నాలాంటి వారికి కనపడని దేవుడు ఒక్కసారైనా కనపడితే....చంపేయాలన్నంత కోపంగా ఉంది.
ఇది ఆస్తికత్వమెా, నాస్తికత్వమెా కాదు...కొన్ని చూస్తూ కూడ ఏమి చేయలేని నిస్సహాయత నుండి వచ్చిన బాధ...బంధాలు ఎంతగా దిగజారిపోయాయెా చూస్తుంటే ఈ మనిషి జన్మ మీదే అసహ్యంగా ఉంది. ఇలాంటి సృష్టికి మూలమైన ఆ శక్తిని నాశనం చేయాలన్నంత కోపంగా ఉంది.
30, జూన్ 2018, శనివారం
కోపం...!!
26, జూన్ 2018, మంగళవారం
ఒకింత గర్వంగానే ఉంది..!!
దగ్గర దగ్గర రెండు దశాబ్దాల క్రిందటి పరిచయ స్నేహం ఇప్పటికీ పరిమళిస్తూ నా వద్దకు వచ్చి కాసేపు సంతోషాన్ని పంచిందంటే..కలిసున్నది కొద్దీ రోజులే అయినా ఆత్మీయంగా అక్కా అంటూ నన్ను పలకరించే కవిత తన కుటుంబంతో సహా వచ్చి కాసేపు పలకరించి వెళ్లిన ఆ ఆనందం ఎప్పటికి తరగని నా ఆస్థిగా మిగిలిపోతుందని చెప్పడం నాకు ఒకింత గర్వంగానే ఉంది. చాలా చాలా కృతజ్ఞతలు కవితా.
డబ్బులకు, హోదాలకు, ఉద్యోగాలకు విలువలు ఇచ్చే ఈరోజుల్లో నాకున్న కొంతమంది హితులు, స్నేహితులు, చాలా తక్కువమంది బంధువులు ఉన్నారని చెప్పడం ఓ కంట కన్నీరు, ఓ కంట పన్నీరు లాంటిదే. కొందరు స్నేహంలో కూడా వారి వారి స్వప్రయోజనాల కోసం మనతో నటిస్తారు. ఆ ముసుగు తొలిగితే కానీ మనకు వారి అసలు నైజం బయటపడదు. బంధువుల సంగతి చెప్పనే అక్కరలేదు, పలకరిస్తే పాపం అన్నట్టుగా ఉంది ఈరోజుల్లో. ఏదేమైనా బంధాలను మీ అవసరాలకు వాడుకోకండి, రేపటిరోజున మీ మనస్సాక్షికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీకు మనసే లేదంటారా సరే మీరు మనుష్యులని ఒప్పేసుకుంటాం.
25, జూన్ 2018, సోమవారం
అమూల్యం...!!
మన:పూర్వక వందనాలు మాస్టారు మీ అమూల్యమైన స్పందనకు....
శుభోదయం 🌻
నాలుగు దిక్కులా వున్న ఆవేదన ఆక్రందన ఆత్మీయత అభిమానం ఆలోచనలు ఓ రాశిగా పోసి సారాన్ని గ్రహిస్తే జీవితం భిన్నకోణంలో సాక్షాత్కరిస్తుంది.
రచయితలు,కవులు ఎందరో ఎన్నో భావాలు స్పృశించారు.
కానీ, గుండె లోతుల్లో తాకి, చదువరులకు ఉద్వేగంతో , మెదడుకు పదును పెడుతున్నాయి యీరచనలు.
రచనలు ఆశానిరాశల కలబోత.
నూతన ఆవిష్కరణలు.
చాలా బాగున్నాయి.ధన్యవాదాలు.👏👍👌👐
22, జూన్ 2018, శుక్రవారం
మానసిక వైకల్యం..!!
కన్నపేగు మమకారాన్ని
నడిరోడ్డున పారేయలేక
బతక లేక, చావలేక
కష్టాలు కన్నీళ్ల స్నేహంతో
ధిక్కారాలను, దిగుళ్ళను
సోపానాలుగా చేసుకుంటూ
తన వంతు బాధ్యతలు నెరవేర్చుతూ
అవహేళనలను, అపహాస్యాలను
పునాదులుగా మార్చుకుంటూ
శరీరం కదలలేని స్థితిలో సైతం
మానసిక ధైర్యాన్ని కోల్పోని
ఆచేతనావస్థల చేతనం ముందు
అన్ని సక్రమంగా ఉండి
బంధాలను భారమని
గాలికి వదిలేసి తమ స్వార్ధం చూసుకునే
మానసిక వికలాంగులు ఎందరో..!!
20, జూన్ 2018, బుధవారం
మట్టి పొరల్లోంచి... సమీక్ష....!!
ఆరు కవితా సంపుటాలు వెలువరించి విశిష్ట నానీల కవిగా అందరికి సుపరిచితులైన డాక్టర్ సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఏడవ కవితా సంపుటి "మట్టి పొరల్లోంచి..." సమీక్ష మీ అందరి కోసం..
మొదటి కవిత నాలో నేనులో మానవీయ పలకరింపుల పరిమళాల జ్ఞాపకాల దొంతర్లు మనోపేటికలో నిరంతరం ప్రవహిస్తూ, మనసు మర కాదని మమతల పొర అని, ఎప్పటికి మానవీయపు మల్లెచెండే అని సరిక్రొత్త మనిషిని పరిచయం చేస్తారు. వెన్నెముక గోడులో చాలా అద్భుతంగా" రైతు నిఘంటువులో అన్ని ఉన్నాయి.. పేగు నింపే గిట్టుబాటు ధర తప్ప" అని వాస్తవాన్ని ఎలుగెత్తి చాటారు. అంకెలు కవితలో ఎక్కడ చూసినా అంకెల ఆరాటమే, ఆర్ధిక అనుబంధాలే అన్ని అని, భాష, బంధం అనేవి ఈ అంకెల గారడితో పడి గగన కుసుమాలైపోతాయని అంటూ ప్రస్తుతం మనం కూరుకుపోయిన కార్పొరేట్ వ్యవస్థ గురించి కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. మాటల బేహారిలో "అతడు అనుసంధాత కాదు/ అన్నదాత అడుగుల్ని శాచించే విధాత" అని ఎవరు ఇప్పటి వరకు చెప్పని కోణంలో మార్కెట్లో దళారుల అక్రమాల్ని చెప్పారు అనడం కంటే చూపించారు అనడం సబబుగా ఉంటుంది. సుడిగుండం చుట్టూలో పొట్టకూటి కోసం ఆశల వలలు వేయడం దినచర్యగా బతుకీడుస్తున్న మత్యకారుల జీవితాలను, చిక్కుల సుడిగుండాలను మానవ జీవితాలకు అన్వయించి చెప్పడం చాలా బావుంది. మళ్ళీ అమ్మ ఒళ్ళోకి అంటూ పసితనపు కాలాన్ని దాటిన జ్జ్ఞాపకాల అలలు తలపుకొస్తే వయసు వేగంగా వెనక్కి వెళ్ళి కళాశాల ముంగిట్లో వాలుతుందని చెప్పడం మనం చదివితే ప్రతి ఒక్కరు ఆ అనుభూతిని అందుకుంటారనడంలో సందేహం లేదు. పసి (డి ) ప్రపంచంలో బాల్యాన్ని నెమరువేసుకుంటూ కళ తప్పిన పల్లె చిత్రాన్ని సజీవంగా చూపించారు. ఆ నేల నిండా లో రైతు గోడు వెళ్ళబోసుకోవడానికి ఒక కాగితం ముక్క చాలు వినే నాధుడుంటే అంటారు. జిందగీలో క్యాష్ అండ్ క్యారీ యూజ్ అండ్ త్రో అంటూ జీవిత సత్యాన్ని, డాలర్ యవనికలో ఆర్ధిక అవసరాలు దేశాలను, జీవితాలను శాసిస్తున్నాయని అది డాలర్ కాల మహిమని, భాషే నా శ్వాసలో మాట మట్టి వాసనల్ని కోల్పోతోంది, భాష బండరాయి కింద నలిగిపోతోంది అంటూ పేగు భాషతో బంధాలను నిలబెట్టుకోవాలని, సూక్ష్మ 'వ్రణం'లో చక్రవడ్డీ కోరలకు చిక్కి ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్న వైనాన్ని, మళ్ళీ బతికేందుకులో అవయవ దానం ప్రాశస్త్యాన్ని, దృక్పథంలో చిట్టి చీమల శ్రమ మనిషికి ఆదర్శమని, పాదు నీడలో మట్టి, చెట్టు,చినుకు, చేను, మనిషిది గొప్ప హరితానుబంధమని, గుప్పెడు బంగారంలో అమ్మ చుట్టూ తిరుగాడిన బాల్యపు క్షణాలను, ఉట్టిలో ఉట్టి ఇప్ప్పుడు ఓ తెలియని వస్తువయినా పాడిపంటలకు, ప్రేమాభిమానాలకు ఎప్పటికి ప్రతికే అని, ఎక్కడని వెదకడంలో కలివిడితనం అంటే ఇప్పటి సామాజిక మాధ్యమాల స్నేహాలు, చుట్టరికాలు కాదని మనిషిని మనిషిలో వెదకమని చెప్పడం, చప్పిడి బతుకులో ఉప్పుమడికి, బతుకుబండికి దళారులే అనుసంధానమౌతుంటే బతుకంతా చప్పిడి మెతుకులే అంటారు. గుండె తడిలో చదువు స్వదేశం కోసం కాకుండా డాలర్ల సంపాదన కోసమై, బాల్యాన్ని నేలరాస్తున్న ఇప్పటి చదువులకు హృదయపు తడితో వినయము, విలువలు కావాలంటారు. మానవత్వపు పతాకలో కోల్పోయిన తనానికి మానవత్వపు పరిమళం అద్ది జీవితాన్ని చిగురింపజేయమంటారు. దాహం బాబోయ్ .. దాహం,లో నీటిని పొదుపు చేయకపోతే వచ్చే నష్టాలను, ఫేస్ బుక్ లో అమ్మలో సాంకేతికతను పురోగమనానికి కాకుండా బంధాల, అనుబంధాల తిరోగమనానికి ఎలా వాడుకుంటున్నామన్నది స్పష్టంగా చెప్పారు. జలో రక్షతి రక్షితఃలో ఒకప్పటి స్వచ్ఛమైన నీటికి, ఇప్పటి అమ్మకాల నీటికి తేడాలు, ప్రతిదీ వ్యాపారమైయమైన మన జీవితాలను, లింకుల కర్రలో నాన్నతో జ్ఞాపకాల అనుబంధాన్ని అప్పట్లో ఊరితో పెనవేసుకున్న లింకుల కర్ర ఉపయోగాన్ని హృద్యంగా చెప్పారు. దిగులు గూడులో అసలైన విషాదం ఊపిరి పోసుకున్న ఇంట్లోకి, ఊపిరి పోయాక చేరుకోవడంతో ఎన్నో జ్ఞాపకాలను దాచుకున్న ఆ ఇంటికి మిగిలినవి దిగులు చూపులని బాధని కూడా అందంగా చెప్పారు. రామయ్య పంతులు బడిలో ఒకప్పటి పల్లెటూరి బడి జ్ఞాపకాలను ఎప్పటికి చెదరని చెరగని జ్ఞాపకాలని గుర్తు చేసారు. ఆకలి మట్టీలో ఇటుకబట్టి కూలి కష్టాన్ని, పల్లెపటంలో డాలర్ మోజులో పడి ప్రేమానురాగాలు కూడా ప్రియమైపోయాయని (దొరకడం లేదని) వెలిసిపోయిన పల్లె పటాన్ని మన ముందుంచుతారు. 'వెదురు' చూపులో మేదర్ల వెతలను, ఉల్టా ఉగాదిలో ప్రపంచ ద్రవ్య భాషలో మనిషి అమ్మకపు సరుకని, పండుగలు కూడా ఊహల్లోనేనని చాలా బాగా చెప్పారు. కాసేపు విరామంలో కాసేపు విరామం చాలు దేహానికి విశ్రాంతి అవసరం లేదని మనల్ని మనమే ఉత్తేజపరచుకోవాలని జీవితం ఓ సుదీర్ఘ కావ్యమని చక్కని భావంతో ఈ చివరి కవితతో ఈ కవితా సంపుటిని ముగించారు.
ఈ కవితా సంపుటిలో సామాన్య జీవితాల కష్టాలు, కన్నీళ్లు, దిగుళ్ళు, కాలం చేసిన గాయాలు, సేదదీర్చే జ్ఞాపకాలు, మరచిపోతున్న మానవత్వపు చిరునామాలు, బడుగు రైతు వ్యధలు, సాంకేతిక మాయాజాలం ఇలా అన్ని కలిపి ఒకప్పటి జీవితాలు, ఇప్పటి మార్పులు చేర్పులు అన్ని కలిపి తనదైన శైలిలో చిన్న చిన్న పదాలతో మనమూ మట్టి మనుష్యులమే అని మన మనసు పొరలను స్పృశించారు మట్టి పొరల్లోంచి ...చక్కని అక్షర కావ్యాన్ని అందించినందుకు హృదయపూర్వక అభినందనలు...!!
19, జూన్ 2018, మంగళవారం
" కవితాభిషేకం " సమీక్ష..!!
ఎన్నో కవితా సంపుటాలు, హైకూలు, మినీ, దీర్ఘ కవితా సంపుటాలు, లెక్కలేనన్ని పురస్కారాలు, సత్కారాలు అందుకున్న కవి, నిగర్వి మొహమ్మద్ ఖాన్ కవితా సంపుటి " కవితాభిషేకం " సమీక్ష ఈరోజు గోదావరిలో మీ అందరి కోసం...
తన జీవితంలో 50 సంవత్సరాల కబుర్లను, జ్ఞాపకాలుగా ముందుమాటలో కవిత్వంగా చెప్పడం చక్కని, చిక్కని అనుభూతినిస్తుంది. జ్ఞాపకాలతో మొదలుబెట్టి జ్ఞాపకంగా ముగించిన ఈ కవితాభిషేకం ఓ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక కవితాభిషేకం ఎలా మొదలైందో చూద్దాం. మనోనేత్రంతో చూడటానికి అలవాటు పడిన మనిషికి మనసు లేని నాడు ఒట్టి మరమనిషని చెప్పడం, అనాలోచితంలో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం మూర్ఖుల లక్షణమని, కర్తవ్యాన్నిమరచిన మనిషి పద్దతి కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడమంత ప్రమాదకరమైనదని కుక్కతోక-గోదావరిలో చెప్తారు. నివేదికలో విభిన్న వ్యత్యాసాలను, లోపాలను పోలికలను పారదర్శక హృదయంలో చూడమంటారు. అమ్మానాన్నల ఎడబాటును, వారితో పెంచుకున్నఅనుబంధాన్ని మరవడం అసాధ్యమని చెప్తూ వారు లేని గాయాలను మననం చేసుకుంటూ గాయాల నడుమ నేనులో వివరిస్తారు. కాలం కను సన్నిధిలో కాలం తన కట్టుబాటుకు మించి పోజాలదని సహేతుకంగా వివరించారు. దినచర్యలో కాగితానికి కలానికున్న అవినాభావ సంబంధమే జీవితమని, అబ్దుల్ కలాం గారికి చక్కని నివాళి, తన పుస్తకాల లోతుల్ని తవ్వుకుంటూపోతే అందమైన ప్రకృతి ఆవిష్కృతమౌతుందని ప్రకృతి కవితలో, మౌనవ్రతంలో అంతరంగపు ఆలోచనని, ప్రత్యర్థిలో గాయమే మనసుకు ప్రత్యర్థి అని, పచ్చ సంతకంతో కళ చక్కని స్వప్నంగా నిలిచే హృదయానికి పచ్చని సంతకమని, ప్రాణభిక్షలో ఆపదలో సాటి మనిషికి చేయూతనివ్వడం ఎండిపోతున్న మహా వృక్షానికి చిరు కాల్వ ద్వారా నీరు నివ్వడమన్న చిన్న మాటలో జీవితాన్ని నిలబెట్టే ప్రాణభిక్షను చూపించారు. సంక్షిప్త వాస్తవంలో ప్రేమను, కన్నీటి బొట్టు లోతును ఎన్ని యుగాలయినా కనుక్కోవడం అసాధ్యమని నగ్న సత్యంలో, కవిత రాయడానికి ఆలోచనల ప్రవాహాన్ని సరిగా అందుకోలేక పొతే అసంపూర్ణంగా మిగిలిపోతుందని అసంపూర్తి కవితలో, మోహనరాగంలో మనసు అంతరంగాన్ని, అల్లకల్లోలాన్ని అక్షరాలుగా మలచడానికి సాహిత్యం దోహదమైందని ఆశావహ దృక్పథాన్ని చెప్పడం చాలా బావుంది. స్వప్నాల పంట, పొయిట్రీలలో కలలను, ఆలోచనలను కవితలుగా మలచడం, త్రినేత్రంలో మనసు మూలలను స్పృశిస్తే అద్భుతమైన భావాలకు ఊపిరి పోస్తుందని, గత చరిత్ర, నీతి, నిబద్ధత, మరో సూర్యుడులలో అంతర్యుద్ధాలను, శాంతి సందేశాలను, కుల వివాదాలను, నీతి, నియమాలను చెప్పారు. గాయ సందేశంలో గేయం గురించి తెలుసుకోవాలంటే ముందు గాయాన్ని తెలుసుకోమంటారు. చివరి క్షణంలో మనిషి అహాన్ని, నా డైరీలో ఒక పేజీలో కవిత ప్రారంభానికి ముగింపుకు మధ్యన నలిగిన కవి హృదయాన్ని ఆవిష్కరించారు. మన ఊరి చెరువు, కృషితో నాస్తి దుర్భిక్షంలలో చిన్ననాటి ఊరి చెరువు జ్ఞాపకాలను, సంకల్పబలానికున్న గొప్పదనాన్ని, కలం దాచుకున్న కవిత్వంలో జీవిత అనుభవాలను కలం దాచిన గుప్త నిధులుగా, కాలం చుట్టూ మనమా లేక మన చుట్టూ కాలమా అని జవాబు లేని ప్రశ్నలో, కవితల పూలు అంటూ భాష మాధుర్యాన్ని, మరణానికి కూడా మరణమని బహిర్గత రహస్యంలో సరిక్రొత్తగా చెప్పడం, రక్తాక్షరాలులో చరిత్ర పుటల గాయాలను, బొడ్దు ప్రేగులో సృష్టికి ప్రతి రూపం అడదని, శృతిలయలలో చక్కని జీవన నాదాన్ని, కవితాభిషేకంలో తనని తాను వెదుక్కుని, పోగొట్టుకుని పేర్చుకున్న అక్షర భావాలకు పుస్తక రూపాన్ని ఇవ్వడంలో గల ఆంతర్యాన్ని, శిశిర వసంతంలో ప్రశ్నలకు సానుకూల సమాధానాలను, కెరటాలు లో దాంపత్యపు అనుబంధాన్ని, కాలధారల నురగలలో, కాలకూ విషం, నూతనాధ్యాయము, ఆత్మ విశ్వాసం, ఆక్రందన, దివ్యప్రేమ, ప్రస్థానం, కన్నీరు, సమస్య, చివరి గంట, మూర్ఖుల సామ్రాజ్యం, అసలు రహస్యం, మధ్య దూరం వంటి కవితల్లో పాలధారను పిండే వైనాన్ని, జీవితపు విష కోరలను, గెలుపు, ఓటములను, ఆక్రందనను, ఆవేశాన్ని, ప్రేమను, పాశాన్ని, సమస్యలను, కన్నీళ్లను ఇలా అన్నింటిని చివరి గంటల ప్రస్థానంగా భాషకు ప్రాముఖ్యాన్నిస్తూ, పుస్తకం లేని ప్రపంచం మూర్ఖుల సామ్రాజ్యంగా వివరిస్తూ అంతః సౌందర్యాన్ని చూడమని అసలు రహస్యంలో బోధిస్తారు. చావుకు బ్రతుక్కు మధ్య దూరాన్ని చెప్తూ, భాషా వట వృక్షాన్ని ప్రేమించమనడం , అవరోధంలో ఆత్మ తృప్తి, వ్యక్తిత్వం మనిషికి ఆభరణాలని, పోగొట్టుకున్న క్షణాలను ఒంటరి క్షంలో, దీక్షలో కవి కవితని అందంగా చెక్కడం, ప్రవాహం, మనసు, అపరిచితులు, అలజడి, అర్హత, ఒడుదుడుకులు, మధ్యవర్తులు, సుస్వాగతం, నగ్న సత్యం, వంటి కవితల్లో జీవితపు ప్రతి అనుభవాన్ని చూపించారు. నాలో నేను, ఆత్మీక శక్తిలలో మనసు మాటలను అక్షరీకరించడం, సంక్షిప్త వాస్తవంలో జీవితపు చదువుని, అతుక్కున్న పేజీలో ఎదుటి మనిషిలోని లోపాల్ని చూడటం మన బలహీనత అని, ధవళ వస్త్రంలో మనసు స్వచ్ఛతను, అక్షర సాక్ష్యం తన కలమని, భాష వారసత్వ సంపద భావాలకు, మనసుకు వారధని, వసంతంలో వేకువ, రాతిరిల అందాల ఆనందాలను, కరెన్సీ నోటు ప్రాభవాన్ని వినిపిస్తూ, ఉత్తరానికి పోస్ట్ కార్డుకు వ్యత్యాసం తెలియని బాల్యంతో పోగొట్టుకున్న నేస్తం చిరునామాను గుర్తు చేసుకుంటూ స్నేహితునికి ఈ కవితను అంకితమిస్తూ తన అక్షరాలతో భావాల కవితాభిషేకం సంపూర్తి గావించిన మొహమ్మద్ ఖాన్ అభినందనీయులు.
16, జూన్ 2018, శనివారం
చెదిరిన క్షణాలు...!!
చిన్ననాటి చిత్రాలన్నీ
చెదిరి పోయాయి
జ్ఞాపకాలన్నీ
చెల్లాచెదురైయ్యాయి
చేజారిన క్షణాలన్నీ
చిత్తరువులై మిగిలాయి
రాలిన కలలన్నీ
రాతలుగా మారాయి
మురిసిన ముచ్చట్లన్నీ
మౌనమైయ్యాయి
అలిగిన అలకలన్నీ
అలసిపోయాయి
మనసు గాయాలన్నీ
అక్షరాలనాశ్రయించాయి
చెప్పని కథలన్నీ
కంచికి పోనని మారాం చేస్తున్నాయి
కనుమాయలన్నీ
కనుమరుగు కాలేక కదలాడుతున్నాయి
చివరి చూపులన్నీ
చిందరవందరగా పేర్చబడ్డాయి
ఆపలేని కాలాన్ని
దిగులు దుప్పట్లు కమ్మేసాయి...!!
హెచ్చరిక...!!
ఎవర్నిబడితే వాళ్ళని
ఎప్పుడుబడితే అప్పుడు ప్రేమించడానికి నేనేం జెమినిగణేశన్ ని కాదు.
అమ్మాడీ
ఎందర్ని పెళ్ళి చేసుకున్నా
ఎంతమందితో తిరిగినా
నా ప్రేమంతా నీతోనే అంటే
నమ్మడానికి సావిత్రిని అంతకన్నా కాదు.....
ఈ పోస్ట్ సరదాకి ఎవరినీ ఉద్దేశించి కాదు...
భుజాలు తడుముకోకండి...😊
15, జూన్ 2018, శుక్రవారం
పంచనామా ముగిసిందా...!!
అక్కరకు రాని
దేహపు భాగాలన్నీ
తొలగించబడుతున్నాయి
ఒక్కొక్కటిగా
మరణానికి సంకేతంగా
మిగిలిన కార్యక్రమాలన్నీ
జరిగిపోతున్నాయి
ఒకదాని తర్వాత ఒకటిగా
అక్కడున్న వారందరికి
తెలియకుండా నిజాలన్నీ
కప్పేయబడ్డాయి
మళ్ళి మళ్ళీ లేవకుండా
అలవాటైన పనిగా
సుతిమెత్తగా కుట్టేస్తూ
ఖాళీలన్నీ పూరించబడ్డాయి
లోపాలు కనబడకుండా
శరీరానికి చితి పేర్చి
చేతులు దులిపేసుకుంటూ
బాధ్యతలు తీర్చుకున్నామని
తలారాబోసుకున్నారు
ఏనాడో చనిపోయిన శవానికి
ఈనాడు చేసిన అలంకారాలు
నామమాత్రమేనని
తెలుసుకోలేక పోయారు
మనసుని కాల్చే
మారణాయుధాలను
గుర్తించలేని న్యాయం
మరోసారి ఓడిపోయింది...!!
13, జూన్ 2018, బుధవారం
జీవన "మంజూ"ష (జులై)
అభిమానం, ఇష్టం అనేవి హద్దులు దాటకుండా ఉంటే బావుంటుందనేది అందరికి తెలిసిన విషయాలే. కాని మనకు కులం, సినిమా నటుల మీద, రాజకీయ నాయకుల మీద ఉన్న అభిమానం ఎలా ఉంటోందనేది సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పలు పోస్టులు చూస్తుంటే భవితకు మార్గ దర్శకం కావాల్సిన పెద్దలు, యువతకు దిశా నిర్దేశం చేయాల్సిన యువతరం నాయకులు ఎంతగా దిగజారిపోతున్నారనేది తెలుస్తోంది. మనం వాడే హాస్యం అనేది ఎదుటివారిని నొప్పించకుండా ఎంత సున్నితంగా ఉంటే అంత బావుంటుంది. పదిసార్లు మనం ఒకరిని అంటే ఎదుటివాళ్ళు కనీసం ఒక్కసారయినా మనని అనకుండా ఉండరు. మనం ఎదుటివారిని అంటున్నామంటే మనలో లోపాలేం లేవని మిడిసిపడటం కాదు. సినిమావాళ్లు, రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. మన అభిమానమే అతి. మనకు చాతనయితే తప్పు ఎవడు చేసినా చొక్కా పట్టుకు నిలదీయగలిగే దమ్ము ఉండాలి. అది లేని నాడు మాట జారకూడదు.
అలగాజనం అన్నారని ఒకరు, తోశారని, కొట్టారని, ఇలా రకరకాలుగా పోస్టులెట్టేస్తున్నాం. మరి మిగతా ఎవ్వరు ఏమి అనలేదా లేక ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ పరులా. మరి మిగతా కులాలని కొందరు తిట్టినప్పుడు వీరికి వినపడలేదా. మనం దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటామన్నది గుర్తు తెచ్చుకోండి. ఎక్కడైనా సరే క్యూ లో నిలబడినప్పుడు ఎంత తోసుకుంటామో మనకు తెలియనిదా. మన మీద ఎవరైనా పడితే సహనంగా ఏమి అనకుండా మర్యాదగా సర్దుకుంటున్నామా. సినిమాల్లో నీతులదేముంది చూసే వాడుంటే ప్రతోడూ సూక్తిసుధలు వల్లే వేస్తాడు. చేసే పనుల్లో ఎంత స్వచంగా ఉన్నారనేది మనం తెలుసుకోవాలి అంతేకాని అభిమానం ముసుగులో నిజాలు మరచిపోకూడదు. ఇక రాజకీయ నాయకుల సంగతి చూస్తే అందరు ముఖ్యమంత్రి అయిపోదామనే. మన తప్పుల తడకలు మరచి పక్కోడివి మాత్రమే అదీ మనకు అనుకూలమైన వాటినే విమర్శించి చూపుతాం. నటులు, రాజకీయాలు, కులాలు అన్ని అవసరార్ధమే అన్నది మర్చిపోతున్నాం. రేపటి సంగతిని మరచి ఈరోజు మన అవసరాలు తీర్చే వాడికి కొమ్ము కాస్తూ భవితకు సమాధి కట్టేస్తున్నాం. వ్యక్తి పూజలు, కులపు కుసంస్కారాలతోనూ జత కలిసి మన అమ్మ నేర్పిన సంస్కారానికి కూడా తిలోదకాలిచ్చి మనమూ ముసుగులోనే బతికేస్తున్నాం. ఇదీ మన సంస్కారం, రేపటి తరాలకు మార్గ దర్శకం.
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం...
12, జూన్ 2018, మంగళవారం
ఒక కవితా సంపుటి సమీక్ష...!!
పాత తరానికి కొత్త తరానికి మధ్యన సాహిత్యంలో వస్తున్న పెను మార్పులకు అనుగుణంగా తెలుగు సాహిత్యం ఎన్నో మార్పులకు లోనవుతోంది. వచన కవిత్వంలో వస్తు, శిల్ప, భావ ప్రకటనలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకువస్తున్నఈ తరం యువ కవి సిద్ధార్థ కట్టా "ఒక" కవితా సంపుటి సమీక్ష ఈ వారం గోదావరి సాహిత్యంలో మీ అందరి కోసం ...
"ఒక" కవితా సంపుటి లోనికి తొంగి చూస్తే అమ్మని, ఆకాశాన్ని, పసి హృదయాన్ని ఎంత బాగా ఆవిష్కరించారంటే చెప్పడం కన్నా చదివితే బావుండేంతగా..ఆమె ఆవలితీరంలో ఆకాశం అనుభవాలను మనం ఆస్వాదించడం ఎలానో, అర్ధం చేసుకోవడం ఎలానో వివరిస్తారు. నీకోటి చెప్పనా అని సుతిమెత్తని సంభాషణ వినిపిస్తారు. మా అమ్మలో మన అమ్మలనూ చూపిస్తారు. నిషిద్ధ హృదయంలో హృదయాన్ని గాయాల బావిలో జారవిడుచుకోవడం, అంతరించిందంటూ మగ జాతి అహంకారాన్ని నిరసించడం, పాప నాన్నతోలో పసితనపు పాప అమాయకత్వాన్ని లాలించిన తండ్రి మనసును, ఒట్టి హృదయానివి అంటూ హృదయపు అంతర్లోచనాన్ని, జ్ఞాపకమొస్తే ఏమేం చేయాలో చెప్తూ మారాం చేస్తూ జీవితంలోకి దూకమనడం వంటి సరి కొత్త ప్రయోగంతో ఆకట్టుకుంటారు. రాత్రి మెట్లపై గాలి , మనసు మాటల మౌనాన్ని సముద్రం, ఆకాశంతో పోల్చడం, తిరిగి ఎంత రక్తం తీసుకుంటే, రాజ్యమా కవితలలో ఉద్యమాల బాటలో విషాదాన్ని, అప్పుడు గుర్తించు అంటూ మనసును గుర్తించమనడం, పెద్దవ్వాలని లేదు లో పసిపిల్లల మీద, ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు తన అక్షరాలు తల్లడిల్లడం చూడొచ్చు. ఆద్ధంలో అబ్బాయీ, ఐదు రెక్కలు కవితల్లో ఊహలను, కలలను దృశ్యాదృశ్యాలలో చూపించడం, ఉమ్ము లో ఓ రణ నినాదాన్ని, ధిక్కార స్వరాన్ని, గాయాలను వెదకాలి అంటూ మన గాయం మానితే మరో గాయపు గేయాన్ని వెదకడం, ERROR 404 లో కనపడని జీవితపు పేజీని వెదకడం, సూర్యుడ్ని అతికించగలడు, నీళ్లగొంతుతో, ఎలా వస్తుందో తెల్సా కవితలలో కాస్త కొత్తదనపు శైలితో ఊహలకు ఊపిరి పోయడం, జ్ఞాపకం లేని మైలురాయి వద్ద మళ్ళీ కలుస్తాను ఈ సారి ఒంటరిగా వినమంటారు. ఆనవాళ్ళను మోసుకుంటూ పావురమెగిరిపోయింది, ఆకాశం నిండిపోయేలా, పసిపిల్లకు జ్వరమొచ్చింది కవితల్లో రాత్రి నక్షత్రాలను తెంపుకు పోవడం, ప్రకృతికి పిల్లల్ని ఇవ్వడం, ప్రశ్న అనుకుని కవితలో ప్రశ్న అనుకుని ప్రాణాన్ని తీసుకుపోవడం, Our Kid లో కార్పొరేట్ విష పంజాలో చిక్కుకుని విల విలాడుతున్న పసితనాన్ని, ఒక అర్ధరహితం లో అర్ధంకాని మనిషితనాన్ని, చిన్నారి శివ శ్రీ లో ఓ సమస్యను, ఆఖరి అద్భుతంలో తెలిసాడే నాటకంలో హృదయాలను యధాస్థానంలో మొలకెత్తనివ్వడమే ఆఖరి అద్భుతం అంటారు. ఏళ్ల క్రిందటా, యుగాల క్రిందటా తిప్పేసిన పేజీల చాటుగా ఓ పాతమనిషి పూర్వీకుడు అని చెప్పడం చాలా బావుంది. భర్తీ అయిన శీర్షిక లో స్వచ్ఛమైన ప్రేమ భావాన్ని, పూలు..పాప.. డోరా లో పసితనంలో కావాల్సిన స్వేచ్ఛను స్కూల్ డ్రస్ లేని బడి, కొన్ని ప్లాస్టిక్ పువ్వులు కావాలని పాపతో అడిగించడం అందరి మనసులను తడి చేస్తుంది. ఆరు రెక్కలు లో "మనుషులంతా ప్రేమను నమిలి మింగిన వారు / పాపాయి ఏడుపుకు / అందరు తలలు తిప్పుతారు / తమనెవరో పేరు పెట్టి పిలిచినట్టు " ఇది అందరి ఆమెల ఆత్మకథ అని ఎంత హృద్యంగా చెప్పారో. చివరిగా, గాయాల గేయాలే నీకు ఉరితాళ్ళు, సీతాకోకచిలుక, భర్తీ కాని శీర్షిక, బాగుంటుంది, మీకు కల, గొప్పదేశం, మనిషి ఒక అద్భుతం, దిగులు, ఇన్క్లూడింగ్ మీ, వాళ్లిచ్చే పిట్టతనం, విప్లవం ప్రకృతి ధర్మం, అతడు-ఆమె వంటి కవితలన్నింట్లో ఆర్ద్రత, ప్రేమ, తప్పులను సహించలేని తత్త్వం, అన్యాయం మీద తిరుగుబాటు ధోరణి, సమాజపు పోకడ మీద దిగులు, చేజారుతున్న విలువలు దక్కించుకోవాలన్న ఆరాటం కనిపిస్తుంది. చెట్టు నేల చెప్పిన రహస్యం లో అదృశ్యమౌతున్న పచ్చదనాన్ని కాపాడమనే ఆవేదన, నీలో చిన్నప్పుడే లో ఓ ఆవేశం, అని ఉంటావు, గాలిరంగు పాట, కలకోసం, నీలాంటి, పాపలాంటి, మనుషుల్లాంటి, నువ్వన్నట్టుగానే కవితల్లో వెదుకులాటలు, వేడికోలు, కొన్ని సర్దుబాట్లు కనిపిస్తాయి. నాన్న చెమట చుక్క దేహం లో నాన్నలంటే చెమట చుక్కల దేహం, ఆకలే తెలియని శ్రామికుల సమూహం అని ఎవ్వరు చెప్పని అభివ్యక్తిని వ్యక్తీకరించారు. జీవితాన్ని జీవించడం ఎలాగో, చేయగలిగిన పని లో బతికున్నంత కాలం పెద్దవాళ్ళం అవడం కుదరనప్పుడు జీవితాంతం పిల్లల్లా బతికేయమనడం, మెత్తటి కలవరింత లో ఒక తేనే కల,పువ్వు ఊహ, మెత్తని కలవరింత అంటూ మరో జననానికి నాంది గీతాన్ని ఆలపిస్తూ ఈ కవితా సంపుటిని ముగించడం ఓ చక్కని నిండుతనాన్ని తెచ్చింది.
కొన్ని కవితలు చదువుతున్నప్పుడు విశ్లేషణ రాయడం చాలా క్లిష్టంగా ఉంటుంది. కొత్త తరం వచన కవులు తీసుకునే వస్తువు కానివ్వండి, అభివ్యక్తి కానివ్వండి వారు చెప్పాలనుకున్న విషయాన్ని మూసలో కాకుండా సరి కొత్తగా చెప్పడం అభినందించదగ్గ విషయం. ఈ " ఒక " కవితా సంపుటి సమీక్ష రాస్తున్నప్పుడు నాకు నేనుగా వేసుకున్న ప్రశ్న కొంత వరకైనా సరిగా రాయగలుగుతున్నానా లేదా అని. రాయడానికి ఓ క్షణం సంశయించాను రాయగలనా లేదా అన్న మీమాంశ నన్ను వెంటాడి. ఎంత వరకు న్యాయం చేయగలిగానో నాకు తెలియదు. వైవిధ్యంగా తన భావాలను తీర్చిదిద్దిన "ఒక " కవితా సంపుటి కవి సిద్దార్థ కట్టాకు మనఃపూర్వక అభినందనలు.
అసమర్ధ జీవితం...!!
ఓ అసమర్ధ జీవితానికి
మిగిలిన అవశేషాన్ని
వసంతాలన్నీ వస్తు పోతూ
పరామర్శల ప్రహసనాన్ని
మెుక్కుబడిగా తీర్చుకుంటున్నాయి
చిగురింతల చిరునవ్వులు
ఓ క్షణమైనా దరి చేరవా అని
ఎదురుచూపులతో కాలానికి
సంధానించిన ఆశల రెక్కలు
విడివడిపోతూ నిరాశకు
ఆశ్రయమిచ్చేస్తున్నాయి
గెలవాలన్న తపన
మనసుకుంటే చాలదని
మనం వేసిన తప్పుటడుగులు
మరణ శాసనాన్ని రాసేస్తాయని
మనది కాని ప్రయాణానికి
మనల్ని ఉసిగొల్పుతాయని
ఓటమి క్షణాలను దగ్గర చేస్తాయని
అర్ధం అయ్యేసరికి
అర్ధాయుష్షుతో ముగిసిపోతుంది బతుకు...!!
11, జూన్ 2018, సోమవారం
ఏక్ తారలు...!!
1. పంచాంగం పరిహసిస్తోంది_పరామర్శకు మీనమేషాలు లెక్కిస్తున్నావని...!!
2. అమాస అల్లరి చేస్తోంది_పాడ్యమి పలకరింపుకు వస్తోందని...!!
3. కలతలను మాపేయాలి_కలల ఉలికిపాటుకు ఊరటగా...!!
4. కనుమరుగు కాలేని కాంతిపుంజాన్నే_చుక్కలెన్నయినా నీ చేరువలోనేనంటూ...!!
5. నేనో మౌనాన్ని_నీ మనసు చదివే క్షణాల్లో...!!
6. నేనో నాదాన్ని_నీ స్వరంలో ఒదిగిపోతూ...!!
7. నేనో ఉద్వేగాన్ని_నీ అనుభూతులకు ప్రాణం పోస్తూ...!!
8. నీ మనసు_ఎన్నో మౌనాలను దాచుకున్న సంద్రం..
!!
9. నేనో అలజడిని_అవిశ్రాంతంగా నిన్ను తట్టిలేపుతూ..!!
10. నేనో మెలకువను_నీ కలలకు అర్ధాన్నౌతూ...!!
11. మాయ తెలియదు మనసుకు_కలను కల్లగా మార్చడానికి...!!
12. కందమూలాలకు కటకటలౌతోంది_శాకాహారం విలువ తెలిసాక...!!
13. రెప్పలు దాచేసిన కన్నీళ్ళు_అలవోకగా అక్షరాల్లో ఒలికిపోతూ....!!
14. బొమ్మలన్నీ జీవం లేనివే_జీవం పోసే విధాత చేతిలో కీలుబొమ్మలై...!!
15. కొన్ని క్షణాలు చాలు_యుగాల దూరాన్ని తగ్గించడానికి...!!
16. కాస్త మౌనం చాలదూ_వేల భాష్యాలు వినిపించడానికి..!!
17. మౌనానికెన్ని అరలో_మనసులోని భావాలను భద్రపరిచేందుకు..!!
18. జ్ఞాపకాల సహవాసం మౌనానికి_కాలం నేర్పిన పాఠాలను నెమరువేసుకుంటూ..!!
19. గుండెగూటిలో తచ్చాడుతునే ఉన్నాయి_సశేషంగా మిగిలిన సజీవ జ్ఞాపకాలు...!!
20. నేనెప్పుడో ముగిసిన కథనే_చెదిరిన జ్ఞాపకంగా చిరిగిన పుస్తకం పేజిలో...!!
21. ఏకాంతమింతే_నీతోనే సంభాషించాలనుకుంటుందెప్పుడూ...!!
22. మౌనమే మధురం మన మధ్యన_మనసుల స్నేహం మనదయ్యాక...!!
23. వెల్లువైన ప్రేమ వగలుబోతోంది_వలపు విరిజల్లులో తడిసి ముద్దౌతూ...!!
24. కొన్ని ప్రేమలంతే_మనసుకే పరిమితమైపోతాయలా...!!
25. మౌనమెప్పుడూ సమ్మెాహనమే_సన్నిహితమైన నీ ఆలోచనల సవ్వడితో..!!
26. రాగమూ యెాగమైంది_మనసుకన్నీరు సంగీతఝురిగా మారినప్పుడు...!!
27. రాలిపడిన కలలివి_రక్కసి కోరలకు చిక్కుబడి...!!
28. దాచిన క్షణాలు గుప్పెడే_సాహచర్యం కడవరకు..!!
29. ఎన్ని దారులో ప్రణయానికి_పరిచయం లేకున్నా పరిమళిస్తూ...!!
30. అరక్షణం చాలదూ_అనుబంధం అపహాస్యం కావడానికి....!!
10, జూన్ 2018, ఆదివారం
పుట్టినరోజు శుభాకాంక్షలు..!!
నేను సినిమావాళ్ళ గురించి పోస్టులు పెద్దగా పెట్టలేదు. కానీ ఈరోజు చాలామంది పోస్టులు చూసాను. అవి చూసాక ఇది రాయాలనిపించింది. అభిమానం అనేది ఎంతగా వెర్రితలలు వేసిందనేది అర్ధం అయ్యింది. మనమెప్పుడు మాట తూలలేదా, మన మీద ఎవరైనా పడినప్పుడు శాంతంగానే ఉన్నామా. పోనీ మనం అభిమానించే నటులు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఏ తప్పు చేయ లేదా. బాలయ్యకు కోపం మాత్రమే ఉంది, ఎవరి చావుకు కారణం కాలేదు, పార్టీలెట్టి సొమ్ము నొక్కేసి నమ్మిన జనాన్ని నట్టేట ముంచి పదవి కోసం దిగజారలేదు. కుటుంబానికి, వివాహబంధానికి మచ్చ తేలేదు.
అమ్మ నేర్పిన సంస్కారం మనది... అందుకే మన అభిమానాన్ని మరొకరిపై ద్వేషంగా మార్చుకోవద్దు. తప్పుని తప్పుగానే చూద్దాం.
7, జూన్ 2018, గురువారం
రహదారి..!!
ఏ దారెటు పోతున్నా
తడబడే అడుగులకు
తెలిసిన రహదారే అది
గమనం సాగుతూనే ఉన్నా
గమ్యానికి చేర్చే బాట
అడ్డదిడ్డమై అడ్డు తగులుతోంది
పంతాలకు బోయిన అహాలు
ససేమిరా దిగిరామని హుంకరిస్తూ
తమ ప్రతాపాన్ని తెలియజేస్తున్నాయి
కలలన్నీ ఎదురుచూస్తూ
నిదురబోయే క్షణాల కోసం
కావలి కాస్తున్నాయి ఎప్పుడెప్పుడా అని
మెలకువలోనే మరణాన్ని
మరో రణాన్ని ఆవాహన చేసుకున్న
మనోసంద్రం నిరాకామైందని తెలుసో లేదో...!!
4, జూన్ 2018, సోమవారం
భరత వాక్యానికి..!!
రెప్ప పడని కనులెన్నో
వేసారిన బతుకులెన్నో
గాయాల బతుకుల్లో
గాంధర్వరాగాలు వినిపించేదెన్నడో
స్మశాన వైరాగ్యంలో
సప్తపదుల హోరు వినవస్తోందెందుకో
బద్దలైన నిశ్శబ్దంలో
భరత వాక్యానికి నాంది పలకడానికనుకుంటా...!!