మన లోపాలకు పరోపకారం అనే అందమైన ముసుగు వేసుకుని నలుగురిలో పెద్ద మనుష్యులుగా చెలామణి అయిపోతూ, మన తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతారో అని ముందే ఎదుటి వాళ్ళలో లోపాలు లేక పోయినా / చిన్న చితకా ఉన్నా మన అసలు నైజాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళను బలహీనుల్ని చేయడానికి మనం చేయని ప్రయత్నం ఉండటం లేదు. ఏదో ముక్కు ముఖం తెలియని వాళ్ళను అన్నా అర్ధం ఉంటుందేమో. పెళ్ళాం అంటే నీ అవసరాలు తీర్చి, నీ కోపతాపాలను భరించి నీకంటూ ఓ బతుకు ఇచ్చేది. దాన్ని నిర్లక్ష్యం చేసిన ఎవడు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. నీ పక్కనే ఉన్నా నోరారా పెళ్ళాన్ని పలకరించే మనసు ఉండదు కానీ ఈ ముఖ పుస్తకం, ఫోన్ల పుణ్యమా అని పలకరించడానికి సమయమే చాలనంత మంది భామలు ఈరోజుల్లో. అందుకేనేమో మన వివాహ వ్యవస్థ కూడా బీటలు వారింది. బంధాన్ని తెంచుకోవడానికి ఓ సెకను సరిపోతుంది. కానీ కలిసి కలకాలం జీవితాన్ని పంచుకుందామని చెప్పి ప్రతి క్షణం ముసుగులో బతికే బంధానికి అర్ధం ఏమిటో పెద్దలే చెప్పాలి. మనం కళ్ళు మూసుకున్నామని సమాజం చూడకుండా ఉండదు. ఇల్లాలు మౌనంగా భరిస్తుంది అంటే తనకు నీ వేషాలు, మోసాలు ఏమి తెలియవని కాదు. నలుగురిలో నీ విలువ దిగజారకుడని సహిస్తుంది. నువ్వు ఆ ఓర్పునే పరిహసిస్తే దానికి పర్యవసానం ఒక్కసారి రామాయణం గుర్తుకు తెచ్చుకుంటే సరిపోతుంది. సీతాదేవి భూదేవితో వెళ్లిపోయే ముందు చెప్పిన మాటలు చాలు.
పేరు కోసమో, జనం కోసమో మనం బతకాలి అనుకుంటే పర్యవసానం ఏంటి అనే దానికి రామాయణమే సాక్ష్యం. ఇప్పుడు నీ చుట్టూ తిరిగే నలుగురు కాలం నాడు నీతో లేరేందుకు అని ఒక్కసారి ప్రశ్నించుకో. పెళ్ళాం పదిమందికి భోజనాలు పెట్టాలి అంటే చేతులెత్తేసే పెద్ద మనుష్యులు గొప్ప కోసం బోలెడు ఆర్భాటాలు చేసి ఓ దండ వేయించుకుంటారు. ఎందరున్నా ఏకాకిగా బతికేస్తూ అదే చాలా ఘనమైన జీవితం అనుకుంటారు. రామాయణంలో రాముడు చాలా గొప్పవాడు. కానీ రాముడి జీవితం ఏంటి అనేది చూస్తే అసలు బంధాలు అంటే ఏమిటి..? వాటిని నలుగురి కోసం నిర్లక్ష్యం చేస్తే పర్యవసానం ఏమిటి..? చివరకు మిగిలేది ఏమిటి అనేది తెలుస్తుంది.
సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు...నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి