4, జులై 2019, గురువారం

ఆగస్టు జీవన మంజూష..!!

నేస్తం, 
    ఈ ప్రపంచంలో కనీసం మరణ వాంగ్మూలానికయినా విలువుందో లేదో తెలియదు. మనమెలాంటి వారమెా మనకు తెలియకపోయినా మనమేంటన్నది మన మరణం నలుగురికి తెలియజెప్తుందట. ఐనా దాని వలన మనకు కొత్తగా ఒరిగేదేం ఉండదు. ఓ నాలుగు మెుసలి కన్నీళ్ళు తప్ప. చనిపోయాక ఎలాంటి వారినయినా మంచోళ్ళని పొగడడం మనకలవాటే కదా అనాది కాలం నుండి. ఆనాటి రావణుడి నుండి ఈనాటి నాయకుల వరకు చనిపోయిన ప్రతోడూ " చుక్కల్లోకెక్కినాడు సక్కనోడే. "  సామాన్యుల చావెలాగు సమాజానికి పట్టదు. డబ్బు, అధికారమున్న వాడి చావు కూడా ఘనమైన కళ్యాణమే. ఆ చావుని కూడా తమ వ్యాపారానికి అనుగుణంగా మార్చుకునే అపర మేధావులే అందరు ఈనాడు. 
    బతికుండగా అయినవాళ్ళ బాగోగులు పట్టించుకోని పెద్దలు పోయాక మాత్రం విందు భోజనాలు, ఖరీదైన కానుకలు పోయిన వారి గుర్తుగా ఇవ్వడం నేటి నాగరికతగా మారిపొయింది. దూరాన ఉన్న  తోబుట్టువులు, బంధువులు ఈనాటి నిత్య వాడకాలైన వాట్సప్ వీడియోల్లో పార్థివ దేహాన్ని చూడటం, నాలుగు కన్నీటిబొట్లు కార్చడం పరిపాటై పోయింది. బతికున్నప్పుడు, బాలేనప్పుడు కనీసం అదే వీడియో కాల్ ఒక్కసారి కూడా చేసిన దాఖలాలుండవు. అయినవారైనా, బయటివారైనా ఎదుటివారు బాధలోనో, కష్టంలోనో ఉన్నప్పుడు ఓ చిన్న పలకరింపు ఎంత భరోసానిస్తుందో తెలుసుకుంటే ఏ అనుబంధమైనా పది కాలాలు పదిలంగా ఉంటుంది. మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆ విలువ తెలుస్తుందనుకుంటా చాలా మందికి. అందుకే మన పెద్దలు ఎప్పుడోనే చెప్పారు ఈమాట " తాతకు పెట్టిన ముంత తల వైపునే ఉంటుంది " అని. 
       నాగరిక ప్రపంచంలో బతుకుతున్న అనాగరికులమని చెప్పుకోవడానికి మనసు రాకున్నా ఇదే నిజమని మన చుట్టూ ఉన్న ఎందరో డబ్బు జబ్బు మనుష్యులు నిరూపిస్తున్నారు. మన తరం మన తరువాతి తరాలకు అందించాల్సిన సంస్కారాన్ని మనమే లేకుండా చేసుకుంటే, వారికి చెప్పడానికి ఏమి ఉండదు వర్చ్యువల్ ప్రపంచం తప్ప. యాంత్రిక జీవితాలే మిగులుతాయి , యంత్ర సంబంధిత అనుబంధాల మధ్యన. 
బతకడం కోసం ముందుతరాలకు ఆస్తుల్ని మాత్రమే పంచుతున్నారు. వాటితోపాటు కొంచం సంస్కారాన్నీ బలవంతంగానైనా పంచండి. ఎందుకంటే మనకు ప్రాణవాయువునందించే ప్రకృతితో పాటు అదీ కనుమరుగైపోతుంది. రేపటి తరాన్ని బ్రతికించేది ప్రాణవాయువైతే, కనుమరుగైన మన తరాన్ని వారిమధ్యన బతికించేది సంస్కారమే. అహంకారాన్ని అణచే ఆయుధం సంస్కారమే. 

       

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner