17, ఆగస్టు 2020, సోమవారం
కాలం వెంబడి కలం..15
ఇంజనీరింగ్ ఫైనలియర్ జూనియర్స్ తో కలిసి మెుదలైంది. మా క్లాస్మేట్స్ కూడా చాలా మంది ఉన్నారు. కృష్ణకాంత్ వెళిపోతూ దినేష్ ని పరిచయం చేసారు. అమ్మాయిల్లో లాస్ట్ రెండు బెంచ్ లు మావే. మా ముందు అను, పొడుగు, పొట్టి వాళ్ళు కూర్చునేవారు. మా బెంచ్ లో నేను, వెంబడి నిర్మా,, నీలిమ, ఉమారాణి కూర్చునేవాళ్ళం. మా వెనుక బెంచ్ లో దినేష్ వాళ్ళు, రాంమెాహన్ వాళ్ళు కూర్చునేవారు. దినేష్ నవ్వేవాడు ఏంటి లాస్ట్ బెంచ్ లు మీవేనా అని. ఎమ్ టెక్ చేయడానికి వెళ్ళిన మురుగన్ సర్ మళ్ళీ మాకు AWT(యాంటెనా వేవ్ థియరీ) చెప్పడానికి వచ్చారు. మా బద్దకిస్ట్ శివప్రసాద్ సర్ మ్యూపి (మైకోప్రాసెసర్), ఈరన్న సర్, ఇంకా మిగిలిన సర్ లు అంతా పాతవాళ్ళే. ఎకనమిక్స్ మాకు కొత్త సబ్జక్. ప్రాజెక్ట్ గైడ్ హరికృష్ణ మా క్లాస్మేట్. ఇక ప్రాజెక్ట్ టీమ్ కోసం మేం ఎవరిని అడగలేదు. మామూలుగా అబ్బాయిలు ఎక్కువమంది ఉంటూ ఒకరో, ఇద్దరో అమ్మాయిలుండటం సాధారణంగా జరుగుతుంది. సరే జూనియర్స్ కి అంటే మేం పెద్దగా తెలియదు. మా వాళ్ళు కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళెవరు అడగకపోతే మాకేం భయం. నేను అన్నాను...మనమే చేసుకుందాం అని. సరేనని మా టీమ్ నేను, నీలిమ, నిర్మా, ఉమారాణి అని అనుకున్నాం. మాతోపాటు మా ప్రాజెక్ట్ లో మా క్లాస్మేట్ వెంకటస్వామి కూడా జాయిన్ అయ్యాడు.
ఎలివేటర్ కంట్రోల్ సిస్టమ్ మా ప్రాజెక్ట్.
మా బద్దకిస్ట్ శివప్రసాద్ సర్ మ్యూపి చాలా బాగా చెప్పేవారు. థర్డ్ ఇయర్లోలా సరదాగా ఉండేవారు కాదు. ఆయన క్లాస్ ఫుల్ అటెండెన్స్ ఉండేది. చాలా కామ్ గా వినేవాందరు. మధ్య మధ్య ప్రశ్నలు కూడా అడిగేవారు. ఒక్క క్లాస్ బంక్ కొట్టినా మన పని అయిపోయినట్లే అనుకునేవారం. మ్యూపి లాబ్ కూడా ఉండేది. శివప్రసాద్ సర్ ఇన్ఛార్జ్. నేను, నా క్లాస్మేట్ కళ్యాణ్,జూనియర్ మహేష్ కన్నడ అబ్బాయి బాచ్మేట్స్ మి. నేను మ్యూపి ప్రాక్టికల్ ప్రోగ్రామ్ ముందే రాసుకుని వెళ్ళేదాన్ని. శివప్రసాద్ సర్ క్లాస్ లో అందరం భయపడేవాళ్ళం. లాబ్ లో నన్ను ప్రోగ్రామ్ రాయమనే వారు. రాశాక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమనేవారు. ఏదోక ప్రశ్న అడుగుతూనే ఉండేవారు. ఆయన అడిగే పద్ధతికి నాకు నవ్వు వచ్చేది. పుస్తకం అడ్డుపెట్టుకుని నవ్వుతూ ఉండేదాన్ని. సర్ చూసి నవ్వుతారేంటండి చెప్పండి అనేవారు. మహేష్ ని నేను, కళ్యాణ్ ఏడిపిస్తూ ఉండేవాళ్ళం. అసలు సంగతేంటంటే నేను, మా పొట్టి క్లాస్లు ఎగ్గొట్టి సినిమా రిలీజ్ అయిన రోజే వెళిపోయేవాళ్ళం. ఈ శివప్రసాద్, ఈరన్న సర్ లు బైక్ మీద సినిమాకి వచ్చేవాళ్ళు.అదన్న మాట అసలు విషయం. ఇలా మ్యూపి లాబ్ సరదాగా ఉండేది మా అల్లరితో.
మా మురుగన్ సర్ క్లాస్ లో జనాలు గొడవ చేస్తే సర్ అలిగి క్లాస్ వదిలి వెళిపోయేవారు. మళ్ళీ సర్ ని బ్రతిమాలి, ఏంటి సర్ చిన్నపిల్లోడిలా మీరిలా అలగడం ఏం బాలేదని చెప్పి క్లాస్ కి వచ్చేటట్లు చేసేవాళ్ళం. మురుగన్ సర్ బాగా సెన్సిటివ్. అప్పుడప్పుడూ ఇలాంటి విషయాల్లో ఆయనకు క్లాస్ మేం తీసుకోవాల్సి వచ్చేది. ఫైనల్ ఇయర్ లో సెమినార్ ఉండేది. మురుగన్ సర్ ఇన్ఛార్జ్ దానికి. మా వెంకటస్వామి సెమినార్ క్లాస్ మెుత్తానికి హైలెట్. చాలా చాలా చిన్న అక్షరాలతో పేపర్లలో మెుత్తం రాసుకుని వచ్చి బోర్డ్ మీద రాసేసాడు. అందరం భలే ఎంజాయ్ చేసాము తను సెమినార్ చెప్పేటప్పుడు అదేలెండి రాసేటప్పుడు. ఇక నా సెమినార్ సంగతంటారా...జనం ఎక్కువగా లేరని మెుదలు పెడితే కంప్యూటర్స్, మెకానికల్ వాళ్ళు కూడా వచ్చేసి క్లాస్ నిండుగా ఉంది. మనకేమెా మాట్లాడటం రాదాయే. ఎప్పుడో చిన్నప్పుడు ప్రతిసారి డిబేట్ లో నాకే ఫస్ట్ వచ్చిందని, ఇంజనీరింగ్ లో సెమినార్ అదీ అంతమంది ముందు చెప్పేద్దామనుకుంటే ఎలా? మురుగన్ సర్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మాత్రమే ఉండి మిగతావాళ్ళని వెళిపొమ్మన్నారు. హమ్మయ్య అనుకున్నా. అయినా ఓ పదిమంది ఉంటారులే ఏదో చెప్పేసి మమ అనిపించుకుందామని నేను అనుకుంటే, మరి ఎలా తెలిసిందో ఏమెా అందరు వచ్చేసారు. ఏం చేస్తాం చెప్పాలి కదా అని చేతిలో పేపర్స్ తో డయాస్ ఎక్కాను. అందరికి విష్ చేసి నేను ఇయర్ గాప్ లో నేర్చుకున్న కంప్యూటర్ డాటాబేస్ గురించి చెప్పడం మెుదలుపెట్టాను. నాకే తెలుస్తోంది చేతులు ఒణకడం. పాపం అందరు చూస్తున్నారు కాని ఎవరు నవ్వలేదు. ఇలా కాదని స్పీచ్ టేబుట్ పేపర్స్ పెట్టేసి నేనే నవ్వేసి, ఓ నిమిషం ఆగి గబగబా చెప్పేసి ఎనీ డౌట్స్ అని, ఎవరు అడగరులే అనుకుని, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోబోతుంటే, మురుగన్ సర్ లేచి ప్రశ్నలు అడగండి, మీకు మళ్ళీ ఛాన్స్ రాదని చెప్పారు. మా రాంమెాహన్ ని కూడా అడగమన్నారు. మిమ్మల్ని వదలదు అడగకుండా, అందుకే మీరు అడగండి అని. ఎవరు ప్రశ్నలు అడిగే సాహసం చేయలేదు. మురుగన్ సర్ మాత్రం నాలుగైదు ప్రశ్నలు అడిగి నా సెమినార్ ముగించారు. సెమినార్ అయ్యాక మా కాలేజ్ కాంటీన్ లో మా అల్లరి బాచ్ కి, మురుగన్ సర్ కి మిర్చి బజ్జి, సాఫ్ట్ డ్రింక్ పార్టీతో సరిపెట్టేసాను. మా కాలేజ్ కాంటీన్ లో మిర్చి బజ్జి భలే బావుండేది. మీకు నోరు ఊరుతోంది కదా... మిర్చి బజ్జీ టేస్ట్ ఊహించుకోండి ఇప్పటికి.....
వచ్చే వారం మరిన్ని కబుర్లతో....
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి