11, జులై 2020, శనివారం

పంచరత్నాలు..!!

1.  మౌనం
అర్థమవదు
మనసు
మాట్లాడలేదు
తెలిసేదెలానో..!!

2.  చెలిమి
వీడదు
తరగదు
ఆత్మీయత
బుుణానుబంధం...!!

3.   వెదికిన
చిరునామా
దొరకని 
మానవత్వం
ఇప్పటికిదే...!!

4.  అబద్ధంలో
నిజం
వాస్తవంలో
కల
బావుంటుంది...!!

5.  రాయడం
కష్టం
కాపి
తేలిక
రచనలు..!!

10, జులై 2020, శుక్రవారం

కాలం వెంబడి కలం...9

       మాకు సెకెండ్ ఇయర్ లో ఫోట్రాన్ లాబ్ ఉండేది. ఎప్పుడో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మా అంబా రమణ గారి పుణ్యమా అని ఓరోజు మా MPC బాచ్ అందరిని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళి కంప్యూటర్ చూపించారు. మనం తప్పు చేస్తే మెుమాటం లేకుండా తిట్టేస్తుంది మేడం అంటే మేడంతోపాటు అందరూ నవ్వేసారు. 1986 లో చూసిన కంప్యూటర్ మళ్ళీ 1990 లో చూసాను. కంప్యూటర్ లాబ్ కి వెళ్ళే మెుదటిరోజు బోలెడు ఎగ్జైట్మెంట్. లాబ్ బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళడం, లోపల AC తో ఉన్న చిన్న పెట్టెలోనికి వెళ్ళినట్టనిపించింది. మాకు ముగ్గురికి కలిపి ఒక సిస్టమ్ ఇచ్చారు. నాతో ఉన్న వాళ్ళిద్దరు ఫస్ట్ ఇయర్ లో మెుదట మా నాన్న పరిచయం చేసిన అమ్మాయిలు శ్యామల, వాణిశ్రీ అన్నమాట. ఫ్లాపీ కొనుక్కోవడం, దానిని సిస్టమ్ లో ఇన్సర్ట్ చేయడం, ఫైల్ కి పేరు పెట్టుకోవడం సరదాగా అనిపించింది. నవ్య, కావ్య అని పెడదామంటే వాణిశ్రీ అలా వద్దు ఫైల్ పేరు మన ప్రోగ్రామ్ తెలిసేదిగా ఉండాలంది. సరే అని ఊరుకున్నా. ఫ్లో చార్ట్ గీయడం వరకు పర్లేదు, ఏంటో ప్రోగ్రామ్ రాయాలంటే లాజిక్ తెలియాలని అనడం అర్థం అయ్యేది కాదు అప్పట్లో. ఇన్ పుట్ ఇచ్చి, అవుట్ పుట్ రిజల్ట్ రావాలని, సిస్టమ్ కమాండ్ లు తెలుసుకోవడం ఇలా అప్పుడప్పుడూ అరుదుగా దొరికే కంప్యూటర్ తో ఆడుకోవడం భలే బావుండేది.ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫోట్రాన్ లాబ్ ఉంది మాకు. థియరీ ఎగ్జామ్స్ లో ECT ఎగ్జామ్ రోజు నేను మెయిన్ ఆన్సర్ షీట్ మెుత్తం నింపేసాను. ఎడిషనల్ తీసుకున్నాను. నా ముందు కూర్చున్న మెాహన్ వెనక్కి తిరిగి అన్ని రాశావా అంటే రాస్తున్నా అన్నాను. సరే నీ మెయిన్ షీట్ ఇవ్వు అన్నాడు. కాస్త భయం వేసింది. 
       చిన్నప్పుడు అడిగిన వాళ్ళకి ఆన్సర్లు చూపించడం, చెప్పడం, లేదా వాళ్ళ పేపర్ తీసుకుని రాసివ్వడం అలవాటు. అలా ఓసారి హింది పేపర్ మెుత్తం మా జూనియర్ కి రాసిచ్చేసాను. జాగ్రత్తగా ఓ 80 మార్కులకే రాసిచ్చాను. కాని మన రైటింగ్ హింది టీచర్ కి తెలుసు కదా, ఆ అమ్మాయికి అంత బాగా రాదని తెలుసు, ఎవరు రాసిచ్చారు చెప్పు అంటే, ఆ అమ్మాయి చెప్పకపోతే మంజు రాసిచ్చింది కదా నిజం చెప్పు అంటే ఆ పిల్ల స్వాతి భయంతో చెప్పేసింది. తర్వాత క్లాస్ లో తిట్లు, మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మావాళ్ళకు నా మీద కంప్లయింట్స్, కోపంగా కాదులెండి ఇష్టంగానే చెప్పారు. కొత్తగా వచ్చిన తెలుగు టీచర్, ఆవిడ కొత్త లూనాతో డ్రైవింగ్ కూడా నాకు నేర్పారు. 
       మెాహన్ పేపర్ అడగ్గానే నాకు ఆ విషయం గుర్తు వచ్చింది. సరే ఏదైతే అది అవుతుందని మెయిన్ షీట్ మెాహన్ కి ఇచ్చాను. నేను ఎడిషనల్ రాసుకుంటున్నా. ఈలోపల స్వ్కాడ్ వచ్చారు. ఇక చూడాలి నా సంగతి. లోపల భయపడుతూనే పైకి రాసుకుంటున్నట్టు నటిస్తున్నా. నాకో ఎడ్వాంటేజ్ ఏంటంటే నా ఇనీషియల్ ప్రకారం లాస్ట్ నెంబర్స్ లో వస్తుంది. స్వ్కాడ్ మా వరకు రాకుండానే వెళిపోయారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. ట్విస్ట్ ఏంటో తెలుసా ఆ సబ్జెక్ట్ నాకు ఉండిపోయింది. మెాహన్ కి క్లియర్ అయ్యింది. ఫోట్రాన్ లాబ్ ప్రోగ్రామ్ రాయడం మాత్రమే అన్నారు. ఎగ్జిక్యూషన్ లేదన్నారు. ప్రిపేర్ కాలేదు. సరే వస్తే రాద్దాం లేదంటే వచ్చేద్దాం అనుకున్నా. ఏదో రాశాను మెుత్తానికి. వైవా కి ఎక్స్ట్రనల్ మేడం నాకు తెలిసినావిడ. ఫస్ట్ ఇయర్ లో నాకు మా క్లాస్ రూమ్ తెలియక ఈ మేడం ఉన్న స్టాఫ్ రూమ్ కి వచ్చి, ఆవిడనే అడిగాను. అప్పటినుండి ఆవిడకు నేను బాగా గుర్తు. వైవా బానే ఆన్సర్ చేసాను. 
       అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయానుగా. మేమూ సీనియర్స్ అయ్యాం కదా. నేనెవరిని రాగింగ్ చేయలేదండోయ్. కాకపోతే మా హాస్టల్ లో సరదాగా ఇంట్రడక్షన్ తీసుకున్నాం. పాపం కొత్తలో నేనంటే జూనియర్స్ (హాస్టల్ అమ్మాయిలు) భయపడేవారు. తర్వాత అనేవారు " నిన్ను చూసి ఎందుకు భయపడ్డామెా తెలియదు " అని. మరో విషయమేంటంటే మా పెద్ద అమ్మమ్మ మనుమడు బాలకృష్ణ నాకు జూనియర్. వాడితోపాటుగా విజయనగరంలో అప్పుడప్పుడూ మాతో ఆడుకున్న సురేంద్ర అంకుల్ కొడుకు భానుకృష్ణ కూడా. బాలకృష్ణని చిన్నప్పుడు చూసాను. మా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక నాన్న, నేను ఇంటికి వచ్చేటప్పుడు ట్రైన్ లో మా సెక్షన్ శోభన్ బాబు వాళ్ళు అందరు ట్రైన్ లో బాగా గోల చేసారు. వీడు కూడా వాళ్ళతో ఉన్నాడు. క్లాస్ లో, లాబ్లలో అప్పుడప్పుడూ కనబడుతూ, నిదానంగా వుండే శోభన్ బాబు విశ్వరూపం చూసామన్న మాట. మా బాలు గాడు మేం ఎక్కిన బస్సే విజయవాడలో ఎక్కాడు. బస్ లో సిగిరెట్ కాల్చి పొగ వదిలితే నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత కాసేపటికి మెాపిదేవిలో బస్ ఆగి బయలుదేరుతుంటే వీడు గబుక్కున దిగాడు. ఎవరబ్బా ఇక్కడ దిగేవాడు అని ఆరాగా చూసాను. తర్వాత మా పిన్ని చెప్పింది, వీడూ మా కాలేజ్ లోనే జాయిన్ అయ్యాడని. అప్పుడనుకున్నా ఆరోజు హడావిడిగా బస్ దిగింది వీడే అని. బాలు, భాను ఇద్దరు అలా మళ్ళీ కలిసారు.

