20, ఆగస్టు 2020, గురువారం

నిర్ణయం...!!

నేస్తం, 
         పలకరించి చాన్నాళ్ళయినా, మనసులో మాట్లాడుతూనే ఉన్నా నీతో. మన మధ్యన మౌనం కూడా మాట్లాడుతుందని నీకు తెలుసు కదా. జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణాలను గాలికి వదిలేస్తే, తరువాత బతుకంతా గాలిలో దీపమేనని తెలియకపోవడంతో, రాబోయే విపత్తు ఊహకందదు. గాలికి అడ్డు పెట్టే చేయి దొరకక ఎప్పుడు ఆ దీపమారిపోతుందో తెలియదు. ఒక్కరు తీసుకునే నిర్ణయం మీద కుటుంబం మెుత్తం ఆధారపడి ఉంటుందని ఆలోచించక పోవడమూ తప్పే. ఆవేశంలోనో, జాలిపడో తీసుకునే నిర్ణయాలెప్పుడూ తప్పుల తడకలే. అది ఏ విషయంలోనైనా నిజమే. 
      ఆడపిల్లని ఓ ఇంటికి ఇచ్చేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని మన పెద్దలు ఊరికినే చెప్పలేదు. ఇప్పటి రోజుల్లో ముత్తాతల పేర్లే తెలియని బంధాలు మనవి. ఏడు తరాలు, మూడు తరాలు ఎలాగూ చూడలేం. కనీసం ఇప్పటి తరమూ చూడలేం. అందుకే పిల్లనయినా, పిల్లాడినయినా ఇచ్చేటప్పుడు కుటుంబం, పెరిగిన వాతావరణం అయినా చూడాలి. అందుకే మన పెద్దలు మరో మాట కూడా చెప్పారు. వియ్యానికైనా, కయ్యానికైనా సమవుజ్జీ ఉండాలని. ఇది అనుభవపూర్వకంగా నేనెరిన సత్యం కూడానూ. 
      కుటుంబం విలువ తెలియని వారికి విలువ ఇవ్వడం కూడా ఓ నేరమే. దానికి శిక్ష మనమే అనుభవించాలి తప్పదు. పైకి అందరు సాధు జీవులుగానే కనబడతారు. నటనేదో, నిజమేదో తెలుసుకోవడం చాలా కష్టం. రెండు నాలుకలున్న మనిషి పాము కన్నా చాలా ప్రమాదకరం. పాముకి కోరల్లో మాత్రమే విషముంటుంది. ఈ ధోరణి మనుషులకు ఒళ్ళంతా విషమే. అవసరానికి అనుగుణంగా రంగులు మారుస్తూ ఉంటారు. తెల్లారి లేస్తే సూక్తిసుధలు ప్రవహింప చేస్తారు. కాని తామెంత వరకు పాటించారో ఆలోచించరు. ప్రపంచమంతా వీరి అడుగుజాడల్లోనే నడుస్తోందన్న భ్రమలో బతికేస్తుంటారు. ఇంటి అవసరాలు పట్టవు కాని ప్రపంచంలో అందరి బాగోగులు సమీక్షిస్తారు. తాము తప్ప మిగిలిన వారంతా పనికిరాని వాళ్ళన్న అహంకారం ఎక్కువ. గురివింద గింజకు దాని నలుపు తెలియనట్లన్న మాట. మన సమాజంలో అందరూ గురివింద గింజలే మరి. 

 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner