13, జూన్ 2018, బుధవారం

జీవన "మంజూ"ష (జులై)

నేస్తం,
         అభిమానం, ఇష్టం అనేవి హద్దులు దాటకుండా ఉంటే బావుంటుందనేది అందరికి తెలిసిన విషయాలే. కాని మనకు కులం, సినిమా నటుల మీద, రాజకీయ నాయకుల మీద ఉన్న అభిమానం ఎలా ఉంటోందనేది సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పలు పోస్టులు చూస్తుంటే భవితకు మార్గ దర్శకం కావాల్సిన పెద్దలు, యువతకు దిశా నిర్దేశం చేయాల్సిన యువతరం నాయకులు ఎంతగా దిగజారిపోతున్నారనేది తెలుస్తోంది. మనం వాడే హాస్యం అనేది ఎదుటివారిని నొప్పించకుండా ఎంత సున్నితంగా ఉంటే అంత బావుంటుంది. పదిసార్లు మనం ఒకరిని అంటే ఎదుటివాళ్ళు కనీసం ఒక్కసారయినా మనని అనకుండా ఉండరు. మనం ఎదుటివారిని అంటున్నామంటే మనలో లోపాలేం లేవని మిడిసిపడటం కాదు. సినిమావాళ్లు, రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. మన అభిమానమే అతి. మనకు చాతనయితే తప్పు ఎవడు చేసినా చొక్కా పట్టుకు నిలదీయగలిగే దమ్ము ఉండాలి. అది లేని నాడు మాట జారకూడదు.
     అలగాజనం అన్నారని ఒకరు, తోశారని, కొట్టారని, ఇలా రకరకాలుగా పోస్టులెట్టేస్తున్నాం. మరి మిగతా ఎవ్వరు ఏమి అనలేదా లేక ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ పరులా. మరి మిగతా కులాలని కొందరు తిట్టినప్పుడు వీరికి వినపడలేదా. మనం దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటామన్నది గుర్తు తెచ్చుకోండి. ఎక్కడైనా సరే క్యూ లో నిలబడినప్పుడు ఎంత తోసుకుంటామో మనకు తెలియనిదా. మన మీద ఎవరైనా పడితే సహనంగా ఏమి అనకుండా మర్యాదగా సర్దుకుంటున్నామా. సినిమాల్లో నీతులదేముంది చూసే వాడుంటే ప్రతోడూ సూక్తిసుధలు వల్లే వేస్తాడు. చేసే పనుల్లో ఎంత స్వచంగా ఉన్నారనేది మనం తెలుసుకోవాలి అంతేకాని అభిమానం ముసుగులో నిజాలు మరచిపోకూడదు. ఇక రాజకీయ నాయకుల సంగతి చూస్తే అందరు ముఖ్యమంత్రి అయిపోదామనే. మన తప్పుల తడకలు మరచి పక్కోడివి మాత్రమే అదీ మనకు అనుకూలమైన వాటినే విమర్శించి చూపుతాం. నటులు, రాజకీయాలు, కులాలు అన్ని అవసరార్ధమే అన్నది మర్చిపోతున్నాం. రేపటి సంగతిని మరచి ఈరోజు మన అవసరాలు తీర్చే వాడికి కొమ్ము కాస్తూ భవితకు సమాధి కట్టేస్తున్నాం. వ్యక్తి పూజలు, కులపు కుసంస్కారాలతోనూ జత కలిసి మన అమ్మ నేర్పిన సంస్కారానికి కూడా తిలోదకాలిచ్చి మనమూ ముసుగులోనే బతికేస్తున్నాం. ఇదీ మన సంస్కారం, రేపటి తరాలకు మార్గ దర్శకం.
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం...  

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner