28, అక్టోబర్ 2019, సోమవారం
ఎడారిపూలు సమీక్ష ....!!
22, అక్టోబర్ 2019, మంగళవారం
రెక్కలు...!!
1. నినాదంలో
ఆవేశం
నివేదనలో
ఆక్రోశం
వ్యక్తీకరణ ఏదైనా
వినిపించేది వేదనే..!!
2. నోటితో
మాటలు
నొసటితో
విరుపులు
అవగతం కాదు
అసలు నైజం..!!
3. చేసేది
ప్రభుత్వోద్యోగం
జీతంగా తీసుకునేది
ప్రజల సొమ్ము
పని చేసేది
అధికారానికి...!!
4. క్రమాక్రమ
శోధన
కూల్చివేతల
లక్ష్యం
ప్రజాధనం
దుర్వినియెాగం..!!
5. కట్టడం
నేలమట్టం
సచివాలయం
పాలనా సౌలభ్యం
నిర్మాణమేదైనా
శాశ్వతం పునాది...!!
6. గెలుపోటముల
ఆరాటం
మనిషి జీవితమెుక
కదనరంగం
మానసిక ప్రశాంతత
మరణం...!!
7. అవసరానికి
కాళ్ళు
ఆదమరిచామా
జుట్టు
ఏమరుపాటు
కూడదు...!!
8. అధికార
మదం
అస్తవ్యస్త
పాలన
జన జీవితాలు
అతలాకుతలం...!!
9. గెలిచిన ప్రతివాడు
విజేత కాదు
ఓడిన ప్రతివాడు
పరాజితుడు కాదు
గెలుపోటముల లెక్కలు
సరిచూసేవాడు ఆ పైవాడు..!!
10. అంగడి సరుకయ్యింది
అమ్మదనం
అష్టావక్రుల
చేతబడి
కాదేది అనర్హం
ధన పాశానికి..!!
11. పరాయితనం చేసింది
పట్టాభిషేకం
అయినవారివ్వలేదు
ఓ ఆత్మీయాలింగనం
ఇంటి వైద్యానికి పనికిరాదు
పెరటిచెట్టు..!!
12. చేతికి
పని
కలానికి
రాత
అందమైన
అలంకారం..!!
13. వ్యాధి
బాధిస్తుంది
వ్యసనం
వదలదు
నష్టం
జీవితానికి...!!
14. కూల్చివేతల్లో
ఉన్న తొందర
పథకాల
మార్పుల్లో వేగిరత
నిబద్ధత
అభివృద్ధిలో కనపడాలి...!!
15. పురిటి నెప్పులు
భరిస్తుంది
మంచైనా చెడైనా
బిడ్డను సాకుతుంది
పాపాల భైరవి
ధరిత్రి...!!
16. అడ్డుపడుతున్న
అహం పొరలు
ఒప్పుకోలేని
అనుభవ రాహిత్యము
నమ్మక తప్పని
వాస్తవ సందర్శనం...!!
17. మనసుతనాన్ని
సంరక్షించాలనుకుంటూ
మనిషితనాన్ని
మరిచిపోతోంది
అక్షరాల
అసహనంలో...!!
18. చెక్కిలిపై
జారిన కన్నీళ్ళు
మనోసంద్రపు
సుడిగుండాలు
దాచేసే సాక్ష్యమే
చిరునవ్వు...!!
19. జనారణ్యంలో
ఆధిపత్య పోరు
వనారణ్యంలో
జాతిపోరు
ప్రపంచం
యుద్ధభూమి...!!
20. అర్థమయ్యేలా అనువదించేవి
అక్షరాలు
అర్థం కాని అనువాదం
మనసు
వాదానువాదాల సమతూకం
జీవితం..!!
21. ఏలినాటి శని
ఏడేళ్ళు
ఎన్నికల శని
ఐదేళ్ళు
కర్మఫలం
కాటికి పోయే వరకు...!!
22. వరుసలో పేర్చిన
అక్షరాలు కొన్నే
అందించే భావాలు
అనంతం
వాణీ కటాక్షం
పూర్వజన్మ సుకృతం...!!
23. గురుతు తెచ్చే
జ్ఞాపకాలకు
నిలువుటద్దం
ఈ అక్షరాలు
పరమార్థమెరిగిన
రాతలివి..!!
24. ఆకాశం
చేతికి అందదు
సముద్రానికి
ఆవలి తీరం తెలియదు
మనసు గుట్టు
విప్పలేము...!!
25. కళలు
అందరివి
నైపుణ్యం
కొందరిదే
ఫలమేదైనా
పూర్వజన్మ సుకృతం...!!
26. గీతల్లో
ముగ్గులు
రాతల్లో
జీవితాలు
ఇదేనేమెా
విధి విలాసం...!!
27. రెప్పల పొదిలో
అంబుల గుంపు
గుప్పెడు గుండెలో
జ్ఞాపకాల చప్పుళ్ళు
ముత్యాల సరాలే
మనసు రాగాలు..!!
28. మనసు
మాయమైంది
మనిషి
బతికేవుంది
జీవించడానికి జీవితానికి
తేడా ఇదేనేమెా...!!
29. తొలిసందె
మలిసందె
మధ్యన
నడిమింటిసంధ్య
జీవనసందెలన్నీ
సూర్యోదయాస్తమయాలే..!!
30. మరిపించడం
తెలుసు
మురిపించడం
తెలియదు
ఇదే
నేటి మన అధికారం..!!
16, అక్టోబర్ 2019, బుధవారం
జీవన 'మంజూ'ష (డిసెంబర్ )
నేస్తం,
ఒంటరితనం అనుభవించని వారు ఈరోజుల్లో లేరనే చెప్పాలి. మనకంటూ అందరు ఉన్నా, ఒంటరితనం ఏదో ఒక క్షణం మన మనసు తలుపు తట్టలేదని అబద్ధం చెప్పలేము. ఈ ఒంటరి రక్కసి ఎన్నో జీవితాలను నాశనం చేస్తోంది. ఎందరి ప్రాణాలనో బలి కోరుతోంది. పేదా, మధ్యతరగతి, సంపన్న కుటుంబాలు అనే తేడా దీనికి ఏమాత్రమూ లేదు. పిల్లల నుండి పెద్దల వరకు అందరు దీని బారిన పడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేని ఎన్నో మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు, జీవితాలను బలి చేసుకుంటున్నారు.
ఒంటరితనానికి కారణాలు వెతకడం మెుదలుబెడితే సవాలక్ష సాకులు చెప్తారు కొందరు. కుటుంబం అన్న తర్వాత సమస్యలు, కోపతాపాలు సహజం. మన ఇంట్లో కరువైన దగ్గరతనాన్ని మరోచోట వెదుక్కోవాలన్న ఆలోచనలతో ఉచ్ఛం నీచం మరచి ప్రవర్తించడం నేడు సర్వసాధారణమైపోయింది. మన అనైతిక ప్రవర్తనతో మరో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి వెనుకాడని మనస్తత్వాన్ని అలవరుచుకుంటున్నాం. ఇది ఎంతో హేయమైన చర్య అని అనిపించక పోవడం దురదృష్టం.
మనిషి కనిపెట్టిన డబ్బు నేడు మనిషినే శాసిస్తోంది. దీనికి కారణం మనం అనుబంధాలకు విలువనివ్వకుండా, ప్రతి బంధాన్ని డబ్బుతో కొలవడం, మన స్వార్థం మనం చూసుకుంటూ " నా " అన్న అక్షరంతో బతికేయడం మెుదలుబెట్టాం. బంధం, బాధ్యత మరిచి హక్కులు, అవసరాలతో, అహంకారం అలంకారమని మన చుట్టూ ఓ చట్రం గీసేసుకుని బతికేయడం అలవాటు చేసుకుంటున్నాం. చావు, పుట్టుకలు ప్రతి ఇంటికి సహజమని మర్చిపోతూ, ఈరోజు గడిచిపోయింది చాలనుకుంటున్నాం. రేపన్నది ఒకటుందని, తాతకు పెట్టిన ముంత మన తల వైపునే ఉంటుందని మర్చిపోయి, ఎగిరెగిరిపడుతున్నాం.
ప్రపంచమంతా మన అరిచేతిలోనే చూసుకునే వెసులుబాటు సాంకేతిక కల్పించినందుకు సంతోషించాలో లేక ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరికెవరు ఏమీ కానట్టు ఉంటున్నందుకు బాధ పడాలో తెలియని అయెామయంలో పాత కొత్త తరాలకు మధ్యన నలిగిపోతున్న నేటి తరం పరిస్థితి ఇది. రక్త సంబంధాలు లేవు, కుటుంబ అనుబంధాలు కానరాని నేటి దుస్థితి మన భారతీయ వ్యవస్థకు తీరని నష్టం. అవసరానికి డబ్బులు కావాలి కాని అవసరమే డబ్బుగా బతుకుతున్న నేటి మనిషి, తను ఏం కోల్పోతున్నాడో తెలుసుకునే రోజు త్వరలో వస్తే బావుండు.
12, అక్టోబర్ 2019, శనివారం
జీవన 'మంజూ'ష (నవంబర్)..!!
మనిషికి పరిణితి అనేది ఎప్పుడు వస్తుందో, దేని వలన వస్తుందో తెలియడం లేదు. వయసు పెరిగే కొలది బాధ్యతలు పెరిగి మానసిక పరిణితి వస్తుందనుకుంటే అది తప్పనిపిస్తోంది కొందరి ప్రవర్తన చూసి. పోని చదువు సంస్కారం, విలువలు నేర్పుతుందేమెాననుకుంటే అదీ పొరబాటని తెలిసిపోతోంది. కీర్తి కండూతి కోసం వెంపర్లాడటంలో తప్పులేదు కాని ఎదుటివారిని అణగదొక్కి మనం మాత్రమే పేరు సంపాయించుకోవాలన్న స్వార్థం మనల్ని అధఃపాతాళానికి తొక్కేస్తుందని మర్చిపోతున్నాం. ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని అందరు అనుకుంటున్నారు, కాని మనిషి మనిషితనపు సహజత్వాన్ని మరచి ప్రవర్తించడం రానున్న తరాలకు మంచిది కాదని తెలుసుకోలేక పోతున్నారు.
9, అక్టోబర్ 2019, బుధవారం
మొగ్గలు సమీక్ష...!!
తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలకు లోటు లేదు. లఘు కవిత్వం ఆదరణ పొందుతున్న ఈరోజుల్లో ఎన్నో లఘు కవితా ప్రక్రియలు ప్రాచుర్యంలోనికి వచ్చాయి. ఏక్ తారలు, మణి మాలికలు, రెక్కలు, నానీలు, హైకూలు, రుబాయిలు ఇలా ఎన్నో కొత్త కొత్త ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో వెలువడుతున్నాయి. శతక పద్యాలు చాలా వరకు నాలుగు పాదాల్లో ఉంటాయి. వేమన, సుమతి శతకాల ప్రాచుర్యం ఎంత అనేది మనకు తెలుసు. అలానే ఈ మొగ్గలు తెలుగు లఘు కవిత్వ సాహిత్య ప్రక్రియ కూడా ముచ్చటగా మూడు పాదాల్లో మనల్ని మురిపిస్తాయి. మొదటి రెండు పాదాలు వస్తు, శిల్పాలకు ప్రాధాన్యతనిస్తే మూడవ పాదం చక్కని అభివ్యక్తితో మొదటి రెండు పాదాలకు ముక్తాయింపునిస్తుంది. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ చేతిలో పురుడు పోసుకున్న సరికొత్త లఘు కవితా ప్రక్రియ
" మొగ్గలు "
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రాసిన మొదటి మొగ్గ
" కొన్ని అక్షరాలు చాలు
కవిత్వాన్ని ఆవిష్కరించడానికి
అక్షరం రసాత్మక కావ్యం "
వాక్యం రసాత్మకం కావ్యం నుండి అక్షరం రసాత్మక కావ్యాన్ని తొలి మొగ్గగా అందించి మొగ్గకు చక్కని అలంకరణ చేసారు. మొదటి రెండు పాదాలకు ఓ చమక్కుతో మెరిపించడం ఈ మొగ్గల ప్రత్యేకత. అడుగులతో చివరి మజిలి చేరడాన్ని, కోరణం లోకానికి వెలుగునివ్వడాన్ని, కొన్ని మధుర జ్ఞాపకాల అనుభూతులు జీవితానికి, మానవత్వపు విలువలు మనిషికి ఆభరణమని, కొన్ని బంధాలు అనురాగ బంధాలు కావడాన్ని, మనిషి వ్యక్తిత్వపు లక్షణాలు, నవ్వుల ఉపయోగాన్ని, విజయం ఇచ్చే శక్తిని, మంచి పనులతో అందరి మనస్సులో చిరస్థాయిగా మిగిలిపోతామని, పుట్టినప్పుడు తొలి కేరింత ఆనందాన్ని, పిల్లల అల్లరి సంతోషాలను, తప్పటడుగులు నేర్పే గుణపాఠాలను, పట్టుదలతో చదువు ఇచ్చే గౌరవాన్ని, మూడుముళ్ళ బంధం గొప్పదనాన్ని, బాధ్యతల బంధాలను, కుటుంబ సంబంధాలను, కష్టనష్టాలను ఇలా జీవితంలో ప్రతి అనుభూతిని అలతి పదాల్లో, సరళమైన భాషలో సున్నితంగా మూడు పాదాల మధుర వచనాల్లో ఆవిష్కరించడం అరుదైన విషయమే. ఈ చక్కని ప్రక్రియను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ అభినందనీయులు.
" మట్టి చివరికి మనల్ని ఆహ్వానించనిదే
మన జీవితం అప్పుడే ముగిసిపోదు
జీవితం ఒక మహాప్రస్థానం "
మరణం గురించి ఎంత అద్భుతమైన మొగ్గ ఇది. కవితైనా, కథైనా పుంఖానుపుంఖాలుగా రాసినంత మాత్రాన గొప్పగా ఉండదు. చెప్పదల్చుకున్న విషయాన్ని అర్థవంతంగా, సూటిగా, స్పష్టంగా చదువరుల గుండెల్లోనికి దూసుకుపోయేటట్లుగా వచనమైనా, కవిత్వమైనా ఉంటే చాలు. పది కాలాలు ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎంత ఎక్కువ వాక్యాల్లో చెప్పామన్నది కాకుండా లోతైన భావాన్ని కూడా తక్కువ పదాల్లో ఎంత భావయుక్తంగా చెప్పామన్నది ముఖ్యం.
" ఆలోచనలు వెంటాడినప్పుడల్లా
అక్షరాలు మొలకెత్తుతూనే ఉంటాయ్
అక్షర సంగమం కవిత్వం "
కవిత పుట్టుక కష్టమైనా ఎంత సుళువుగా చెప్పేసారో తన ముచ్చటైన మొగ్గలో.
స్నేహాన్ని, గమ్యాన్ని, గమనాన్ని, అనుభవాల జ్ఞాపకాలను, మనసు, మమతలను, నదీ, సాగర సంగమాలను, ప్రకృతి అందాలను, పక్షుల కిలకిలరావాలను, జీవితమంటే కష్టసుఖాలని, రైతుకు వాన ఎంత ముఖ్యమో, చినుకు అందాన్ని ముత్యమని, గేయం గాయపడిన అక్షరమని, విత్తు, చెట్టు ఉపయోగాలను, జాబిలి, వెన్నెల అందాలను, పరోపకారం ఆవశ్యకతను, స్వేచ్ఛ గురించి, చరిత్ర పాఠాలను, కవిత్వం చదువుతుంటే మనసు పొందే హాయిని, కవి తీరని దాహాన్ని, జీవమున్న అక్షరాలు సమాజ వికానికి దోహదపడతాయని, అక్షరాలను ప్రేమలో ముంచితే కాని పదాలు ప్రేమ కవిత్వాన్ని ఆవిష్కరించలేవని, కష్టాలను గెలిస్తే కాని సుఖాలు తెలియవని, సమాజాన్ని చదివితే కాని లోకం తీరు తెలియదని, జీవితం ఓ తెరచిన పుస్తకమని, వేదన, బాధలు, కన్నీరు, ఆనందం, ఆహ్లాదం, జీవితపు అనుభవాలు, పసితనపు అమాయకత్వాలు, కలం విలువ, కాలం గొప్పదనం, రాజకీయపు రంగులు,
" దుఃఖాన్ని ఎన్నిసార్లు ఒంపుకున్నా
బాధలు ఎప్పటికి ఉంటాయి
కన్నీటికి తడి ఎక్కువ " ఇలా చెప్తూనే.. గుండె గాయపడితేనే కవిత్వమంటారు.
అమ్మను, అమ్మ చేతి వంటను, ఆడపిల్లను, అంతరాలను, అసమానతలను, ప్రశంసలను, గుండె లోతుల్లో విషాదాలను, ఎన్నో ప్రశ్నల సమాధానాలను, కళలను, కల్లోలాను, ప్రేమను, ఆర్తిని ఇలా ప్రతి హృదయపు అనుభూతిని తన మొగ్గల్లో అక్షరాలకు అద్దుతూ, మన మనసులను వికసిమజేయడానికి, సమాజంలో మానవత్వపు పరిమళాలు వెదజల్లడానికి సాహిత్యపు సేద్యాన్ని కొత్తగా చేయదానికి ఈ మొగ్గలు కవితా ప్రక్రియ రూపొందించిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారికి హృదయపూర్వక అభినందనలు.