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

9, జులై 2020, గురువారం

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో ఫ్లోర్ , బాత్ రూమ్ క్లీనింగ్...



నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో ఫ్లోర్ , బాత్ రూమ్ క్లీనింగ్...

భూతల స్వర్గమేనా..17

పార్ట్... 17
        పొద్దున్నే బస్ చికాగో మెయిన్ బస్ స్టేషన్ లో ఆగింది. నేను దిగాల్సింది అరోరా బస్టాండ్ లో. సెంట్రల్ స్టేషన్ లో బస్ క్లీనింగ్ కోసం ఆపారు. నేను కిందకి దిగి కాస్త అవతలగా కూర్చున్నాను. బయలుదేరేటప్పుడు ఎనౌన్స్ చేస్తారు కదా అని. నన్ను అరోరాలో రిసీవ్ చేసుకోవడానికి శరత్ గారు వస్తారని, ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేసి ఇక్కడ బస్ ఆపారని చెప్పాను. తర్వాత చూస్తే బస్ లేదు. కంగారేసి ఎంక్వైరీలో అడిగితే బస్ వెళిపోయిందని చెప్పారు. నా లగేజ్ మెుత్తం బస్ లోనే ఉండిపోయింది. రెండు పెద్ద సూట్కేస్లు, ఒక చిన్న సూట్కేస్. దానిలోనే నా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే ఈ బస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసాను. నా లగేజ్ అరోరా బస్ స్టేషన్ లో దింపమని  చెప్పాను. శరత్ గారికి, రామస్వామి గారికి ఫోన్ చేసి చెప్తే, కాబ్ వేసుకుని అరోరా బస్ స్టేషన్ కి వచ్చేయమన్నారు. 150 డాలర్లు దండగన్నమాట. ఏం చేస్తాం తప్పదు కదా మరి, మన అజాగ్రత్తకి మూల్యం చెల్లించాలి కదా. ఇంకా నయం బస్ వాళ్ళు నా లగేజ్ జాగ్రత్తగా దించి వెళ్ళారు. నేను బస్ స్టేషన్ కి వెళ్ళేసరికి లగేజ్ దించి బస్ అప్పుడే వెళిపోయింది. శరత్ గారు నన్ను లగేజ్ తో సహా వాళ్ళింటికి తీసుకువెళ్ళారు. శరత్ గారి వైఫ్ కవితక్క చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు రడీ అయ్యారు. నేను ఫ్రెష్ అయ్యి,  రడీ అయ్యాను. కవితక్క ఆరంజ్ జూస్ ఇచ్చింది. తాగేసి ముగ్గురం రామస్వామి గారిని కలవడానికి వారి చైనీస్ రెస్టారెంట్ హ్యూనాన్ ఇన్ కి బయలుదేరాం. 
           రెస్టారెంట్ మేనేజ్మెంట్, మెంటెనెస్స్ అంతా కవితక్క చూసుకునేది. రామస్వామి గారి వైఫ్ మాధవి గారు బయట జాబ్ చేసుకుంటూనే వీటిని కూడా చూసుకునేవారు. రామస్వామి గారు అప్పటికే భారత్ మేళా అని ఇండియన్ గ్రాసరిస్టోర్ కూడా తీసుకున్నారు. శరత్ గారు అక్కడ, ఇక్కడ కావాల్సిన సరుకులు, కూరగాయలు అన్ని తేవడం చూసుకునేవారు. ఆరోజంతా కవితక్క వెనుకే ఉంటూ తను చేసేదంతా చూస్తూ వున్నాను. ఆ నైట్ కి నన్ను నేపర్ విల్ లో రామస్వామి గారింటికి తీసుకువెళ్ళారు. చాలా  పెద్ద ఇల్లు. నా లగేజ్ కూడా వచ్చేసింది. వాషింగ్ మెషీన్ ఉన్న రూమ్ లో బెడ్ ఉంది. ఆ రూమ్ నాకు ఇచ్చారు. తర్వాత 4,5 రోజులనుకుంటా నన్ను రామస్వామి గారు పొద్దున్నే ఎనిమిదింటికంతా రెస్టారెంట్ కి తీసుకువెళ్ళేవారు. కవితక్క, శరత్ గారు కూడా ఆ టైమ్ కి వచ్చేసేవారు. కవితక్క నాకు అక్కడ చేయాల్సిన పనులు బాత్ రూమ్లు కడగడం, కూరగాయలు కోయడం, టేక్ అవుట్ల ఆర్డర్ తీసుకోవడం, ఇవ్వడం మెుదలైనవి నేర్పేది. లంచ్ బఫే ఉండేది. సాయంత్రం టేక్ అవుట్లు, డిన్నర్ ఉండేది. మరో పక్క ఇండియన్ ఫుడ్ టిఫిన్స్ , డిన్నర్ కూడా సాయంత్రం పూట మెుదలు పెట్టారు. వీకెండ్ బాగా బిజీగా ఉండేది. చైనీస్ కుక్ లు, తోలు వెయిటర్స్ కూడా ఉండేవారు. హోమె చైనీస్ వెయిటర్ సరదాగా మాట్లాడేది. చిన్న చిన్న చైనీస్ పదాలు కూడా అప్పుడప్పుడూ నేర్పేది. కొన్ని రోజుల తర్వాత జాబ్ మార్కెట్ అప్పటికే బాలేని కారణంగా మాధవి గారి జాబ్ కూడా కాంట్రాక్ అయిపోయింది. మా వారి ఫ్రెండ్ మాధవి గారి తమ్ముడు. 
         తర్వాత ఓ రోజు మాధవి గారు నేను రడీ అయ్యి రెస్టారెంట్ కి బయలుదేరుతుంటే నేను తీసుకువెళతానులే నిన్ను, మనిద్దరం కలిసి కాసేపాగి వెళదామంటే సరేనని ఆగాను. వీళ్ళకి ఓ పాప, బాబు. పాప అప్పుడు ఐదో, ఆరో చదువుతుండేదనుకుంటా. బాబు బయట ఉండేవాడు అండర్ గ్రాడ్యుయేషన్ అనుకుంటా. కాఫీ తాగుతూ ఆ కబురు, ఈ కబురు చెప్తూ నేనేం చేస్తున్నానో అన్నీ కనుక్కుంది. చాలా ప్రేమగా ఉండేది నాతో అప్పటి నుండి. నా గురించి బాగా కేర్ తీసుకునేది కూడా. అప్పుడప్పుడూ ఇండియన్ గ్రాసరిస్టోర్ కి కూడా తీసుకువెళ్ళే వారు శరత్ గారు. అక్కడ విజయ అని ఒకావిడ పని చేసేవారు. వాళ్ళాయన జాబ్. ఈవిడ ఇక్కడ పని చేసేవారు. నాకేమెా ఖాళీగా కూర్చోవడం రాదు. షాప్ నీటుగా లేదని క్లీనింగ్ మెుదలుపెట్టాను. నాకు వచ్చినట్టుగా అన్నీ సర్దేసాను. బాత్ రూమ్ కూడా నీట్ గా క్లీన్ చేసాను. కవితక్క నాకు రెస్టారెంట్ లో చెప్పిన పనే ఇక్కడా చేసి విజయతో అన్నానేమెా మనమే క్లీన్ చేయాలని. నాకు సరిగా గుర్తు లేదు. ఆవిడ మరి ఎవరికి ఏం చెప్పుకుందో నాకు తెలియదు. ఆరోజో, మరుసటి రోజో రామస్వామి గారు మీటింగ్ ఉందన్నారు. అందరు ఏదేదో మాట్లాడారు. చివరికి నాకర్థమైందేంటంటే నన్ను విజయకు సారి చెప్పమన్నారని. సారి చెప్పేసాను. కాని నా తప్పు లేకుండా సారి చెప్పడమంటే నాకు చచ్చిపోవడంతో సమానం. మాధవి అక్క తన కార్ లో ఇంటికి తీసుకువచ్చారు. తనకి నా సంగతి బాగా తెలుసు. నాతోపాటే రూమ్ కి వచ్చి బాధపడవద్దని చెప్పి సముదాయించింది. చాలా సేపు బాధనిపించింది. అప్పటినుండి కాస్త మనుషుల నైజాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. నాకేమెా కాస్త ఆత్మాభిమానం ఎక్కువ. ఏదీ తొందరగా రాజీ పడలేను. ఈ విషయం నుండి బయటపడటానికి నాకు చాలా సమయమే పట్టింది. 

మళ్ళీ కలుద్దాం.. 

-

7, జులై 2020, మంగళవారం

రమ్య ద రోబో సమీక్ష...!!

రమ్య ద రోబో సమీక్ష...!! 
  మనసు ఆలోచనలకు ఆధునిక రెక్కల ఊహల ఊయల " రమ్య ద రోబో "
       బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదురాలైన డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ విశ్వపుత్రికగా తెలియని సాహితీకారులు లేరు. వీరు కవిత్వం రాయడంలోనూ, అనువాదం చేయడంలోనూ దిట్ట. తన రచనా వ్యాసంగంలో మరో ప్రక్రియ కథ చోటు చేసుకోవడం ముదావహం. అది తన చుట్టూ జరిగే సంఘటనలకు, తన మనసులో రేకెత్తిన సరికొత్త ఆలోచనలకు ఆధునికతను ఊహగా జోడించి, ఆ ఊహల చుట్టూ చక్కని కథనాన్ని నడిపించి, కథగా మలిచి " రమ్య ద రోబో " కథా సంపుటిగా మన ముందుకు తెచ్చారు. 
        ఆధునిక టెక్నాలజీ, అదీనూ ఓ రోబోట్ మన జీవితాల్లోకి వస్తే ఫలితాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయెా తెలిపే కథ రమ్య ద రోబో. రెక్కలకు దెబ్బ తగిలి ఎగరలేక నిస్సహాయంగా వున్న పక్షి, ప్రయాణం పిల్లలు పై చదువులు చదవాలన్న కోరికను పోల్చుతూ ఓ తల్లి తీసుకున్న నిర్ణయం కలల రెక్కలు కథ. మీటూ..అమ్మా అంటూ సమస్యను తెలివిగా పరిష్కరించుకుంటూ, చదువుకోవాలన్న కోరికను తీర్చుకున్న తెలివిగల పనిపిల్ల కథ ఇది. తానధిగమించిన సమస్య డిప్రెషన్ వల్ల పాడవబోయిన ఓ జీవితానికి చక్కని దారి చూపిన ఓ లెక్చరర్, స్టూడెంట్ కథే ఈ డిప్రెషన్. చక్కని సందేశాత్మక కథ. పెరిడోలియా అన్న మానసిక లక్షణాన్ని వివరిస్తూ, మంచి కలలు జీవితానికి చూపిన మంచి బాట గురించి తెలిపిన కథ రెక్కల కొండ. మన మనసే మన ఆలోచనలు అనే బుద్ధుని ప్రభోదాన్నెరిగి జీవితాన్ని ఆనందంగా గడపడమెలాగో తెలియజెప్పే కథ మనసును విను. పెంపుడు జంతువులపై మన ప్రేమ, వాటికి మన మీదున్న ఇష్టాన్ని తెలిపే కథ లైకా. 2035 లో జరగబోయే పరిణామాల గురించి మనుమడు ఊహించి చెప్తే, రాబోయే కాలంలో ఆధునిక పరిణామక్రమం గురించి అమ్మమ్మ తన చిన్నతనంలో చదివిన కథను మనమడికి చెప్పడం చాలా బావుంది. అమ్మమ్మ చేతి ముద్ద నుండి అమ్మ పిలుపుతో వాస్తవంలోకి వచ్చినట్టుగా, జ్ఞాపకాల గోడ కథలానే మనందరి జ్ఞాపకాలు కూడా మనల్ని పలకరిస్తాయి హాయిగా. ఆత్మహత్యలకు గల కారాణాలను సహేతుకంగా వివరిస్తూ, పరిష్కార మార్గాలను కూడా సూచించిన కథ జీవన వారధులు. పిల్లలకు అమ్మ చెప్పే కథల ఆధారంగా కలిగిన అంతరిక్ష యానం వంటి గొప్ప ఆలోచనలను నిజం చేసుకున్న కథ విశ్వం పిలిచింది. తరాల అంతరాయ ఆలోచనలకు అద్దం పట్టే కథ మైండ్ సెట్. 
      ఆధునిక ఆలోచనలు, జ్ఞాపకాలు, మనిషి మైండ్ సెట్, వైవాహిక జీవితాల్లో కొన్ని సమస్యలు, పిల్లల ఆలోచనలు, వాటికి పెద్దల సహకారం ఇలాంటి కథలన్నీ మనకు "రమ్య ద రోబో " లో కనిపిస్తాయి. ఎక్కువగా ఫ్యూచర్ టెక్నాలజీ గురించిన ఊహల కథలున్నాయి. భవిష్యత్తులో ఈ ఊహలే నిజం కావచ్చునేమెా. సులభ శైలిలో 12 కథల సంపుటిగా వెలువడిన "రమ్య ద రోబో " కు హృదయపూర్వక అభినందనలు. 




Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner