19, జూన్ 2018, మంగళవారం

" కవితాభిషేకం " సమీక్ష..!!

                  అక్షర భావాల అనుభవాల అభిషేకం మొహమ్మద్ ఖాన్ " కవితాభిషేకం" ..!!

       ఎన్నో కవితా సంపుటాలు, హైకూలు, మినీ, దీర్ఘ కవితా సంపుటాలు, లెక్కలేనన్ని పురస్కారాలు, సత్కారాలు అందుకున్న కవి, నిగర్వి మొహమ్మద్ ఖాన్ కవితా సంపుటి " కవితాభిషేకం " సమీక్ష ఈరోజు గోదావరిలో మీ అందరి కోసం...
      తన జీవితంలో 50 సంవత్సరాల కబుర్లను, జ్ఞాపకాలుగా ముందుమాటలో కవిత్వంగా చెప్పడం చక్కని, చిక్కని అనుభూతినిస్తుంది. జ్ఞాపకాలతో మొదలుబెట్టి జ్ఞాపకంగా ముగించిన ఈ కవితాభిషేకం ఓ మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక కవితాభిషేకం ఎలా మొదలైందో చూద్దాం. మనోనేత్రంతో చూడటానికి అలవాటు పడిన మనిషికి మనసు లేని నాడు ఒట్టి మరమనిషని చెప్పడం, అనాలోచితంలో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం మూర్ఖుల లక్షణమని, కర్తవ్యాన్నిమరచిన మనిషి పద్దతి కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడమంత ప్రమాదకరమైనదని కుక్కతోక-గోదావరిలో చెప్తారు. నివేదికలో విభిన్న వ్యత్యాసాలను, లోపాలను పోలికలను పారదర్శక హృదయంలో చూడమంటారు. అమ్మానాన్నల ఎడబాటును, వారితో పెంచుకున్నఅనుబంధాన్ని మరవడం అసాధ్యమని చెప్తూ వారు లేని గాయాలను మననం చేసుకుంటూ గాయాల నడుమ నేనులో వివరిస్తారు. కాలం కను సన్నిధిలో కాలం తన కట్టుబాటుకు మించి పోజాలదని సహేతుకంగా వివరించారు. దినచర్యలో కాగితానికి కలానికున్న అవినాభావ సంబంధమే జీవితమని, అబ్దుల్ కలాం  గారికి చక్కని నివాళి, తన పుస్తకాల లోతుల్ని తవ్వుకుంటూపోతే అందమైన ప్రకృతి ఆవిష్కృతమౌతుందని ప్రకృతి కవితలో, మౌనవ్రతంలో అంతరంగపు ఆలోచనని, ప్రత్యర్థిలో గాయమే మనసుకు ప్రత్యర్థి అని, పచ్చ సంతకంతో కళ చక్కని స్వప్నంగా నిలిచే హృదయానికి పచ్చని సంతకమని, ప్రాణభిక్షలో ఆపదలో సాటి మనిషికి చేయూతనివ్వడం ఎండిపోతున్న మహా వృక్షానికి చిరు కాల్వ ద్వారా నీరు నివ్వడమన్న చిన్న మాటలో జీవితాన్ని నిలబెట్టే ప్రాణభిక్షను చూపించారు. సంక్షిప్త వాస్తవంలో ప్రేమను, కన్నీటి బొట్టు లోతును ఎన్ని యుగాలయినా కనుక్కోవడం అసాధ్యమని నగ్న సత్యంలో, కవిత రాయడానికి ఆలోచనల ప్రవాహాన్ని సరిగా అందుకోలేక పొతే అసంపూర్ణంగా మిగిలిపోతుందని అసంపూర్తి కవితలో, మోహనరాగంలో మనసు అంతరంగాన్ని, అల్లకల్లోలాన్ని అక్షరాలుగా మలచడానికి సాహిత్యం దోహదమైందని ఆశావహ దృక్పథాన్ని చెప్పడం చాలా బావుంది. స్వప్నాల పంట, పొయిట్రీలలో కలలను, ఆలోచనలను కవితలుగా మలచడం, త్రినేత్రంలో మనసు మూలలను స్పృశిస్తే అద్భుతమైన భావాలకు ఊపిరి పోస్తుందని, గత చరిత్ర, నీతి, నిబద్ధత, మరో సూర్యుడులలో అంతర్యుద్ధాలను, శాంతి సందేశాలను, కుల వివాదాలను, నీతి, నియమాలను చెప్పారు. గాయ సందేశంలో గేయం గురించి తెలుసుకోవాలంటే ముందు గాయాన్ని తెలుసుకోమంటారు. చివరి క్షణంలో మనిషి అహాన్ని, నా డైరీలో ఒక పేజీలో కవిత ప్రారంభానికి ముగింపుకు మధ్యన నలిగిన కవి హృదయాన్ని ఆవిష్కరించారు. మన ఊరి చెరువు, కృషితో నాస్తి దుర్భిక్షంలలో చిన్ననాటి ఊరి చెరువు జ్ఞాపకాలను, సంకల్పబలానికున్న గొప్పదనాన్ని, కలం దాచుకున్న కవిత్వంలో జీవిత అనుభవాలను కలం దాచిన గుప్త నిధులుగా, కాలం చుట్టూ మనమా లేక మన చుట్టూ కాలమా అని జవాబు లేని ప్రశ్నలో, కవితల పూలు అంటూ భాష మాధుర్యాన్ని, మరణానికి కూడా మరణమని బహిర్గత రహస్యంలో సరిక్రొత్తగా చెప్పడం, రక్తాక్షరాలులో చరిత్ర పుటల గాయాలను, బొడ్దు ప్రేగులో సృష్టికి ప్రతి రూపం అడదని, శృతిలయలలో చక్కని జీవన నాదాన్ని, కవితాభిషేకంలో తనని తాను వెదుక్కుని, పోగొట్టుకుని పేర్చుకున్న అక్షర భావాలకు పుస్తక రూపాన్ని ఇవ్వడంలో గల ఆంతర్యాన్ని, శిశిర వసంతంలో ప్రశ్నలకు సానుకూల సమాధానాలను, కెరటాలు లో దాంపత్యపు అనుబంధాన్ని, కాలధారల నురగలలో, కాలకూ  విషం, నూతనాధ్యాయము, ఆత్మ విశ్వాసం, ఆక్రందన, దివ్యప్రేమ, ప్రస్థానం, కన్నీరు, సమస్య, చివరి గంట, మూర్ఖుల సామ్రాజ్యం, అసలు రహస్యం, మధ్య దూరం వంటి కవితల్లో  పాలధారను పిండే వైనాన్ని, జీవితపు విష కోరలను, గెలుపు, ఓటములను, ఆక్రందనను, ఆవేశాన్ని, ప్రేమను, పాశాన్ని, సమస్యలను, కన్నీళ్లను ఇలా అన్నింటిని చివరి గంటల ప్రస్థానంగా భాషకు ప్రాముఖ్యాన్నిస్తూ, పుస్తకం లేని ప్రపంచం మూర్ఖుల సామ్రాజ్యంగా వివరిస్తూ అంతః సౌందర్యాన్ని చూడమని  అసలు రహస్యంలో బోధిస్తారు. చావుకు బ్రతుక్కు మధ్య దూరాన్ని చెప్తూ, భాషా వట వృక్షాన్ని ప్రేమించమనడం , అవరోధంలో ఆత్మ తృప్తి, వ్యక్తిత్వం మనిషికి ఆభరణాలని, పోగొట్టుకున్న క్షణాలను ఒంటరి క్షంలో, దీక్షలో కవి కవితని అందంగా చెక్కడం, ప్రవాహం, మనసు, అపరిచితులు, అలజడి, అర్హత, ఒడుదుడుకులు, మధ్యవర్తులు, సుస్వాగతం, నగ్న సత్యం, వంటి కవితల్లో జీవితపు ప్రతి అనుభవాన్ని చూపించారు. నాలో నేను, ఆత్మీక శక్తిలలో మనసు మాటలను అక్షరీకరించడం, సంక్షిప్త వాస్తవంలో జీవితపు చదువుని, అతుక్కున్న పేజీలో ఎదుటి మనిషిలోని లోపాల్ని చూడటం మన బలహీనత అని, ధవళ వస్త్రంలో మనసు స్వచ్ఛతను, అక్షర సాక్ష్యం తన కలమని, భాష వారసత్వ సంపద భావాలకు, మనసుకు వారధని, వసంతంలో వేకువ, రాతిరిల అందాల ఆనందాలను, కరెన్సీ నోటు ప్రాభవాన్ని వినిపిస్తూ, ఉత్తరానికి పోస్ట్ కార్డుకు వ్యత్యాసం తెలియని బాల్యంతో పోగొట్టుకున్న నేస్తం చిరునామాను గుర్తు చేసుకుంటూ స్నేహితునికి ఈ కవితను అంకితమిస్తూ తన అక్షరాలతో భావాల కవితాభిషేకం సంపూర్తి గావించిన మొహమ్మద్ ఖాన్ అభినందనీయులు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner