11, ఆగస్టు 2020, మంగళవారం

కాలం వెంబడి కలం... 14

         ఎప్పుడూ ఇంట్లోవాళ్ళను వదిలి ఉండని నన్ను, మా నాన్న బళ్ళారిలో ఇంజనీరింగ్ లో చేర్పించడానికి మరో కారణం మా బేబమ్మ, కృష్ణ మామయ్య వాళ్ళు కూడా. ఫస్ట్ ఇయర్ అంతా బానే వచ్చి చూసి వెళ్ళేవారు కృష్ణ మామయ్య. నాకు వైట్, ఖాకి ఏప్రాన్ లు కుట్టించడం, కాలిక్యులేటర్ కొనివ్వడము ఇలా అన్ని చూసుకునేవారు. వాళ్ళ అబ్బాయి లీలాకుమార్ నాకు చిన్నప్పటినుండి మంచి ఫ్రెండ్, నా క్లాస్మేట్ కూడానూ. బొమ్మలు బాగా వేసేవాడు. 
ఆంధ్రాలో మెువ్వలో డిగ్రీ చదివేవాడు. తర్వాత మరి ఏమైందో తెలియదు కాని రావడం మానేసారు. నేనే ఓ రెండు మూడు సార్లు వాళ్ళ కాంప్ కి వెళ్ళి వచ్చాను. బస్ దిగి ఓ మూడు మైశ్ళ పైనే నడిచి వెళ్ళాలి వాళ్ళింటికి. చిన్న కాలిబాట ఉండేది. రెండు పక్కలా పొద్దుతిరుగుడు పూలతో పొలాలు చూడటానికి భలే అందంగా అనిపించేవి. నడిచిన దూరమే తెలిసేది కాదు. కాకపోతే ఒకే ఒక్క భయముండేది నడుస్తున్నంతసేపూ. ఎటునుండి ఏ పాము వస్తుందోనని. చాలా పెద్ద పెద్ద పాములుండేవి అక్కడ. నాకు భయమనేమెా పాపం ఓ పామూ కనబడలేదెప్పుడూ. 
       థర్డ్ ఇయర్లోనే అనుకుంటా ఓ ఆదివారం రోజు నాకు బాగా ఆకలి వేస్తోంది పొద్దు పొద్దున్నే. ఆ ముందురోజు ఏమి తినలేదు. హాస్టల్ మెస్ లో బిసిబేళా బాత్ టిఫిన్ ఆరోజు. నా తమిళ్ ఫ్రెండ్ ఉమారాణిని బయటికి వెళ్ళి టిఫిన్ తినివద్దాం పదా అంటే, తను రడీ అవుతోంది. సండే కదా అంత పొద్దు పొద్దున్నే ఎవరు లేవరు కదా. మీ అందరికి కూడా తెలుసుగా ఆ విషయం. ఈ లోపల వాచెమెన్ విజిటర్స్ వచ్చారని చెప్పాడు. కిందకి వెళితే ఇద్దరు అబ్బాయిలు కనిపించారు. మీకు లీలాకుమార్ తెలుసు కదా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఓపిడి దగ్గర ఉన్నారని చెప్పారు. నాకు లీలాకుమారి అని అనిపించింది. మా యశోదా వాళ్ళ అక్క లీలాకుమారి. మాకు 3 ఇయర్స్ సీనియర్. వాళ్ళ నాన్నగారు చనిపోతే నాకు చెబుతారేంటి అనిపించింది.మళ్ళీ అడిగాను వివరం. వాళ్ళు మళ్ళీ వివరంగా చెప్పారు. సరే నేను హాస్పిటల్ కి వస్తానని చెప్పాను. ఉమరాణిని తీసుకుని వెంటనే ఓపిడి హాస్పిటల్ మార్చురి రూమ్ దగ్గరకి వెళ్ళాను. మా కాలేజ్ నుండి అప్పుడప్పుడూ బస్ మిస్ అయినప్పుడు నడుచుకుంటూ దీని పక్కనుండే వచ్చేవాళ్ళం బస్ స్టాప్ దగ్గరకి. కాని ఇలా రావాల్సిన అవసరం పడుతుందని అస్సలు అనుకోలేదు. లీలాకుమార్ అక్కడే ఉన్నాడు. హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసే ముందు, చూస్తారా అని అడిగితే చూస్తానని తల ఊపాను. లోపలికి తీసుకువెళ్ళారు. శరీరమంతా బాండేజ్ చుట్టేసారు. ముఖం మాత్రం కనబడుతోంది. ఏంటోగా అనిపించింది మామయ్యను అలా చూసేసరికి. అయినవాళ్ళంతా దూరాన ఉన్నారు. ఉమని హాస్టల్ కి వెళ్ళమని చెప్పి, రేపు వస్తానని వార్డెన్ కి కూడా ఇన్ఫామ్ చేయమని చెప్పాను. మామూలుగా అయితే మా వార్డెన్ పర్మిషన్ ఇవ్వదు. ఓ రోజు ముందే పుస్తకంలో రాయాలి. తర్వాత తిడితే తిడుతుందిలే అని అనుకున్నాను. లీలాకుమార్ తో కార్ లో కాంప్ కి వెళ్ళాను. మా వెనుక ట్రాక్టర్ లో కృష్ణ మామయ్యను తీసుకువచ్చారు. నన్ను చూడగానే బేబమ్మ ఇలా రావాలని ఇన్ని రోజులు రాలేదా అని ఏడిచింది. అంతకు ముందున్న చోటు నుండి మారారు. ఈ ఇంటికి ఇదే వెళ్ళడం నేను. మా ఊరు నుండి అయినవారందరు తెల్లవారు ఝాముకి వచ్చారు. పొద్దున్నే తీసుకువెళిపోగానే నేను హాస్టల్ కి వచ్చేసాను. ఆ మధ్యాహ్నం నిద్రపోతుంటే విజిటర్స్ అని పిలుపు. ఎవరాని వెళితే నాన్న, శ్రీధర్ అంకుల్ ఉన్నారు. ఈ శ్రీధర్ అంకులే నాకు ఇంజనీరింగ్ సీట్ తక్కువ డొనేషన్ కు ఇప్పించింది. నా హెల్త్ ప్రోబ్లం అప్పుడు ఇంటికి వెళుతుంటే ట్రైన్ లో పరిచయం అంకుల్, ఆంటి. తర్వాత నాన్న చెప్పారు. కృష్ణ మామయ్య విషయం హాస్పిటల్ లో అంతా శ్రీధర్ అంకుల్ చూసారు. కేస్ అదీ లేకుండా, బాడి తొందరగా ఇచ్చేటట్లు చేసారు. కాసేపు మాట్లాడి వెళిపోయారు. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 
           

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner