1. కొన్ని జ్ఞాపకాలంతే
వీడనూ లేవు
అలా అని ఉండనూ లేవు..!!
2. అలిగింది మాటలే
మౌన రాయబారాలు
మనసుల మధ్యన...!!
3. ముసిరినందుకు మురిసిపోయింది
తరలి వచ్చిన జ్ఞాపకాలతో
తలమునకలైన తన్మయత్వం...!!
4. వాస్తవమెప్పుడూ ఇంతే
భారాన్ని మనకొదిలి
అస్పష్ట ఆకృతిగా తానుండిపోతూ..!!
5. కంటిధార ఓ అదృష్టమే
మింటికెగసే మంటలనార్పే
మనో ఒౌషదమైనప్పుడు...!!
6. అక్షర లక్షణమది
రాయడమలవాటు చేసి
మనసు పుటల్ని నింపేయడానికి...!!
7. పలకాలి
అమ్మ నేర్పిన పలుకులను
వాటిలో నిండిన ఆత్మీయతతో..!!
8. చెప్పాలి
ఆనాటి జ్ఞాపకాన్ని
నువ్వున్న క్షణాలను చేర్చి...!!
9. జననం
కర్మ ఫలితానికి
తిరుగులేని సాక్ష్యం..!!
10. అమాసని మరిచిందనుకుంటా
ముచ్చట్ల మాయకు లోనై
అవని ఆకాశం వైపు చూస్తూ...!!
11. జవాబుదారీ తాము కావంటున్నాయి
ఆలోచనల ముసుగులను
తొలగించలేని అక్షరాలు...!!
12. బాల్యాన్ని దాచిన
వెల కట్టలేని ఆత్మీయతల ఖజానా
అమ్మ చీర కొంగు...!!
13. పాపాయికి దిష్టి తగలనీయకుండా
బాల్య జ్ఞాపకాలను దాచిన
మమతల మైమరపు అమ్మ చీరచెంగు..!!
14. కొన్ని వాస్తవాలంతే
గతాన్ని మరువనివ్వవు
గాయాన్ని మాననీయవు..!!
15. అంతర్ముఖం
మనకు మాత్రమే తెలిసిన
మన మనసు నైజం..!!
16. మెా(క)హరింపులు
మెామాటానికనుకున్నా
మన నెయ్యపు చుట్టరికానికని తెలియక..!!
17. నివేదించే నివేదనలేనన్నీ
మాలిమైన మనసుకు
మాటలద్దిన అక్షరాలుగా మారుతూ..!!
18. పెరుగుతున్న దూరాలు
బలహీనమౌతున్న బంధాలు
ధనాపేక్షల కాలమందు...!!
19. ఆకతాయి నీలిమబ్బు గుర్తు చేసిందందుకే
బాల్యపు తడి పొడి జ్ఞాపకాలతో
మనసుని తడిపేస్తూ...!!
20. గెలిచింది మృత్యువు
ఓడింది అక్షరం కాదు
మానసిక నైర్మల్యం...!!
21. నీతో నేను లేకున్నా
నీ జ్ఞాపకాలన్నీ నాతోనే
ఉన్నాయంటే దానర్థం...!!
22. ఆశంటే అంతే మరి
కడవరకు చేరినా
కలల్లో కదలాడుతునే ఉంటుంది...!!
23. రాతిరికెప్పుడూ మెలకువే
కలలను కాలరాయాలని
వేకువ వచ్చి చేరుతుందోనన్న భయంతో..!!
24. ఆహ్వానం అనివార్యం
చీకటి వెలుగులు చుట్టాలు
మనం వద్దన్నా వలస వచ్చేస్తుంటాయి మరి..!!
25. గాయానికి కొలతేం ఉండదు
చిన్నదయినా పెద్దదయినా
గురుతులలాగే మిగిల్చేస్తుంది...!!
26. మెాదంతో ఖేదం
పోటిపడలేక పోతోంది
మనసైన క్షణాలు మనవైనప్పుడు...!!
27. మారకాలు ఇప్పటివి కాదులే
మనసులు తెలియని
మనుషుల మధ్యన బతుకుతున్నంత కాలమింతే...!!
28. గ్రాంథికం గ్రంథాలకే
పరిమితమట
వ్యవహారం మనదని...!!
29. తెలియనితనాన్ని అమాయకత్వమంటే ఎలా
తెలుసన్న మాయలో
పడిన బంధాలను
30. నిరాసక్తత
చెదిరిన మేఘమయ్యింది
మన మధ్యన ఇమడలేక...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి