29, జూన్ 2019, శనివారం

నిరీక్షణ సినిమాలో ఓ మంచి పాట...!!

https://youtu.be/83h0q__6wg4

సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే
సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
కాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం తీరందీ నేరం
సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
తానాలే చేశాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా…

28, జూన్ 2019, శుక్రవారం

ఓ చిన్న క్లారిటి..!!

నేనేదో జగన్ ని అంటున్నానని వారి అభిమానులు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ఏ ప్రభుత్వం ఎంత అవినీతి, అక్రమాలు చేసింది,  చేస్తుంది అన్నది జగమెరిగిన సత్యం. జగన్ నా శత్రువు కాదు, బాబు నా మిత్రులూ కాదు. కాని కే సి ఆర్ మాత్రం నాకు ఆజన్మ శత్రువే. తెలంగాణా మిత్రులు గమనించాలి ఇక్కడ కె సి ఆర్ మాత్రమే నా శత్రువు. ఎందుకంటే ఆంధ్రులను కూసిన కారు కూతలకు కాని, వాడిన పదజాలానికి కాని నాకెప్పటికి శత్రువే. ఆంధ్రులందరకు శత్రువని అనలేదు. గమనించగలరు. నాకు శత్రువయినా నేను ఓ విషయంలో మెచ్చుకోకుండా ఉండలేను. దీక్ష అంటూ మెుదలెడితే సాధించాలి లేదా చచ్చిపోవాలంతే.

3000 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని ఇప్పుడే టి వి లో విన్నాను. మరి సామాన్యుడి కష్టాలను తీర్చడంతో మీ పాలన మెదలు పెట్టారా.  ఒక రోజు దీక్షలు, పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, ఓదార్పు యాత్రలు మీరు లెక్కలేసుకోవడానికి తప్ప మరెందుకు పనికిరావని మనవి. వాడు కట్టింది వీడు కూల్చి, ఎవరి అవినీతెంతో లెక్కలు వేసి హమ్మయ్య అని చేతులూపుకుంటూ, జనాలకు చూపడానికి కాదు. మీ పాలన సరైనదైతే జనం బ్రహ్మరథం మీకే పడతారు. ఊరికే టి వి లో పేపర్లూపుకుంటూ చెప్తే చాలదు. అవినీతి, అక్రమాలు చేయకుండా నిజాయితీగా ఎవరి సంపాదన ఎంతో ఎవరి మనస్సాక్షికి వారికే తెలుసు.

నేను మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను.. ప్రతిపక్షంలో ఉండి అప్పటి అవినీతిని చూస్తూ ఎందుకు ఊరుకున్నారు.  మీ పాదయాత్రల్లో మీరున్నారు. కక్ష సాధింపు చర్యలు కాదు.. జనం మర్చిపోతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి దృష్టి పెట్టండి.

మరో విషయం నాకు కులగజ్జి అనుకునేవాళ్ళెవరయినా నన్ను అన్ ఫ్రెండ్ లేదా బ్లాక్ చేసుకోవచ్చు. విమర్శ సహేతుకంగా లేని ఎవరినైనా నేను బ్లాక్ చేస్తాను. కామెంట్లు తీసేస్తాను. నేను ఎప్పుడూ ఎవరి గోడ మీద వారి అభిప్రాయాలకు విరుద్దముగా కామెంట్ పెట్టలేదు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించండి.

ధన్యవాదాలు

ఏక్ తారలు...!!

1.   గోప్యత గుట్టుగానే ఉంది_ఏ బంధం ఎలా ముడిపడుతుందో తెలియక...!!

2.   రెప్ప తెరవలేకున్నా_కన్నుల మాటు నుండి కనుమాయమౌతావని..!!

3.   తోబుట్టువులైనా తోడు రాని రోజులివి_కాలానికి కనికరమేలా...!!

4.   తప్పని బాధ్యతలే ఇవి_తప్పుకోలేని బంధాల నడుమ...!!

5.   పై పై అలంకరణలదేం ఉందిలే_అలంకారాలతో కూర్చిన అక్షరాలుండగా...!!

6.   పదబంధాలంతే మరి_అక్షరాలకు అభినయం నేర్పేస్తుంటాయలా...!!

7.  పదాలన్నీ పారాడుతున్నాయి_పసితనపు అల్లరి గుర్తొచ్చింది కాబోలు...!!

8.   పరాజయానికి పంతమెక్కువ_గెలిచి చూపిస్తుంది...!!

9.   నా అక్షరాలకు తెలుసు_నన్నెలా చూపాలో..!!

10.    వీధికుక్కకి విశ్వాసమెక్కువ_మృగరాజుకి మృగత్వమే జాతి లక్షణం మరి..!!

11.   జీవిత పుస్తకమే అంత_అనుభవాల పుటలతో పేజీలు నింపేస్తూ..!!

12.   సుతారంగా మీటానందుకే_ఉలికిపడి నిదుర లేస్తావని...!!

13.  లిఖితమే సరిలేదు_ఎన్నో ఇజాల నిజాలను లిఖించాలన్న కోరికున్నా..!!

14.   కలకు మెలుకువ వచ్చిందట_ఇలలో నీతో ముచ్చట్లాడాలని...!!

15.   కలలు లేని జీవితమిది_ఎల్లలుండని సంద్రాన్ని దాటాలనుకుంటూ...!!

16.  కదిలించే కథలెన్నో_కనిపించని మనసుల వెనుక..!!

17.   మాటలెక్కువయ్యాయి_మనసు కుదుటబడి..!!

18.   మాసిపోని చెమరింతలే అవి_తడిమే గురుతులకు ఓదార్పునిస్తూ...!!

19.    వినిపించని వేదనలెన్నో_చిరునవ్వు మాటున దాగుండి..!!

20.   మనసు జ్వలనమెా నిరంతర ప్రక్రియ_అక్షరాల హారతిలో...!!

21.   కోతలెక్కువయ్యాయి_అధికారమిచ్చిన అహంతో..!!

22.   అక్కరకు రాని అనుబంధాలెన్నో_మక్కువలకు మారు మాట చెప్తూ..!!

23.   అక్షరాలు కుదురుగా ఉండట్లేదు_గాయాలను గేయాలుగా మలిచే వరకు..!!

24.   అర్ధనారీశ్వర తత్వానికే అవమానం_తామేంటో తెలియని ముఖాలకి...!!

25.   ఆకాశం ఘనీభవించింది_విషపు కోరల వత్తిడికిలోనై...!!

26.  భరించలేని రోదనలే అన్నీ_మౌనం మాట్లాడితే...!!

27.    నిరంతరాయంగా శ్రమిస్తోంది శరీరం_మానసిక రోగుల స్వస్థతకై....!!

28.   వ్యధల ఉరవడి ఎక్కువైంది_వనవాసానికి చేరిన వనితకు..!!

29.   అక్షరాల ఆంతర్యమది_భావాలకు మాత్రమే అవగతమౌతూ...!!

30.   అలవాటైతే చాలు_అక్షరాలు అల్లేసుకుంటాయి అలవోకగా..!!

27, జూన్ 2019, గురువారం

ఏం జరుగుతుంది..!!

నేస్తం,
  ఏమి జరగదు మనమున్నా, పోయినా ఎవరికి ఎలాంటి నష్టము లేదు. పైపెచ్చు సంతోషం కూడానూ. ఎందుకంటావా..ఏం చేసినా అడిగేవారుండరు, ఆరాలు తీసేవారుండరు, దేనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండదు.. ఇలా బోలెడు ప్రయెాజనాలున్నాయి ఒక్క మన చావుతో. కాని తెలియదనిదల్లా ఒక్కటే. రేపటి రోజున మన చావు కూడా నిజాలు మాట్లాడుతుందని. మనం నమ్మిన అక్షరం సాక్షిగా...ప్రపంచానికి ఎవరేంటో తెలియజెప్తుందని..ఐనా దీని వలన మనకు వచ్చే లాభమేమి ఉండదు. ఓ క్షణం అయ్యెా పాపం అంటారు కాస్త మానవత్వమున్న వారు. అదీ లేని వారు మరో మెాసానికి సమాయత్తమౌతారు, ఈ చావును కూడా వ్యాపారంగా మలచుకుంటూ...!!

మరణం మాట్లాడుతుందట...!!

నీకు తెలుసా
మరణం కూడా
మాట్లాడుతుందట

మన తప్పొప్పుల
లెక్కలన్నీ బేరీజు వేసే
సమయమప్పుడిస్తుందట

బంధాలకు బాధ్యతలకు
మనం పూసిన తేనెను
ఒలికించే ప్రయత్నం చేస్తుందట

అహానికి అధికారానికి
చరమగీతాన్ని రాసేసి
చివరి చరణం పాడుతుందట

కపటానికి కాయానికి
మధ్యనున్న ప్రేమను
తెలియజేస్తుందట

అటు ఇటు వెరసి
మనమేంటో
మన చావు చెప్తుందట..!!

21, జూన్ 2019, శుక్రవారం

అవార్డుల కబుర్లు...!! జీవన "మంజూ"ష (జులై )....!!

నేస్తం, 
      తెలుగు సాహిత్యంలో ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే అవార్డులు, బిరుదులు ఎలా తెచ్చుకోవాలి. చాలా బావుంది కదా ఈ చర్చ కూడా.  అసలు అవార్డులు ఎలా వస్తాయి? వాటికీ ఉండాల్సిన అర్హతలు ఏమిటి అని తెలియని వారి కోసం చేసిన చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.
       ఒకప్పుడు రచయితలంటే చాలా గొప్పగా ఉండేది, సినిమా వాళ్ళతో పాటుగా వీళ్లకు కూడా అంతే క్రేజ్ ఉండేది. ఈ అంతర్జాల మాయాజాలం వచ్చాక సాహిత్యం అదీ తెలుగు సాహిత్యం ఎంత వింత పోకడలు పోతోందో మనందరికి తెలియని విషయమేం కాదు. అవార్డుల కోసం అప్పటికప్పుడు పుస్తకం వేసేసి అవార్డులు తెచ్చుకున్న వారు ఇప్పుడు కోకొల్లలు. ఒక అవార్డు రావాలంటే కనీసం ముద్రితమైన పుస్తకం ఒకటి ఉండాలన్న నియమం కూడా ఇప్పుడు లేనట్టుగా ఉంది. అవార్డు కమిటీలో ఎవరో ఒకరు తెలిసుంటే చాలని ఎంతోమంది అవార్డు గ్రహీతల ద్వారా తేటతెల్లం అయ్యింది. మందు పార్టీలు, రాసుకుపూసుకు తిరగడాలు, డబ్బులు వెదజల్లడాలు ఇలా అనేక దారులు మన తెలుగు సాహిత్యంలో తెరుచుకోబడ్డాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
      ఇక పురస్కారాలు, సన్మానాలు, బిరుదులు వగైరాల కోసం ఏమాత్రం కష్టపడనక్కరలేదు. 1000, 2000 రూపాయల నుండి అందరికి అందుబాటు ధరలలోనే ఉన్నాయి. పక్కన డాక్టరేట్ పెట్టుకోవాలన్నా కూడా ఏమాత్రం శ్రమ పడనక్కరలేదు. ఓ 70, 80 వేలలోనే చాలా చవక ధరలకే తెలుగు సాహిత్యపు మార్కెట్ లో సరసమైన ధరలకే దొరుకుతున్నాయి. ఒక్క రాత్రిలోనే సంచలనాలు సృష్టించాలంటే ఏదో ఒక మతాన్ని హేళన చేస్తూ నాలుగు ముక్కలు రాయడమో, లేదా అంగాంగ వర్ణనలు చేస్తూ పచ్చిగా భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రదర్శిస్తే చాలు. కావాల్సినంత పేరు, కీర్తి వచ్చి పడతాయి. వీటితోపాటుగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు, అనేక పేరున్న పెద్ద పెద్ద సాహితీ సంస్థల నుండి బిరుదులు, సన్మానాలు కుప్పలుతెప్పలుగా వచ్చి చేరి మీ సాహిత్యానికి వన్నె తెస్తాయి.
        ఇంతకీ సంక్షిప్తంగా అవార్డులు, బిరుదులు కావాలంటే..నే చెప్పోచ్చేదేటంటే పార్టీలు, ఫంక్షన్లు బాగా చేయడంతోపాటుగా పెద్దలకు కాస్త అందుబాటులో ఉంటూ, వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతుంటే చాలు. వీటితోపాటుగా డబ్బులు పంచగలిగితే కోరుకున్న అవార్డు, బిరుదు మీ సొంతమే. దీని కోసం కష్టపడి రాయనక్కరలేదు, పుస్తకాలు ముద్రించనక్కరలేదు. మరెందుకాలశ్యం ఎవరికేది కావాలో తెచ్చేసుకోండి. 

లైఫ్ హాలిడే సమీక్ష...!!

                                  ఆలోచన రేకెత్తించే అక్షరమాలి " లైఫ్ హాలిడే "

                   ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ గత పదేళ్లుగా కవిత్వం రాస్తున్న అక్షరమాలి సురేష్ తన కవితలను ఓ పుస్తకంగా తేవడం అభినందనీయం. పలు సాహితీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తెలుగు సాహిత్యానికి తన వంతుగా సేవ చేస్తూ బాల కవులను తీర్చిదిద్దుతున్న సాహితీ సేవకుడు కొత్తపల్లి సురేష్.
                      అమ్మ కథలను, అమ్మ పాడే శ్రావ్యమైన సుప్రభాతాన్ని, నాన్నపై  అమ్మ అనురాగాన్ని, పూలతోటలో అమ్మ రాణి వాసాన్ని, ఆరుబయట వెన్నెల్లో వెలుగురవ్వై అమ్మలక్కలతో గొంతు కలిపి అమ్మ పాడే పాటను విని ఎన్నిరోజులైందో అమ్మను చూసి అంటూ అమ్మ జ్ఞాపకాలను మనకూ గుర్తుకు తెస్తారు. నెత్తురు దానం చేసినంత సులభంగా నదిని దానం చేశాం అంటూ అదృశ్యమైన నదీప్రవాహంలో మన సంస్కృతి ఒక శిథిలనౌక అంటూ మరో మొహంజోదారో కవితలో వాపోతారు. శ్వేత రుధిరధార కవితలో కంటిలోని చుక్క వేదనను గతం పూసిన జ్ఞాపకాల అంచులలో నుంచి అందరు రాలిపోతుంటే, దుఃఖపరాగం దేహాకాశమంతా పరుచుకున్నాక చిల్లులుగా కురుస్తున్న నెత్తుటి తారల నడుమ రాలక మిగిలిన మింటిచుక్కను నేనంటూ సరికొత్త అభివ్యక్తిని వెలిబుచ్చారు. పల్లెను వాడాలి వచ్చిన పరిస్థితులను, నగర యాంత్రిక జీవితంలో యంత్రాలుగా మారిపోయినా అప్పుడప్పుడు మదిలో మిగిలిన జ్ఞాపకాల శకలాలను శకలాల మూట కవితలో గాయాలను కూడా హృద్యంగా చెప్తారు. ఇప్పటి పల్లెల్లో ఉగాదికి కొత్త నిర్వచనాన్ని ఇన్ క్రెడిబుల్ ఫెస్టివల్ కవితలో చెప్తారు. తరిగిపోతున్న విలువలను పిల్లలకు ఎలా చెప్పాలో తెలియని  స్థితిలో తనలోని స్ఫూర్తి ఓ యానకంగా మారి విజయం గుండెల మీద నవ్వుల జెండాను నాటి వద్దాం అంటూ కొత్తపాఠం కవితలో పిలుపునిస్తారు. రేపటిపొద్దు కవితలో అమ్మ ఒడి లాంటి బడి గురించి అద్భుతంగా చెప్తారు. రాతిరిలో కరువైన నిదురను తల్చుకుంటూ సాగిన ఆలోచనల అనంత ప్రయాణంలో అనుభవాల సారాన్ని చెప్తూ అలవోకగా అనంతసాగరానికి జత చేస్తారు. కనీసం ఒక్క రోజైనా ఆడదానికి, ఆమె కష్టానికి, త్యాగానికి విలువనిద్దాం అని ఆమెకు సెలవిద్దాం కవితలో పిలుపునిస్తారు. పల్లె ఫిలాసఫీని, పల్లె  అందాలను, పల్లె తీర్చిన జనావసరాలను చెప్తూ, ఇప్పటి పల్లె దుస్థితిని కళ్లముందుంచుతూ ఒక కార్పొరేట్ స్మశానవాటికగా మారిపోయి, తిరిగి మొలకెత్తడానికి చోటు దొరకక కుళ్లిపోతున్న శవంగా మారుతున్న రైతు లైఫ్ హాలిడే ప్రకటిస్తున్నాడని వాస్తవాలను కళ్లకుకట్టినట్టుగా ఈ కవితా సంపుటి పేరైన లైఫ్ హాలిడే కవితలో చాలా చక్కగా చెప్తారు. లోకం ఒక దేహాల సంత అంటూ లోకపు తీరును చెప్తారు. పల్లె నుండి బతుకుదెరువుకు పట్నం వచ్చిన వలస కూలీల జీవితాలను ఊరిచివరి ఆకాశం కవితలో మనసుకు హత్తుకునేటట్లు చెప్తారు. ముసుగుల మనుష్యుల మొహాల దేహాల భాషను దేహభాష కవితలో నిర్మొహమాటంగా చెప్తారు. వాన రాకతో రైతు, పంట పొలాల ఆనందాన్ని వానచెట్టు కవితలో చెప్తారు. " నీకు నాకు మధ్య ఎడతెగని చీకటివాగులాగా ఈ రేయి" అంటూ ఘనీభవించిన రేయిలో ఓ దూరమైన జ్ఞాపకాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో నిరీక్షణను అందంగా చూపిస్తారు. పదనిసలు కవిత కొత్తగా ఉంది. కార్పొరేట్ బడి ఒక వింత రాకాసి, కాసులను పీల్చే ప్రైవేటు ప్రేయసి అని చెప్తారు. ఆసుపత్రి గీతం కవిత ప్రతో ఒక్కరి మనసు చప్పుడే అని అనిపించక మానదు. ఆకలి అమ్మ రెప్పలమాటున నొక్కిపట్టిన కన్నీటిచుక్క అంటూ ఆకలి రూపాలను వర్ణిస్తారు హంగ్రీ స్టోన్స్ కవితలో.  నాయిన కవిత ప్రతి ఒక్కరి నాన్నను గుర్తుకు తెస్తుందనడంలో సందేహం లేదు. పఠనకాంతి కవిత తీరని ఆశల కలలను చెప్తూ విలువలను, సిద్ధాంతాలను, వాదాల్ని, నినాదాల్ని నమ్ముకున్న మనిషిని తనకు తననే కాందిశీకుడ్ని చేసిన స్థితిని చెప్తారు. నిద్రఅద్దం పెళ్ళున బద్దలయ్యింది అంటూ చీకటి స్వప్నాల భయాన్ని లిప్త కవితలో చెప్తారు. రకరకాల మనుషుల మనస్తత్వాలను కొందరు మనుషులుంటారు కవిత చెప్తుంది. అతడు - ఆమె కవిత చేజారిన జీవితపు జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. కన్నీటి లిపి కవిత మనసు సేద దీరే క్షణాలను తెలుపుతుంది. ఎన్నికల హడావిడి, హంగామాలను నేల నవ్వింది కవిత చూపిస్తుంది. బంతిపూల నవ్వులతో కవితలో ఇల్లాలి త్యాగాన్ని గుర్తుజేసుకుంటారు. పాదప్రమిదలు ప్రేయసి రాకను, కౌముది కవిత నాగేశ్వరాచారి గారిపై తన మనో భావాలను,  నువ్వు విడిచిన వేలు నేను కవిత తన అన్నయ్య  కొత్తపల్లి నరేంద్రబాబు గారి కోసం రాయడం చాలా బావుంది. నది వెళ్ళిపోయింది, నావ వట్టిదేనని తేలిపోయింది అంటూ ఎదురుచూపుల నిరీక్షణను చెప్తారు. పూలవాన ప్రేమను, బహుళం, అతడూ మనిషే, నేలమాలి, పంచకం వంటి  కవితలు పేదోడి బతుకు నిర్వచనాన్ని, త్యాగ గుణాన్ని, కార్పొరేట్ అధికారానికి మోసపోయిన బతుకులను చెప్తాయి. సాయిబాబు గారి కోసం చలి కవిత, ఎ రెయినీ డే కవిత నగరంలో వాన మొహం మొత్తే చేదు గుళిక అని ఆ కారణాలను చూపిస్తారు. సత్యం హత్యకు గురైన సీమ నది అంటూ మరికొన్ని పోలికలను చెప్తారు. నది ఎండిపోయాక కూడా రాజకీయపు అధికారానికి మాత్రమే పచ్చనోట్ల తడితో వాళ్ళ పొలాలు మాత్రమే పచ్చగా ఉంటాయని, మిగిలిన భూములన్నీ మండే ఎండను పండించే ఇసుక గుండెలని, వట్టి కలలే కాని నీళ్ళు అందవని నది వెళ్ళిపోయాక కవితలో సీమ రైతుల అవస్థలను చెప్తారు.
       సామాజిక చైతన్యంతో సీమ రైతుల కష్టాలను, కన్నీళ్ళను, వేదనలను, కలలను, ఆశలను, వ్యవస్థలో లోపాలను, ప్రేమను, విరహాన్ని, నిరీక్షణను, ఇల్లాలి గొప్పదనాన్ని, త్యాగాన్ని, ఆడదాని విలువను, అమ్మానాన్న, పల్లె జ్ఞాపకాలను, కార్పొరేట్ దందాలను ఇలా తాను చూసిన, అనుభవించిన ప్రతి అంశాన్ని చక్కగా అక్షరీకరించి లైఫ్ హాలిడే అంటూ మనకు ఆహ్లాదంతో పాటుగా, మన మనసుల్లో కూడా కాస్తంత ఆలోచనను రేకెత్తించారు అనడంలో అతిశయోక్తి లేదు. చక్కని భావాలను అందించిన " అక్షరమాలి " కొత్తపల్లి సురేష్ కి హృదయపూర్వక అభినందనలు. 

మనిషి కనబడుటలేదు పుస్తక సమీక్ష...!!

   
http://m.gotelugu.com/issue318/7974/telugu-columns/book-review/ 

     " సమాజంలో మనిషి కోసం వెదుకులాటే ఈ మనిషి కనబడుటలేదు కవిత్వం..."           
                   బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు భాషాభిమాని, నిరంతర సాహిత్య సేవకులు గుడిమెట్ల చెన్నయ్య గారు రచించిన మనిషి కనబడుటలేదు కవిత్వ సంపుటి నిండా తరిగిపోతున్న మానవత్వపు విలువల కోసం తపిస్తున్న ఓ మనసు కనిపిస్తుంది. అంతరించిపోతున్న తెలుగు బీభత్స కోసం పరాయి రాష్ట్రంలో ఉన్నా మూలలను మరువక, తెలుగు భాషపై మమకారంతో ఎనలేని సేవ చేస్తున్న సాహితీ సంపన్నులు గుడిమెట్ల చెన్నయ్య గారు
                మనిషిలోని అంతర్గత ఆలోచనలను, అంతర్ముఖాన్ని చూపిన కవిత నిన్న అలా... నేడు ఇలా, ఆ క్షణం  కవితలు. ముసుగు వేసుకున్న ఎన్నో మనసులకు సాక్ష్యం ఈ కవిత. పసితనంలో తాతయ్య చెప్పనా సుద్దులు విన్న చిన్నపాప పెద్దదై అందుకున్న విజయాన్ని చూడలేని తాతయ్యను తల్చుకున్న పసి మనసు రాడా నాన్నా కవితలో కనిపిస్తుంది. నిజం కవితలో చెప్పినవన్నీ అబద్ధాలైనా ఈ తనువంతా నీదేనన్న నిజం గుర్తించమంటూకవితాత్మకంగా చెప్పడం చాలా బావుంది.  కవిత్వమంటే ఎలా ఉండాలో చెప్పే కవిత ప్రతిధ్వనించాలి. మంచి, మానవత్వం గురించి నాన్న చెప్పినది ఆచరించిన కొడుకు, సమాజంలో ఎదుర్కున్న అవహేళనలను, మానసిక వేదనను తండ్రికి చెప్పుకోవడం, ప్రశ్నించడం మనకు ఈ సమాజంలో ఎంతోమందిని చూపెడుతుంది. మళ్ళీ రా.. సినారే కవితలో సినారే గారిని గుర్తు చేసుకోవడం చక్కగా ఉంది. కదలిసాగు సోదరా కవిత మనిషి ఎలా ఉండాలో చెబుతుంది కాస్త ఆవేశంగా శ్రీ శ్రీ గారిని గుర్తు చేస్తూ. తరిగిపోతున్న మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ నిరాశ్రయానికి ఆశ్రయమిచ్చిన వల్లకాడుని, నిర్జీవ సమాజాన్ని చాలా బాగా చూపించారు కాస్త చోటివ్వు కవితలో. మామిడిపండు తినాలన్న కోరికతో ముదుసలి చేసిన కసరత్తు, పిల్లవాడు కోసిచ్చిన మామిడిపండు తింటూ ఆ తాతకు గుర్తుకొచ్చిన తన వయసు వయసుడిగిన సంగతి కవిత చెప్తుంది. తెలుగు భాషోద్ధారకులమంటూ విర్రవీగే కొందరికి చెంపపెట్టు పండితులు వీరు, తెలుగు భాషోద్ధారకులు వీరు అన్న కవిత. అంతరించిపోతున్న సంస్కృతులను, పెల్లుబికుతున్న కుల,మత విద్వేషాలను పారద్రోలమని రాబోతున్న వత్సరాన్ని కోరుకుంటూ స్వాగతం మన్మథా..సుస్వాగతం అంటారు.  అతివ సహనానికి ఓ హద్దుంటుందని హద్దు కవిత చదివిన ఎవరికైనా తెలుస్తుంది. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమ దాడులను ప్రశ్నిస్తుంది మానవత్వం - మంచితనం, మానవత్వం, ఉన్మత్తుల మదమణచు, వీడు మారేదెప్పుడు కవితలు. మగువ మనసు ఏమిటో చెప్తుంది నీ హృదిలో " రవ్వంత చోటిస్తే చాలు " మరే కోరికలు లేవు, గువ్వలా ఒదిగిపోతానంటూ పరవశమౌతుంది. మగువను పై పై మాటలకు, చేష్టలకు మోసపోవద్దంటూ ఓ హెచ్చరిక చేస్తారు ఆలోచించు కవితలో. సమాజంలో మనుష్యులలో నశిస్తున్న మానవత్వాన్ని ప్రశిస్తారు దయా రహితులు కవితలో. కనుమరుగైపోయిన రిక్షావాడిని, కష్టాన్ని, డబ్బున్న వాడి మోసాన్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చారు తన అక్షరాలతో రిక్షావాడు కవితతో. సహజత్వాన్ని కోల్పోతున్న మన బతుకులకు అద్దం పట్టారు ఈ సహజమైనదే ముద్దు కవితలో. కపటపు ప్రేమ మాయల, మత్తు గురించి వివరిస్తారు ఎన్నాళ్ళీ మాయమాటలు కవితలో. సహనంతో సాహసాన్ని ఊపిరిగా చేసుకుని ఆయుధాన్ని ఆయుధంగా మార్చుకుంటూ ధైర్యంగా సాగిపొమ్మంటారు అధైర్య పడకు చెల్లీ కవితలో. ప్రతిభను గుర్తించలేని మన భరతావని దుస్థితిని గూర్చి బాధను ఇది నా భారతదేశం కవితలో చెప్తారు. మనసున్న మనిషిని ప్రసాదించమని శ్రీ విరోధికి స్వగతం పలుకుతారు. మనిషిలోని మృగత్వాన్ని ఎత్తి చూపుతూ అంతరించిపోతున్న మానవత్వానికి ఘోషిస్తూ " మనిషి కనబడుటలేదు అన్న కవితలో కవి వాపోతారు. ఈ కవితా సంపుటికి కూడా ఈ కవిత పేరు పెట్టడంలో అంతరార్థం మనకు అర్థం ఆయుతుంది. కవికి సమాజం పట్ల, మానవ సంబంధాలపై ఉన్న ఇష్టాన్ని, తన కళ్ళ ముందు జరిగిన సంఘటనలకు సాక్ష్యాలుగా తన అక్షరాభావాలతో మనతో పంచుకున్న మనసు కనిపించేటట్లు చేయడం, సరళమైన భాషతో, చక్కగా చదువరులకు అర్ధం అయ్యేటట్లుగా రాసిన వచనం అభినందించదగ్గ  విషయం. తలెత్తుకు తిరగాలి అంటూ సాంప్రదాయ వస్త్రధారణ విలువను మహిళలు గుర్తించాలంటూ, అరకొర వేషధారణలను వద్దంటూ హితవు చెప్తారు. మంచితనానికి ఫలితాన్ని, విశ్వాస ఘాతకుడి తీరును, రాతల విషయంలో జరుగుతున్న మోసాలను, నాయకుల కల్లబొల్లి మాటలను, అత్యాశకుబోయి మోసబోయిన జీవితాలను, మగాడి నిరంకుశత్వాన్ని, బతుకుదెరువుకు కొలువు కోసం వెళ్లిన మగువకు ఎదురైన కామాంధుడి కోరికను, పండుగ సందడికి వెచ్చాల కోసం కిరాణాకొట్టుకు వెళ్లిన పసివాడిని చేసిన మోసం, ఆసిఫా కోసం రాసిన విచక్షణ కవిత, మనమెలా బతకాలో చెప్పిన మంచి సుద్దుల కవిత ఆచరించి చూపుటయే మిన్న. తెలుగు భాష కీర్తి కోసం తపన అభిలాషలో చెప్తారు. ఆకాంక్షను, శుభ సందేశ గీతికను చివరిగా వినిపిస్తూ చక్కని భావాలను, వచనాన్ని అందించిన మానవత్వపు విలువల మంచి గంధం ఈ మనిషి కనబడుటలేదు కవితా సంపుటి. తెలుగు భాషపై మక్కువ గలిగిన మానవతావాది గుడిమెట్ల చెన్నయ్య గారు తమ మనసు స్పందనలను, తెలుగు భాషపై మమకారాన్ని, సమాజంలో మనిషి కోల్పోతున్న విలువలను ఈ కవితా సంపుటిలో పొందుపరిచారు. ప్రతి ఒక్కరు చదవదిగిన కవితా కుసుమాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. తేట తెనుగు వచనాన్ని రాసిన గుడిమెట్ల చెన్నయ్య గారికి అభినందనలు. 

జీవన "మంజూ"ష.. !! ( జూన్)

నేస్తం, 
     కొన్ని జీవితాలింతేనేమో. తాము సంతోషంగా ఉండలేరు, తన అనుకున్నవారిని సంతోష పెట్టలేరు. లేని పెద్దరికాన్ని తమకు తాము ఆపాదించేసుకుంటారు అహంకారానికి గుర్తుగా, కాని బాధ్యతలకు మాత్రం దూరంగా బతికేస్తూ కుటుంబ బాధ్యతలన్ని తామే మోస్తున్నట్టుగా నలుగురిలో చెప్పుకుంటారు. బాధ్యతలకు అక్కరకు రాని పెద్దరికం, హక్కులలో ముందుంటుందనుకుంటా. మనిషి జీవితంలో బాధ, సంతోషం ముఖ్యమైనవి. సంతోషంలో ఉన్నప్పుడు మనచుట్టూ ఎవరున్నా లేకున్నా పర్వాలేదు. అదే బాధలో ఉన్నప్పుడు మన అనుకున్న నలుగురి కోసం వెదుక్కుంటాము, కాని మనం ఎదుటివాళ్ళ కష్టంలో ఎంతవరకు పాలుపంచుకున్నామో గుర్తుకు రాదు ఆ సమయంలో. పెద్దలు చెప్పిన సద్దిమూటను " ఆ ఇల్లు ఈ ఇంటికెంత దూరమో ఈ ఇల్లు కూడా ఆ ఇంటికంతే దూరమని " మర్చిపోతే ఎలా? డబ్బే లోకంగా బతికేస్తూ అనుబంధాలు అవరార్థమే అనుకుంటే మనం పోయిన నాడు కరువయ్యేది కూడా " ఆ నలుగురే " అన్న మాట గుర్తు చేసుకుంటే బంధాలు ఇలా వెలవెలబోయి వెలిసిపోవు.
       కుటుంబంలో పెద్దరికమన్నది పిల్లలు తప్పు చేస్తుంటే సరిదిద్దేదిగా ఉండాలి కాని ఆ పిల్లలే మన తప్పులను ప్రశ్నిచేంతగా, మన ప్రవర్తన ఉండకూడదు. బాధ్యతారాహిత్యం చాలా ప్రమాదకరం. నాలుగు మాటలు నలుగురికి చెప్పేస్తుంటాం కాని ఆ నాలుగు మాటల్లో ఎన్ని మనం పాటించి ఎదుటివారికి చెప్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోలేం. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకునే ధైర్యం మనవద్ద లేదు కనుక. ఎదుటివారిని తప్పు పట్టేముందు మనమెలా వారితో ఉంటున్నామని మన మనస్సాక్షిని అడిగితే అది చెప్పే సమాధానాన్ని ఒప్పుకోగలమా నిజాయితీగా...! మన అవసరాలే వారికి ఉంటాయని, మనకూ వారితో అవసరాలుంటాయని మర్చిపోయి ఏకాకుల్లా బతికేద్దామని నిర్ణయించుకుంటే ఎవరు చేయగలింది ఏమి ఉండదు. కుటుంబ విలువలు నాశనం, తద్వారా సమాజంలో నైతిక విలువల పతనానికి మనమూ ఓ చేయి వేసినవారమౌతున్నాం. మార్పు అనేది మంచికి దారి తీయాలి కాని చెడుకి కాదు అని మన ప్రవర్తన ఋజువు చేయాలి. కుటుంబ హితమే సమాజ హితమని నమ్మిన నాడు సమాజంలో ఓ మంచిపనికి మనమే పునాదిరాయిగా మారతాం. అంతరించి పోతున్న కుటుంబ విలువలు నిలబడాలని కోరుకుందాం. 

స్వప్న మేకల..!!

                " ఆనతికాలంలోనే అందరి మనసులను దోచిన స్వప్న మేకల కవిత్వం...!! " 
                     ఏళ్ల తరబడి రాస్తున్నా కొందరికి వారు రాసే దానిపై స్పష్టమైన అవగాహన ఉండదు. అది వ్యాసమో కవిత్వమో కూడా తెలియని పరిస్థితిలో, నేడు ముఖ పుస్తకంలో వస్తున్న పుంఖానుపుంఖాల కవిత్వపు తీరుతెన్నులు మనకు తెలియనివేం కాదు. అతి తక్కువ కాలంలో కవిత్వంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కవయిత్రులలో స్వప్న మేకల ఒకరు. కవిత్వం రాయడం మొదలుబెట్టిన తొలినాళ్ళ నుండే తనదైన శైలితో చదువరులను ఆకట్టుకుంటున్న అతి తక్కువమందిలో స్వప్న మేకల కవిత్వం ఒకటి. చక్కని తేలిక పదాలతో చిక్కని భావాలు అందిస్తూ ఎందరి మనసుల్లోనో తనదైన ముద్రతో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. 
               సమాజంలో సమస్యలు, మన చుట్టూ తిరుగాడుతున్న ఎన్నో సందేహాలు, బంధాలు, అనుబంధాలు, మానవ సంబంధాలు, అమానవీయ కోణాలు ఇలా చెప్పుకుంటూపోతే ప్రపంచంలోని ప్రతి సందర్భమూ ఆమెకు ఓ కవితా వస్తువే. రేయి పగలు నడుమ చెమట చుక్కల లెక్కలు వేసే రైతు శ్రమ, కార్య దీక్ష, పట్టుదల, నిరాశలను వెరసి సగటు రైతు ఆంతర్యాన్ని అద్భుతంగా శ్రమ గీతం కవితలో చూపిస్తూ మనల్ని చివరి వరకు చదివిస్తారు. పరవశం కవితలో వివశత్వానికి, ఎదురుచూపుల నిరీక్షణకు మధ్యలో కొత్త ప్రపంచాన్ని స్వాగతించే ఆశలను అందంగా వినిపిస్తారు. తప్పిపోయిన జీవితం కవిత ఇప్పటి వలసల జీవితాలకు అద్దం పడుతుంది. ఈ కవిత గురించి చెప్పడం కన్నా ప్రతి ఒక్కరు చదివితేనే బావుంటుంది. దూర దేశాలకు వలస పోయిన మనుష్యుల మనసుల మానసిక స్థితి గురించి అద్భుతంగా చెప్పారు. కాలపు నీడకు పుట్టిన నిర్మానుష్య దేహమిది అని ఎడారి వనం కవితలో ప్రకృతి వైపరీత్యాలను, తదనుగుణంగా జరుగుతున్న పరిణామాలను వివరిస్తారు. అమ్మను అమృత వర్షిణిగా అభివర్ణిస్తూ అమ్మ ప్రేమను అక్షరాలతో మనకు అందిస్తారు. వీరి కవిత్వ భావ పఠిమకు ఇవి కొన్ని  ఉదాహరణలు మాత్రమే. 
    మనసులోని భావాలను చెప్పడానికి రచయితలు పలు ప్రక్రియలను ఎంచుకుంటున్నారు నేడు. వాటిలో లఘు కవితలు ఒకటి. వీరు ఈప్రక్రియలో రాయడంలో కూడా దిట్టే. వాక్యం రసాత్మకం కావ్యం అన్న మాట ఎంత నిజమో ఈ చిన్న కవితాత్మక వాక్యం చూస్తే మీకే అర్థం అవుతుంది. 
" నిన్నొదలి వెళ్ళలేకనే...
శిశిరంలో రాలిపోయిన వసంతమల్లె చిగురిస్తుంటాను..!! "
 విభిన్న ప్రక్రియలలో తనదైన భావుకత్వంతో, వాస్తవ పరిస్థితులకు తగినట్టుగా కవితా వస్తువుల ఎంపికలో, లోతైన అభివ్యక్తితో చక్కని చిక్కని కవిత్వాన్ని తేలిక పదాలతో వెలువరిస్తూ అతి కొద్దీ కాలంలోనే ఎందరో అభిమానులను సంపాదించుకున్న భాగ్య నగర వాసి స్వప్న మేకల మరిన్ని కవితా కుసుమాలతో అందరిని అలరించాలని కోరుకుంటూ... వారి తెలుగు సాహితీ వెలుగులకు హృదయపూర్వక అభినందనలు.. 

లోకం పోకడ..!!

నేస్తం, 
అంటే అన్నానంటారు గానండి...కాస్త నిజాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయండి. మీలో చాలామంది పేరున్న డాక్టర్లున్నారు. క్రింద ఒక రిపోర్ట్ పెడుతున్నాను. సమస్య గురించి మీకు తెలిసింది చెప్పండి.
పెద్ద హాస్పిటల్, తెలిసినవాళ్ళు అని వెళితే 10000 తీసుకుని టెస్ట్ చేయకుండానే చేసామని చెప్పి, ఈ టెస్ట్ లో సరిగా రాలేదు మరో టెస్ట్ చేద్దామంటూ, కనీసం సి టి స్కాన్ రిపోర్ట్స్ కూడా సరిగా చూడని నలుగురు డాక్టర్లు...ఆఖరుకి మనమే ఫలానా అని ఉంది చూడండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈనాడు.
మరో హాస్పిటల్ లో కిడ్నీస్ లో రాళ్ళున్నాయని చిన్న హోల్ వేసి లేజర్ రేస్ తో పగలగొడతామని చెప్తే, సరేనని వెళ్ళితే స్టంట్ వేయాలి ముందు, తర్వాత 15 రోజులకి ఒకటి పగలగొడతాము.. రెండోది మరోసారని చెప్తే ఏం చేయాలో తెలియక 2 లక్షల ఖర్చుతో బయటపడిన వైనమది. 
మరో పేరున్న హాస్పిటల్ లో గాల్ బ్లాడర్ తీసేయాలని చెప్పి, ఏదేదో చేసి పేషంట్ ని అపస్మారక స్థితిలోనికి తీసుకువెళ్ళి దాదాపు నెల రోజులు నరకం చూపించారు. ఇప్పటికి ఆ పేషంట్ కోలుకోలేదు.
ఇవన్నీ తెలిసిన వాళ్ళ ద్వారా వెళితే కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగిన సంఘటనలు. అదీ కాస్తో కూస్తో అవగాహన ఉంటేనే..
మరి ఏమి తెలియని సామాన్యుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకమే కదా...!!

17, జూన్ 2019, సోమవారం

ఏక్ తారలు..!!

1.   మెలకువ ఎక్కువే_కలలెక్కడ కలత చెందుతాయెానని...!!

2.   దాయాలనే నా యత్నమునూ_గతి తప్పిన మనసును గదమాయిస్తూ..!!

3.   ఏకాంతమెప్పుడూ సౌకర్యమే_అక్షరాంగనలకు ఆతిథ్యమీయడానికి...!!

4.  సమయమెప్పుడూ అనుకూలమే_ఏకాంతమే శీతకన్నేస్తుంది అప్పుడప్పుడూ...!!

5.   అక్షరాలెప్పుడూ దాపునే ఉన్నాయి_అలరించే భావాలే దూరంగా...!!

6.   అనంత సాగరమే మది_జీవితపు ఆటుపోట్లకు గురౌతూ...!!

7.   నిత్య విద్యార్థులమే జీవిత పాఠశాలలో_ఆటుపోట్ల ఆటస్థలాన్ని నింపేస్తూ...!!

8.   గొడ్రాలితనమే కోరుకుంటోంది_అమ్మగా మారి నికృష్టులకు జన్మనీయడంకన్నా...!!

9.  అక్షరాలతో ఆంతరంగికమే ఎప్పుడూ_పద సంపద పొర్లుపోనీయకుండా..!!

10.   వగరు వలపులెన్ని వచ్చి చేరాయెా_నెచ్చెలితో నెయ్యానికి...!!

11.   ప్రబంధమెప్పుడూ పరిచయమైనదే_ప్రణయమే సరికొత్తగా చేరుతుందంతే...!!

12.   అర్థమైన అంతరంగాన్నే నేను_రహస్యానికి తావీయక...!!

13.  అన్ని రుచుల అనుబంధమే మనది_గతజన్మ బుుణానుబంధమై...!!

14.  చెమరింతలే చేవ్రాలుగా మారిన క్షణాలు_అక్షరాలకు అంకితమిస్తూ...!!

15.  ఓరిమి వహిస్తూ ఒదిగిపోవాలిక_పదాలకు ప్రాణం పోయాలంటే..!!

16.   నిశీధి నేస్తమయ్యింది_నీ తలపులను నాకందిస్తూ..!!

17.   అనంతానికందనివే మనసు భావాలు_అక్షరాలకు దొరికిపోతూ..!!

18.   అండదండలు పుష్కలమే_అక్షర సమర్పణే అన్యాక్రాంతమౌతూ..!!

19.   గెలుపుబాట పరుస్తున్నాయి_ఓరిమిని వరించిన అక్షరాలు...!!

20.   నిశీధి చిత్తరువు చెదిరిపోయింది_చెలిమి మెరుపు తాకిడికి...!!

21.   అక్షరాలకెప్పుడూ ఆనందమే
అందాన్ని అభివర్ణించడానికి...!!

22.   రాతల్లో ఇమడ్డం కొత్తేమి కాదు అక్షరాలకు_నిన్ను తలపిస్తున్నందుకే ఆ వన్నెలు...!!

23.   తడబాటు తప్పడం లేదు_తప్పుటడుగులకు మడుగులొత్తేటప్పుడు...!!

24.    అపురూప భావాలు_అనంతాన్ని మనకందిస్తూ..!!

25.  నాయకులు నిమిత్తమాత్రులు_కట్టేది కూల్చేది ప్రజల సొమ్ముతోనే...!!

26.  ఆత్మశోధనే మార్గం_మానసిక పరిణితిని తెలుసుకోవడానికి...!!

27.   ప్రతి పరిమళమూ ఒక అనుభూతే_మది ఆస్వాదను అనుసరిస్తూ...!!

28.   చుక్కలు శూన్యాన్నలంకరిస్తున్నాయి_చీకటికి సాయం చేయాలంటూ...!!

29.  ఈ వెన్నెల జలతారే ఆశ పెడుతోంది_చీకటి బతుకులో వెలుగు నింపుతానంటూ..!!

30.   మెాయక తప్పదు_మనసు భారమెంతున్నా..!!

12, జూన్ 2019, బుధవారం

ఏ'కాంతా'క్షరాలు ఆవిష్కరణ...!!

సాదాసీదాగా ఏ హంగు ఆర్భాటాలు లేకుండా  గొడవర్రులో సిరిగిన శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఆత్మీయంగా ఆవిష్కృతమైన ఏ'కాంతా'క్షరాలు...
మెుదటి పుస్తకాన్ని అందుకున్న నా నెచ్చెలి అనూరాధ కోనేరు/సిరిగిన.
అంకితమందుకున్న కోనేరు రమణారావు గారు,  ధాత్రి దేవి గారు...




7, జూన్ 2019, శుక్రవారం

ఏటైపోనాదేటో...!!

ఏనాడు కనబడని మెుకాలన్నీ ఓ చిన్న పోస్టో, లేదా నాకు నచ్చిందో, లేదా నిజమేంటో నలుగురు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో పోస్ట్ ఎట్టగానే పతొక్కరూ పరిగెట్టుకు వచ్చేత్తున్నారెందుకో. మరి అన్ని పోస్ట్లకు ఈ అత్యుత్సాహమేటైపోనాదో. మీరు నమ్మింది, మీకు నచ్చింది మీ గోడ మీద మీరు ఎట్టుకున్నప్పుడు నాకు నచ్చినవి నేనెట్టుకుంటే తప్పేంటి అద్దెచ్చా..మీరెప్పుడు మీకు నచ్చిన రాజకీయాల గురించి, నాయకులు గురించి, సినిమా గురించి, సినిమా వాళ్ళ గురించి పోస్ట్ లు ఎట్టనేదా. మీ అభిప్రాయాలు, అవాకులు, చెవాకులు మీ గోడల మీదెట్టుకుని ఊరేగండి. తెలంగాణా సోదరులు మా మీద చూపిస్తున్న  దృతరాష్టృ ప్రేమ మా కెరికే. అంత ప్రేమ మేము తట్టుకోలేం గాని మీ రాష్ట్రం బాగోగులు చూసుకోండి ఇదే ఉత్సాహంతో. మరోసారి నా గోడ మీద మీ ప్రేమను అత్యంత ఉత్సాహంతో చిలకరించ వద్దని నా మనవి... మెామాటం లేకుండా బ్లాక్ చేయబడతారు... పనికిమాలిన కామెంట్లు, బొమ్మలు ఎడితే. జర సోచాయించుండ్రి బిడ్డా..

5, జూన్ 2019, బుధవారం

ఏక్ తారలు..!!

1.  కొలిమి వాత తప్పదనుకుంటా_మెుద్దుబారిన మనసుకు..!!

2.   వైనమే వడ్డింపులకు_బాధ్యతలకామడ దూరం పోతూ...!!

3.   విషాదమే వెన్నంటి వస్తోంది_గతంతో పాటు భవిష్యత్తును వదలనంటూ...!!

4.   తరగని మమకారమది_తడబాట్లెన్నెదురైనా ముడి వీడని మనసులతో...!!

5.   వద్దని వారిస్తున్నా వినడం లేదు_వెతలన్నీ కతల్లో చేరుతూ. ...!!

6.   ఒడుపు తెలియలేదు_నేర్పుగా బతకడానికి..!!

7.   తప్పుటడుగు  ఒక్కటి చాలు_జీవితకాలం వెలివేతకు...!!

8.   బదులివ్వలేని వృద్ధాప్యం_బాల్యాన్ని నెమరువేసుకుంటూ...!!

9.    అర్థం అయ్యి కాని అయెామయమే_సమ్మతమేదో తెలియక...!!

10.   వెలకట్టలేని సంతసాలే_దశాబ్దాలనాటి బంధాలు దరిజేరితే...!!

11.   మనదాక వస్తే అక్కసు_మనమంటే మాత్రం నిజాయితీ...!!

12.   తట్టుకోవడం కష్టమే మరి_అరవై ఏళ్ళకు సరిపడా ఆరు రోజులకే చేరితే...!!

13.   నిజాలు భలే ఒప్పేసుకుంటాం_నవ్వు ఏడుపు మనకొకటేనని...!!

14.   అక్షరాలతో ఆడుకుంటున్నా_బాల్యాన్ని పుస్తకాల్లో నిక్షిప్తం చేద్దామని...!!

15.   అలుక నేర్చిన అక్షరాలకు తెలుసు_మురిపెంగా భావాలనెలా మాయ చేయాలో..!!

16.    అనునయించే మనసది_అక్షరభావాలను ఓ తాటి మీదకు తెస్తూ..!!

17.    అలసినా ఆనందమే అక్షరాలకు_పదబంధనాల పరిరక్షణలో..!!

18.    నా విజయానికి సారథులు మీరు_తరగని మన చెలిమి సాక్షిగా..!!

19.    అనుబంధానికి అర్థం తెలుసు_ఆర్తినెరిగిన అక్షరానికి...!!

20.   అనుబంధాలు అటకెక్కుతున్నాయి_అక్షరాలకు బాధ్యతలప్పజెప్పేశామంటూ...!!

21.   మనసుని పట్టి తెచ్చేసుకున్నా_నిన్ను వదిలి రాలేనంటుంటే...!!

22.   తరగని మనసు భారం_చెక్కిలిని సముదాయిస్తూ...!!

23.    నిశీధి క్రీనిడలే అన్నీ_మనసుని వశం చేసుకోవాలనుకుంటూ..!!

24.   అమ్మతనమే అక్షరానిది_ఏ భావానికైనా ఆసరానిస్తూ...!!

25.   అక్షరాలకన్నీ అలవాటే_ కలతలను, కలలను ఏమార్చడంలో...!!

26.   మధుర కవనమే జీవన కావ్యం_ఊహలకు వాస్తవికత తోడైతే...!!

27.    భావాలతో బాంధవ్యం పెంచుకున్నా_అక్షరాలను వదిలుండలేక...!!

28.   దాయాదుల పోరిది_దైవమెటు మెుగ్గు చూపనుందో...!!

29.   మహాత్ములే అందరూ_మహోపన్యాస వాక్యలతో...!!

30.   అనుసంధానమెప్పుడూ ఆచరణ యెాగ్యమే_బంధాలను బలోపేతం చేయడంలో...!!

3, జూన్ 2019, సోమవారం

అత్యుత్సాహం...!!

"అయ్యిందమ్మా పెళ్ళి...అనిగిందయ్యా రంది"..ఇక పక్కోడి పాలనలో లోపాలెదకడం మాని మన సంగతి మనం ఏడిస్తే మరోసారి అధికారం కట్టబెడతారేమెా. మీరేం చేసినా చూస్తున్నాం, వింటూ కూడ ఏం  అనడం లేదని బాగా అత్యుత్సాహం చూపెడుతున్నారు. ముందు మీ బొక్కలు సరి చేసుకోండి. కాలం నాడెప్పుడో ఎమ్ సెట్ లీకేజ్ కేస్ లో ముద్దాయిని జైల్ లోనే చంపేసి ఆత్మహత్యగా చూపించినా, నానా హడావుడి చేసి అందరికి క్లీన్ చిట్టిచ్చిన డ్రగ్స్ కేస్, నిన్న జరిగిన ఇంటరు, పదవ తరగతి అవకతవకలు, మాయమై చనిపోతున్న ఎందరో ఆడబిడ్డలు, యాక్సిడెంట్ లు జోరుగా జరుగుతున్న ప్రభుత్వ వాహనాలు, తాగునీరు కటకటలు,  విభజన అనంతరం లచ్చమందికి వచ్చేసిన ఉద్యోగాలు, ఓడి  గెలిచిన రేవంత్ రెడ్డి ఇలా చెప్పుకుంటూపోతే చానా లిస్టు ఉంది. మా ప్రభుత్వ పాలన మేం చూసుకోగలం. ఏమైనా మాట్లాడదల్చుకుంటే ముందు మా విద్యుత్ బకాయిలు కట్టి అప్పుడు మాట్లాడండి. అధికారంలోనికి వచ్చిన పార్టీ మీకు కొమ్ము కాస్తుందనుకుంటున్నారేమెా.. ఆంధ్రులు మీ మాటలు,  చేతలు, ప్రవర్తన, పద్దతి ఏదీ మర్చిపోరు... పక్కింటి సంగతి మాని మీ ఇంటి సంగతి చూసుకునేడవండి... మాకు ఉచిత సలహాలిచ్చే ప్రతి  ఒక్కరికి ఈ పోస్ట్..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner