25, ఆగస్టు 2014, సోమవారం

ఇలపై జాబిలి.....!!

ఇలపై జాబిలి ఇదిగో చూడిలా....

నింగిపై దాగిన నిండు పున్నమి
నేలపై కెపుడు వచ్చెనో వివరమే
విన్నవించుమా......

జగతి సిగలోని  ఈ జాబిలమ్మెవరో
సొగసు చూడ ఈ సంపెంగ మొగ్గ
ఎక్కడిదో......

పాలుగారే ఈ పసిడి చందనమెవరో
విరుల తావుల వాలిన ఈ వలపు రెమ్మను
చూడలేక....  

కసరి పారవేసిన ఈ కాంతి చినుకుకు
తట్టుకొనలేక పాదానుక్రాంతమే
ఈ ప్రపంచం.... 

నీ చిరునవ్వు సాక్షిగా అందిన ప్రేమకు
దాసోహమే ఈ జన్మకు తోడుగా
వేల జన్మల జతకు వివరణ అడుగక....!!

24, ఆగస్టు 2014, ఆదివారం

ఓ చిన్న సందేహం.....!!



ఓ చిన్న సందేహం అండి ..... మనలో చాలామంది పెళ్ళి అయినవాళ్ళు ఉన్నారు.... ఎంతమంది మీ పెళ్ళికి మీరే మీ అమ్మానాన్నలను ఆహ్వానించారు చెప్పండి...!! అది రాత పూర్వకంగా కానివ్వండి లేదా వెళ్ళి పిలిచినా సరే....!!

శూన్యాన్ని చుట్టేద్దామని...!!

శూన్యాన్ని చుట్టేద్దామని రోజు నా ప్రయత్నమే
ఎక్కడ మొదలు పెట్టాలా అనుకుంటూ మొదలు
వెదికే వెతుకులాటలోఆది అంతాల కోసం పోరాటమే
అయినా ఆగని ఆలుపులేని ఈ పరుగు పందెంలో
ఓడిపోవడానికి ఇష్టపడని నా అంతరంగం తనలోని
కలల నిజాల కోసం తపన పడుతూ నిరంతరం సాగుతూనే
అందని గమ్యాన్ని అందుకోవాలని ఆరాటపడుతూ
అడ్డు తగిలే ఆలశ్యాలను అధిగమిస్తూ పోతూనే ఉన్నా
ఎప్పటికైనా ఏమి లేని శూన్యాన్ని చుట్టేసి పక్కనే
దాగిపోయిన జలతారు వెలుగు అందిపుచ్చుకోవాలని
విశ్వమంతా ఆ వెన్నెల కాంతిలో మెరవాలని
సంతోషపు చిరు జల్లులు సాదరంగా స్వాగతం పలకాలని
నిరాశల నిటూర్పులు వినిపించని కొత్త ప్రపంచాన్ని అందరికి
పరిచయం చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూస్తున్నా...!!

23, ఆగస్టు 2014, శనివారం

పేదరికం...!!

పేదరికం డబ్బులోనా ఆకలిలోనా...!!
అనుబందాలే లేని ఏకాకులదా...!!
అన్ని ఉన్నా కడుపు నిండా తినలేని నష్టజాతకులదా...!!
ఎవరిదీ పేదరికం....ఎలా పుట్టింది ఈ పేదరికం...!!
ఇలా ఓ అట్టముక్క ఇచ్చేసి హమ్మయ్య అనుకుందామా ...!!

నలుగురు మనుష్యులు.....!!

మనం అనుకుంటూ ఉంటాము మన అంత నిజాయితీ పరులు ప్రపంచంలోనే లేరు అని....కాని అది చెప్పాల్సింది మన  పక్కన ఉండేవారో లేదా మనతో ఉండేవారో చెప్పాలి.... మనం పక్క వారికి కీడు చేయవచ్చు కాని మనకు అధికారం చేతిలో ఉంది అని అందరిని భయపెట్టి బతుకుదామంటే ఎలా సరిపోతుంది లెక్క...!! మనం ఒకరి లెక్కలు సరిచేడ్డామంటే మన లెక్కలు సరి చేసే వారు మరొకరు ఉంటే అది తట్టుకోలేము ఎలా అండి ఇలా అయితే.... అధికారాన్ని ఊరి  కోసం ఉపయోగించాలి కాని మన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటునే ఉన్నాము ఎప్పటి నుంచో....!! ఒకసారి నెగ్గాము కదా అని ప్రతిసారి లెక్కలు మనకే అనుకూలం అనుకుంటే ఎలా అండి.... మీకు కలక్టర్ తెలిస్తే మీ పని అయిపోతుందా....నీతి న్యాయం అనేవి ఉండనక్కరలేదా.... మనం మన ముందు వాడిని ఇబ్బంది  పెడితే మనకన్నా పై వాడు మన దారిలోనే వెళతాడు కదా.... మనం చేసినప్పుడు తప్పు అనిపించనిది మన దగ్గరికి వచ్చేసరికి మారిపోతోందా....!! మనం చూపిన దారే కదా మరి తప్పెలా అవుతుంది.... ఉపసభాపతి మీ చేతిలో ఉంటే జిల్లాలో ఏం చేసినా సరిపోతుందా ....!! చదువు అధికారం ఉండగానే సరి కాదు సంస్కారం అనే పదాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు కాస్త అది వెదకండి మీకు తెలియక పోతే కాస్త పుస్తకాల్లో వెదకండి కనిపిస్తుంది అర్ధం.....!! న్యాయం ధర్మం అనేవి అందరికి సమానమే అని గుర్తు చేసుకుంటే రేపు పొతే మోయడానికి నలుగురు మనుష్యులు అందుబాటులో ఉంటారు.....!!

22, ఆగస్టు 2014, శుక్రవారం

కన్నీటి కలశాలు.....!!

నేను మాట్లాడుతూనే ఉన్నా
నీ మాటలకన్నిటికి సమాధానాలుగా
మరెందుకు వినిపించడం లేదు నీకు....!!

జీవితంలో జీవిని వదలినా
ఉండిపోయిన జీవాత్మ పయనం  సాగుతూనే
వెదుకుతోంది తన ఉనికి కోసం...!!

ఇన్నేళ్ళ  సాహచర్యాన్ని మరచి
మరో కొత్త ప్రాంగణం కోసం నిరంతరాన్వేషణంలో
వసంతాల మజిలీలను మోసగిస్తూ....!!

గాయాలు తగిలిన గుండె గొంతుక
మూగబోయి మది మానసం మౌనంగా పలికితే
అందుకే వినిపించలేదు కాబోలు...!!

చెప్పాలని తొదర పడినా చెప్పని
సంతసాల చిలక పలుకులు చిన్నబోయి ఇదిగో
ఇక్కడే సమాధిలో నాతోనే ఉన్నాయి....!!

ఎప్పటికి నిను చేరని కధల కావ్యాలు
నీకు అర్ధం కాని సంతకంలా మిగిలిపోయి ఇలా
కన్నీటి కలశాలుగా నిలిచిపోతున్నాయి....!!

21, ఆగస్టు 2014, గురువారం

ఎక్కడో కొన్ని మాత్రమే...!!

గాజుబొమ్మకు ఊపిరి లేదని అనుకున్నా
అందమైన ఆకృతికి అలంకరణ చేసి
భలే బావుందని సంబర పడుతుంటే
చేతిలో నుంచి చటుక్కున జారిపోయిన
అందాల అపరంజి భళ్ళున బద్దలై
ఇల్లంతా పరుచుకున్న ముక్కల్లో
ఏ చిన్న ముక్కని తాకినా తడిగా
తగిలిన మనసు కన్నీళ్ళు కనిపించి
ముక్కలన్నీ ఏర్చి కూర్చి అతుకులకు
అమర్చిన అద్భుత సోయగాల ముందు
దాచిన కలకంఠి కాటుకచుక్కల మరకలు
దిష్టి చుక్కలుగా అమరినట్టుగా అనిపించినా
దాయలేని మౌనరోదన అలంకారాలను
అడ్డుగోడలను దాటి మానవత్వాన్ని తాకితే
వెలువడే వరదగోదారి ఉదృతానికి మమతల
ఆనకట్టను వేసిన బాల్యాన్ని వదలలేని 
జ్ఞాపకాల అల్లికలో మళ్ళి దాచుకున్న
సజీవశిల్పాన్ని కానుకగా అందుకున్న
కాలాన్ని యుగాంతం వరకు స్వచ్చంగా
నిలుపుకున్న క్షణాలు ఎక్కడో కొన్ని మాత్రమే...!!

20, ఆగస్టు 2014, బుధవారం

నన్ను నేను వెదుక్కుంటూ....!!

చినుకు రాలినా చివురు తొడిగినా
మొలకలెత్తినా మోడుబారినా
ఉరకలెత్తినా ఉండిపోయినా
మసకబారినా మనసుతో చూసినా
వెలుగు చుక్కల రెక్కలు రాలిపడుతున్నా
గగనపు చిరునామాలో మిగిలిపోయిన
తలపుల తటస్థ వాకిటిలో ఎదురుచూస్తూ
మేఘాల దుప్పటిలో దాగిపోయినా
నన్ను దాటి పోలేని జ్ఞాపకాలను వదలి వెళ్ళలేక
రమ్మని పిలిచే పిలుపులను అందుకోలేక
శూన్యాన్ని చూస్తూనే ఉండిపోతున్నా
పారవేసుకున్న నన్ను నేను వెదుక్కుంటూ....!!

16, ఆగస్టు 2014, శనివారం

ఏమిటో మరి ఈ వింత...!!

గరళం గొంతులోనే ఉండిపోయింది
ఎటు  వెళ్ళాలో తెలియక
ఇముడ్చుకోలేని విషాన్ని భరించడం
ఆ నీలకంఠధారునికే ఎరుక
లెక్కలేసుకుంటున్న క్షణాలలో దగ్గరగా
వచ్చిన నీలో అంతర్ముఖంగా
నన్ను నేను చూసుకుంటున్నా ఎందుకో
ఆపలేని కాలాన్ని అంతర్లీనమైన భావుకతతో
పోల్చుతూ ఈ చర్మపు తిత్తిలో మిగిలిన
మనసు ఎగిరిపోయే నిమిషం తెలిసినా
మరో ప్రపంచానికి స్వాగతం పలికే
మరుజన్మకు నాందిగా ఆనందాన్ని
చవి చూడాలన్న అంతర్లోచనాన్ని
నాకు మాత్రమే వినిపిస్తున్న సాగర మధనం
అద్భుతంగా అనిపిస్తోంది ఏమిటో మరి ఈ వింత...!!

14, ఆగస్టు 2014, గురువారం

నీ దగ్గరనే....!!

తొలి వలపు తెలియని నా ప్రేమకు
మలి వాసంతము నీవే అయినావు
మరులుగొన్న మనసుకు మరపునే
దూరం చేసి జీవితాంతం వెన్నాడుతునే
వదలని నీ జ్ఞాపకాల సాక్షిగా మరణించిన
నా మది వెదుకుతూనే ఉంది అంతర్లీనంగా
మరపునే మరపించిన నీ ప్రేమకు బందీగా
దాసోహమైన ఈ జన్మ వేల జన్మలకైనా
నీ కొరకే ఎదురుచూస్తూ ఉంటుందని
నీ ఎరికలో లేని నా హృదయం నన్ను వదలి
నీ దగ్గరనే దాగిపోయింది ఎందుకో మరి...!!

పుట్టినరోజు శుభాకాంక్షలు .....!!





అల్లరి శౌర్యకు అందరి పుట్టినరోజు శుభాకాంక్షలు .....
                                            ప్రేమతో .....
                                           అందరూ

13, ఆగస్టు 2014, బుధవారం

మనమూ ఒకరమే అంతే...!!

ఒక్కోసారి ఎవరో ఒకరు అన్న మాటలు నిజాలై పోతాయి....మనం అనుకోకుండా అనుకున్నవి కూడా అలానే అవుతాయి.... ఇలా అవుతుంటే ఎంత సంతోషమో కదూ.... డబ్బులు పెట్టి కొనలేనిది.... కావాలంటే దొరకనిది అదే కదా మరి.... కాలాన్ని శాసించే ఆ ఆనందం మనలో ఎంతమందికి దొరుకుతుంది...?? విధిరాత ఎలా ఉన్నా చివరి మజిలి మనకు తెలిసిన మరుక్షణం ఏమి కొత్తగా మారిపోదు..... అన్ని మాములుగానే వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి.... వాటిల్లో మనమూ ఒకరమే అంతే...!! తెలిసినా తెలియక పోయినా జరిగే వాస్తవాలను ఆపలేము కాని నమ్మగలిగే స్థితిలో ఉంటే చాలు.... మనకు నచ్చలేదని నిజాన్ని అబద్దమని అనుకున్నంత మాత్రాన నిజం అబద్దమైపొదు... అబద్దం నిజమైపోదు.... వాస్తవాన్ని అంగీకరించే మనసు మనకు ఉంటే సరిపోతుంది... రెప్పపాటు ఈ జీవితాన్ని క్షణాల గంటల రోజుల నెలల సంవత్సరాల కాలం నెట్టుకువస్తున్న మన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల భారాలు వాటిని మరచిపోయే కొన్ని ఆనందాల ఆప్యాయతలు అందరికి కాకపోయినా కొందరికైనా వరాల జల్లుగా మారి సంతోషపు సంబరాలు నాట్యాలు చేస్తూ ఉంటాయి.....రాతల తేడానో గత జన్మ ఫలితమో తప్పని శాపాలుగా వెంటాడుతూ ఏడిపిస్తుంటాయి మరి కొన్ని... ఏది ఎలా ఉన్నాబతుకు బండి లాగక తప్పని జీవితాల అక్షరాల కధలు మరి కొన్ని... రెప్ప తెరిచినా క్షణం నుంచి రెప్ప మూసే క్షణం వరకు తప్పని పోరాటమే అన్ని కలగలిపిన ఈ జీవన గమనం....!! ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది " జగమంత కుటుంబం నాది ... ఏకాకి జీవితం నాది " ఇంత బాగా ఎలా రాయగలిగారా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని....ఎందరో మహానుభావులు అందరికి నా వందనాలు...!!

11, ఆగస్టు 2014, సోమవారం

కాలాన్నే వదలివేశానని......!!

క్షణాల కాలం దొర్లి పోతూనే ఉంది ఆగకుండా
నన్ను వదిలేసిన క్షణాలు మాత్రం ఉండిపోయాయి
నాకు తోడుగా నాతో పాటుగా నా వద్దనే....!!

నీతోపాటుగా రాలేని నన్ను వెక్కిరిస్తున్న క్షణాలను
వెంటాడి పట్టుకుందామనుకుంటే పరిగెత్తిపొతు ఎలా నవ్వుతున్నాయో
మాతో పోటికి రాలేవని గేలి చేస్తూ ఎగతాళి చేస్తున్నాయి....!!

ఎప్పుడు నువ్వే గెలిచావని సంబరపడి పోతున్నావు
కాని నువ్వు ఓడిపోతున్న క్షణాల కాలాన్ని చూడలేని నా మనసు
నిన్ను అనుక్షణం గెలిపిస్తోందని మరచి పోయావు కదూ....!!

నీ ఓటమి చూడలేని నేను ఈ ప్రపంచాన్ని వదలివేస్తూ
నీ విజయానికి సోపానంగా మారడానికి సైతం నా మది వెనుకాడలేదన్న
సత్యాన్ని నువ్వు తెలుసుకునే క్షణాల్లో నీ ఎదురుగా లేనిది నేనే...!!

ఎవ్వరు కొనలేని సంతోషాన్ని పంచుకోవడానికి నీతో
నేను లేనన్న నిజాన్ని గ్రహించలేని నువ్వు ఎందరున్నా ఎవరు లేని
ఏకాంతాన్ని మాత్రమే సొంతం చేసుకుంటున్నావు....!!

రేపటి మన అన్న ఆనందంలో నువ్వు మాత్రమే ఉండిపోయావని
నిన్న నేడు వదిలేసిన నీకు రేపటిలో లేని మన గురించిన ఆలోచన రాలేదని
తెలిసిన క్షణం నేను వినకూడదని కాలాన్నే వదలివేశానని నీకు తెలుసా......!!

9, ఆగస్టు 2014, శనివారం

మృత్యు శకటాలు...!!


ముంచుకొస్తోంది మృత్యువు రాక్షసంగా
యముని మహిషపు లోహపు గంటలు
వినిపించే మరణ మృదంగ నాదం...
ఎటు చూసినా శకటాల శకలాల మధ్యన
పిన్నల పెద్దల ఆహాకారాలే రోదన వేదనలే
జాలి లేని మృత్యువు వి'భిన్న' రూపాలు
ఎదురు నిలిచే  నిరంతర ప్రయత్నంలో 
అధిక వేగాలనివారణ వాహనదారుల
నియమపాలన సాధనాల పరిశీలన
ఆధునిక యంత్రాల అనుసరణలో
ఆత్మ పరిశీలన మనసు శోధన
మరనశాసనాల తగ్గింపుల అవకాశం
దైవం మనకిచ్చే మరో వరం ప్రకృతి విలయాల
వికృతి రూపాల అడ్డుగోడలు సహజ వాతావరణం
సమయ పాలన సరిపెట్టును ఎన్నో ఒడిదుడుకులను....!!

7, ఆగస్టు 2014, గురువారం

సజీవ రూపమే....!!

నిస్తేజమైన ఆ చూపుల వెనుక దాగిన
మనోగతం నాకు తెలుస్తోంది
నిరాసక్త జీవితానికి నాందీవాచకమని....

ఎప్పుడో రాలిపోయిన రెక్కలు
అక్కడక్కడా పడి చెదురుమదురుగా
అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి....

వాలే పొద్దు వర్ణాలతో పోటి పడుతూ
విచ్చుకుంటాయి వాడిపోతామని తెలిసినా
వేవేల వర్ణాల అందాలను అందిస్తూనే....

రేయికి అందే ఆనందాన్ని దూరం చేయని
వేకువని చూస్తూ సందెవేళ సాయంత్రానికి
స్వాగతం పలికే మల్లెల పరిమళాలు....

తొలిఝాము అవుతుందని
మంచుపూల తెరలను ఆహ్వానించే
రాతిరి రెక్కల చాటున దాగిన ఉషోదయం....

వినిపించే మనసు స్వరాలు
కనిపించే మానస సరోవరాలు కలగలిపిన
కమ్మని చీకటి వెలుగుల రంగేళి.....

గాలి గాంధర్వమైనా మౌనం మంత్రమైనా
నీ దరి చేరిన గడ్డిపూవుకైనా
గంధపు సువాసనల తాకిడితో సజీవ రూపమే....!!

6, ఆగస్టు 2014, బుధవారం

ఆ జ్ఞాపకాలు ఎప్పటికి సజీవమే....!!

అను చాలా సంతోషం నీ సమయంలో నాకు కాస్త సమయాన్ని కేటాయించి నా సంతోషానికి కారణమైనందుకు ఇరవైరెండు ఏళ్ల తరువాత కూడా ఇంత బాగా గుర్తు పెట్టుకుని వచ్చినందుకు పాత రోజులు గుర్తు చేసినందుకు ... ఆ జ్ఞాపకాలు ఎప్పటికి సజీవమే అని మనసున్న మమతలకు దూరాలు అడ్డు కావని నిరూపించినందుకు....మన ఆనంద క్షణాలను ఎప్పటికి గుర్తు ఉండేలా చేసినందుకు ..... థాంక్స్  మాత్రం చెప్పను.... మీ అందరికి గుర్తుగా ఉండిపోయిన నేను చాలా అదృష్టవంతురాలిని....!!

అవగతం కావడం లేదు ఎందుకంటావ్...!!

ఎన్నో ఏళ్ళ మౌనం ఒక్కసారిగా
భళ్ళున బద్దలైంది అనుకోకుండా...
మౌనపు మాటల శబ్ధాల అర్ధాలకు
అడ్డుగా పదాల గోడలు కట్టడానికి
నీవద్ద ఇంకా ఏం మిగిలున్నాయని
అలా అంతా చూస్తూ వెదుకుతున్నావు...??
అందరితో పాటుగా నిన్ను నువ్వు
ఏమార్చుకున్నా నీ మనస్సాక్షికి
అసలు నిజం తెలియనిది కాదుగా...
ఎదురు చూసి చూసి వదలిపోయిన
ఈ హంగుల ఆర్భాటాల లోకానికి 
మళ్ళి  రావాలన్న కోరికలేని నాదైన
సామ్రాజ్యంలో బతికేస్తున్న నన్ను
కొత్తగా మళ్ళి పాత ప్రపంచానికి
పరిచయం చేయాలనుకోవడంలో అర్ధం
నాకు అవగతం కావడం లేదు ఎందుకంటావ్...!!

4, ఆగస్టు 2014, సోమవారం

మరి ఎవరు ఎప్పుడో....!!

స్నేహం అంటే నాకు గుర్తు వచ్చేది ముందుగా కర్ణుడే....!! స్నేహానికి అసలైన నిర్వచనం చెప్పింది కర్ణుడే...!! ఇచ్చిన
మాట నిలబెట్టుకోవడంలో శిభి చక్రవర్తి చిన్న పావురానికి మాట ఇచ్చిన మహారాజు ప్రాణాలను సైతం ధారపోయడానికి వెనుకాడలేదు.... ఎప్పుడో చిన్నప్పుడు చదివిన కధ ఆ రాజు పేరు గుర్తు లేదు కధ కూడా పూర్తిగా గుర్తు లేదు.... దరద్రదేవత చోటు అడిగితే కాదనలేని ఆ రాజు లోనికి రమ్మని ఆహ్వానిస్తే అష్ట లక్ష్ములు ఒక్కొక్కరుగా ఇంటిలోనుంచి బయటకు వెళుతుంటే ఎందుకు అని అడుగుతాడు దారిద్ర్యం ఉన్న చోట తాము ఉండలేమని చెప్తూ బయటకు వెళిపోతుంటారు వరుసగా చివరికి సత్య లక్ష్మి వెళుతుంటే  అమ్మా నీవెందుకు వెళుతున్నావు... నీకోసమే కదా నేను ఇచ్చిన మాట మీదే ఉన్నాను అంటే ఏం చెప్పలేక మళ్ళి లోనికి వెళుతుంది...తన వెనకాలే మిగిలిన లక్ష్ములు అందరు లోనికి వచ్చేస్తుంటే ఏమ్మా... ఉండలేమని వెళ్ళారు కదా అని అడిగితే  సత్యలక్ష్మి ఎక్కడ ఉంటే మేము అక్కడే అని సమాధానం చెప్తారు.... ఈ కధలో తప్పులు ఉంటే ఉండొచ్చు కాని జరిగింది ఇదే...!!
మోసం నటన ఈ రోజుల్లో చాలా సాధారణం అయిపోయాయి.....మనం అలా ఉన్నామని అందరిని మన గాటినే కట్టేస్తే అది చాలా తప్పు.... మనం అబద్దాలు చెప్తామని అందరు అలానే చెప్పరు....అలానే బంధమైనా అనుబంధమైనా ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇల్లు ఆ ఇంటికి అంతే దూరం.... మనం ఎలా ఉంటే ఎదుటివాళ్ళు మనతో అలానే ఉంటారు.... మళ్ళి వాళ్ళు అలా ఉంటే ఒప్పుకుని చావదు మన అహం....ఏం చేస్తాం మనతోనే మనం నిజాయితీగా ఉండలేమాయే ఇక బయటి వాళ్ళతో సరే మన అనుకున్న వాళ్ళతో అయినా నటించకుండా ఉండే సమయమెక్కడ..
ఉన్న కాస్త జీవితమూ నటనకే అంకితమైపోతే ఇక మన అసలు రూపం మనకి కూడా గుర్తులేనట్టే కదా... ఈ క్షణం మాత్రమే మనది మరుక్షణం మనది కాదని తెలిసినా.... పోయినప్పుడు ఆరు అడుగులు లేదా నాలుగు కట్టెలు నలుగురు మనుష్యులు మాత్రమే.... ఏది మన వెంట రాదు... మంచి చెడు తప్ప...!! ఏది మిగుల్చుకోవాలన్నది మన చేతిలోనే ఉంది... మన బాధ్యతలను మర్చి పోకుండా మన పని మనం చేస్తే చాలు... ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తే అప్పుడు ఆ(.... అంటూ వెళిపోవడమే అన్ని అప్పటికప్పుడు వదిలేసి.....మరి ఎవరు ఎప్పుడో....!!

వేద సారాల సారాంశం.....!!

యోగాన్ని సాధనగా యోగమే భోగంగా
నిరంతరాయంగా నిర్భేధ్యంగా సాగుతున్న
మనసు యోగం మానసిక పరిపక్వతతో
మమేకమైన మౌనమైన మది మానసం
బళ్ళున బద్దలైన ఒక రోజు....
ఉగ్రస్వరుపం ఉదృతంగా ఉరకలేసి
ఒక్క ఉదుటన ఉరికిరాగా అడ్డుకోలేని
నిస్సహాయుల రోదనలతో నిండిన వేదనలు
వినిపించని మౌనంలో కనిపించని ఆవేశం
చాటుగా ధీటుగా నిలుచున్న ఆ వెలుగు రేఖల
కాంతిని ఆపలేక అటు ఇటు పరుగులు పెడుతూ
ఓరిమి ఆవేశం ఎలా ఉంటుందో చవి చూస్తున్న
సమాజ జీవశ్చవాలు అతలాకుతలం అవుతూ
యోగాన్ని ఆభరణంగా చూడలేని కబోదులు
ఆ యోగ జ్వాలలలో ఆహుతి కాక తప్పదని
వేద సారాల సారాంశం.....!!

అమ్మలోని బొమ్మా ....!!

అమ్మా...!! అమ్మలోని బొమ్మా
ఏమిటమ్మా నీ ఆంతర్యం ...??
అంతర్లోచనల అంతర్లోకాల ఆలోచనల
ఆంతర్యాన్ని ఎక్కడ దాచేసావు..??
జీవిత మైదానంలో ఆటబొమ్మగా మారి
అలుపు సొలుపు మరచిపోయి అందరి కోసం
ప్రాణమున్న యంత్రానిగా జీవధారలు
అందిస్తూ నీ ఆయువు మాకు పోస్తూ 
శిధిల శల్యాలుగా శరీరాన్ని రుధిరాశ్రువుల  
ధారలలో తడిపేస్తూ చూడనివ్వని
నీ మనసు మూగవేదన వినిపిస్తున్నా
వినపడని దూరాలకు తరలించాలనే
నీ విశ్వ ప్రయత్నంలో సఫలీకృతం
అవుతూనే నిరంతరాయంగా
నిర్విరామంగా సాగిపోయే నీ పయనం
నిన్ను సృష్టించిన విరించికే
ఓ ప్రశ్నార్ధకంగా మిగిలిపోయి
తన సృష్టికే తలను వంచి
విశ్వాన్నంతా నీ పాదాల చెంత
దాసోహం చేసిన ఆ విధాత
చిత్రం ఎంత వి'చిత్రం' కదూ....!!

3, ఆగస్టు 2014, ఆదివారం

స్నేహితులరోజు శుభాకాంక్షలు.....!!

హితాన్ని కోరే సన్నిహితులు కొందరే.... స్నేహానికి చక్కని భాష్యాన్ని అందించేది కొందరే.... మనకు అమ్మానాన్నఅక్కాచేల్లి అన్నాతమ్ముడు అంటూ ఇలా ఎన్నో కుటుంబ బంధాలను ఇచ్చిన ఆ సృష్టికర్త ఏదో మనకు తక్కువైందని స్వర్గం నుంచి స్నేహాన్ని కానుకగా పంపినందుకు ఆ స్నేహానికి వక్ర భాష్యాలు తీయకుండా చక్కని స్నేహాన్ని కల్మషం లేని మనసులతో అందరు అందించాలని అందుకోవాలని కోరుకుంటూ అందరికి స్నేహితులరోజు శుభాకాంక్షలు..... !!

2, ఆగస్టు 2014, శనివారం

రాకోయి అంటున్నా......!!

నాకు నేనే అక్కరలేని ఈ లోకంలో
రాని అతిధి కోసం ఎదురుచూస్తున్నా....

రాకోయి అంటున్నా వస్తాను అంటుంటే
అందుకోలేని ఆతిధ్యాన్ని ఎలా ఇవ్వాలో మరి....

క్షణాల కాలం తరిగి పోతోంది వేగంగా
ఎదురుచూపుల నిరీక్షణలో నిన్ను చూపిస్తూ....

నచ్చలేని అబద్దాన్ని మోసుకుంటూ
ఇష్టం లేని నిజాల పంజాలను విసురుతూ....

చూస్తూ ఉండలేక చూడాలని లేక
దాగిపోవాలని దాచేసుకోవాలని ప్రయత్నిస్తున్నా.....

అయినా బయటపడిపోతూనే ఉంది ఎప్పుడు
ఆంతర్యాన్ని వెల్లడిస్తూ ఆహార్యాన్ని దాచుకుంటూ....

ఎందుకోయి రాలేదు ఎదను పరిచినా
గుప్పెడు గుండెలోని పిడికిలంత ప్రేమను తట్టుకోలేకా....!!

నీతో గడుపుతున్నా....!!


దాచేసుకున్నా నన్ను నేనే
నీ జ్ఞాపకాల తాకిడికి తట్టుకోలేక
నీవు లేని ఈ లోకాన్ని చూడటానికి
కష్టపడే మనసు ఇష్టాన్ని చంపలేక
ఒంటరిగానే ఉన్నాననుకున్నా కాని....
నీవు వదలి వెళ్ళిన నన్ను నేను
ఎలా వదలి నీ దరి చేరాలో తెలియక
మనసు చాటున మోముని దాచి
మౌన ముద్రలో నీతో గడుపుతున్నా....!!

1, ఆగస్టు 2014, శుక్రవారం

అసలైన నమ్మకం కోసం.....!!

కోపం శాపమై కాటేసినా
కన్నీరు కావేరిలా పొంగినా
నీ చెంతన అందే వరాల
వెండి వెన్నెల కోసం....

వేల జన్మలుగా
వేచి చూస్తున్నా
తెరచాటు దాటిరాని
నీ స్నేహం కోసం ....

కోటి ఆశలతో కోరుకుంటున్నా
కొత్త చివుర్ల అందాలతో
సరికొత్త జీవితానికి జతగా 
కమ్మని నీ చెలిమి కోసం...

పదాల వెల్లువ స్వరాల చేరువ
మాటల చాటున దాగిన
మౌనం చెప్పే కబుర్లు
వినే మనసు కోసం....

అంది అందని ఆనందం
దొరికి దొరకని అనుబంధం
దగ్గర కాలేని దూరం చేసిన
మాయాజాలం కోసం....

బాసటగా చేరిన స్నేహం
బంధంగా మారిన క్షణం
అందిన చేయి వదలని
అసలైన నమ్మకం కోసం.....!!

జన్మ ధన్యం....!!


ప్రకృతి అందాలకు మేఘాల సంతోషానికి
జనియించిన చినుకుల జలపాతాలు
కొండల నుండి కోనల నుండి సాగే
సెలఏరుల సంగమాల అక్షయ పాత్రలే
ఈ పుణ్య నదులకేరింతలు మన సంపదలు
ఆకాశ గంగల అందాలు పాపాలను హరిహించగా
పాపికొండల గోదారి గలగలలు కృష్ణమ్మ కిలకిలలు
వంపులు తిరుగుతూ ఒయ్యారాలు ఒలక బోసే
అన్ని నదుల ఆనందాల జలకాలు అతివల సొంతాలు
అన్ని నదుల పుట్టినిల్లు మన పుణ్య భరతావని
అవని అందాల ఆనందాల సంబరాల సంతోషాలు
ఈ వేద భూమిలో పుట్టిన మన జన్మ ధన్యం....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner