గృహిణిగా, ఉద్యోగినిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సమాజానికి తన వంతుగా సాహిత్య సేవ చేస్తూ ఎన్నో సామజిక అంశాలను ప్రశ్నలుగా సంధిస్తూ, అనేక పురస్కారాలు అందుకుంటూ, ఆధునిక వచన కవిత్వంలో తనదైన ముద్రను వేస్తున్న రజిత కొండసాని తొలి కవిత్వ సంపుటి " ఒక కల రెండు కళ్లు ".
సాధారణంగా ఎవరమైనా కలను ఎలా కంటాము, మన రెండు కళ్లు మూసుకుని శరీరం అచేతనావస్థలో ఉన్నప్పుడు మనసు, మెదడు చేతనావస్థలో చూసే మరో ప్రపంచమే కల. అందుకేనేమో రజిత కొండసాని తన కవిత్వ సంపుటికి సరికొత్తగా " ఒక కల రెండు కళ్లు " అని పేరు పెట్టారు.
వ్యవసాయ ప్రధానమైన మన దేశానికి రైతు వెన్నెముకాని చెప్తూ, ఆ బడుగుజీవి కష్టనష్టాలను కళ్లకు కట్టినట్టుగా " నా దేశపు వెన్నెముకా.." కవితలో చక్కని వచనాన్ని అందించారు, ఋతువుల అందాలను,ఆనందాలను ఋతువుల సాక్షిగా కవితలో చక్కని వర్ణన చేసారు. ఇరువురి మనసుల మధ్యన అనుబంధాన్ని, అంతులేని ఆరాధనను " అద్దానికి సైతం.." అన్న కవితలో ఎంత అద్భుతంగా చెప్పారో మీరూ చూడండి.
" ఇంతకూ నాకు అర్థం కానిది ఒక్కటే
మనిద్దరం ఒకటేనని అద్దానికి ఎలా తెలుసో మరి
తనలోకి నేను తొంగిచూస్తే ప్రతిబింబంగా నిన్ను చూపిస్తోంది."
నువ్వే నేనుగా, ఆటను - ఆమె, కల నిజం చేసేందుకైనా, పలకరిస్తావని, నిరంతర యత్నం, మౌనమేలనోయి, కుదురుగా కూర్చోనిస్తేగా, జీవన సహచరుడు, కలను చెదిరిపోనీకు కవితలు చక్కని, చిక్కని ఆరాధనా భావంతో నిండి చదువరుల మనసులను రంజింపజేస్తాయి. నిజం గ్రహిస్తే కవిత రాజకీయ నాయకులకు ఓ హెచ్చరిక. ప్రణయపు పరిచయాన్ని చిత్రమే కదూ కవిత వివరిస్తుంది. తన జ్ఞాపకాల ఊసులలోని అనుభూతులు నిత్యం వెలిగే చిరునవ్వులుగా, క్షణాల సంతోషాలు శాశ్వతంగా ప్రియుని మదిలో నిలిచిపోవాలన్న ఆశను మిగిలిపోవాలని... కవితలో హృద్యంగా చెప్తారు. రైతు దుస్థితిని కవులు తమ అక్షరాలతో కరువు పూలు పూయింస్తారని కరవుపూలు కవిత చెప్తుంది. నీ చెలిమితో.. నేను.. పల్లవించిన పాటగా.. సుతారంగా ఈ అక్షర శృతులలో ఒదిగిపోతానంటారు. ఆకలి అలారం కవిత జీవన పోరాటానికి బతుకు బాటన నడవమని ఆకలి ఆరాటాన్ని సరికొత్తగా చెప్పడం చాలా నచ్చింది. ప్రత్యూషపు సందడిని, సౌందర్యాన్ని గోరువెచ్చని సూరీడా చూపిస్తుంది. చదువుల కొనుగోలు బహిరంగ వేలాన్ని కార్పొ'రేట్' చదువు కవిత పేరులోనే చెప్పేస్తుంది. మనుష్యుల మనసుల దూరాల భారాన్ని దిగులు మేఘం కవిత తెలుపుతుంది. స(రి)తిగమలు ఇల్లాలి ఇంటి పనుల విన్యాసాన్ని ఎంత గొప్పగా చెప్పిందో.. ఈ కవితా వస్తువు, కవితను మలిచిన తీరు అమోఘం..ఇంతవరకు చూడని వస్తుశిల్పం. ఇంతి సహనాన్ని, సమరాన్ని ఆవిష్కరించిన కవితలు రెండో కోణం, ఆదిపరాశక్తివై, కీర్తి పతాకను. ప్రేమను, స్నేహాన్ని చెప్పిన కవిత నీ స్నేహమే. మన దేశపు రాజకీయ దౌర్భాగ్యాన్ని, నాయకుల అర్హతను సూటిగా ప్రశ్నించిన కవితలు మినహాయింపు, మహా నటులు. ఇవి అందరి మనసులలోని మాటలే. ఒక 'కల' రెండు 'కళ్లు' కవితను తన కవితా సంపుటికి పేరుగా ఎన్నుకోవడంలోనే రజిత దృక్పధం తెలుస్తోంది. బిడ్డలు అమ్మానాన్నల గురించి రాసిన ఎన్నో కవితలు చదివిన మనకు ఈ కవిత కొత్తగా కనిపిస్తుందనడంలో ఎట్టి సందేహమూ లేదు. తమ ఆశల దీపం ఎలా వెలుగొందాలో, తమ ఇద్దరి కలల మనోనేత్రమే బిడ్డ సంతోషమని, అమ్మానాన్న కలిసి కన్న రెండు కళ్ల ఒకే కలే ఈ కలని ఎంత బాగా చెప్పారో. ఈ కవిత గురించో ఇంతకన్నా చెప్పడానికి నాకు మాటలు రావడంలేదు. చెట్టు ఆవశ్యకతను, అవసరాన్ని మనతో కడవరకు తోడుండే బంధమని చెప్పడం చాలా బావుంది. ఎన్నికల హడావుడిని చెప్పిన కవిత పోలింగ్ పండుగ. మురిపిస్తూ.. మైమరపిస్తూ .. నిజమే కదూ అంటూ.. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ప్రేమను, మైమరపును, ఆశలను అందంగా అందించిన అక్షర కుసుమాంజలి ఈ " ఒక కల రెండు కళ్లు కవితా సంపుటి.
చక్కని భావోద్వేగాలను, అనుభూతుల అందాలను, కోపాల శరాలను, ప్రేమామృత పాశాలను, సామాజిక అసమానతలను, ప్రకృతి సోయగాలను అలతి పదాల్లో అందంగా అందించిన కవయిత్రి రజిత కొండసానికి హృదయపూర్వక అభినందనలు.