3, మే 2019, శుక్రవారం

నాన్న పచ్చి అబద్ధాలకోరు సమీక్ష..!!

  గో తెలుగు డాట్ కామ్ లో నేను రాసిన సమీక్ష ..
    http://m.gotelugu.com/issue315/7905/telugu-columns/book-review/
                                               " నాన్న పచ్చి అబద్ధాలకోరు అంటున్న సురేంద్ర రొడ్డ "
                 అనుభవాల నుండి అక్షరాల ప్రయాణం మొదలవడం కొందరి విషయంలోనే సాధ్యమౌతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తన అనుభవాలకు చక్కని అక్షర రూపమిచ్చి పలువురి ప్రశంసలతోపాటుగా తొలి కవితా సంపుటి " నాన్న పచ్చి అబద్ధాలకోరు " కు గిడుగు రాంమూర్తి పంతులు గారి పురస్కారం పొందిన ప్రతిభాశాలి " సురేంద్ర రొడ్డ ".
           
 ఈ కవితా సంపుటి లో మొదటి కవితనే తన పుస్తకం పేరుగా ఎన్నుకోవడంతో ఆ కవిత సురేంద్రపై చూపిన ప్రభావం అర్ధమౌతుంది.  నాన్న పచ్చి అబద్ధాలకోరు అంటూ తన సంతోషానికి, తన అవసరాలకు ఉపయోగపడుతూ నాన్న చెప్పిన అబద్ధాలు ఏకరువు పెడతారు. ఎంతోమంది నాన్నల మనసును తన అక్షరాల్లో చూపించి అందరి మన్ననలు పొందారు. అనాథాశ్రమం పాలైన తండ్రి, కొడుకు కోసం కన్న కలలన్ని తెలిసిన తన భార్యకు ఈ విషయం చెప్పొద్దని చెప్పడం చదువుతుంటే కంటనీరు రాక మానదు. అనాదిగా ఆటబొమ్మ కవిత ఆడపిల్ల అంటే ఉన్న వివక్షను చిన్నతనం నుండి చూపిస్తూ, కన్నపేగు కూడా మోసం చేసి వెళ్లిన తీరును చెప్తూ, మరో ఆటబొమ్మ కథ మొదలైందని చరిత్ర పునరావృతమవడాన్ని చాలా బాగా చెప్పారు. తాళి బంధంతో ముడి పడిన కొత్త అనుబంధాన్ని సర్వస్వంగా భావిస్తూ, వదులుకున్న పాత అనుబంధాలను గుర్తుచేసుకోవడం బావుంది. అమ్మ కోక అద్భుతాల నిధి, ఆనందాల పెన్నిధి అంటూ అమ్మ చీరతో పంచుకున్న అనురాగాలను, ఆప్యాయతలను వినిపిస్తారు. అర్ధాంగి కవితలో భార్యాభర్తల మధ్యన ఉండాల్సిన సున్నితత్వాన్ని, తాను నొప్పించిన విషయాలను, చెప్పని క్షమాపణలను చెప్పడం చాలా బావుంది. ఇగిరిపోవే కన్నీటిచుక్కా కవితలో ఎందరి ఆశలు ఎండమావులుగా మారాయో చెప్తారు. మరో కూలీ కవితలో అమ్మానాన్నల కష్టాన్ని కల్లు ముంతల పాల్చేస్తూ వాళ్లతోపాటు కొడుకు తానూ మరో కూలీగా మారడాన్ని చెప్తారు. చిరునవ్వు కోసం ఎదురుచూపులను, అంతరాలను, జ్ఞాపకాలను, కన్నీటి మాటలను, బాలికలను బతకనిద్దాం, శిథిలాలయం కవితలు సామాజిక చైతన్యాన్ని, మగవాడి దౌర్జన్యాలను, మనసుల అంతరాలను చెప్తాయి.  నీటి కోసం నినాదం, మరో మునిమాపు వేళ, ఎన్నాళ్ళు అయిందో, ఓ మనసా వంటి కవితలు ఆశలను, ఇష్టాలను, కోరికలను సున్నితమైన భావాలుగా చెప్తారు. వలస పక్షులు కవిత పల్లె నుండి పట్నానికి పోతున్న వలస బతుకులను, నీ నవ్వులు తప్ప కవిత ఓ ప్రేమికుడి కానుకను, ఏడవకమ్మా.... ఏడవకు కవిత జాతిని జాగృతం చేసే దిశగా, నడుస్తున్న పండ్ల చెట్టులా నాన్న కవిత పేదరికంలో కూడా బిడ్డలపై నాన్న ప్రేమ గొప్పదనాన్ని చాటి చెప్తుంది. నీవంటే..ఏమిటో కవిత నీతో ఉన్న అనుబంధాలనడుగు, నీ అంతరాత్మనడుగు నువ్వేంటో చెప్తారంటారు. పల్లెతో బంధాన్ని స్వర్గమే కనిపిస్తుంది చూడులో చెప్తారు. నేను నేనేనా ప్రియా కవితలో ఆరాధన అందరిని ఆకట్టుకుంటుంది. జంటగానే పోదాం, ఉమ్మడి కుటుంబాలు, నిజమైన నేస్తం, అనురాగపు చినుకులు, ప్రియమైన తలగడ, మైమరపు, ఇంకా ఏం మిగిలున్నానని, మనసున్న మనిషిగా, ఏమైందో, నివేదన, ప్రేమ లేఖ, ప్రేమ కుటీరం, నీకు ఏమికాని నేను, అక్షర తోరణాలు, మనసుకు తెలుసు వంటి కవితలు తనచుట్టూ ఉన్న అనుబంధాలను, అనురాగాలను, అభిమానాలను, ప్రేమలను, మనసులోని ఆరాధనను తెలియజెప్తాయి. ఎండిన గుండెలకు, మండే మనుషులకు, అనుభూతులు అరుదైన అందరికీ కోరని అమృత వర్షమే నా అక్షరాలు అంటూ తన అక్షరాల అతిశయాన్ని చెప్తారు. సాంకేతిక అభివృద్ధి, యాంత్రిక యుగపు యాంత్రిక మనస్తత్వాలను నవ నాగరికత కవితలో ఎండగడతారు. పేగు బాధల మధ్యన అంతరించిపోతున్న అనుబంధాలను, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలను ప్రశ్నిస్తూ ఇపుడెందుకు ఏడుస్తారు అంటారు. గురువు గొప్పదనాన్ని గురువుగారికి ఎన్ని రూపాలో కవితలో చెప్తారు. మరువకుమా కవితలో తాత్వికత కనిపిస్తుంది.  శాపగ్రస్తులు కవితలో ఎవరు లేక ఆదరణ కరువైన పసితనపు బతుకులను కళ్ళకు కట్టినట్టు చూపెడతారు. మొహమాటాల ముసుగులో మోసపోతూ, గుండెలో బాధను దాచుకుంటూ, సభ్య సమాజంలో బతికేస్తున్న అందరూ ఈ జీవితపు రంగస్థలంలో మహా నటులేనంటారు. ఒకే ఒక్క రోజు ఈతి బాధలు మరచి కమ్మని కలను కంటూ తన మనసుకు నచ్చినట్లుగా బతికే వరమిమ్మనడం చాలా బావుంది. మధుర భావాలు, నిరీక్షణ కవితలు మధుర భావాల ప్రేమ పలుకులు. అమ్మ మనసు పడిన బాధను, అనురాగ కడలిగా శ్రీమతిని ప్రేమగా తన అక్షరాల్లో నింపుకున్నారు. మనసా ఏమిటో నీ మాయ అంటూ అంతు చిక్కని అనంతంగా అంటారు. రాబోవు తరాలు చూడలేని మన తరపు ఆనందాలను, అనుభూతులను, అనుబంధాలను..ఇక చూడలేరేమో అంటూ వాపోతారు. మనసు మరణాన్ని చెప్తూ కన్నీటి చుక్కా కారిపోకే నను వంటరిగా వదిలి అని ప్రాధేయపడతారు. అమ్మ ఆవేదన, మా అమ్మ అమృతపు పలుకులు, అమ్మా నీకు వందనం, అమ్మ మనసులో చూడు వంటి కవితలు అమ్మ ప్రేమను, అమ్మతో పంచుకున్న అనుబంధాలను చాలా చక్కగా చెప్తారు. గురుతుండిపోవూ, ఎన్నో... ఎన్నెన్నో, ఎపుడు నను చేరునో, ప్రియా వంటి కవితలు ప్రేమ భావనలను, సున్నితపు మనసుల ఊహలను చెప్తాయి. ఆకాంక్ష కవిత సాహితీ ప్రయాణంలో అక్షరాలపై తనకున్న ఆరాధనను, తన ఆశలను చెప్తారు. నిరంతర ప్రేమికులు కవితలో ప్రతి ప్రేమికుడు కవి కాకపోవచ్చు కానీ ప్రతి కవి ప్రేమికుడే అని భలే చెప్తారు. తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఎలా చూడాలనుకున్నారో ఆశ కవితలో చెప్తారు. కొత్త రెక్కలతో ఆమె కవితలో స్త్రీ జాతి తరపున మాట్లాడతారు. దోచుకొకే కన్నీళ్లను కవితలో బతుకులో ఏది మారకపోయినా చివరి మజిలి కోసం దాచుకున్న కన్నీళ్లను దోచేసుకున్నావంటారు సరికొత్తగా. చీర అందాన్ని వర్ణిస్తారు. మగాడు కవితలో మనసున్న మారాజుగా పురుషుడిని చూపిస్తారు. శ్రీమతి సాన్నిహిత్యపు పరిమళాన్ని దివ్య పరిమళం కవితలో మనతో కూడా ఆస్వాదింపజేస్తారు. భాషకందని భావాల అన్వేషణని అంతరాత్మ వెదుకులాటగా చెప్తారు. నేనో బొమ్మలా ప్రేయసి రాకపోకలను చూస్తుండిపోయానంటారు. ప్రియమైన నేస్తం తన మనసును పంచుకున్న కాగితమని చెప్తూ అక్షరాల అభిషేకంతో కృతజ్ఞతలు తెలుపుతారు. కవిఉహలకు, ఆశలకు, ఆశయాలకు, మనసు భావాలకు, వెతల గుండెకు ఓదార్పుగా, వంటరితనానికి నేస్తంగా, ఏకాంతానికి సాయంగా అభివర్ణిస్తూ కవితను కలకాలం పచ్చగా కళకళలాడుతూ వర్ధిల్లమంటూ అక్షరాలతో వేడుకుంటారు.
            తన అనుభవాలకు, మనసు భావాలకు స్వచ్ఛమైన రూపాలనిస్తూ, కుటుంబం, సమాజం పట్ల తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ, సున్నితంగా, భావయుక్తంగా చెప్పిన మనసు రాతలు ఈ కవిత్వ సంపుటి నిండా పరుచుకుని ఉన్నాయి. అమ్మానాన్నలపై, భార్యాబిడ్డలపై వెరసి తనకు అక్షరాలపై ఉన్న ప్రేమనంతా రంగరించి రాసిన " నాన్న పచ్చి అబద్ధాలకోరు " కవితా సంపుటి ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం. అందరి మనసులకు నచ్చేటట్లుగా నిజాయితీగా రాసిన సురేంద్ర రొడ్డకి హృదయపూర్వక అభినందనలు.


2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

ramesh చెప్పారు...

Please let me know where to get this book

చెప్పాలంటే...... చెప్పారు...

+919491523570 సురేంద్ర రొడ్డ కి కాల్ చేయండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner