12, ఫిబ్రవరి 2017, ఆదివారం

మహిళా సాధికారత...!!

మహిళా సాధికారత అంటూ ఓ మూడు రోజులు సదస్సులు నిర్వహించి నలుగురితో నాలుగు మాటలు చెప్పించేస్తే
మార్పు వచ్చేస్తుందా...? అసలు సాధికారత అనేది ఎంత వరకు పనికి వస్తుంది మహిళకు న్యాయం జరగడానికి. హక్కులు, బాధ్యతలు చట్టాలతోను, సంస్కరణలతోను సాధ్యమయ్యేవి కాదు.  ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలి.  గొప్ప గొప్ప పదవులలోను, పేరున్న వాళ్లతోను ఉపన్యాసాలు చెప్పించి మహిళలు అన్నింటా ముందు ఉన్నారు ఈ రోజుల్లో అంటే మనకు మహిళా సాధికారత వచ్చినట్లేనా. మాలాంటి సామాన్య మహిళలను కదిలిస్తే బయటకు వస్తాయి అసలు నిజాలు.
అనాది నుంచి మనువు కూడా మహిళలకు అన్యాయమే చేసాడు. పురాణాలు, ఇతిహాసాలు ఇలా ఏది తీసుకున్నా అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే కనిపిస్తుంది కానీ మొగవాడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది మాత్రం చెప్పలేదు.  మంచి చెడు అనేవి నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి. ఆడయినా మగయినా నీతి, న్యాయం ఒకటే. బాధ్యతలు, బరువులు, బంధాలు కూడా సమానంగానే ఉంటాయి. మనం చూస్తున్న ఎన్నో వాస్తవ జీవితాల్లో మగాడు పెళ్ళాం పిల్లల్ని వదిలేసి పోవడం చూస్తున్నాము కానీ ఆడది మొగుడు, పిల్లల్ని వదలి వెళ్లిన సంఘటనలు అరుదుగా ఉంటున్నాయి. వీడు పదిమందితో తిరుగుతాడు కానీ పెళ్ళాం పక్కన అమ్మాయితో చనువుగా మాట్లాడినా సహించలేదు. నూటికి తొంభైమంది ఇలానే ఉంటే ఇక మహిళా సాధికారతకు చోటెక్కడ..?
ఓ చిన్న ఉదాహరణలు రెండు చెప్తాను... ఉద్యోగం చేసి సంపాదించినా రూపాయి దాచుకోవడం చేతకాక పుస్తకం ఆవిష్కరణ చేయాలీ అంటే నావల్ల కాదు అని చేతులెత్తేసి, సినీ రాజకీయ నాయకుల కోసం క్వింటాళ్ల కొద్దీ పువ్వులకే బోలెడు ఖర్చు పెట్టారు. మరొకరేమో ఇంట్లో ఏమి పట్టించుకోరు కానీ బయట వనితలతో షాపులు పెట్టిస్తారు, వాళ్లకు అండగా అన్ని చక్కబెడుతూ ఇంట్లో పెళ్ళాం అడిగితే చేతులు ఎత్తుతారు. పిల్లలకు పుట్టినప్పటి నుంచి ఓ గుడ్డ ముక్క కొనని వెధవ పెళ్ళాం ఆస్థి లో వాటా కోసం గోతికాడ నక్కలా ఎదురుచూపులు. అందరు పెద్ద మనుష్యులే మరి. ఇలా చెప్పుకుంటూ పొతే సవాలక్ష సమస్యలు. ఇవి మనం చట్టాల్లో మార్పులు చేస్తేనో, రాజ్యఆంగాన్ని తిరగరాస్తేనో, గుర్తు వచ్చినప్పుడెప్పుడో ఒకసారి నిద్రలేచి సమస్యల మీద నా పోరాటం అంటేనో తీరిపోవు.
మార్పు ప్రతి ఇంటి నుంచి రావాలి. మగవాడి ఆలోచనా దృక్పధం మారాలి. నేను అమెరికాలో ఉద్యోగం చేసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోలేదు కానీ ఇండియా వచ్చాక నాలుగేళ్ళు హైదరాబాద్లో చేసినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు చూసాను. అమ్మాయిలూ అబ్బాయిలు అని కాదు కానీ ఎవరికి వారు తమ లాభం కోసం ఎదుటివారిని ఏం చేయడానికైనా వెనుకాడని స్వార్ధం చూసాను. రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో కళ్లారా చూసాను. పేర్లు వద్దులెండి.. అందరికి నా ధన్యవాదాలు.
అన్ని అనువుగా ఉండి విజయాలు సాధించిన వారి గురించి, వారి మాటల గురించి కాదు, ప్రతికూల పరిస్థితులను దాటి ఓటమికి ఎదురు నిలిచిన వారి జీవితాల గురించి చెప్పండి. వారితో నాలుగు మాటలు చెప్పించండి. అందరికి స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఒక్కసారి సామాన్యుల జీవితాలను కదిలించండి, మాకు సాధికారత వద్దు మేముగా బతికే అవకాశం ఇవ్వండి అని ఎన్ని గొంతులు ఎలుగెత్తుతాయో మీకే తెలుస్తుంది. కుల మత ప్రాంతీయ రాజకీయ వివక్షకు తావులేకుండా నేతిబీరకాయలో నెయ్యిని చూడాలనుకోకుండా ఒక పని చేసినా నిజాయితీగా చేస్తే సామాన్య మహిళ కాస్తయినా ఊపిరి పీల్చుకుంటుంది.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner