లుతోంది ఆరాటంతో...!!

చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చేజారిన క్షణాల సంతసాల కోసం నీ సాన్నిహిత్యాన్ని....!!

వేల సార్లు మరణించినా మళ్ళి ఒక్కసారైనా
జీవించాలని నీ చెలిమి కోసం బతకాలని ఈ తపన...!!

21, జులై 2014, సోమవారం

ఔన్నత్యం ముందు ...!!

మాయని మమతలు మబ్బుల
మాటుగా తొంగి చూస్తున్నాయి
జారిపోతున్న కన్నీరు ఆగలేనంటూ
మనసు పొరల్లోనుంచి ఉబికి వచ్చేస్తోంది
దాచలేని ప్రేమను దాచేయాలన్న
సాహసానికి అడ్డుపడుతున్న దాగని
హృదయపు సంకేతాలను వినిపిస్తున్న
అంతరంగపు ఆరాధన హాయిగా ఉంది
రాలిపోయి రెక్కలు ఊడిన పూవుకైనా
కమ్మని రాగాలు పలికించే మాధుర్యాన్ని
సొంతం చేసుకున్న నిర్మలమైన నిశ్చలమైన
మది వరంగా పొందిన అదృష్టం చేరువగా
చెంత చేరితే వేడి గాలులే మలయమారుతాలుగా
జడివానలే చిటపట చినుకులుగా సేదదిర్చే 
చల్లని తోడుగా చనిపోయిన ఆశను
చిగురింప చేసిన ఔన్నత్యం ముందు
శిరస్సు వంచి దాసోహమంటున్నా...!!

20, జులై 2014, ఆదివారం

గోధూళి గోరింట...!!

 చాలా రోజులకు మళ్ళి పోటికి రాసిన కవితను స్వీకరించి విజేతగా తోటి విజేతల సరసన నిలిపిన కృష్ణా తరంగాలు సమూహపు నిర్వాహకులకు ...సభ్యులకు నా కృతజ్ఞతలు....
గోరింట పండింది గోధూళి మెరిసింది
ముద్దమందారపు  ముగ్ధ చేతి నిండా
సిరుల చిరునవ్వుల చందనాలు
అందమైన అరచేతికి ఆభరణంగా
అమరిన  ఎరెర్రని ఛిలుక ముక్కుల
చందాన అతివ సింగారం ఈ గోరింట
ఆషాఢపు ఆనవాలు మగువ చేతిలో
ముగ్గిన ముగ్గుల సోయగాలు ముంజేతిలో
గమ్మత్తుల జ్ఞాపకాలు గోరింట ఆనవాలు
చిన్నప్పటి తీపి గురుతులు చూసుకున్నా
వధువుగా మారిన జవరాలి సిగ్గుల మొగ్గలు
చెంపల కెంపుల ఆనందాలు ఈ గోరింట పండిన
అరచేతి వయ్యారపు సయ్యాటల కేరింతలు

19, జులై 2014, శనివారం

ఎటూ కాకుండా చేస్తున్నాయి...!!

దూరం కాని చేరువ దూరంగానే ఉంది
దగ్గరగా ఉన్నా దూరం దగ్గరగానే ఉంది
ఎందుకో దూరం ఇలా ఆడుకుంటోంది
మన మధ్యన దాని పెత్తనం ఏంటో..!!

ఎంత దూరంగా నేట్టివేసినా పక్క పక్కనే
ఉన్న మనతో దాని ఆటల హంగామాలతో 
దోబూచులాడుతూ నమ్మకంతో పట్టి దూరంగా
పారవేయలేవంటు ఎంత ధీటుగా ఉందోచూశావా...!!

దగ్గరకాలేని దగ్గరతనం ఏమి చేయలేక
దూరంగానే ఉండిపోతూ దూరమౌతోంది
ఏమిటో ఈ దగ్గర దూరం ఇలా మనతో
ఆడుకుంటూనే ఎటూ కాకుండా చేస్తున్నాయి...!!

కాలం చూస్తూనే వెళ్ళిపోతోంది
క్షణాల గంటలను మోసుకుంటూ
మన కోసం ఆగలేనని విచారాన్ని
అందిస్తూ దురాన్ని దూరంగా విసిరి వేయలేక....!!

18, జులై 2014, శుక్రవారం

మాయా ప్రపంచం...!!

కోపమెందుకో చర చరా వచ్చేస్తోంది
క్షణంలో పోయే ఈ ప్రాణానికి
అంత అహంకారమెందుకో మరి...!!
ఎంత దగ్గరగా ఉన్నా దురాన్ని
పెంచుతూ ఒంటరిని చేస్తూ
ఏకాంతానికి కూడా దూరంగా....!!
అందరిని దూరం చేసి తను మాత్రం
ఉండి పోదామని చూస్తోంది
పక్కపక్కనే తిరుగుతు ప్రయాస పడుతూ...!!
మనసేమో మాట విననంటోంది
కోపమేమో వెళ్ళలేనంటోంది
మధ్యన నలిగి పోతోంది ఈ జీవితం...!!
చుట్టరికాల సూటిపోట్లు తప్పని
మమకారపు బంధాల అగచాట్లు
మరో లోకం చూడనివ్వని మాయా ప్రపంచం...!!
రగులుతున్న రోషావేశాలు
నాలోని మనిషిని దహిస్తున్న
మారణకాండకు సంకేతాలుగా మిగిలిపోయాయి...!!
ఎవ్వరికి చెందని ఏకాకిలా
అందరున్నా ఎవరులేని రాలేని
నా ఒంటరి పయనానికి సాక్షీభూతంగా నిలిచి పోయాను...!!

17, జులై 2014, గురువారం

కాలం గాయపడింది...!!

కాలం గాయపడింది నాతో పాటుగా
చెరగని గుర్తులు మిగిల్చి పోయింది
బతుకు మీద ఆశను చంపేస్తూ
చితిని పేర్చుతున్న జ్ఞాపకాలను
కాలనీయని మంటలను చూస్తూ
వదలి వెళ్ళలేక ఉండిపోయిన
కనపడని మనసు మౌన రోదన
ఎక్కడో వినిపిస్తోంది దూరంగా
ఏమి చేయలేని నిస్సహాయస్థితి
బిగ్గరగా నవ్వుతోంది నన్ను చూసి
ఎటూ పోలేని నా అస్సహాయత
నాతోపాటుగా ఆగి పోయింది
నన్ను వదలి వెళ్ళలేక ఉండలేక
నేను ఉండి పోయాను అందుకేనేమో...!!

ఆన్ని కలసి....!!

నీ ఏకాంతానికి నే సాక్ష్యంగా మిగిలానా
నీ ఒంటరితనానికి నే నేస్తానయ్యానా
నీ మౌనానికి నే సంకేతానయ్యానా
నీ కలలకు వాస్తవ రూపానిచ్చానా
నీ భావాలకు అందమైన భాషనయ్యానా
నీ చిత్రాలకు సరిపోల్చే ఆకారానయ్యానా
నీ మనసుకు దగ్గరగా తోడుగా ఉన్నానా
నీ జ్ఞాపకాలను నాతోనే ఉంచుకున్నానా
నీ ఆత్మీయతను పంచుకున్నానా
నీ చెలిమికి దాసొహమయ్యానా
నీ అక్షరాలకు ఆలంబనగా మారానా
నీ కనులలో కాపురం ఉన్నానా
నీ వాస్తవం నేనుగా అయ్యాను ఆన్ని కలసి....!!

16, జులై 2014, బుధవారం

గుర్తుకే రాలేదు సుమా....!!

పుడుతూనే ఏడుపుతో మొదటిసారిగా చెలిమిని
పరిచయం చేసి అమ్మకు నాకు వారధిగా నిలిచి
నాతోపాటుగా నాలో అన్ని పంచుకున్న నువ్వు
నా మనసు చెలమలోఇంకిపోయావు అనుకున్నా...!!
మెన్నెప్పుడో పలకరించిన జ్ఞాపకం ఇంకా ఉన్నా అని
నే మరిచేపోయా ఇంకా నా స్నేహాన్ని వీడలేదని
నీ చెమ్మ తగిలి నా చెంప చెప్పింది నిజమే అని
అయినా కడ వరకు వీడని బంధం కదా మనది ...!!
చుక్కగా మిగిలావో చుక్కలన్ని ధారగా మారి
చెలమ జలధి నిండిపోయి కన్నీటి చినుకులుగా
పన్నీటి ధారలుగా నాతో మమేకమై మదిని
పంచుకుని మమతలు పెంచుకుని మిగిలావో...!!
పురిటినాడు నీతోనే మొదలై కదా వరకు తోడుగా
కలసి బతికే మన బంధం ఎవరు విడదీయరానిదని
రెప్ప తెరిచిన క్షణం నుంచి రెప్ప మూసే వరకు
వెన్నంటి ఉండే నేస్తానివి నువ్వే అని గుర్తుకే రాలేదు సుమా..!! 

15, జులై 2014, మంగళవారం

అతి సామాన్యురాలిని....!!

చిలిపి మాటలు చెప్పే చిన్నారిని కాదు
వలపు తలపుల వాయనాలు వడ్డించే
వగలు పోయే వయ్యారిని కాదు
అబద్దాల నిజాలు చెప్పి మోసపుచ్చే
అమ్ముడుపోయే  న్యాయాన్ని కాదు
మాట ఇచ్చి మరచిపోయే మనసు లేని
మౌన భాష్యాన్ని దాచుకున్న మోసపు
హృదయాన్ని అందుకున్న చెలిమిని కాదు
పగలు సాయంత్రాలు పూర్తిగా భరించే
బంధాల అనుభందాల చాటున ఒంరటిగా
మిగిలిపోయిన అతి సామాన్యురాలిన...!!

గమ్యం చేరేనా..!!

నా దారిలో పోదామంటే
గోదారి అడ్డుగా తగిలింది
వెనుక దారిలో వెళదామనుకుంటే
కృష్ణమ్మ కాపు కాసింది
పక్కగా పోదామంటే
పెన్నమ్మ ఉగ్రంగా దూసుకొస్తోంది
రహదారిలో పోనియ్యని
ఈ లోకానికి దాసోహం కాలేక
మండుతున్న మనసు కొలిమిలో
వేసిన మౌనపు గంధపు చెక్కల వాసన
శ్వాసగా మార్చుకుని బతకాలన్న ఆశను
చిగురింప చేసి రాలిన చోటే సరి కొత్త చివురుగా
రూపుదాల్చాలని తహ తహలాడుతున్న
ఒంటరి రాదారి పయనం గమ్యం చేరేనా..!!

14, జులై 2014, సోమవారం

ఊపిరిగా మార్చుకుని....!!

గడియ ఆగలేని కాలం
గాలివాటుగా వెళ్ళిపోతోంది
నే మోయలేని భారాన్ని
తనపై వేసుకుని...!!
మనసు రాయిగా మారిపోయింది
తగిలిన దెబ్బలు తగులుతూనే ఉంటే
తప్పించుకునే దారి లేక తడబడుతూ
తల్లడిల్లి పోతోంది....!!
పడని అడుగుల పాదాల మొరాయింపు
పట్టి లాగుతున్న బాంధవ్యాలు మరోవైపు
దిక్కు తోచని ఎడారిలో పెనుగాలుల ఇసుక
తుఫానులో ఒంటరిగా...!!
హృదయం లేని పాషాణం ఎదురుగా
ముక్కలైన మది అల్లాడుతూ అర్దిస్తోంది
ఆత్మ నివేదనతో ఆంతర్యాన్ని తెలుపుతూ
ఆశనే ఊపిరిగా మార్చుకుని....!!

12, జులై 2014, శనివారం

సున్నితంగా....!!

శైకత రేణువునే అనుకున్నా
పరమాత్మలోని అణువులోని
పరమాణువు కన్నా విస్పోటనాన్ని
సృష్టించగల నైపుణ్యం నాలో దాగుందని
ప్రపంచాన్ని మొత్తాన్ని అరచేతిలో
చూడగల మేధాశక్తి నా సొంతమని
వాయు వేగంతో పోటి పడే మనో నైపుణ్యం
నా మౌన తరంగమని తారాడుతున్న
తారంగాల తాండవాన్ని చిద్విలాసంగా
చూస్తున్న విధాత....
ఎందుకో కోపంగా నలిపెస్తున్నాడు జాలి లేకుండా
అనుకోకుండా గాలి వాటుకి దారి తప్పి
ఎటు చేరాలో తెలియక తన కంటిలో
పడిన అతి చిన్నఇసుక రేణువుని
నలిగిన నలుసైన ఆ రేణువే కన్నీటి ధారలో
జారిన అశ్రుకణంగా భువిపై వాలిన
సాగర తీరాన్ని ముద్దాడిన చెలిమిని
వదలలేక అనుబంధాన్ని పెనవేసుకున్న
తీరం అలల తాకిడికి మైమరచి
అందమైన ఉషోదయ సాయంత్రాలుగా
అందరిని మురిపిస్తూ ఆ విరించినే
సవాలు చేసింది సున్నితంగా....!!

పదిలంగా దాచుకున్నా...!!

వేకువ వెన్నెల పొద్దుపొడుపులో
సింధూరపు మందారాలు శ్రావ్యంగా
సందడి చేస్తూ కనిపిస్తున్న అందాలు
వాటిలో నీ రూపు రేఖలు చూస్తున్నా
కనిపించనేలేదు ఒక్కసారైనా....
జ్ఞాపకాల గతాన్ని గునపంతో గుచ్చి
బయటకు రానీయకుండా బతికేద్దామంటే
గుచ్చుకున్న గాట్ల తూట్లు మాననే లేదు
మరపు మందు వేద్దామంటే కాలమే
దాగి పోయింది కనపడకుండానే అచ్చం నీలానే.....
ఎక్కడో పారవేసుకున్న పాత పుస్తకం
కనిపించింది నీ గురుతులను చెరగనీయకుండా
పదిలంగా అందుకున్నా పాతబడినా ఇంకా
సరికొత్తగానే అనిపిస్తున్న అనుబంధపు
లాలిత్యాన్ని ఆస్వాదించే మధువుగా
మురిపెంగా అందుకున్నాముచ్చటగా
దాచుకున్నా కనిపించినప్పుడు నీకు కానుకగా ఇద్దామని...!!

దేవునికే శిక్ష వేయాలి.... ఎలా..??

బతికున్న శవంతో సహజీవనం ఎలా ఉంటుందో...!! మీలో ఎవరికైనా ఎరికనా...!! చనిపోయాక నరకం ఎలా ఉంటుందో తెలియదు కాని బతికుండగానే నరకాన్ని మించిన లోకాన్ని చూపిస్తుంది ఆ పదం నాకు దొరకడం లేదు సరిపోల్చడానికి....పాపం ఆ పదానికి కూడా భయం వేసింది దొరికితే ఎక్కడ పోల్చేస్తానో అని... కాని ఈ సహజీవనం ఆ అందని అదృశ్య పదమే అనుభవిస్తున్న మనతోపాటు మన బాంధవ్యాలకు కూడా....!! కోపం తెచ్చుకోకండి ఎవరు ఇక్కడ ఓ సామెత గుర్తు చేయాలనిపించింది... "చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు"... ఎంత చక్కగా వినే వారు ఉంటే ఎన్ని నీతులు వల్లే వేస్తామో....!! కనీసం వాటిలో ఒకటయినా ఆచరణలో ఉంటే ఎంత బావుండు...!!
కోపం ఎవరి మీద తీర్చుకోవాలో తెలియనప్పుడు మన ఖర్మకు బాధ్యుడు అయిన దేవుని మీదే చూపించాలి....నా సిద్ధాంతం అదే....తప్పయినా ఒప్పయినా తప్పని రాద్దాంతం...!! మన ఖర్మకు మనల్ని బాధ పెడితే తట్టుకోవచ్చు కాని అన్నెం పున్నెం ఎరుగని వాళ్ళను బలి చేస్తూ అందరితో నటిస్తూ తనతో తను కూడా నటించే ఇలాంటి వాళ్ళను సృష్టించిన దేవుని నిందించడం తప్పేలా అవుతుంది చెప్పండి....!! అయినవాళ్ళు ఎవరు దగ్గరకు రాకుండా పరాయి వాళ్ళు అందరు తనకు బాగా దగ్గరి వాళ్ళు అని విర్రవీగుతున్న ఈ నైజాలకు అసలు జీవితాన్ని తెలియచేప్పని దేవునికే శిక్ష వేయాలి....  ఎలా..??

11, జులై 2014, శుక్రవారం

రాని ఆ క్షణాల కోసం....!!

అనంతమైన శూన్యాన్ని మాయం చేసి
అందమైన కావ్యంగా చూడాలన్న తపన
ఎగసి పడుతున్న మనసు కెరటాలకు
అర్ధం అయిన విశ్వ జనీనమైన ప్రేమకు
దాసోహమంటున్న వేలాది మందిలో
వెతుకుతూనే ఉన్నా ఎక్కడో ఓ చోట
నువ్వు కనిపించక పోతావా అని....!!
అన్ని రకాల ప్రేమల్లో దాగిన సత్యాన్ని
వెదికిన నా మది అంతరంగం అలసిపోయి
సోలిపోయింది అంతరార్ధాన్ని గ్రహించి
ప్రేమలోని ఇష్టాన్ని అటు ఇటు తిప్పి
భూమి గుండ్రమే అని తెలిపిన సాక్ష్యాలు
నమ్మలేని ఆధారాలుగా కనిపిస్తుంటే....!!
స్వర మాధుర్యాన్ని దానిలోని మమతను
గుర్తించలేని నీ అసహాయతను చూసి
మేఘాల పరదాలు కమ్మిన వెలుగు చుక్కలు
బయటికి రాలేని నిస్సహాయతకు ఆసరా కాలేక
ఓ జన్మ ఖైదీగా నీ కోసం మిగిలిన ఈ జీవిత బంధిని
మరపు మత్తులో ముంచుతూ మిగిలున్నా రాని
ఆ క్షణాల కోసం ఎదురుతెన్నులు చూస్తూ....!!

మిగులుతున్న పాత జీవితాలు.... !!

వేద మంత్రాల పంచభూతాల
ఖేద మోదాల నాద వాద్యాల
అష్టదిక్కుల అగ్నిహోత్రాల
సప్తపదుల నడకల మధ్యన
పచ్చని పందిరిలో పసుపు కుంకుమ  జంటగా
ముచ్చటైన ముత్తైదుల బంధు జనాల నడుమ
ముత్యాల తలంబ్రాల వర్షపు హర్షాల
చినుకుల మధ్యన జంటగా మారుతూ
వేసిన ముచ్చటైన మూడు ముళ్ళ బంధం
తడి ఆరని కాళ్ళ పారాణి మెరుస్తుంటే
ఏడడుగుల సాక్షిగా ఏడుజన్మలకు
అనుబంధంగా అప్పగింతల అంపకాల
ఆనందం చాటుగా దాగిన కన్నీటి భాష్పాల
నడుమన ఎక్కడో ఆకాశంలో కనిపించిందో లేదో
తెలియని అరుంధతి నక్షత్రం ఆలంబనగా
మొదలైన కొత్త జీవితం.....
వేసిన మూడు ముళ్ళు నూరు ముళ్ళై గుచ్చుతు
ఏడేడు జన్మల బంధం ఏడురోజులకే ఎన్నో రోజులైతే
అప్పగింతల అంపకాలే అంపశయ్యలుగా మారుతుంటే
చూసి చూడనట్టు పోయే బాంధవ్యాలు చూస్తూ
బాధను దిగమింగుతూ మరణ శాసనాన్ని సోపానంగా
ఆరని అగ్నిహోత్రాన్ని చితిగా చేసుకుని చితికి పోతున్న
కొత్తైన పాత జీవితాలు మారని మనసులకు
మార్పు లేని సమాజానికి చితా భస్మాలుగా
మిగులుతున్న పాత జీవితాలు.... !!

10, జులై 2014, గురువారం

నేను ఓ ఇసుక రేణువునే....!!

చెరిగి పోయిన చిరునామా
చెదరని జ్ఞాపకమై నిలిచినా
ఓ చోట కూర్చాలని...
అటు ఇటు పారిపోతున్న
అక్షరాలను పట్టుకునే లోపలే
అందకుండా జరిగిపోతూ...
పట్టు చిక్కకుండా జారిపోతున్న
ఒరవడిలో ఏరుకుంటున్న
మమతల మంజీరాలు...
మాయమై పోతున్న మనసులకు
మారిపోతున్న మనుష్యులకు
నీటి మీది రాతలుగా నిలిచి....
సాక్ష్యాల సంబంధాలను బందించి
అంపకాల పంపకాలే అవకాశాలుగా
అంపశయ్యల అవశేషాల రోదన....
వినిపిస్తున్నా వినిపించని
మరో దిక్కుకు దారి చేసుకుంటూ
మారుతున్న కాలాన్ని అవకాశంగా
కప్పుకుని అనుబంధాలను దోచుకుంటూ
తప్పుల ఒప్పులను దాచేసుకుని
తమని తామే మోసపుచ్చుకుంటూ
బతికేస్తున్న ఎందరో మహానుభావుల్లో
నేను ఓ ఇసుక రేణువునే....!!

9, జులై 2014, బుధవారం

ఆ అద్భుతం ఎలా ఉంది....!!

మనసు మూగతనాన్ని అలుసుగా తీసుకుని
అలల కలలు అస్తవ్యస్తంగా చేసిన మదిలో
మాటల ప్రవాహాన్ని అడ్డుకున్న గరళాన్ని
దాచిన చిరునవ్వు చాటుగా చూస్తోంది
దాగిన కన్నీటి సంద్రాన్ని చూపకుండా
ఆపగలిగిన ఆ మౌనాన్ని ఎలా చూపాలి...!!
తెలియని స్వరాల సమ్మేళనం గమ్మత్తుగా
మత్తుగా మాయ చేసినా చీకటి చాటున
చిరు వెన్నెల అందం తెలిసిన జీవితపు
గమ్యం చేరాలని ఆరాటం పోరాటం ఆటలో
ఓడిపోయిన  హృదయం అలసి సొలసి
ఆగిపోతే అలానే ఉండిపోతే తెలియని
ఆ అలౌకిక అనుభూతిలో మమేకమై
అదే తన ప్రపంచమని భ్రమలో బతికేస్తున్న
మరణ శయ్యపై కూడా మమతల
మాధుర్యాన్ని చవి చూస్తున్న
ఆ అద్భుతం ఎలా ఉంది....!!

5, జులై 2014, శనివారం

వాయిదా వేస్తూనే....!!

విగత జీవిగా మారానని అనుకున్నా
ఇంకా జీవం ఎక్కడో ఉందని తెలిసి
ఆ చోటు కోసం వెదుకుతున్నా....
కనిపించని క్షణాలు ఎన్నున్నా
ఎదురుగా వచ్చే ఒక్క క్షణం కోసం
ఆత్రంగా చూస్తూనే ఉన్నా....
జీవం లేని నిశ్చలత్వం నాదైనా
జీవితాన్ని పంచుకున్న నీకోసం
కాలాన్ని వెళ్లదీస్తున్నా...
మారని మనసుల సందేహాలు
మార్చుకోలేని జీవితాలు మనవై
దగ్గరలోనే ఎంతో దురాన్ని.....
చెలిమి లేని స్నేహం మనదని
కలివిడిగా ఉన్నా విడివడిన
బంధాన్ని అక్కున జేర్చుకునే
యత్నాన్ని ఎప్పటికప్పుడు
వాయిదా వేస్తూనే ఈ జీవితం
జీవం లేని ఆకారంగా ఉండిపోతోంది....!!

4, జులై 2014, శుక్రవారం

ఈ జన్మకు తెలుసుకోలేని....!!

సాహిత్యం రాహిత్యం నుండి వచ్చినా
సాన్నిహిత్యంలో నుంచి జనియించినా
ఏదైనా ప్రేమలోని నమ్మకానికి దాసోహమే
ఆ నమ్మిన క్షణానికే ఈ భావాల రాపిడి
సహజత్వమో అసహజత్వమో తెలియకుండా
ఇప్పటికి అలానే ఉండి పోయిన గతాన్ని
మార్చలేని మార్పులేని మనసుల
సంఘర్షణ ఘర్షణగా మారినా...
మారని మనిద్దరి ఆంతర్యాల గమ్యం
నాకు తెలియని నీకు తెలిసిన నేను
అందుకేనేమో నాతో ఆటలాడుతూ నువ్వు
ఎప్పుడూ ఓడిపోతూ నేను...
అయినా చిరునవ్వుని వీడని నా మోము
నేను ఓడినా అది నా గెలుపే అని సంబరపడుతూనే
ఓ జీవిత కాలం ఓడిపోయానని గుర్తించలేని
అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని
పక పకా నవ్వుతూ నీ గెలుపు కోసం
నా ఆరాటాన్ని ఈ జన్మకు తెలుసుకోలేని
నీది ఎంత తెలివి అనుకోవాలో మరి...!!

2, జులై 2014, బుధవారం

ఒంటరి నక్షత్రం.....!!

ఆకాశం నుంచి రాలిపండిందో
నక్షత్రం ఒంటరిగా భయపడుతూ
తనేక్కడికి పడిపోతోందో తెలియక
తన చుట్టూ ఉన్న బంధాలను వదలి
అనుబంధాలకు దూరంగా మరలి పోతూ
రాలిపడుతున్న క్షణాలను లెక్కించుకుంటూ
జ్ఞాపకాలను తోడుగా తెచ్చుకుంటూ
మరో చోట తన సహజత్వాన్ని చూపించాలని
ఆరాటపడుతూ రేపటి పై కొండంత ఆశతో
మిణుకు మిణుకుమనే చిన్న వెలుగుని
చీకటిలో చిరు దీపంలా అందరికి వెలుగు పంచుతూ
తను మాత్రం ఏకాంతానికి తోడుగా
వనవాసానికి బయలుదేరింది ఎందుకో మరి...!!

1, జులై 2014, మంగళవారం

నా అక్షరాలు.....!!

నా అక్షరాలు
నాతో స్నేహం చేసే నా నేస్తాలు
నా అక్షరాలు
నాలో నన్ను పంచుకునే బంధాలు
నా అక్షరాలు
నే దాచుకునే విలువైన జ్ఞాపకాలు
నా అక్షరాలు
నే పెంచుకునే అనుబంధాలకు సాక్ష్యాలు
నా అక్షరాలు
నన్ను నాకు చూపే నా అంతర్నేత్రాలు
నా అక్షరాలు
నాతో ఆడుకునే అందమైన ఏకాంతాలు
నా అక్షరాలు
నాతోనే ఉండే విచిత్రపు ఒంటరి నక్షత్రాలు
నా అక్షరాలు
నన్ను దాయలేని దాపరికాల భావాలు
నా అక్షరాలు
నే మలచిన మనసు మౌన గానాలు
నా అక్షరాలు
నాకే సొంతమైన నా ఆనందాలకు నిలయాలు
నా అక్షరాలు
నా జీవిత గమనానికి రూపాలు
నా అక్షరాలు
అటు ఇటు వెరసి నేనే అని నాకు తెలిపిన దాఖలాలు...!!

మాయ చేయడం తగునా.....!!

ఎందుకో మన మధ్యన మాటలు
మౌనంగా తారాడుతున్నాయి
ఎటూ పోలేక అక్కడే తచ్చాడుతూ
నువ్వెప్పుడు పలకరిస్తావా అని......
చూశావా దూరం కూడా అలానే ఉంది
నువ్వెప్పుడు దాన్ని దూరం చేస్తావో అని
భయపడుతూ నన్ను భయపెడుతోంది
నేనెక్కడికి పోను అని అడుగుతూ...
మాటల గల గలల్ని మౌన సమీరాలుగా
మార్చి తరిగే దురాన్ని మరింత పెంచుతూ
నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ
నన్ను మాయ చేయడం తగునా.....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner