30, జులై 2013, మంగళవారం

తెలుగు ఇలా అయిపొయింది...!!




తెలుగుని అభిమానించే బాలు గారు కీరవాణి గారు నిన్నటి పాడుతా తీయగా లో attitude కి అర్ధం మర్చిపోయారు...
వారే ఇలా అయిపోతే ఇక మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి..? ఎవరో దృక్పధం అని చెప్పారు సమయానికి.... నడవడి అయినా సరిపోతుంది..... బాలు గారు పాటలే కాదండి తెలుగు కూడా గుర్తు ఉంచుకోండి అప్పుడప్పుడు ఇలా అవసరం అవుతుంది....!! ఇది ఎవరిని కించపరచడానికి రాసింది కాదు.  

ఇకనైనా మారండి....!!

తెలంగాణా ఇచ్చేస్తారంట  తన్నుకు చావండి.....!! విడగొట్టాలన్నా  ఉంచాలన్నా రాజ్యాంగ పరిధులు అక్కర లేదు, తీర్మానాలు, ఆమోదాలు ఎవరివి అక్కరలేదు..అమ్మగారు ఎంత చెప్తే అంత...సి డ బ్యూ సి సబ్యులంతా కలిసి ఏక వాక్య తీర్మానం చేసే అవకాశం అమ్మగారికి ఇస్తారంట...ఆవిడ గారు కేక్ కత్తిరిస్తారంట... అందరు చప్పట్లు మాత్రమే కొట్టండి...ఇక తెలంగాణా నాయకులంతా కాంగెస్ లోకి దూకండి...విజయశాంతి ముందు వరుసలో ఉంటుంది.. చిరంజీవి గారు దారి చూపారు కదా....!! వీరు అదే దారిలో పోతారు. ఇంకా చాలా మంది ఉన్నారు లెండి కె సి ఆర్ గారితో సహా....

పంచాయితీ ఎన్నికల ఫలితాలకు భయపడి ఇప్పటికిప్పుడు నిర్ణయాలు చేయడంలో నీతి సీమాంద్ర నేతలకు ఇప్పటికయినా అర్ధం అయితే జరగనున్న మిగిలిన పంచాయితీ ఎన్నికలను కాంగెస్ కు వ్యతిరేకం చేయండి...!! కనీసం ఇప్పుడయినా మీ రాజకీయ లబ్ధిని చూసుకోకుండా నిజాయితీగా ఆంద్ర రాష్టం కోసం పనిచేయండి పార్టీలకు అతీతంగా....!! ఇప్పటికయినా కళ్ళు తెరవండి...!! నాయకులే కాదు.. ఓటర్లు మీరు కూడా డబ్బుకు అమ్ముడు పోకుండా మనకోసం ఓటు వేయండి స్వార్ధ నాయకులకు బుద్ది చెప్పండి. 

ఏం మాయ సేసావో...!!

పొద్దు వాలి పోయింది
చీకటింటికి చేరింది
సుక్కల ఎలుగులో ఎక్కడని ఎతికేది
మబ్బుల మాటున దాగిన చల్లనయ్యను...!!
నిశి రాతిరి చీరని నక్షత్రాల మసక ఎలుగులో
అక్కడక్కగా అద్దుకున్న చుక్కలు... 
ఎక్కడో దూరంగా చిన్న తారక
అది నా మావ రూపేమో....!!
ఏ దిక్కునసూసినా ఏ పక్కకు ఎతికినా
నీ రూపే కాన వస్తోంది
నీ తలపే సుట్టు ముడుతోంది
ఇది మనసు సిత్రమో
మనిషి మాయో తెలియకుంది...!!
ఏం మాయ సేసావో...!!
ఏ మత్తు సల్లినావో...!!
ఎరికైతా లేదు.

29, జులై 2013, సోమవారం

ఇంతకీ ఎవరు నువ్వు...??

ఎందుకు ఇష్టమో చెప్పనేలేదు నువ్వు
ఎంత ఇష్టమో మాత్రం తెలియచెప్పావు...!!
ఊహలతో సహవాసమే అన్నావు
ఊపిరిగా మారమంటున్నావు...!!
మనసుకే బందీని అన్నావు
మనిషినే కట్టి పడేశావు...!!
కాలంతో పోటి పడలేనన్నావు
నా కాలమంతా నువ్వే తీసుకున్నావు...!!
మాటలే రావన్నావు మౌనమే నువ్వన్నావు
మౌనంతోనే మాటల గారడీలు చేశావు..!!
అన్ని మరచి పోతానన్నావు
మరుపన్నదే లేకుండా చేశావు నాకు...!!
ఇంతకీ ఎవరు నువ్వు...??

28, జులై 2013, ఆదివారం

ఈ తెలివి చూసారా.....!!

మొదటి విడత పంచాయితీల్లో వెనుకబడిపోయామని కొత్తగా మళ్ళి మరో ప్రహసనం మొదలుపెట్టి రెండో విడత ఎన్నికల ఓట్ల కోసం తద్వారా సీట్ల కోసం అమ్మగారు చేసిన ప్రయత్నం కాస్త సఫలం అయ్యింది...మొత్తానికి  తెలంగాణా ఇస్తున్నాము రండి అంటూ మరోసారి జనాలను మోసం చేస్తున్న రాజకీయ చరురతను అర్ధం చేసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది మనలో ఉన్నారు....??  చేతులెత్తండి మరి... -:).
మింగ మంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం....!! మరి ఏం చేయాలి చెప్మా...ఇలా ప్రాంతాలలో చిచ్చులు పెట్టి ఆడుకోవాలన్న మాట. చూసారా ఎంత తెలివో... అత్తగారు ఉంటే కోడలమ్మ తెలివి చూసి ఎంత సంబర పడిపోయేదో....పాపం...!! ఇక్కడ పాము కప్పల్లో దేనికి బలం ఎక్కువో చూసి దాని వైపు వెళ్ళాలి ఇది అంతే...లాభం ఎటో, ఎంతో చూసుకోవడమే...!!
తెలంగాణా ఇస్తామంటే సిమాంద్ర నేతలు ఊరుకోరు...ఇవ్వమంటే తెలంగాణా నేతలు ముఖ్యంగా అప్పుడప్పుడునే...వేరే ఏ వ్యాపకం లేనప్పుడు జనాలు తనని మర్చి పోతున్నారేమో అని అనుకుంటూ మా తెలంగాణా ప్రజలు వెనుకబడిపోతున్నారు అని గుర్తు చేసుకునే కె సి ఆర్ గారు అస్సలు ఊరుకొరు....మళ్ళి ఎన్నికల వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది....మనమూ చూడటం తప్ప ఏమి చేయలేము కదా...ఇష్టమైతే ఓటు వేస్తాం అంత కన్నా చేయగలిగినది మాత్రం ఏముంది...!! ఇది ఇలా సాగుతూనే ఉంటుంది మనం నాయకులను నమ్మినన్ని రోజులు...కొత్తగా మార్పేం ఉండదు....!! ఎటొచ్చి నాయకులు ఖాళి చేసిన ఖజానాలు నింపడానికి మనకు సంబంధం లేని కరంట్ బిల్లులు కడుతున్నట్లుగానే, రోజు పెరిగే ఇంధన ధరలను... ఇలా దేనిని ఆపలేం...!! 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner