31, మే 2019, శుక్రవారం

మరోసారి...!!

యావన్మందికి తెలియజేయడమేమనగా మీకు నచ్చినవే రాస్తూ, మీ అడుగులకు మడుగులొత్తే రకం నేను కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.  నేనుగా ఎవరి గోడల మీద రాతలను కాని, వ్యక్తిగతంగా కాని, ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని విమర్శించలేదు. వ్యక్తిత్వాన్ని, వ్యవస్థను, మతాన్ని, కులాన్ని, జాతీయతను అవహేళన చేసినా, అసభ్యకరంగా కాని, అభ్యంతరకరంగా రాసినప్పుడు నా స్పందనలు ప్రత్యక్షంగానే తెలియచేస్తాను కాని ముందోమాట, వెనుకోమాట మాట్లాడను. ఇలానే రాయాలి, అలానే రాయాలని ఎవరికి ఉచిత సలహాలు, సూచనలు ఇవ్వలేదు. ప్రపంచంలో అందరికి నచ్చేటట్లు ఉండాలన్న నియమం నాకు లేదు. సీత నిర్ణయం అని మరుక్షణంలోనే ఆమె నిర్ణయంగా మార్చిన మతపరమైన హేళన రాతను సమర్థించిన, మనకెందుకులే అని నోరు మెదపని కుహనా మేథావులు ఈరోజు నా రాతల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఏ మతమూ, కులమూ, సాహిత్యం, కళ కూడ ఎవరిని అవహేళన చేయమని చెప్పలేదు. కాని అదే సమయంలో మన హక్కులు, బాధ్యతలను వదలివేయమని కూడా చెప్పలేదు. నేను రాసే రాతలకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతానంటే హృదయపూర్వక స్వాగతం.... దేవుడే అందరిని మెప్పించలేడు...
నేనూ నా రాతలు ఏపాటి చెప్పండి....
మీకు ఒప్పనిపించింది నాకూ ఒప్పనిపించాలనేం లేదు కదా.. వితండవాదం మీ మేనిఫెస్టో అంటే మీ ఇష్టం....సద్విమర్శలకు సదా స్వాగతం..
.

29, మే 2019, బుధవారం

ఓ మాట...!!

తటస్థంగా ఉండి రాజకీయ నాయకుల, పార్టీల వైఖరిని జనానికి తెల్పుతూ, సమాజ హితానికి దోహదపడాల్సిన మీడియానే పార్టీలకు, నాయకులకు కొమ్ము కాయగాలేనిది..."నువ్వు చెప్పిన మాట నిన్ను అడిగితే " ప్రమాణ స్వీకారం చేయకుండానే అంటున్నారు, సమయమివ్వాలి అంటూ అప్పుల చిట్టాలు విప్పుతున్నారు. మీరెందుకు ప్రమాణ స్వీకారానికి ముందే స్టేట్మెంట్స్ ఇచ్చారని అడగడంలో తప్పేముంది.
కవికి, జర్నలిస్ట్ కి చాలా తేడా ఉంటుందండి. మీకు నచ్చిన వారిని మీరు సమర్థించినప్పుడు, ఎదుటివారు వారికి నచ్చిన వారిని సమర్ధించడంలో తప్పేంటి? కవి కలంలో ఇంకే మీ కలాల్లోనూ ఉంది. చిన్న మాట అదీ మీ నోటి నుండి వచ్చిన దానికి క్లారిఫికేషన్ అడిగితేనే ఇన్ని మాటలంటున్నారు. నాకు కులం, పార్టీ లేదు. అయినా మీ కులాలను, పార్టీలను మీరు నెత్తికెత్తుకున్నప్పుడు లేనిది నేను రెండు మాటలు అదీ తప్పుగా కూడా మాట్లాడలేదు... జస్ట్ అడిగానంతే... దానికే ఇంతలా గింజుకుంటే ఎలా...?
మీకిష్టమైనవి మీ గోడ మీద రాసుకున్నప్పుడు నాకామాత్రం హక్కు లేదా?
కలంలో ఇంకు ఎప్పుడూ కంపు కొట్టదు. మన మనసులోనే మాలిన్యాలన్నీ. ఒక్క క్షణం నేనేం రాశానో, మీ గోడల మీద కాని, నాకు వచ్చిన కామెంట్లు కాని మనసుతో చూడండి మీకే తెలుస్తుంది. మీరు రాస్తే ఒప్పు, నేను రాస్తే తప్పు ఎలా అవుతుంది...?

28, మే 2019, మంగళవారం

మీ ఏడుపేంటో...!!

ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అంటే అన్ని అప్పులున్నాయి ఇన్ని  అప్పులున్నాయి అని అంటున్నారు... ఆ అప్పుల సంగతి తెలియకుండానే ఎన్నికల హామిలిచ్చారా, కేంద్రంలో  ఏ అధికారమెుస్తుందో తెలియకుండానే ప్రత్యేక హోదా హామి ఇచ్చారా... ప్రమాణ స్వీకారానికి ముందే మీరు గోడదాటు వ్యవహారంగా మాట్లాడుతుంటే...బాబూ హామీలు నెరవేర్చండి అంటే పొలోమని నా మీద పడి ఏడుస్తారెందుకు.... నేనేనాడయినా మీ గోడలకొచ్చి మీ రాతల్ని క్రిటిసైజ్ చేసానా...చెప్పండి.
ఎన్నికల్లో గెలిచిన వారిచ్చిన హామీలు నెరవేర్చమని అడిగే హక్కు ఉంది కదా.... నేనేమీ అసభ్యంగా మాట్లాడలేదే...
మరెందుకంత ఉక్రోషం... మర్యాదగా అడిగా...మీరు మీకిచ్చిన మర్యాద నిలుపుకోండి లేదంటే బ్లాక్ చేసుకోండి.... అతిగా మాట్లాడవద్దు.....

త్రిపదలు...!!

1.  అక్షరాలతో ఆంతరంగికంగా
అసలుకు నకలుకు
తేడా తెలుసుకునే క్రమంలో...!!

2.   గొప్పదనమంతా
నా అక్షరానిదేనన్న అహంతో
మనసాక్షరాల రూపాన్ని చూడలేకున్నా...!!

3.   అక్షరమే ప్రపంచం
నాదన్నదంతా
తానే నిండిపోతూ...!!

4.   మాను మూగదైంది
బంధాల గారడీల నడుమ
మనసుల నైజాలను తిలకిస్తూ...!!

5.  తక్కువన్న తూకమే లేదిక్కడ
నెయ్యమైనా కయ్యమైనా
మన మధ్యనే...!!

6.   మలిప్రేమలు
జ్ఞాపకాలను దాచుకునే
మనసు ఖజానాలు...!!

7.   అంపశయ్య ఆలోచనేలా
పలకరించే జ్ఞాపకమై
నిను వీడక నేనుంటే...!!

8.  శూన్యం చుట్టేసినప్పుడంతే
ఏ లెక్కల పద్దులు
సరికావంతే....!!

9.   నైల్యమూ ఓ ఛాయే
ఎదను కమ్మినా
ఎడ మాపుతుందేమెా..!!

10.   ఆవేశమూ, ఆవేదనా కాదది
ఏళ్ళ తరబడి తిరస్కారాల తీర్మానాలకు
ఓర్పు నశించి సంధించబడుతున్న శరాలు..!!

11.    మనసు మెుద్దుబారింది
సహనానికీ ఓ హద్దుంటుందని
చరిత్రను గుర్తుచేస్తూ...!!

12.    స్పందన లేని మనసు
సజీవమైనా నిర్జీవమే
అక్షరాల నడుమ కొనూపిరితో...!!

13.   ఒక్క క్షణమైనా
నాది కావాలన్న కోరిక
గెలుపును ఆస్వాదించడానికి...!!

14.   కొన్ని వాస్తవాలంతే
మనకు నచ్చినట్టోసారి
నచ్చనట్టోసారిగా మిగులుతూ...!!

15.    అన్ని సందర్భాలూ ఇంతే
మన సంతోషం చూడలేని
కొందరికి కంటగింపుగా...!!

16.   వాత్సల్యమెా
అయస్కాంతమనుకుంటా
తాకిన వెంటనే ఇట్టే ఆకర్షించేస్తూ...!!

17.   కదలిక మెుదలైతే చాలు
క్షణాల కాలాన్ని
కలం అక్షరాల్లో ఒంపడానికి...!!

18.   భర్తీ చేయలేనిది
ఈ అమ్మతనమే
విధాతకు సైతం సవాలు విసురుతూ...!!

19.   జ్ఞాపకాల జలతారుల్లా
తడుముతున్న బాల్యం
మరలి రానంటూ మారాము చేస్తూ..!!

20.   భద్రతెప్పుడూ అగమ్యగోచరమే
నమ్మిన నిజాలు
చేదుగా అనిపిస్తుంటే..!!

21.   అస్థిమితమంతే
అటు ఇటు ఎటూ పోనివ్వదు
గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశించలేక...!!

22.  ఇంకని నీటి చలమే
కంటిలోని కన్నీరు
మనసును బయల్బెడుతూ..!!

23.    మాటలతో నాకు అలవాటే
అలుక నేర్చిన నీ మౌనాన్ని
అందంగా ఎలా చూపాలో...!!

24.  స్వరం పాతదే
గతి తప్పిన గమకాలను
సరి చేయడానికే ఈ నాదం..!!

25.   పరిభ్రమణాల
పరిలోకనం
బంధాల అనుబంధం..!!

26.   నీవు లేక నేను
మనలేనని తెలిసినప్పుడు
ప్రశ్నాలంకారాలకు తావెందుకట...!!

27.   కొన్నలా గుర్తుంటాయి
బాధలో ఓదార్పులా
బాసటకు తోడుగా...!!

28.   మానని గాయాలే
కొన్ని పరిచయాలు
మనసుని బాధిస్తూ...!!

29.   పలకరింపే ప్రాణమౌతుంది
మరణాన్ని మరలి పొమ్మంటూ
ఆత్మాభిమానం ఆయువుపట్టంటూ...!!

30.    ఓటమికి వెరవని మనసిక్కడ
ఎగుడుదిగుడు రహదారుల్లో
గెలుపు సోపానమధిరోహించడానికి...!!

ఆ మాట.. ఈ మాట...!!

అప్పులున్నాయని ఈరోజు కొత్తగా తెలిసిందా. పాలక పక్షానికన్నా  ప్రతి పక్షానికే ప్రభుత్వ, ప్రజల సమస్యలు తెలిసుండాలి కదా. సమస్యలన్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారనే కదా అధికారమప్పజెప్పింది ప్రజలు. అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే చేతులెత్తేయడం సబబు కాదండి. మన హక్కులు మనం సాధించుకోవడానికి ఎవరికి లొంగి బతకనక్కరలేదు. మీ స్వప్రయెాజనాల కోసం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకండి. వ్యక్తిగత కక్షలు,విమర్శలు మీ ఇష్టం. ఆంధ్రులను గురించి నోరు పారేసుకునే ఏ ఎదవను మేము ఉపేక్షించము.  విభజన అప్పటి నుండి అందరికి అన్ని విషయాలు
తెలుసు. ప్రతిపక్ష పాత్రకు ఎలాగు న్యాయం చేయలేదు, కనీసమిప్పుడైనా మీకు అధికారం కట్టబెట్టిన జనం నమ్మకాన్ని నిలబెట్టుకోండి.
" అన్ని ఉంటే గుడ్డిది కూడ కాపురం చేస్తుంది " అన్న పెద్దలు చెప్పిన సామెత గుర్తు చేయక తప్పలేదు మీ మాటలు విన్న తరువాత. ఈ సామెత వాడినందుకు నన్ను మన్నించాలి అందరు. ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం లేదు. సామెత గుర్తు చేసానంతే. యు టర్న్ తీసుకోకుండా పని చేస్తే చాలు. 

27, మే 2019, సోమవారం

ఎన్నికల రాజకీయాలు...!!

రా రాక్షసంగా(రాజసంగా)
జ జనానికి
కీ కీడు చేసే
యం యంత్రాంగం... పరుచూరి వారి డైలాగ్ గుర్తు వచ్చింది.

ఎన్నికలు లేకుండా నాయకుల మధ్య ఒప్పందంతో అధికారాన్ని పంచుకుంటే కనీసం ఎన్నికల ఖర్చు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టవచ్చు. అధికారం, పదవుల కోసం పార్టీలు మారే శ్రమ తప్పుతుంది. చరిత్రలో మన చరిత చెప్పుకోకుండా చెయెత్తి జై కొట్టు తెలుగోడా / భారతీయుడా గతమెంతో ఘనకీర్తి కలవోడా  అని పాడుకోవడానికయినా మిగులుతాం. ఉపయెాగం లేని  ఎన్నికలను బహిష్కరించండి ఇకనయినా...

23, మే 2019, గురువారం

అక్షరాలకు సార్థకత...!!

నేస్తం,
          ఉన్న వేదాలు, ఉపనిషత్తులు చాలు. మరో భారతమెా, రామాయణమెా రావాలని లేదు. మహాకవి శ్రీ శ్రీ గారన్నట్టు " ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం " అన్నది మనం ఒప్పుకోవాల్సిన సత్యం. తప్పని పరిస్థితి అయినా, తప్పించుకోలేని స్థితి అయినా రెండు చేతులు కలవనిదే చప్పట్లు వినబడవు, మరి అలాంటప్పుడు ఈ సమాజం ఒక్కరినే దోషిని చేయడమెంతవరకు సబబు? అనాది నుండి ఆడదానికి జరుగుతున్న అన్యాయానికి ఈ సమాజమిచ్చిన బిరుదు బరితెగించిన ఆడది అని. మగాడు తన అవసరాలు తీర్చుకుని నడిబజారులో వదిలేసినా ఏ తల్లి మనసు తన బిడ్డను కుప్పతొట్టెల పాలు చేయాలనుకోదు. మన దౌర్భాగ్యం ఏంటంటే చెత్తబుట్టల పాలైన బిడ్డలతో సహా సమాజమంతా ఆ తల్లినే నిందిస్తారు కాని తను మరణానికి చేరువౌతున్నా బిడ్డకు జన్మనిస్తూ సంతోషించే ఆ తల్లి మనసు కనబడదు. కుటుంబ బాధ్యత లేకుండా తిరిగే మగవాడికి కనకపు సింహాసనం, పాలు, మురిపాలు తీర్చే అమ్మకు, ఆలికి మనమిచ్చే గౌరవం ఏపాటిదో మీకందరికి ఎరుకే. ఈ ప్రపంచంలో చెడ్డ తండ్రి ఉంటాడేమెా కాని చెడ్డ తల్లి ఉండదు. బిడ్డ రోడ్లపాలు కావడానికి ఏ తల్లి కారణం కాదు. ప్రతి కవి, రచయిత    తమ రాతలు ఎవరిని కించపరచకుండా నిజాయితీగా రాయగలిగినప్పుడే ఆ అక్షరాలకు సార్థకత. 

16, మే 2019, గురువారం

గుర్తుకే రావు..!!

ఎప్పుడూ
నువ్వు గుర్తుండటానికి
గతానివి కావు
జ్ఞాపకానివి కాదు
మరిచిపోవడానికి
మారు పడటానికి
క్షణాల పరిచయము లేదు
మరుక్షణం దాటిపోవడానికి
యుగాల తరబడి
నిరీక్షణ అనుకోవడానికి
జన్మబంధమై చెంత చేరిన
వాస్తవమైన ఆత్మానుబంధమైతే
మరపుకు తావెక్కడ...!!

13, మే 2019, సోమవారం

నీకు నాకు మధ్యన...!!

నీకు నాకు మధ్యన
పరిచయం పాతదయినా
పలకరింపులకు సమయమే లేకుండాపోయింది

మాటలు లేకపోయినా
మౌనాలు పంచుకొనకపోయినా
బంధమలాగే మిగిలిపోయింది

మమకారం మరుగున పడినా
బాధ్యతలు వదులుకోలేని పాశం
మనచుట్టూ చేరినా దూరమలాగే ఉండిపోయింది

అభిమానాలు అందకుండాపోతున్నా
ఆప్యాయతలకర్థం మరిచిపోతూ
వంటరి బతుకు వలస వచ్చి చేరింది

మనసు చచ్చిపోయినా
జ్ఞాపకాలు గాయాలై బాధ పెడుతున్నా
రేపటిపై ఆశ అలాగే నిలిచిపోయింది

కొన్ని జీవితాలింతేనేమెా
గతానికి వాస్తవానికి మధ్యలో
అసంపూర్ణంగా మిగిలిపోతూ....!!

12, మే 2019, ఆదివారం

మహాత్ములు కొందరు...!!

మేకవన్నె పులులు కొందరు మీకు ఎదురు పడవచ్చు. జర జాగ్రత్త...
కొన్ని పేర్లు.. 1997 నుండి మెుదలైన అసలు జీవితం నుండి....
1998 పూర్ణచందర్రావు Allied Informatics Chennai
2000 సంవత్సరం అమెరికాలో మెుదలుబెట్టి...
పోతిన రఘుబాబు(బాబ్) HNC Solutions
రామస్వామి యనమదల,
రాజు ఇందుకూరి, బాల ఇటికిరాల, అరి కేసరి, చక్రధర్ మరి కొందరు American Solutions USA & INDIA  

మరి కొందరు కపట స్నేహితులను, రాబంధువులను ...మరోసారి...

9, మే 2019, గురువారం

నా రాతల పై పెద్దల అభిప్రాయాలు ..!!

నా అంతర్లోచనాలు, చెదరని శి(థి)లాక్షరాలు  పుస్తకాలపై మా నాన్న, పెదనాన్న రాసిన అభిప్రాయాలు
మనఃపూర్వక ధన్యవాదాలు ఇద్దరికీ

మహర్షి గురించి...!!

సక్సెస్ అంటే గమ్యం కాదు ఓ ప్రయాణం అన్న మాట బావుంది. విజయం సాధించడం అంటే ప్రపంచం మనల్ని గుర్తించడమని అందరు అనుకుంటారు. కాని గతాన్ని, జ్ఞాపకాలను మరిచిపోవడం కాకుండా, విజయం సాధించడమంటే జీవితంలో ఏది కోల్పోకుండా మనం బతకడమని, నలుగురిని బతికించడమని చెప్తూ, రైతుకిచ్చిన గౌరవం, రైతు సమస్యలను చెప్తూ రైతు అవసరాన్ని సమాజం గుర్తించేటట్లు చేయడం బావుంది. సినిమా చాలా బావుంది.

" విజయమంటే జీవితాన్ని కోల్పోకుండా బతకడమని నా ఉద్దేశ్యం. "

8, మే 2019, బుధవారం

ఏక్ తారలు...!!

1.  ఏ రుచి ఎలా ఉండాలన్నది_నిర్ణయించేది కాలమే...!!

2.  రసాస్వాదన రుచులకెరుకే_కాలంతో పోటిగా...!!

3.   నా కన్నుల్లో నీ రూపే_మరో లోకమే లేనట్లుగా...!!

4.  మనసు మాటల్లో వొలికినట్లుంది_అక్షరాల శబ్దానికి అనువుగా...!!

5.  నీ ఊసుల మైమరపది_మనసాక్షరాలను మాయ చేస్తూ..!!

6.   గమనమంతే అప్పుడప్పుడు గతి తప్పుతూ_మది కన్నీళ్ళకు ఓదార్పవుతూ...!!

7.   వెలుగుతోంది మనసు_ఆత్మ జ్ఞానజ్యోతి ప్రకాశంతో..!!

8.   రేపటి స్వప్నాన్ని_నిన్నలను దాటుకుంటూ నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ..!!

9.   సమ్మెాహన రాగమేమెా అది_మౌనరాగానికి మరులు నేర్పుతూ...!!

10.    కనుకొలుకుల్లో చేరిన కన్నీరు_మనసును తేలిక చేస్తూ..!!

11.   ఓదారుస్తోందో అమ్మ_ఏ తల్లి కన్నబిడ్డైనా తనది అమ్మదనమేనంటూ...!!

12.   మది జలపాతమది_కడలిలో కలిసి సాంత్వనందుతూ...!!

13.    తనివి తీరని మమకారమది_మేఘమై మురిసిందిలా

14.    మనసు పరిచయమేనేమెా_గుప్పెడు ఆత్మీయతను గురుతెరిగిన స్నేహానికి...!!

15.   తక్కెడలక్కరలేని నెయ్యమది_కొలమానానికి చిక్కని బంధమై చేరి...!!

16.    కష్టమంటే ఇదేనేమెా_నీవు లేకున్నా నీతోనే ఉన్నట్టుండటం...!!

17.   దూరం కాలేని బంధం మనది_ఇష్టమైనా కష్టమైనా..!!

18.  అక్షరాలు వెలవెలబోతున్నాయి_అర్థంపర్థంలేని రాతల్లో ఇమడలేక..!!

19.    నిదురపోయిన నిజాలెన్నో_కలలో సైతం కలవరపడుతూ...!!

20.    ఆరాధనే ఆలంబన అయ్యింది_బాధల బరువును మెాయడానికి....!!

21.    అణుకువా ఎక్కువే నా అక్షరానికి_ఆత్మాభిమానం అలంకరణగా..!!

22.   సొగసులీనుతున్నాయి_పూలు నేలరాలినా...!!

23.   అమాస అగుపడనే లేదు_నీ నవ్వుల మెరుపు విరుపులను చూడలేకేమెా...!!

24.   మనసుతో వినలేకపోతున్నాం_ఈ అక్షరాల ఆంతర్యాన్ని...!!

25.    అక్షరం వయ్యారాలు బోతోంది_వెక్కిరింతలు తననేం చేయలేవంటూ...!!

26.    మనసుకు తెలుసనుకుంటా_ఆప్యాయంగా ఆదుకునేవి అక్షరాలేనని...!!

27.   అమ్ముడుబోని అక్షరం ఆత్మ విశ్వాసమది_చురకలేయడం తన వంతంటూ...!!

28.   చురకలంటని చర్మమనుకుంటా_తోలు మందమని బుుజువు చేసుకుంటూ..!!

29.   మూల్యం చెల్లించక తప్పదు కదా_మూలాలను వెక్కిరిస్తుంటే. ..!!

30.   అన్యాపదేశం చేయదెప్పుడూ_కర్తవ్యమెరిగిన అక్షరం...!!

6, మే 2019, సోమవారం

ఊ కొడతారా..ఉలిక్కిపడతారా...!!

నేస్తం,
         "కథ చెబుతాను ఊ కొడతారా ఉలిక్కి పడతారా..." అంటూ పాట పాడను కాని ఓ విషయం చెప్పేద్దామని రాయడం మొదలెట్టేసాను. అందులోనూ ఏదైనా బుర్రలో చేరి తొలుస్తుంటే అస్సలు చెప్పకుండా ఉండలేని బలహీనత నాదయ్యే. నాకీ బలహీనత ఉన్నట్టే కొందరికి రక్తసంబంధ హీనత బాగా పెరిగిపోయింది. మాకు, మా పిల్లలకు ఉన్న సంస్కారం ఏంటంటే చంపడానికి శత్రువు మా ఇంటికి వచ్చినా పలకరించి మంచినీళ్లు తాగడానికి ఇవ్వడం. ఇది మాకు మా అమ్మానాన్నల నుండి, మేము చదువుకున్న గురువుల నుండి మాకు దక్కిన ఆస్తి. అదే అమ్మానాన్నల రక్తం పంచుకు పుట్టినా కొందరికెందుకో మరి ఈ సంస్కారహీనత.  మమ్మల్ని మా పద్ధతులని అవహేళన చేసిన ఎందరికో ఇది నా మాటగా గర్వంగా చెప్తున్నాను. అమ్మ స్థానంలో, గురువు స్థానంలో  ఉండి అనుబంధాలను, భావి భారత పౌరులను సరైన మార్గంలో పెట్టాల్సిన కొందరు రక్త సంబంధాల మధ్యనే గొడవలు పెడుతూ, విభజించి పాలించడమే తమ ప్రధమ కర్తవ్యంగా చేసుకుని, అబద్దాలు ఇంటిపేరుగా మార్చుకుంటుంటే చూస్తూ ఉండలేక నిజాలు చెప్పాలని ఉంది. ఆ నిజాలు తెలిసినా ఒప్పుకునే ధైర్యం లేక ఆ తప్పు అడుగులకు మడుగులు ఒత్తే నాకు తెలిసిన చాలామంది నా దృష్టిలో బతికున్నశవాలే. ఆపదలో ఓ ఓదార్పు మాట పలకలేని రక్త సంబంధం, అహంకారానికి మాత్రమే చిరునామాగా మారినా, కష్టంలో ఉన్నప్పుడు ఇంటికి రావద్దన్నా, ఆపదలో అవసరానికి కూడా తమ సంబంధాన్ని బయటపెట్టవద్దన్నా ఇలా మానసికమైన చర్యలెన్ని చేసినా తెలిసీ తెలియనట్టుంటూ నోరు విప్పని ఎందరో బంధుజనాలూ మీకు పాదాభివందనాలు. నేనంటూంటే చాలామందికి కోపం వస్తుంది కాని ఇదే నిజం ఏంటంటే.. " ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలకు మంచి చెడు చెప్పాల్సిన ఎందరో ఉపాధ్యాయులు అమ్మానాన్నల పట్ల, తోబుట్టువుల పట్ల చాలా హేయంగా ప్రవర్తిస్తూ నేతిబీరకాయలో నెయ్యి చందాన ఈ సమాజంలో బతికేస్తూ మానవ విలువలను పూడ్చి పెడుతున్నారు." సమాజం మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాని ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని కోరుకోరెందుకో...?

జీవన "మంజూ"ష (మే)...!!

 నేస్తం,
         " ఏ ఇంట్లో చూసినా ఏమున్నది గర్వకారణం, మలి వయసు పసితనాన్ని చీదరించుకోవడం తప్ప..." అని అనాలనిపిస్తోంది. శారీరకంగా బాధించి మనుష్యులను చంపడం సహజ లోకరీతి. మానసికంగా ఒక మనిషిని చంపడం సాధ్యమా అని మనకు ఒకింత అనుమానం రావడమూ సహజమే. పుట్టినప్పుడు పసితనం బావుంటుంది కాని అపర వయసులో పసితనం మన కడుపున పుట్టిన బిడ్డలకు కూడా గుదిబండే. పుట్టినప్పటినుండి మనకు చేసిన సేవలు, మన కోసం వాళ్ళు కోల్పోయిన ఎన్నో క్షణాలు ఇవేవీ మనకు గుర్తుకు రాకపోవడం క్షమించరాని నేరమే. కాని ఇలాంటి నేరాలకు ఏ శిక్షలు లేకపోవడం మన దౌర్భాగ్యం. మురికి పట్టిన మన మనస్తత్వాలకు ఎన్ని డిటర్జెంట్ సబ్బులు వేసి తోమినా ఆ మకిలి పోదు. సంస్కారవంతమైన ప్రోడక్ట్లని టి వి లో ప్రకటనలు చూస్తూ మోసపోవడం మనకు అలవాటైపోయింది. 
            సాహిత్యమూ ఈ సంస్కారంలో తీసిపోలేదంటూ తన ఉనికిని చాటుకుంటోంది. కొందరు పరాయి మతాన్ని, కులాన్ని హేళన చేయడం తమ ఉనికిని చాటుకోవడానికి ఒక మార్గంగా సాహిత్యాన్ని ఎంచుకుంటే, ఆ తవికెల్లో అద్భుతమైన శిల్పకళను చూస్తున్న ఎందరో సాహితీ ఉద్దండులు. మరికొందరేమో ఎవరో అసభ్యంగా తిట్టారని, ఘాటు పదజాలంతో గోప్యంగా ఉండాల్సిన అవయవాలను తమ అభ్యంతరకర రాతలతో రాయడం వాటికి వచ్చిన స్పందనలకు ఏదో పురస్కారం వచ్చినంతగా పొంగిపోవడం ఇప్పటి ఫాషన్ ఐపోయింది. 
          సాహిత్యంలో ఎంతగా విషం పేరుకుపోయిందో చెప్పడానికి  ఒక్క సంఘటన చాలు. " కొన్ని బలహీన సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి " అన్న వ్యక్తిని సమర్ధిస్తున్న ఎంతోమంది సాహితీ పెద్దలను ఏమనాలో కూడా తెలియని దుస్థితి ఇప్పుడు మన ముందు ఉన్నది. సాహిత్య అకాడమి అవార్డులు, మరెన్నో పురస్కారాలు అందుకున్నంత మాత్రాన సంస్కారం అలవడదని, జన్మతహః సంస్కారం అబ్బాలని తెలుస్తోంది. తప్పు చేసిన వారికన్నా వారిని సమర్ధించేవారు ఎక్కువ తప్పు చేసినట్లు. ముసుగులు తీయనంతవరకు అందరు దొరలే. ఆ వేసుకున్న ముసుగులు ఏదో ఒక రోజు తొలగక మానవు, నిజ స్వరూపాలు బయటపడినా కూడా ఏ మాత్రం భయం, సంకోచం లేకుండా ఈ జాతి మన మధ్యనే రొమ్ము విరుచుకుని షరా మాములుగా సూక్తిసుధలు వల్లెవేస్తూ సంచరిస్తుండటం చూస్తూ, లోపం ఎక్కడుందో తెలియని స్థితిలో అయోమయంలో మనముండిపోతున్నాం నిస్సహాయంగా... 
ఈ ముచ్చట్లకు ఇప్పటికి సశేషం.... 

5, మే 2019, ఆదివారం

అంతర్లోక పయనం...!!

పుట్టినప్పుడే ఖరారైన      
పయనమిది
పురిటినీళ్ళతో మెదలై
పుడకల శయ్యకు వరకు
సాగే కడసారి నీళ్ళ
పూల కాలిబాటలో మెాసిన
కన్నీళ్ళ కావిడికుండలెన్నో
ఓదార్చుకున్న ఏమరుపాటులెన్నో
ఒంటరి యుద్ధంలో గెలుపు నీదైనా
అహంకారపు అనుబంధాల నడుమ
నలిగిన నీ గుండె కార్చిన
రుధిరాశ్రువులకు సాక్ష్యాలెన్నున్నా
నోరు మెదపలేని
సమాజపు ఆనవాళ్ళమైనందుకు
మమ్ము మేము క్షమించుకోలేని
నిస్సహాయులమై
దశదినకర్మలతో
నీ మరో పయనం
ప్రశాంతంగా సాగాలని
ఈ అక్షర వీడ్కోలు....!!

రాజ్యం అక్కా...నువ్వే గెలిచావు..కాకపోతే మాతో చెప్పిన నీ మాట నిలబెట్టుకోలెకపోయావు. ఎప్పుడు బాలేకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఇక్కడికే వచ్చేస్తానని చెప్పి మెాసం చేసావు. ఈ నాలుగైదు ఏళ్ళలో మనం పంచుకున్న మనసు మాటలన్నీ అందరికి గొంతు విప్పి చెప్పాలని ఉంది.. నువ్వెలా ఉన్నా, నిన్ను  పట్టించుకోని నీ రక్తసంబంధాలు ఎప్పుడూ బావుండాలని కోరుకునే నీ మంచి మనసు మరి ఎన్ని రోజులు నన్ను ఆపగలదో చూద్దాం...!!

 

4, మే 2019, శనివారం

దూరం - దగ్గర...!!

బతికుండగా ఓ పలకరింపు లేకుండా, పోయాక మాత్రం అపారమైన ప్రేమలు వొలకబోస్తూ దూరాభారాలని వాపోతూ,
తోబుట్టువుల చావులను కూడా తమ దర్పానికి వాడుకుంటూ,  రక్తసంబంధాలను అహం, డబ్బుల మాయలో పడి వదులుకుంటున్న ఈరోజుల్లో....కొద్ది పరిచయంలోనే నా మాటకు విలువిచ్చి తన జీవితాన్ని సంతోషంగా మలచుకున్న నా ఆత్మీయురాలు జ్యోతి  కొన్ని క్షణాలు నాకోసం కేటాయించినందుకు నాకెంత సంతోషమెా.... థాంక్యూ సో మచ్ జ్యోతి.

3, మే 2019, శుక్రవారం

అద్వంద్వం పుస్తక సమీక్ష..!!

                                "ద్వైతానికి అద్వైతానికి నడుమదే ఈ అద్వంద్వం.."
కొందరి కవిత్వం చదువుతుంటే అన్ని తెలిసిన పదబంధాలే ఉంటాయి కాని ఓ పట్టాన అర్థం కావు. ఈనాడు వస్తున్న యువ కవుల్లో వచన కవిత్వంలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సొంతం చేసుకున్న కవి పుప్పాల శ్రీరామ్. సమాజానికి, వ్యక్తిగతానికి నడుమ మనసు ఊగిసలాటను తాత్విక కోణంలో " నిస్సంగుడు " గా నిలిచి తన భావాలకు సదృశ్య రూపాన్నిచ్చిన తత్వజ్ఞుడు ఈ శ్రీరామ్ పుప్పాల.
                               మొదటి కవిత రెక్కలు తెగిన దారి ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యపు చదువులు లోహాపంజరాలై వేళ్ళాడుతూ, "చదువిప్పుదు ఒత్తిడికి పగిలిన నల్ల పలక మీద బుద్దిగా ఓనమాలు దిద్దమంటుంది" అంటూ చేజారుతున్న బాల్యాన్ని తనదైన అభివ్యక్తితో అందంగా చెప్తూ చురక వేశారు. మతం పోరాటం నేర్పిన గురువని చెప్తూ కూటి కోసం పరాయి దేశాలు వలసలు పోయి అక్కడ అష్టకష్టాలు పడుతూ అసువులు బాసిన ఎందరో భారతీయుల ఆత్మఘోషను మెహ్ రూమ్-కా-మొహబ్బత్ నామా కవితలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. నేను పుట్టిన ఇల్లు కవిత అవసరాల కోసం తను పుట్టిన ఇల్లు వదలి వెళ్తున్నప్పుడు, తిరిగి ఏ పరిస్థితిలో ఆ ఇంటికి  వచ్చినా తన దేహానికి చోటిచ్చిన తీరుని హృద్యంగా చెప్పడం బావుంది. "పంట పాద ముద్రలు పట్నం కూడలిలో నిలబడ్డాయి" , "నాగళ్ళు నడచిన దూరమంతా భూమిని ముద్దాడే పెదాలకున్న దగ్గరితనంలా కనిపించింది"  అంటూ వలస బతుకుల దైన్య స్థితిని నాసిక్ - ముంబై కవితలో చదువుతుంటే మనసు చెమ్మగిల్లక మానదు. "నా దేశపు  ఏకత్వం అన్నీ తెలిసిన పసితనంలా ఆడుకుంటున్న మా సందులో మతమంటే అమ్మ చెప్పిన నీతి కథలా ఉంటుందంటూ" రంజాన్ మాసపు చిన్నతనపు జ్ఞాపకాలను, రాకియపు ఆటను, మత సామరస్యాన్ని చక్కని భావాలతో దేవుడి సందు కవితలో చెప్పారు. అన్యాయాన్ని ఎదిరించలేని మన అసహాయతను ఎత్తి చూపారు ఆచూకీ కవితలో. దోపిడీకి గురౌతున్న జీవితాలను నల్ల జెండాలు కవితలో, గిరిజనుల పోరాట జీవితాలకి మనస్సాక్షిగా ఇచ్చిన అక్షర రూపం ఆ గిరిజనోడికి నేనేమౌతాను..? అన్న ప్రశ్న మనలో కూడా ఉదయించేటట్లుగా రాయడం అభినందించదగ్గ విషయం. మనిషిలో మనసు యుద్ధ విన్యాసాలను యుద్ధనౌకలో చూపించారు.
               మనసు ఆలోచనలకు ఓ రూపాన్నివ్వడానికి పై కప్పులేని నాలుగు స్తంభాల ఇంటిని అస్తిత్వ వేదనగా చెప్పడం చాలా బావుంది. ప్రేమ మైకంలో పడి, కాంక్షల వలయంలో చిక్కుకున్న మనసు కోపాన్ని " నేనెప్పుడూ అస్తిత్వ చీకటి రతిలోని ఎంగిల్నే కాదు నగ్న చైతన్య రహస్యాన్ని కూడా " అనడంలోనే కవి తన మనసు స్పందన వైఖరి గురించి, సదృశం లేనివాడని చెప్పకనే చెప్పడం, ఈ కవితా సంపుటికి " అద్వంద్వం" అని పేరు పెట్టడం సమంజసంగా అనిపిస్తుంది. ధిక్కార, అధికార నియంత్రణ నాటకాన్ని, దాచుకున్న నెమలీక అందం మన రాజ్యాంగం అంటూ వ్యవస్థలో లోపాల్ని ఎట్టి చూపడం అమ్మ పేరేంటి..? కవితలో కనిపిస్తుంది. "శిక్ష పడ్డ నడిరోడ్డు ఎర్రటి ఎండని మోస్తున్నట్టు " అన్న భావాల్లో ఎంత నిగూఢత దాగివుందో అన్నట్టు ఆమె యాంత్రిక ఙివితం యంత్రంగా మారడాన్ని, "మర్మాంగాలు తయారవని పిండం చుట్టూ  మళ్ళీ ఆబగా ప్రదక్షిణం మొదలెడుతుంది " అంటూ పిండం నుండి పెద్దతనం వరకు ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలకు నేనెక్సూ.. నువ్వయ్యీ..!! అన్న అద్ధం పడుతుంది. అట్రాసిటీ కవితలో వెట్టివాడొకడు రాజు కావాలన్న తన కోరికను చెప్తూ, కులాల కుళ్ళును, అంటరానితనాన్ని అక్షరీకరిస్తారు. " గోడలెప్పుడూ కూలిపోయిన కలల్నే గూళ్ళు కట్టుకున్నాయి " అంటూ యంత్రాల్లా బతికేస్తున్న ఎన్నో జీవితాలను గోడకుర్చీ కవితలో చెప్తారు. " నాకో ఉత్తరం రాయవూ " అంటూ ఆ లేఖ తన మనసుకు ఎలా హత్తుకోవాలో, ఎంత ప్రేమను పంచాలో చెప్పడం ఈ సరికొత్త ప్రేమలేఖ కవిత సారాంశం. " చిన్నప్పుడు అక్షరాలు దిద్దించిన పలక మీద బతుకు సాక్షి సంతకం పెట్టలేక అరిగిపోయిన వేలిముద్రల్లా వణికిపోతారు " అంటూ మలి వయసు పెన్షన్ జీవితాలను లైఫ్ సర్టిఫికెట్ కవితలో చాలా బాగా చెప్పారు. " నది దుక్ఖం నదిది మాత్రమే కాడు నీలో నాలో ఎండిన మోళ్ళది. కుండపోతగా కురవని వానది. " అని నది మనసుని కూడా మన కళ్ళ ముందుకు దుఃఖ నది గా తెచ్చారు. రైతు వ్యధని ఒక మాఫీ కథలో చెప్తారు. అప్పుల జాతి కవితలో వడ్డీలకు బలైపోతున్న బతుకుల్ని, పేదరికం పై గెలుపు కవితలో సమాజపు తీరుతెన్నుల్ని, నెల్లి నరమేధం గురించి పౌరసత్వం పురిటి నొప్పులు కవితలో, మత వైషమ్యాలను పండగెప్పుడొస్తుంది కవితలో, ఖాళీ గిన్నె కవితలో ఆకలి, అమ్మదనం, కోల్పోయిన స్వాతంత్య్రం గురించి చెప్పడం, విలీనంలోంచి  విలీనంలోకి అంటూ వెర్రితలల ఆధునికతను, బహిరంగ మల విసర్జన రహితమైన సమాజం కోసం కోరుకుంటూ మహిళల అవస్థలను ఏ బీ సీ డీ ఎప్ఫూ మా ఊరిప్పుడు ఓడీ  ఎప్ఫూ అన్న కవితలో వివరించారు. చిన్ననాడు పంచుకున్న స్నేహ జ్ఞాపకాలను నేను, ఒక చెట్టూ కవితలో అందంగా చెప్తూ అందరి జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. ఈ యాత్ర ఒక అనాది ఆకలి అంటూ ఙివిత సముద్రంలో వేటపడవల రహస్యాన్ని విప్పుతారు. తనకున్న పుస్తకాల సాంగత్యాన్ని మూగ విపంచిక కవితలో చెప్తారు. " శరీరమే జీవన్మరణాల్ని నిప్పులతో కడిగే అభ్యంగన స్నానం " అని చెప్తూ శరీరం ఇప్పుడొక మారక వస్తువుని, రోగాలు, అంగట్లో అమ్మకానికాని.. ఇలా ఇప్పటి సమాజపు లోపాలను ఎత్తి చూపుతారు ఇదం శరీరం కవితలో. " తాకేందుకు గుళ్ళోకి రానివ్వని దేవత మడి గడప దాటి వచ్చి పూజగదిలోని ఒక మరణం గురించి ఎప్పటికీ వాంగ్మూలమివ్వదు " అంటారు పూజ గది కవితలో. " సంభాషణ మాత్రం ఇప్పుడొక అనివార్య ప్రథమ చికిత్స " అంటూ ఎమర్జెన్సీ కొత్త కాదని, తిరగబడటం నేర్చుకోవాలని చెప్పడం బావుంది. ఆమె నా దేవత సొంత ఊరు కవితలో వర్ణన బావుంది. " గాలాడని గాజు గదిలోంచి బయటకొచ్చాక నల్లటి కలువ పూల రేకుల్లోంచి తెల్లటి చంద్రుళ్ళానే నిద్రపోతున్నాడు " అంటూ పార్థివ శరీరం చాలా బాగా చెప్పారు. వైద్య ప్రయోగాల్లో వాడే చుంచు ఎలుక గురించి "గినియా పంది" కవితలో కవితా వస్తువుగా తీసుకోవడం  ఇప్పటి వరకు నేను చదవని సరికొత్త కవితా వస్తువు, నాకు బాగా నచ్చిన కవిత కూడాను. కట్టుబాట్లను, ఛాందస భావాల లోపాలను చెప్పిన కవిత మాకు మేమే మీకు మీరే. మామిడికాయ పాకలు కవిత తమ బజారులో మామిడికాయల గురించి, " ఊరెళ్ళిరావడమంటే  వున్నచోట నుండి మరెక్కడో రెక్కలు కట్టుకుని వాలడమే కాదు ఒక్కోసారి చలి ఆకులు రాల్చిన కాలం చెట్టు ఒంటరి వేసవిలోకి ధైర్యంగా వెళ్లినట్టు వెళ్ళాలి " అంటూ తను రాధేయ పురస్కారం తీసుకోవడానికి రాజమండ్రి నుండి అనంతపురంకు వెళ్లి వచ్చాక రాసిన నిజాయితీ నిండిన మనసు స్పందన వెళ్లొచ్చాక కవిత.
చివరిగా మోహన్ గారి గురించి తన భావాలను స్వచంగా రాయడం...
అనుబంధాలకు సున్నితమనస్కులు అందరు దాసోహమే... శ్రీరామ్ పుప్పాల కూడా సమాజంలోని  అసమానతలను, ప్రపంచ కాలమాన పరిస్థితులను, వ్యవస్థలోని లోపాలను,రాజకీయ మోసాలను, మహిళల పట్ల వివక్షను ఇలా ప్రతి  సమస్యను అక్షరీకరించారు. కొన్ని కొత్త కవితా వస్తువులను తీసుకుని చాలా సమర్ధవంతంగా కవితలల్లారు. తేలిక పదాలతో చిక్కని భావాలు చెప్పిన అద్వంద్వం కవితా సంపుటి అందరు చదవాల్సిన పుస్తకం. ఇంట చక్కని కవిత్వం రాసిన శ్రీరామ్ పుప్పాలకు మనఃపూర్వక అభినందనలు

వై... సమీక్ష....!!

 http://m.gotelugu.com/issue317/7955/telugu-columns/spirit-of-the-ardhanarishvara-soul/

      "అర్ధనారీశ్వర ఆత్మ ఘోష....!!"

         అతి పిన్న వయసులోనే పెద్ద మనసుతో ఆలోచించగల మంచి మనసు జానీ భాషా చరణ్ తక్కెడశిలది. మానవత్వపు మూలలను తడిమే రచనలు చేయడంలో తనదైన అభివ్యక్తితో చక్కని, చిక్కని భావాలను కవితలుగా, దీర్ఘ కావ్యాలుగా, కథలుగా, వ్యాసాలుగా, బాల సాహిత్యపు కథలు, గేయాలు, విప్లవ గేయాలు, నానోలు, నానీలు, మినీలు మొదలైన సాహిత్యపు ప్రక్రియల్లో అఖిలాశ, లై అన్న కలం పేరుతో తెలుగు,హింది, ఆంగ్ల  సాహిత్యాలలో  విరివిగా రచనలు చేస్తూ ఎన్నో సాహితీ పురస్కారాలు, సన్మానాలు పొందుతున్న జాని రచనల్లో వై.. అన్న దీర్ఘ కావ్యం అరుదైన కవితా వస్తువు.
      మనిషితనంతో విధి ఆడుతున్న వింత నాటకాన్ని మనసుతో అక్షరీకరించిన "వై..." అన్న దీర్ఘ కావ్యం చదవడం పూర్తి చేసిన తరువాత కొన్ని రోజుల వరకు ఓ బాధా వీచిక  మనల్ని వెంటాడుతుందనడంలో ఎట్టి సందేహమూ లేదు. జాని ఎంచుకున్న కవితా వస్తువే వైరుధ్యమైనది. ఎవరు సాహసించని కవితా వస్తువుతో అదీ దీర్ఘ కావ్యం రాసి మెప్పించడం కష్టమైన పనే. ప్రతి పదంలోనూ ఆ మూడో మనిషి మనసు పడే బాధ, రోదన, కోపం, ఆవేశం, ఆక్రందన, తమకంటూ ఓ గుర్తింపు కోసం వారి మది పడే తపన ఇలా ఎన్నో మనకు తెలియని వైవిధ్యమైన కోణాలను మనకు, మన మనసులకు దగ్గరగా చూపించడంలో కృతకృత్యులైయ్యారు. జన్యు లోపం కారణంగా ఈ మానవ సమాజంలో తమకంటూ గుర్తింపు లేకుండా సమాజ బహిష్కరణకు గురైన ఈ అర్ధనారీశ్వరుల వేదన వర్ణనాతీతం. పుట్టుకలో లోపానికి తమ తప్పేమీ లేకపోయినా కన్నవారితోను, తోడబుట్టిన వారితోనూ, ఈ సభ్య సమాజంతోనూ ప్రతిక్షణం ఛీత్కారాలకు గురౌతూ బతుకులు వెళ్లదీస్తున్న వారి మనసులను అక్షరాల్లో అద్దంలా పరిచి వారి సమస్యలకు సమాధానం కావాలని ఈ ప్రపంచానికి వారి గొంతుకను వినిపించి తన దొడ్డ మనసును చాటుకున్నారు.
       పుట్టుక ఒకటే అయినా ఆడ, మగ, పేద, గొప్ప తేడాలున్నట్లే పుట్టుక మగతనం, కాలక్రమంలో ఆడదనపు లక్షణాలతో సగం ఆడ, సగం మగ మనిషిగా బతకడం ఎలానో తెలియక ఇంతా బయటా అవమానాలు, చీదరింపులు ఎదుర్కొంటూ బతుకు వెళ్లదీయడం ఎంత దుర్లభమో ఈ" వై..." చదువుతుంటే తెలిసింది.
"కొన్ని సమూహాలు
కాలపు పై కొనలో
ఒత్తులై వెలుగొందుతున్నారు...
మరికొన్ని సమూహాలు
కాలం పాదాల కింద
పాతివేయబడుతున్నారు...
మరి మేమూ
గగనానికి.. పుడమికి మధ్య
వేలాడుతున్నాము...!!"
అంటూ అటూ ఇటూ కాని మూడో మనిషి అంతర్నేత్రాన్ని విప్పి చూపిస్తారు.
"మాలో మేము తొంగి చూసుకున్నప్పుడు తనువులోని ఆణువణువూ మగాడిదే కానీ హృదయపు సంద్రంలో ఆలోచనలన్నీ స్త్రీతనం వైపు పరుగులిడుతుంటే అప్పుడే మాకర్థమౌతుంది మేమొక చీకటి ఆడపిల్లలమని.." అంటూ చెప్పడంతోనే జాని ఎంత బాగా వారి మానసిక స్థితిని ఆవిష్కరించారో మనకు అర్ధమౌతుంది. అయినవారు, సమాజం వెకిలి మాటలతో,  చూపులతో హింసిస్తుంటే..
"మగతనాన్ని గుమ్మాన వదిలేసి
ఆడతనాన్ని ఆవహించుకున్న శరీరాలతో
సమాజంలోకి అడుగుపెట్టాము..." అని తమ అడుగులు ఈ సమాజంలో ఎలా పడ్డాయో చెప్తారు. కన్నవారు అసహ్యించుకుంటే తమలాంటి వారే తమను అక్కున చేర్చుకుని ఆదరించారని చెప్తూ, చదువుకోవడానికి కూడా తమకెదురైన వివక్షను గురించి వీణావాణినే ప్రశ్నిస్తారు. మూడవతనంతోనున్న తమని సమాజపు కర్కశ కోరలతో కాటేస్తుంటే తమకోసం పోరాడుతున్న కొన్ని గొంతుకలు నేడో రేపో తమకు ఓ స్థానాన్ని కల్పిస్తాయన్న ఆశకు జీవం పోస్తున్నాయంటారు. తమను మనుషులుగా గుర్తించక కొందరు చిన్నచూపు చూడటాన్ని నిరసిస్తారు. అక్షరాలు నేర్వకపోయినా తమ ఆశీస్సులు ఈ మానవ సమాజానికుంటాయని తమ మంచితనపు మనసుని చాటుకుంటారు. తల్లిదండ్రులు తమను కాలపు అంచున నిలబెట్టి సమాజపు శూన్యానికి ఉరి వేస్తే ఈ బతుకుల రాజ్యాంగం తమకు మూడో అంకె కేటాయించిందని వాపోతూ, హృదయం గాయపడిన తాము ఎదురైతే నిండు మనసుతో ఆత్మీయంగా పలకరించమంటూ వేడుకుంటారు. తమ ఒంటరి పాదముద్రలఉహా పయనం అనురాగపు గమ్యానికేనంటారు. వారి చేతి చప్పుళ్ళు ఆకలి కడుపు నింపుకోవడానికంటూ చిందరవందరైన జీవితాలతో చీకటి మేఘాల్లా కదులుతూ, శూన్యంలోకి విసిరేయబడ్డ నక్షత్రాల్లా స్నేహానికై ఎదురుచూస్తున్న లోపల అంగవైకల్యులమే కానీ మనసు కోవెలకు ఏ వైకల్యమూ లేదంటూ తమ విశాల హృదయాన్ని చాటుతారు. దైవం విసిరినా దుఃఖపు పోగులతో గుండె అడ్డం ముక్కలైనా, ఆ ముక్కల్లో మానవత్వపు మనిషి కోసమే తమ అన్వేషనంటారు. వర్తమానం తెలియని చీకటి దుప్పటిలో కప్పెట్టిన తమ  జీవితాలను ఛీత్కారాల నుండి, చీదరింపుల నుండి, సమాజపు విషపు కోరల నుండి బయటకు తీయాలని, రాతి శరీరం నుండి పుట్టలేదు, తల్లి గర్భం నుండే మేము పుట్టినా మాపై ఎందుకీ వివక్ష అంటూ సూటిగా మనసులను తాకుతాయి వారి ప్రశ్నల శరాలు. సమాపు చెట్టు నుంచి రాలిన విషాదపు ఆకులమంటూ, మీ ఆపన్న హస్తాలు అందించి చేయూతనివ్వండి. మేము విశ్వా విజేతమై నిలుస్తామని తమ ఆత్మ విశ్వాసాన్ని వినిపిస్తారు. త్రిసంధ్యా కాలాలోనున్నా ఆధునిక ముసుగేసుకున్న కోరికల కామాంధులకన్నా తామే మేలని నవ్వుకుంటున్నామంటూ సమాజపు నీచపు మనస్తత్వాలపై చురకలు వేస్తారు.  ఆకలికి తట్టుకోలేక బతకాలన్న కోరిక బలంగా ఉండి, సిగ్గు విడిచి స్త్రీతనపు వాంఛను ఎరగా వేసి శరీరాన్ని అమ్ముకుంటూ, మదమెక్కిన మృగాల కామవాంఛకు, పైశాచికత్వానికి బలౌతు, రోజూ చస్తూ బతుకుతున్నామంటారు. తమని తాము చూసుకున్న ప్రతిసారి వెక్కిరించే రాతి ప్రతిబింబాన్ని చూస్తూ మగ శరీరంలో ఆడతనాన్ని అంగీకరించలేక, వ్యర్ధ పదార్ధాన్ని తీసేసే శిల్పి కావాలని నిస్సహాయంగా వాపోతుంటారు. తాము యాచించేది ఆత్మీయ స్పర్శ కోసమని కన్నీటితో చెప్తారు. ఆకాశం ఆశయమని, జీవితమే యుద్ధమని భయపడకుండా నిస్సహాయతను చంపి, చీకటి పేజీలను చింపేసి, ఈ సమాజానికి ప్రతినిధులుగా మారి, అవకాశాలు లేని తామే ఒకరికి అవకాశమై నిలుస్తామనడంలో ఎంత ఆత్మ విశ్వాసం. చిన్నప్పటి అమ్మ చేతి గోరుముద్దలు, ఆసరాగా నిల్చిన నాన్న చేతి చిటికెన వేలు, అనుబంధాల ఆత్మీయతలు, ఆ పిలుపుల కోసం తపిస్తూ ఆదరించి అక్కున చేర్చుకునే ఆప్తుల ఎదురుచూస్తున్నామంటారు. స్త్రీ కి అన్యాయం తిరిగితే ఎన్నో వేల గొంతులు తోడుంటాయి. అదే స్త్రీతత్వాన్ని మా శరీర గర్భంలో నింపుకున్న మాకు న్యాయం జ్జరగడం లేదని ఆక్రోశిస్తున్నారు. స్త్రీ పురుషులతో మాకేవి సమన హక్కులంటూ,మేము ఈ దేశపు పౌరమే అయినా ఏ ప్రభుత్వమూ మా కడుపు నింపడం లేదు. అందుకే మా దేహాలను చీకటి అంగట్లో అమ్మేసామంటారు. అసహజ శరీర మార్పులను అర్ధం చేసుకోకుండా, అసలు పేరున్నా తమకు ఈ సమాజం తగిలించిన పేరుతో, అయినవారే ఆవలి వారై అడుగడుగునా అవమానాలనెదుర్కుంటూ ఛిద్రమైన మనసులను సరి చేసే విశ్వకర్మ కావాలని వేడుకుంటున్నారు. చిట్లిన బంధాల వేర్లు అతికిస్తే వంటరితనాన్ని వదిలేస్తామంటారు. ఈ అనైతిక శక్తుల మధ్యన అస్తవ్యస్తమైనా సహజ పంచభూతాల మధ్యన సేదదీరుతున్నామంటున్నారు. తమ అవస్థలను, తమకు కావాల్సిన పరిష్కారాలను సూచిస్తూ దిగంబర అక్షరాలకు జీవం పోసి మౌనాన్ని స్మశానంలో దాచేసి, గళాలను సమాజంలోకి విసిరి, నేడో రేపో గెలుపు కోసం ఎదురుచూస్తున్న ఆశావాదులుగా చిత్రీకరించి, అద్భుతంగా ఈ మూడో తనాన్ని అవహేళన చేసే వారికి, అసలు మానవత్వాన్ని చెప్పి, మనదే కాదు సమాజం మనతోనున్న మరో తత్వానిది కూడా అని నొక్కి వక్కాణించి, వారి సమస్యలను, వేదనలను చెప్తూ, వారికి పరిష్కార మార్గాలను చూపిస్తూ, తన మనసుని ఈ " వై... " అన్న దీర్ఘ కావ్యంలో పరిచి ఎవరు చేయని సాహసాన్ని చేసిన జాని భాష చరణ్ తక్కెడశిలకు హృదయపూర్వక అభినందనలు.



      

నాన్న పచ్చి అబద్ధాలకోరు సమీక్ష..!!

  గో తెలుగు డాట్ కామ్ లో నేను రాసిన సమీక్ష ..
    http://m.gotelugu.com/issue315/7905/telugu-columns/book-review/
                                               " నాన్న పచ్చి అబద్ధాలకోరు అంటున్న సురేంద్ర రొడ్డ "
                 అనుభవాల నుండి అక్షరాల ప్రయాణం మొదలవడం కొందరి విషయంలోనే సాధ్యమౌతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తన అనుభవాలకు చక్కని అక్షర రూపమిచ్చి పలువురి ప్రశంసలతోపాటుగా తొలి కవితా సంపుటి " నాన్న పచ్చి అబద్ధాలకోరు " కు గిడుగు రాంమూర్తి పంతులు గారి పురస్కారం పొందిన ప్రతిభాశాలి " సురేంద్ర రొడ్డ ".
           
 ఈ కవితా సంపుటి లో మొదటి కవితనే తన పుస్తకం పేరుగా ఎన్నుకోవడంతో ఆ కవిత సురేంద్రపై చూపిన ప్రభావం అర్ధమౌతుంది.  నాన్న పచ్చి అబద్ధాలకోరు అంటూ తన సంతోషానికి, తన అవసరాలకు ఉపయోగపడుతూ నాన్న చెప్పిన అబద్ధాలు ఏకరువు పెడతారు. ఎంతోమంది నాన్నల మనసును తన అక్షరాల్లో చూపించి అందరి మన్ననలు పొందారు. అనాథాశ్రమం పాలైన తండ్రి, కొడుకు కోసం కన్న కలలన్ని తెలిసిన తన భార్యకు ఈ విషయం చెప్పొద్దని చెప్పడం చదువుతుంటే కంటనీరు రాక మానదు. అనాదిగా ఆటబొమ్మ కవిత ఆడపిల్ల అంటే ఉన్న వివక్షను చిన్నతనం నుండి చూపిస్తూ, కన్నపేగు కూడా మోసం చేసి వెళ్లిన తీరును చెప్తూ, మరో ఆటబొమ్మ కథ మొదలైందని చరిత్ర పునరావృతమవడాన్ని చాలా బాగా చెప్పారు. తాళి బంధంతో ముడి పడిన కొత్త అనుబంధాన్ని సర్వస్వంగా భావిస్తూ, వదులుకున్న పాత అనుబంధాలను గుర్తుచేసుకోవడం బావుంది. అమ్మ కోక అద్భుతాల నిధి, ఆనందాల పెన్నిధి అంటూ అమ్మ చీరతో పంచుకున్న అనురాగాలను, ఆప్యాయతలను వినిపిస్తారు. అర్ధాంగి కవితలో భార్యాభర్తల మధ్యన ఉండాల్సిన సున్నితత్వాన్ని, తాను నొప్పించిన విషయాలను, చెప్పని క్షమాపణలను చెప్పడం చాలా బావుంది. ఇగిరిపోవే కన్నీటిచుక్కా కవితలో ఎందరి ఆశలు ఎండమావులుగా మారాయో చెప్తారు. మరో కూలీ కవితలో అమ్మానాన్నల కష్టాన్ని కల్లు ముంతల పాల్చేస్తూ వాళ్లతోపాటు కొడుకు తానూ మరో కూలీగా మారడాన్ని చెప్తారు. చిరునవ్వు కోసం ఎదురుచూపులను, అంతరాలను, జ్ఞాపకాలను, కన్నీటి మాటలను, బాలికలను బతకనిద్దాం, శిథిలాలయం కవితలు సామాజిక చైతన్యాన్ని, మగవాడి దౌర్జన్యాలను, మనసుల అంతరాలను చెప్తాయి.  నీటి కోసం నినాదం, మరో మునిమాపు వేళ, ఎన్నాళ్ళు అయిందో, ఓ మనసా వంటి కవితలు ఆశలను, ఇష్టాలను, కోరికలను సున్నితమైన భావాలుగా చెప్తారు. వలస పక్షులు కవిత పల్లె నుండి పట్నానికి పోతున్న వలస బతుకులను, నీ నవ్వులు తప్ప కవిత ఓ ప్రేమికుడి కానుకను, ఏడవకమ్మా.... ఏడవకు కవిత జాతిని జాగృతం చేసే దిశగా, నడుస్తున్న పండ్ల చెట్టులా నాన్న కవిత పేదరికంలో కూడా బిడ్డలపై నాన్న ప్రేమ గొప్పదనాన్ని చాటి చెప్తుంది. నీవంటే..ఏమిటో కవిత నీతో ఉన్న అనుబంధాలనడుగు, నీ అంతరాత్మనడుగు నువ్వేంటో చెప్తారంటారు. పల్లెతో బంధాన్ని స్వర్గమే కనిపిస్తుంది చూడులో చెప్తారు. నేను నేనేనా ప్రియా కవితలో ఆరాధన అందరిని ఆకట్టుకుంటుంది. జంటగానే పోదాం, ఉమ్మడి కుటుంబాలు, నిజమైన నేస్తం, అనురాగపు చినుకులు, ప్రియమైన తలగడ, మైమరపు, ఇంకా ఏం మిగిలున్నానని, మనసున్న మనిషిగా, ఏమైందో, నివేదన, ప్రేమ లేఖ, ప్రేమ కుటీరం, నీకు ఏమికాని నేను, అక్షర తోరణాలు, మనసుకు తెలుసు వంటి కవితలు తనచుట్టూ ఉన్న అనుబంధాలను, అనురాగాలను, అభిమానాలను, ప్రేమలను, మనసులోని ఆరాధనను తెలియజెప్తాయి. ఎండిన గుండెలకు, మండే మనుషులకు, అనుభూతులు అరుదైన అందరికీ కోరని అమృత వర్షమే నా అక్షరాలు అంటూ తన అక్షరాల అతిశయాన్ని చెప్తారు. సాంకేతిక అభివృద్ధి, యాంత్రిక యుగపు యాంత్రిక మనస్తత్వాలను నవ నాగరికత కవితలో ఎండగడతారు. పేగు బాధల మధ్యన అంతరించిపోతున్న అనుబంధాలను, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలను ప్రశ్నిస్తూ ఇపుడెందుకు ఏడుస్తారు అంటారు. గురువు గొప్పదనాన్ని గురువుగారికి ఎన్ని రూపాలో కవితలో చెప్తారు. మరువకుమా కవితలో తాత్వికత కనిపిస్తుంది.  శాపగ్రస్తులు కవితలో ఎవరు లేక ఆదరణ కరువైన పసితనపు బతుకులను కళ్ళకు కట్టినట్టు చూపెడతారు. మొహమాటాల ముసుగులో మోసపోతూ, గుండెలో బాధను దాచుకుంటూ, సభ్య సమాజంలో బతికేస్తున్న అందరూ ఈ జీవితపు రంగస్థలంలో మహా నటులేనంటారు. ఒకే ఒక్క రోజు ఈతి బాధలు మరచి కమ్మని కలను కంటూ తన మనసుకు నచ్చినట్లుగా బతికే వరమిమ్మనడం చాలా బావుంది. మధుర భావాలు, నిరీక్షణ కవితలు మధుర భావాల ప్రేమ పలుకులు. అమ్మ మనసు పడిన బాధను, అనురాగ కడలిగా శ్రీమతిని ప్రేమగా తన అక్షరాల్లో నింపుకున్నారు. మనసా ఏమిటో నీ మాయ అంటూ అంతు చిక్కని అనంతంగా అంటారు. రాబోవు తరాలు చూడలేని మన తరపు ఆనందాలను, అనుభూతులను, అనుబంధాలను..ఇక చూడలేరేమో అంటూ వాపోతారు. మనసు మరణాన్ని చెప్తూ కన్నీటి చుక్కా కారిపోకే నను వంటరిగా వదిలి అని ప్రాధేయపడతారు. అమ్మ ఆవేదన, మా అమ్మ అమృతపు పలుకులు, అమ్మా నీకు వందనం, అమ్మ మనసులో చూడు వంటి కవితలు అమ్మ ప్రేమను, అమ్మతో పంచుకున్న అనుబంధాలను చాలా చక్కగా చెప్తారు. గురుతుండిపోవూ, ఎన్నో... ఎన్నెన్నో, ఎపుడు నను చేరునో, ప్రియా వంటి కవితలు ప్రేమ భావనలను, సున్నితపు మనసుల ఊహలను చెప్తాయి. ఆకాంక్ష కవిత సాహితీ ప్రయాణంలో అక్షరాలపై తనకున్న ఆరాధనను, తన ఆశలను చెప్తారు. నిరంతర ప్రేమికులు కవితలో ప్రతి ప్రేమికుడు కవి కాకపోవచ్చు కానీ ప్రతి కవి ప్రేమికుడే అని భలే చెప్తారు. తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఎలా చూడాలనుకున్నారో ఆశ కవితలో చెప్తారు. కొత్త రెక్కలతో ఆమె కవితలో స్త్రీ జాతి తరపున మాట్లాడతారు. దోచుకొకే కన్నీళ్లను కవితలో బతుకులో ఏది మారకపోయినా చివరి మజిలి కోసం దాచుకున్న కన్నీళ్లను దోచేసుకున్నావంటారు సరికొత్తగా. చీర అందాన్ని వర్ణిస్తారు. మగాడు కవితలో మనసున్న మారాజుగా పురుషుడిని చూపిస్తారు. శ్రీమతి సాన్నిహిత్యపు పరిమళాన్ని దివ్య పరిమళం కవితలో మనతో కూడా ఆస్వాదింపజేస్తారు. భాషకందని భావాల అన్వేషణని అంతరాత్మ వెదుకులాటగా చెప్తారు. నేనో బొమ్మలా ప్రేయసి రాకపోకలను చూస్తుండిపోయానంటారు. ప్రియమైన నేస్తం తన మనసును పంచుకున్న కాగితమని చెప్తూ అక్షరాల అభిషేకంతో కృతజ్ఞతలు తెలుపుతారు. కవిఉహలకు, ఆశలకు, ఆశయాలకు, మనసు భావాలకు, వెతల గుండెకు ఓదార్పుగా, వంటరితనానికి నేస్తంగా, ఏకాంతానికి సాయంగా అభివర్ణిస్తూ కవితను కలకాలం పచ్చగా కళకళలాడుతూ వర్ధిల్లమంటూ అక్షరాలతో వేడుకుంటారు.
            తన అనుభవాలకు, మనసు భావాలకు స్వచ్ఛమైన రూపాలనిస్తూ, కుటుంబం, సమాజం పట్ల తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ, సున్నితంగా, భావయుక్తంగా చెప్పిన మనసు రాతలు ఈ కవిత్వ సంపుటి నిండా పరుచుకుని ఉన్నాయి. అమ్మానాన్నలపై, భార్యాబిడ్డలపై వెరసి తనకు అక్షరాలపై ఉన్న ప్రేమనంతా రంగరించి రాసిన " నాన్న పచ్చి అబద్ధాలకోరు " కవితా సంపుటి ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం. అందరి మనసులకు నచ్చేటట్లుగా నిజాయితీగా రాసిన సురేంద్ర రొడ్డకి హృదయపూర్వక అభినందనలు.


1, మే 2019, బుధవారం

నా మాటలు శ్రీ శ్రీ గారి గురించి..


వేదికలెక్కి మాట్లాడటం రాని నాతో నాలుగు మాటలు మాట్లాడించిన ఘనత శ్రీ శ్రీ గారిది... ఈ అవకాశమిచ్చిన మహా న్యూస్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు...

https://m.facebook.com/story.php?story_fbid=10156663897349130&id=686274129&sfnsn=mo

దగ్గరకు తీసుకో...!!

దగ్గరగా హత్తుకో

వ్యక్తిలో మార్పుతో
వ్యవస్థను కదిలించు

మెుదటి అడుగు
నీదే కావాలని
ఎందుకనుకోవు ఎప్పుడూ

అందరు నడిచే దారిలో
నడవాలని అనుకోనప్పుడు
సవాళ్ళకు సమాధానం చెప్పే
గుండె ధైర్యం నీకుండాలి

చరిత్ర రాయాలనుకోకు
ఆ చరిత్రలో నీ పేరుండాలని
నీ బాటలో నలుగురు నడవాలన్న
సరికొత్త ఆలోచనలతో
మనసుకు పదును పెట్టు

అందలాలెక్కించినా
అధఃపాతాళానికి నెట్టేసినా
అహం నీ దరి చేరనివ్వకు
నిజాయితీని తాకట్టు పెట్టకు
ఓదార్పునిచ్చే ఆలంబనైన
అక్షరాలను విసిరేయకు...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner