6, డిసెంబర్ 2021, సోమవారం

చీకటి మరకలు..!!

చీకటి మరకలు
చిత్తంలోనే
మగ్గుతున్నాయి

వెలుతురు నీడలో
వెంటాడే
క్రీనీడలకు చిక్కకూడదని

మబ్బుల మాటున
మనసును
దాచే ఆట మెదలయ్యింది

మౌనాన్ని ఆవాహన
చేసుకున్న
మాటలకర్థం వెదుకుతూ

ఓ పక్కన
చితిని పేర్చుతున్నా
భయమనిపించడం లేదు

చెంతనే
చిరునవ్వు తోడుగా
ఉన్నందుకనుకుంటా

గాయాలన్నీ
కాలిపోతాయని
ఎదురుచూస్తూంటే

ఆ గతపు మంటల నుండి
జ్ఞాపకాల నుసి
ఎగసిపడుతూనే వుంది

అక్కడక్కడా
రాలిన కన్నీటి చుక్కల
చెమ్మదనం ఇంకిపోలేదింకా

అక్షరాలకంటిన తడి
అద్దాల మేడలకు 
తాకలేదని ఆలస్యంగా తెలిసింది..!!

5, డిసెంబర్ 2021, ఆదివారం

Manju Yanamadala : పదునైన అక్షరం.. పరిమళించే సాహిత్యం.. మంజు యనమదలకు..

Manju Yanamadala : పదునైన అక్షరం.. పరిమళించే సాహిత్యం.. మంజు యనమదలకు..

3, డిసెంబర్ 2021, శుక్రవారం

రెక్కలు

1.  వదులుకోలేనిది
బలహీనత
తర్కానికి అందనిది
నమ్మకం

ఇహము పరము
తెలుసుకునేది మానవజన్మ..!!

2.  ఉలి దెబ్బలు
భరించాలి
రాతికి
రమణీయత రావాలంటే

నేర్పరితనమంతా
మలిచే తీరుదే..!!

3.   అన్నీ 
ఆశల సౌధాలే
కాసులతో
నిర్మితమిప్పుడు

జీవిత తులాభారమంతా
ధనతూకమే..!!

4.  చెంపదెబ్బ
మాసిపోతుంది
మనసుదెబ్బ
చితి మీద కూడా కాలదు

హింస
పలురకాలు..!!

5.  పరిమితంగా
కొన్ని
అపరిమితమైనవి
మరికొన్ని

అమ్మ దెబ్బల్లో ప్రేమ
తెలియనిదా..!!

6. ముసుగు పేరు
ఆధునికత
మనిషి తీరు
అనాగరికం

పరిజ్ఞానం బట్వాడా అయినది
పరాయితత్వం నుండి..!! 

7.   ప్రశ్నలతోనే
సమస్యలు
బాధ్యతనెరగని
హక్కులు

వితండవాదంతోనే
వింతపోకడలు..!!

8.   అణువే
ఆది అన్నింటికి
ఆకాశానికైనా 
అవనికైనా

దూరానికి 
కొలమానమెప్పుడూ దగ్గరతనమే..!!

9.  మారుతున్నవి
మానవ సంబంధాలే
అనుబంధాలకు
అడ్డుగోడలు కడుతూ

చుట్టరికాలెలా వున్నా
కాలంలో మార్పులేదు..!!

10.   ఓడిపోయేవి
కొన్ని
ఊరటనిచ్చేవి
మరికొన్ని

ఆటేదైనా
నైజమదే..!!

11.   రూపం లేనిది
మనసు
ఉనికి కోసమే
ఆరాటం

మనసు మనిషి మధ్యన
పోరాటమే జీవితం..!!

12.  యుద్ధమేదైనా సరే
సిద్దమే
చాటుమాటుతనం
అలవాటు లేదు

గెలుపోటములు
అక్షరాలకు అంకితం..!!

13.   ఏకపక్షం
కాదేదీ
ఏ జట్టుదైనా
గెలుపే లక్ష్యం

జీవితంలో
ఏ అటైనా..!!

14.   తల వంచని
స్థైర్యం
మెుక్కవోని
ఆత్మవిశ్వాసం

అక్షరాలకు మాత్రమే తెలిసిన
మనసు..!!

15.   ఎదురీతల
జీవితం
ఎడతెగని
అనుబంధాల నిలయం

అమ్మకు అక్షరానికి
ఎరుకైన పాశం..!!

16.   చిరునవ్వై 
సేద దీరుతున్నా
మౌనం
మనసు విప్పిందని

ఆత్మను
అక్షరం పరిపూర్ణం గావించిందని..!!

17.   కలతలు
కారణాలుగా మారుతున్నాయి
బాంధవ్యాలు
భారంగా మారుతున్నాయి

ధనానికి దాసోహం అంటోంది 
సమాజం..!!

18.    ఉచితానుచితాలు
ఆలోచించాలి
అయాచితంగా
మాట జారకూడదు

లాభం సంగతెలా వున్నా
అపాత్రదానం కూడదు..!!

19.   విభజన
ఊసెందుకు
నా నీ ఉనికి
ఒకటే అయినప్పుడు

మనమన్న మాట
మనసులో మెదిలితే చాలు..!!

20.   కలలన్నీ
కల(ల)‘వరాలే
వాస్తవాలన్నీ
వేకువ పొద్దులవే

అడుగులెటు పడినా
అంతిమ ఫలితం కాలానిదే..!!

21.   తల్లీబిడ్డల బంధం
తెచ్చిపెట్టుకుంటే వచ్చే పదవి కాదు
డబ్బుతో కొలవలేనిది
మమతనెరిగిన బాధ్యత

సంస్కారం
జన్మతః ప్రాప్తిస్తుంది..!!

22.   జ్ఞాపకాలన్ని
గత కాలానివే
చెరపలేని రాతలకు
సాక్ష్యాలుగా

భవితతో ముడిబడిన
వాస్తవం మనం..!!

23.   విసుగు
భరించవచ్చు
విరక్తి
రానివ్వకూడదు

మనిషికి 
జీవితానికి తెలియాల్సినవి..!!

24.   వీగిపోతున్న 
చుట్టరికాలు
కొలమానంగా మారిన
ధనము

మనిషితనానికి మిగిలిన
ప్రశ్నార్థకమీనాడు..!!

25.   నిరాశ
చుట్టమౌతోంది
ఆశ
ఆకాశం వైపు చూపెడుతోంది

అనుబంధాలు
ధనాత్మకమైపోతున్నాయి..!!

26.   వెలితి
తెలుస్తోంది
వెతలు
వెంబడిస్తుంటే

కాలం
నిర్వికారంగా సాగిపోతూనే వుంది..!!

27.    వెతలు
వెంటాడుతునే ఉంటాయి
బాధ్యతలు
బంధాలకు చిక్కుబడిపోయాయి

అవినాభావ సంబంధం
కాలానిది జీవితానిది..!!

28.   అనుభవాల
ఆటుపోటులే అన్ని
చిక్కుముళ్లను
విప్పుకుంటూ

భూమ్యాకాశాల కొసలను
కలిపే కాలయంత్రంలో..!!

29.   చుట్టరికానికి కొలమానం
ధన సంబంధం
మనిషితనానికి తూగేది
ఆత్మానుబంధం

కాలపు తక్కెడలో
తూకపురాళ్ళెప్పుడూ ఒకటే..!!

30.  కనబడే అబద్ధం
పొగడ్త
వినబడని నిజం
విమర్శ

కొలవలేని దూరం
రక్త సంబంధాల మధ్యన..!!

1, డిసెంబర్ 2021, బుధవారం

అవస్థ..!!

మనిషికి
మనసుకు 
మధ్యన అవస్థ

మాటకు
మౌనానికి
మధ్యన అవస్థ

బంధానికి
బంధనానికి
మధ్యన అవస్థ

ఆక్రోశానికి
ఆనందానికి 
మధ్యన అవస్థ

ప్రేమకు
ద్వేషానికి 
మధ్యన అవస్థ

అహానికి
ఆత్మాభిమానానికి 
మధ్యన అవస్థ

అక్షరానికి
పదానికి
మధ్యన అవస్థ

అనుభవానికి
సంఘర్షణకి
మధ్యన అవస్థ

చావుకు
పుట్టుకకు
మధ్యన అవస్థ

దూరానికి
చేరువకి 
మధ్యన అవస్థ

వ్యవస్థకి
వ్యక్తికి
మధ్యన అవస్థ

అర్థానికి
పరమార్థానికి
మధ్యన అవస్థ

ఆదికి
అంతానికి
మధ్యన అవస్థ

జీవితానికి
జీవించడానికి
మధ్యన అవస్థ..!!

18, నవంబర్ 2021, గురువారం

రెక్కలు

1.  సాహిత్యం
అందరిది
రాహిత్యం
కొందరిదే

అనుభవసారమే
జీవితం..!!

2.   బాధ 
భరించాలి
దిగమింగడం
అలవాటు చేసుకుంటూ

బంధం
భారమని అనుకోలేం కదా..!!

3.   వంకర నవ్వులు
సంకర బుద్ధులు
వెకిలి చేష్టలు
అనాగరిక భాష

ఇదే ఈనాటి
రాజకీయ అసెంబ్లీ..!!

4.  ఆత్మీయత
అనుబంధానిది
అవసరం
అధములది

ఊరటనిచ్చేది
అక్షరాలేగా..!!

5.   అనుభూతులన్నీ
మనసువే
భావాల పరంపర
అక్షరాలకు కరతలామలకమే

అతిశయాల అనుభవాల 
సమ్మిళితమే జీవితం..!!

6.   కాలం ఎప్పుడూ తన పని 
తాను చేసుకుపోతుంటుంది
ఓడలు బళ్లు బళ్లు ఓడలు 
అవుతుంటాయి

నిరంతర ప్రక్రియను
ఆపడం మన తరమా..!!

7.   అలసిన మనసులకు
ఆశల హరివిల్లు
వెంబడించే బంధాలకు
మమతల పొదరిల్లు

పదిలంగా పొదుపుని
మోసే కుటుంబకావడి..!!

8.   గమ్యం
తెలుసు
గమనం
సాగదు

సగటు మనిషి
సందిగ్ధజీవనం వాదనలోనే..!!

9.  ఆలోచనలు
అనంతాలు
ఆచరణలు
అరకొరలు

వేదనను మిగిల్చిన 
వాదనదే పై చేయి..!!

10.   ఎడతెగని
గిల్లిగజ్జాలు
ఏమరుపాటున
ఏకాంతాలు

జీవిత రాదారిలో
రచ్చబండ పంచాయితీలు..!!

11.  మనసెరుగని
మమత లేదు
మనిషికి తెలియని
మాయ లేదు

కలియుగ ధర్మమిది
కలికాలంలో..!!

12.   మనసుల మధ్యన
అంతరం 
మనుష్యుల నడుమ
బంధం

ఏ రెండిళ్ళకయినా
దూరమెుకటే..!!

13.   అర్థమయిన
చేతలు
అడ్డు తొలగించనలవి కాని
అపార్థాలు

అహం ముడిబడిన
అడ్డదిడ్డమైన గీతలు..!!

14.   బంధమంటే
బాధ్యత పంచుకునేది
ఇష్టమంటే
నిన్ను నిన్నుగా చూసేది

తొలి మలి అడుగులకు మధ్యన
మంజీరపు మంజూషాలు..!!

15.   ఆభరణాలు
అందమే
నోటి మాట
మనసుదైనప్పుడు

సహజత్వం
అరుదైన వ్యక్తిత్వం..!!

16.   బాధలు
బారెడు
ఆశలు
ఆకాశమంత

తూకం తేలని లెక్కలే
జీవితమంటే..!!

17.   శూన్యానికి
చుట్టం
అంబరానికి
అందం

మబ్బుల్లో మసక వెలుతురు
జీవితపు సుఖసంతోషాలు..!!

18.  వెతల కుంపటి
వాడుకోవాలి
చలిని
కాచుకోవడానికి

అవకాశాలను
అందిపుచ్చుకోవాలి గెలవాలంటే..!!

19.  రెక్కల వంతెన
పరిచుంది
రెప్పల తేరుపై
కలల పయనానికి

నిద్రావస్థ
మనోవిహంగం..!!

20.   మరలిన కాలం
మళ్లీ రాదు
చెదిరిన మనసు
కుదురుకోదు

జీవిత పుస్తకంలో
ఖాళీ పేజీలుండవు..!!

21.  శూన్యంలో
అన్వేషణ మెుదలు
యుద్ధానికి 
సిద్దమైన మనసుతో

మనిషి ఆరాటం ఎందుకన్న 
ప్రశ్నకి అంకురం వెదుకుతూ..!!

22.   వెలుతురుకై
వెతుకులాట
చీకటి చుట్టానికి
అక్షరాల తోవ చూపిస్తూ

మనసు
నిరంతరాన్వేషి..!!

23.   కల(ల)వరాలన్నీ
కలబోసుకున్నాయి
మరలిన కాలాన్ని
మార్చలేమంటూ

మౌనం గమ్యానికి
మార్గాన్ని చూపెడుతుందొక్కోసారి..!!

24.   ఇరుకున పడినవి
బంధాలు
ఇబ్బంది పెడుతున్నది
మనుష్యులు

సమాజ జీవనం
సహజ పంక్తి భోజనం..!!

25.   బరువైనా భారమైనా
భరించాల్సిందే
బడబానలం
మదిని చుట్టుమట్టినప్పుడు

జీవితపు నిఘంటువుకి
సాటిరావేవి..!!

26.  వెతుకులాట
తప్పనిసరి
ప్రయోజనం లేదని
తెలిసినా

ప్రాయోజితం 
కొందరికని తెలుసు..!!

27.   ఏకాకి జీవితానికి
నిర్వచనం
జగమంత కుటుంబానికి
అక్షర దర్పణం

గగనాన మెరిసిన
సినీవాలి..!!

28.   రాయికి చూడచక్కని
రూపాన్నైతే ఇవ్వగలం
లేని మనసుని 
ఆపాదించలేం 

వింతైన పోకడలు
మనిషికే సొంతం..!!

29.   గర్భగుడికి
గర్భస్థానానికి పొంతన
రాతికి
మనిషికి వున్న అనుబంధం

మనసుదే ప్రధమస్థానం
నమ్మకంలో…!!

30.   ముంచాలనుకుంటే
ముంచగలమా
లేపాలనుకుంటే
లేపగలమా

ఎత్తుపల్లాలు వైపరీత్యాలు
ప్రకృతి సహజాలు..!!


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner