ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్జ్ఞాశాలి," సాహితీమిత్రులు " సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, రావి రంగారావు సాహిత్య పీఠం ద్వారా ప్రతి సంవత్సరం " జన రంజక కవిత్వ " గ్రంథాలకు పురస్కారాలిస్తున్న నిరంతర సాహితీ వ్యవసాయదారుడు, పద్య, వచన కవి, వ్యాస రచయిత, బాల సాహిత్య సృష్టికర్తగా, ఎన్నో పురస్కారాలు, సన్మానాలు అందుకుంటూ, సాహిత్యంలో పలువురికి గురుతుల్యులుగా నిలిచిన దార్శనికుడు డా. రావి రంగారావు ఈ సాహితీ జనారణ్యంలో అందరికి సుపరిచితులే.
వీరి కవితా సంపుటి " గుండెలో నదులు నింపుకొని.. " గురించి సంక్షిప్తంగా పరిశీలిస్తే వారిలోని కవిత్వ సేద్యగాడు ఇలా అంటాడు..
" అక్షరాల్ని మట్టిలో విత్తాను, పంటలుగా మారాయి
అక్షరాల్ని నా గుండెలో ప్రతిష్ఠించుకొన్నాను, నేను మనిషినయ్యాను.. " అంటూ తనదైన వ్యక్తీకరణలో కవిత్వపు విత్తనాలుగా అక్షరాలను సాహిత్యపు పొలంలో నాటుతూ అక్షర భావాల సేద్యాన్ని తాను చేయడమే కాకుండా పలువురితో చేయిస్తూ, తెలుగు సాహిత్యాన్ని, గొప్పదనాన్ని నలుదెసలా చాటుతున్నారు. వీరి కవిత్వంలో కవి ఎలా ఉండాలి, కవిత్వానికి, అక్షరాలకున్న అవినాభావ సంబంధం, మౌనం, అందం, రాజయాకియలు, సామజిక సమస్యలు, అహం, బంధాలు, పండుగలు, పబ్బాలు, మనుష్యులు, మనస్తత్వాలు, అభిరుచులు, అందలాలు, కలం చేసే కనికట్టులు, జీవిత కదనరంగంలో గెలుపోటములు, ప్రయాణాలు, ప్రామాణికాలు, పిల్లల అల్లరి, పెద్దల ఆలోచనలు, హత్యలు, ఆర్భాటాలు, మేఘాలు, నక్షత్రాలు, తెలుగు మీద మమకారము, నల్లధనం ఇలా ఒకటేమిటి మన చుట్టూ ఉన్న ప్రతిదీ కవితా వస్తువే ఈయనకు. కాఫీ పెడుతున్న సూర్యుడు కవితలో
" పగిలిన కొబ్బరిచిప్పల మధ్య నీరులా
రెండు కొండల మధ్య నది.. " అంటూమొదలుబెట్టి పుట్టుక, చావు మధ్యన జీవితాన్ని, తరువాత చేసే శ్రాద్ధ కర్మలకు సాక్ష్యంగా మిగిలిన సూర్యుడు ఏమి పట్టించుకోకుండా పాలు పొయ్యి మీద పెట్టి కాఫీ తయారు చేసుకుంటూ, తన పని తానూ చేసుకుంటున్నాడు అని ఇటు ఓ మనిషిని, అటు ఆ సూర్య భగవానుడిని పోల్చి చెప్పడం చాలా కొత్తగా ఉంది. ఇలాంటి అభివ్యకిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు.
మరో చోట " దేవుడు నిదురపోతుంటాడు / రైతు మాత్రం ఎల్లప్పుడూ మేలుకొనే ఉంటాడు. అంటారు.
" నది అంటే - భూమి కాగితమ్మీద ఆకాశం కవి రాసే ఓ కమ్మని పద్యం / అది చదువుతున్నాం కాబట్టే ఇంకా మనం బతికే వున్నాం అంటూ కవి మీద తనకున్న ఇష్టాన్ని, సూర్యచంద్రుల పోలికలను, మానవ సంబంధాల విలువలను, నైతిక సూత్రాలను, కష్టాలను, కన్నీళ్లను ఇలా ప్రతి ఒక్క భావాన్ని సరళంగా, సూటిగా చక్కని అలతి పదాల్లో వాడుక భాషలో వచనాన్ని అందించి చక్కని, చిక్కని వచన కవిత్వంగా ఈ" గుండెలో నదులు నింపుకొని... " కవితా సంపుటి అందరికి చేరువ కాగలదని భావిస్తూ రావి రంగారావు గారికి హృదయపూర్వక అభినందనలు...
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి