4, జులై 2019, గురువారం

హృదయ విపంచి కవితా సంపుటి సమీక్ష..!!

               http://m.gotelugu.com/issue326/8187/telugu-columns/hrudaya-vipanchi-kavita-sameeksha/

  మనసు రాగాల మౌన విపంచి ఈ " హృదయ విపంచి "
          కళలకు పుట్టినిల్లు మా దివిసీమ. ఆ దివిసీమ నుండి వచ్చిన  కవయిత్రి పద్మజ సబ్బినేని. వ్యవసాయమే వృత్తిగా జీవించే స్వచ్ఛమైన రైతు కుటుంబ నేపథ్యం. అతి సాధారణమైన సహజ జీవన విధానం వీరి సొంతం. అతి తక్కువ కాలంలో చక్కని భావ కవిత్వాన్ని అందిపుచ్చుకున్న వారిలో వీరు ఒకరు. అలతి పదాల్లోనే అర్థవంతమైన భావాలు ఒలికిస్తూ ముఖ పుస్తకంలో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు రాయడం మొదలు పెట్టిన అతి కొద్దీ కాలంలోనే. తన భావాలకు తగినట్టుగా చక్కని పేరు " హృదయ విపంచి " కవితా సంపుటిని వెలువరించి అందరి అభిమానాన్ని అందుకున్నారు.
       తన కవిత్వాన్ని భగవంతునికి కృతజ్ఞతలతో మొదలుపెట్టి స్త్రీ పరిపూర్ణత్వాన్ని, నిత్య వసంతాల మూగ భాషను, వెన్నెల గోదారిని, తన గమ్యాన్ని తెలుపుతూ హృదయాలాపనను హృదయ విపంచిగా వినిపిస్తూ, నిర్జీవాన్ని, జీవిత సత్యాన్ని, భరోసా కావాలన్న ఎద ఘోషను, జీవన గమనంలో వెన్నెలాకాశం మీద సంతకాలను, జవాబు లేని ప్రశ్నలను, కన్నీటి జ్ఞాపకాలను, నిరీక్షణను, ప్రేమను, వివక్షను, చెలిమిని, బాల్యాన్ని, నిజాల ఇజాలను, చేజారిన క్షణాలను, పరవశాన్ని, ఆధిపత్యాన్ని, స్త్రీ శక్తిని, బంధాలను, అనుబంధాలను, ఆశలను, ఆశయాలను, ఒంటరితనాన్ని, ఆరాధనను, పెళ్ళిని, బాధ్యతలను, మౌనాన్ని, మనసును, సమ్మోహన పరిచే ప్రకృతి అందాలను, చిరుజల్లులను, హరివిల్లును ఇలా ప్రతి భావాన్ని చాలా నిజాయితీగా ఏ హంగులు, ఆర్భాటాలు లేకుండా తన కవితల్లో అందించారు. నాన్న గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు నాన్నను గుర్తు చేసుకోకుండా ఉండలేరు. కలలను తల్చుకుంటూ, అతిథులను అలరిస్తూ, తస్మాత్ జాగ్రత్త అంటూ మనకు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. బంధం గురించి రాసిన ఓ కవిత తనకి తెలియకుండానే మొదటి వాక్యంలోని చివరి పదంతో రెండో వాక్యం మొదలుబెట్టడం. భావ కవితలే కాకుండా లఘు కవితలు కూడా ఈ కవితా సంపుటిలో చోటు చేసుకున్నాయి. అందమైన భావాలను ఇలా అందమైన " హృదయ విపంచి" గా మన ముందు ఆవిష్కరించడం అభినందించదగ్గ విషయం.
         ఈ కవితా సంపుటిలో జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాలు కనిపించాయి. ఓ సున్నితమైన మనసుకు చేరిన స్పందనల భావాలకు అక్షర రూపమే "హృదయ విపంచి." ప్రేమ, ఆరాధన, నిరీక్షణ, బాల్యం, వెనకబాటుతనం, పల్లె జీవితాలు, జ్ఞాపకాలు, గాయాలు, గతాలు, గుండె చప్పుళ్ళు, కలలు, కన్నీళ్లు, కోపం, ఆవేశం, సమాజంలో స్త్రీ పట్ల వివక్ష పై తిరుగుబాటు, అన్యాయాన్ని ప్రశ్నించడం ఇలా అన్ని భావోద్వేగాలు సమపాళ్లలో కనిపిస్తాయి.
    వరం అన్న కవితలో 
" ఏ జ్ఞాపకాలు నిన్ను కలతపెట్టాయో 
ఆ జ్ఞాపకాలను తీసెయ్యలేను కానీ,
నా కనుపాపలలో నిను దాచుకుని 
నీ మనసు కలత చెందకుండా 
చూసుకుంటా..
నీవు నమ్మగలిగితే జీవితకాలం 
నీ మనసుకి ఊరటనిచ్ఛే 
నీ పేదలంపై చిరునవ్వునవుతా 
మరి ఆ వరం నాకిస్తావా నేస్తం...!!" 
ఎన్నో ఆశలతో చెంత చేరితే తనకు లభించిన నిర్లక్ష్యపు బహుమానాన్ని స్వీకరించి కూడా ఇంత ఆర్తిగా అడిగిన వరం ఎంత అద్భుతంగా అనిపించిందో..!!
నిశ్శబ్దాన్ని శబ్దం చేయిస్తూ అక్షరబద్దం చేయడం, స్నేహాన్ని, సవ్వడిని, ప్రేమ తత్వాన్ని, ఆలంబనను, అనురాగాన్ని, ఆశలను, ఆశయాలను, అహాలను, అనుభవాలను ఇలా జీవితంలో ప్రతి చిన్న భావనను మనసుతో చూడటం, దానిని ఓ చక్కని అక్షర భావనగా అందించాలన్న తపన ప్రతి కవితలోనూ కనిపిస్తుంది.  ప్రతి ఒక్కరి స్పందించే మనసు మౌనం ఈ అక్షరాల్లో మనకు దర్శనమిస్తుందనడానికి ఎట్టి సందేహం లేదు. 
      హృద్యమైన భావాలను అక్షరీకరించిన పద్మజ సబ్బినేని గారు అభినందనీయులు. పద్మజ సబ్బినేని మరిన్ని అందమైన భావ కవితలతో మరిన్ని కవితా సంపుటాలు తెలుగు సాహిత్యంలో వెలువరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనల శుభాకాంక్షలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner