6, మే 2019, సోమవారం
జీవన "మంజూ"ష (మే)...!!
నేస్తం,
" ఏ ఇంట్లో చూసినా ఏమున్నది గర్వకారణం, మలి వయసు పసితనాన్ని చీదరించుకోవడం తప్ప..." అని అనాలనిపిస్తోంది. శారీరకంగా బాధించి మనుష్యులను చంపడం సహజ లోకరీతి. మానసికంగా ఒక మనిషిని చంపడం సాధ్యమా అని మనకు ఒకింత అనుమానం రావడమూ సహజమే. పుట్టినప్పుడు పసితనం బావుంటుంది కాని అపర వయసులో పసితనం మన కడుపున పుట్టిన బిడ్డలకు కూడా గుదిబండే. పుట్టినప్పటినుండి మనకు చేసిన సేవలు, మన కోసం వాళ్ళు కోల్పోయిన ఎన్నో క్షణాలు ఇవేవీ మనకు గుర్తుకు రాకపోవడం క్షమించరాని నేరమే. కాని ఇలాంటి నేరాలకు ఏ శిక్షలు లేకపోవడం మన దౌర్భాగ్యం. మురికి పట్టిన మన మనస్తత్వాలకు ఎన్ని డిటర్జెంట్ సబ్బులు వేసి తోమినా ఆ మకిలి పోదు. సంస్కారవంతమైన ప్రోడక్ట్లని టి వి లో ప్రకటనలు చూస్తూ మోసపోవడం మనకు అలవాటైపోయింది.
సాహిత్యమూ ఈ సంస్కారంలో తీసిపోలేదంటూ తన ఉనికిని చాటుకుంటోంది. కొందరు పరాయి మతాన్ని, కులాన్ని హేళన చేయడం తమ ఉనికిని చాటుకోవడానికి ఒక మార్గంగా సాహిత్యాన్ని ఎంచుకుంటే, ఆ తవికెల్లో అద్భుతమైన శిల్పకళను చూస్తున్న ఎందరో సాహితీ ఉద్దండులు. మరికొందరేమో ఎవరో అసభ్యంగా తిట్టారని, ఘాటు పదజాలంతో గోప్యంగా ఉండాల్సిన అవయవాలను తమ అభ్యంతరకర రాతలతో రాయడం వాటికి వచ్చిన స్పందనలకు ఏదో పురస్కారం వచ్చినంతగా పొంగిపోవడం ఇప్పటి ఫాషన్ ఐపోయింది.
సాహిత్యంలో ఎంతగా విషం పేరుకుపోయిందో చెప్పడానికి ఒక్క సంఘటన చాలు. " కొన్ని బలహీన సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి " అన్న వ్యక్తిని సమర్ధిస్తున్న ఎంతోమంది సాహితీ పెద్దలను ఏమనాలో కూడా తెలియని దుస్థితి ఇప్పుడు మన ముందు ఉన్నది. సాహిత్య అకాడమి అవార్డులు, మరెన్నో పురస్కారాలు అందుకున్నంత మాత్రాన సంస్కారం అలవడదని, జన్మతహః సంస్కారం అబ్బాలని తెలుస్తోంది. తప్పు చేసిన వారికన్నా వారిని సమర్ధించేవారు ఎక్కువ తప్పు చేసినట్లు. ముసుగులు తీయనంతవరకు అందరు దొరలే. ఆ వేసుకున్న ముసుగులు ఏదో ఒక రోజు తొలగక మానవు, నిజ స్వరూపాలు బయటపడినా కూడా ఏ మాత్రం భయం, సంకోచం లేకుండా ఈ జాతి మన మధ్యనే రొమ్ము విరుచుకుని షరా మాములుగా సూక్తిసుధలు వల్లెవేస్తూ సంచరిస్తుండటం చూస్తూ, లోపం ఎక్కడుందో తెలియని స్థితిలో అయోమయంలో మనముండిపోతున్నాం నిస్సహాయంగా...
ఈ ముచ్చట్లకు ఇప్పటికి సశేషం....
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి