31, ఆగస్టు 2013, శనివారం

సమ న్యాయమా సమైఖ్యమా.....!!

రాజకీయ నేతల స్వార్ధంతోనే తెలంగాణా విభజన మొదలైందని ఈ పాపం కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలది అని మాజీ మంత్రి, అధికార భాషా సంఘం అద్యక్షులు మండలి బుద్దప్రసాద్ అన్నారు. వై ఎస్ జగన్ సమ న్యాయం లేదా సమైఖ్యం అంటూ గత ఏడురోజులుగా చేస్తున్న దీక్షను భగ్నం చేసారు...జగన్ దీక్షను కొనసాగిస్తారని...కె సి ఆర్ గారు కూడా ఫ్లూయిడ్స్ ఎక్కించుకుని దీక్షను చేసారని గుర్తు చేసిన జగన్ అనుచరులు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ గారి మాటల ఆంతర్యం అర్ధం కాక సొంత పార్టి లోనే తర్జనబర్జనలు పడుతున్నారు. అధిష్టానానికి ఎదురు చెప్పని విధేయులు  సమైఖ్యాంధ్రకు మద్దత్తుగా మాట్లాడుతుంటే పార్టీని సీమాంధ్రలో బతికించుకోవడానికా లేక కొత్త పార్టీని పెట్టబోతున్నారా అని సందిగ్ధంలో ఉన్నాయి పార్టీ శ్రేణులు. పార్లమెంట్లో వాదనలు వినిపించడానికే రాజీనామాలు చేయలేదు....వాదనలు వినిపించక పొతే బిల్లు ఆమోదం పొందుతుంది...రాష్ట్రం సమైఖ్యంగా లేక పొతే పార్టీ నుంచి తప్పుకుంటానన్న లగడపాటి. చంద్రబాబు గారి ఆత్మ గౌరవ యాత్ర....దేనికోసం..!! ఆగని సీమాంధ్ర, తెలంగాణా ఉద్యోగుల నిరసనలు....గత ముప్పై రెండురోజులుగా జరుగుతున్న దమ్ము తగ్గని సీమాంధ్రుల నిరసనల హోరు...పొరు....అదే జోరు. సమ న్యాయమా సమైఖ్యమా....!! అంటూ ఇంటా బయటా నిరసనల వలయంలోను ఎటూ తేల్చని హై కమాండ్ అమ్మగారు...!!  

28, ఆగస్టు 2013, బుధవారం

నీ మనసు మారదెందుకో....!!

శిధిలమైన శిల్పాన్ని అయినా...
చిత్రంగా సజీవమైన ఆకృతిని....!!

జీవనాడులు పని చేయకున్నా...
జీవితాంతం నీకోసం చూస్తున్నా....!!

ప్రాణమే వేసారి పోతున్నా అదేంటో మరి...
నీ మీద ప్రేమ మాత్రం పెరిగి పోతూనే ఉంది...!!

నింగి నేలా కలసిన ఆ చోటు నిజం కాకపోయినా....
నీలో నేను లేనని తెలిసినా నా శ్వాస ఆగలేదు...!!

కరకు రాయికైనా మనసుండదా అని...
కఠిన పాషాణము కరుగదా... కరుణ చూపదా...!!

నీ జ్ఞాపకాల తలపుల వరదలో....
నే మునిగి కొట్టుకు పోతున్నా.... నీ చేయి అందక....!!

అయినా నీ మీదే మరులు ఎందుకో....
నీ మనసు మారదెందుకో....!!

27, ఆగస్టు 2013, మంగళవారం

నేను తెలియదంటూనే....!!

నిన్ను నువ్వే దాచుకుంటావెందుకు...??
నువ్వేమిటో నాకు తెలియదనుకుంటున్నావా...!!
నాకు తెలిసిన నువ్వు నీకు తెలియక పోయినా....
నీకు తెలిసిన నువ్వు నాకెప్పుడో తెలుసు....!!

నాదైన ప్రతి క్షణమూ నీతోనే ఉంటే...
నేను చెప్పే ఊసులన్ని నీతోనే అయితే....
నేను పంచుకునే అనుభూతుల
సరాగాల సంపెంగలు నీ చుట్టూనే పరచుకుంటే....!!

దాచినా దాగని నీ మౌన వీచికల అల్లరి
గాలి వాటుగా నను చేరుతుంటే...!!
కోపంలో మరచిన అలుకలో ఎర్రనైన మోము
ముద్దమందారంలా ముగ్ధ సింగారాన్ని
చిరునవ్వుల నయగారాన్ని మోసుకొస్తే
ఇంకా ఎందుకోయ్....!!
నేను తెలియదంటూనే.... నిన్ను నువ్వు
దాచేసుకోవాలని చూస్తున్నావు....!!

24, ఆగస్టు 2013, శనివారం

స్నేహ బుజ్జాయిలా....!!

అమ్మ ఒడిలో పసిపాపాయిలా చేరి
ముద్దు మురిపాలలో ముంచి
అల్లరి ఆటలు కోపాల బుంగమూతి అలుకలు
అది కావాలి ఇది కావాలి అని మారాలు....
అమ్మా..!! కధ చెప్పవూ అంటూ
పక్కనే చేరి వింటు  వింటూనే
నిదురమ్మ ఒడిలో చేరి
అమ్మ చేతి స్పర్శలో హాయిగా
బజ్జుండిన ఆ నువ్వేనా...!!
ఎదిగిన వయసుతో
పరిణితి చెందిన మనసుతో
అమ్మకు తోడుగా నీడగా
ఆసరాగా ఆలంబనగా
అమ్మ ప్రపంచమే నువ్వుగా
అమ్మతో స్నేహ బుజ్జాయిలా ఈనాడు....

ప్రతి పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవాలని ఆశల తీరాలను అందుకోవాలని కోరుకుంటూ
                                                      ప్రేమతో
                                                      అమ్మ
( ఓ అమ్మ తన ఎదిగిన కొడుకు కోసం తన మనసును అక్షరాలుగా అడిగితే రాసిన కవిత )

23, ఆగస్టు 2013, శుక్రవారం

మనసున్న మగువ.....!!

రాతి యుగమైనా... రావణ యుగమైనా మగువ గువ్వలా ఒదిగి పోయింది తన స్థానంలో... తనకున్న పరిధిలో...!! ఏ చట్రంలో పెట్టినా తనకంటూ ఒక ఉన్నత స్థానాన్నే సంపాదించుకుంది. అమ్మగా తన బాధ్యతను, బంధాలను, అనుబంధాలను ఇలా అన్నిటిని సమన్వయ పరచుకుంటూ ఇంటి బాధ్యతనే కాక బయటి  అదనపు బాధ్యతలను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తోంది ఈనాడు. మగువ ఎప్పుడు బాధ్యతలకు బంధాలకు దూరంగా పారిపోవాలని అనుకోదు...అది ఆధునిక మహిళ అయినా.... ఏమి తెలియని పల్లెటూరి అమాయకురాలైనా పరిస్థితులతో పోరాడుతుంది ధైర్యంగా.
అమెరికా వంటి ఆధునికంగా అభివృద్ధి చెందిన దేశంలో కూడా మగువ పరిస్థితిలో పెద్దగా మార్పేం లేదు...కాకపొతే అక్కడి మహిళల్లో కాస్త ధైర్యం ఎక్కువ. అవసరమైతే ఒంటరిగా జీవించడానికి కూడా భయపడదు. ఇద్దరికీ ఇష్టమైతే కలిసి ఉంటుంది లేదా ఎవరికీ వారే యమునా తీరే చందాన బతికేస్తుంది కాని ఎవరో ఏదో అనుకుంటారని తన ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం సహించదు. వివాహ వ్యవస్థ పటిష్టంగా లేకపోయినా....బంధం ఎలాంటిదయినా విడిపోయినప్పుడు నష్టం మహిళకే ఎక్కువ. ఒంటరిని అని పిల్లలని వదలివేయదు, భరణం కోరదు....జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. నాకు బాగా నచ్చిన అంశం అక్కడి మహిళల్లో ఒంటరి జీవితంలో ధైర్యంగా బతకడం. కలిసి ఉన్నప్పుడు బాధ్యతలను సమంగా పంచుకోవడం.. .విడిపోయినప్పుడు అయ్యో జీవితం పాడయ్యిందే ఎలా బతకాలి అని బాధ పడకుండా మరో కొత్త జీవితానికి తొందరగా అలవాటు పడటం....ఇలా కొన్ని విషయాల్లో ఆ నాగరికత బావుంటుంది. కాకపొతే అదే సర్వ జనీనం కాదు.
ఇక మన విషయానికి వస్తే ఇక్కడి వివాహ వ్యవస్థ భద్రతతో కూడుకున్నది ఒకప్పుడు. ఏవైనా కలతలు వస్తే పెద్దలు సర్ది చెప్పడం లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు సరిపెట్టుకోవడంతో బంధం నిలబడేది. నా ఇల్లు నా వాళ్ళు అనుకుంటే ఏ బంధమైనా ఎన్ని కలతలు కస్టాలు వచ్చినా చెక్కు చెదరక అలానే నిలబడుతుంది. ఇప్పటి మహిళల్లో చాలా మంది చిన్న చిన్న కారణాలకు కూడా పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ అదే ఆత్మ గౌరవం అన్న భ్రమలో బంగారు జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మన వివాహ వ్యవస్థను అందరు ఆదర్శంగా తీసుకుంటుంటే మనమేమో స్వతంత్రము, సమాన హక్కులు అంటూ పరాయి నాగరికతలో చెడు వైపు తొందరగా ఆకర్షితులమౌతున్నాము. అమెరికా వంటి దేశాల నాగరికతకు అలవాటు పడి చిన్న చిన్న విషయాలకు కూడా విడాకుల వరకు పోతున్న బంధాలు ఎన్నో ఈ రోజుల్లో. సహజీవనమంటూ వెర్రి తలలు వేస్తున్న కొత్త నాగరిక ప్రపంచంలో పడి పోతున్న ఎన్నో జంటలు రేపటి తరాల భవిత గురించి ఆలోచించకుండా తమ స్వార్ధం చూసుకుంటున్నారు. ఎందరో ఇష్టపడే మన వివాహ వ్యవస్థను మనమే నవ్వులపాలు చేస్తున్నాము ఆధునికత పేరుతో. తప్పని పరిస్థితిలో విడిపోవాలి కాని అది ఒక గొప్పదనానికి గుర్తుగా అనుకోకూడదు. మనతో పాటు పిల్లల మనసులు కూడా ఎంత బాధ పడతాయో ఆలోచించాలి. మన సమాజంలో భర్త లేని భార్యను ఎంత చిన్న చూపు చూస్తారో....ఆమెను పిల్లలను మాటల
తూట్లతో కుళ్ళబొడుస్తారు. ఒంటరిగా బతకడానికి అవకాశం ఇవ్వని రోజులు ఉన్నాయి. ఇప్పటి పరిస్థితి అలా లేదనుకోండి కాని ఇద్దరి మధ్య బంధం భిన్నత్వంలో ఏకత్వంలా ఉండాలి కాని ఏకత్వాన్ని విభజించరాదు. ఒక్కటిగా ఉండాలి కాని విడిపోవాలి అని కారణాలు వెదుక్కొకూడదు. ఆధునికతలో మంచిని తీసుకోవాలి కాని నాగరికత వెర్రి తలలు వేయకూడదు. భిన్న మనస్తత్వాల కలయికే కుటుంబం...అది మన సొంతం. అందరు దాన్ని చూసి గర్వపడాలి....ఆచరించాలి. మగువకు అర్ధం మమత, సమత, మానవత్వం, మంచితనం, కరుణ, ప్రేమ, సహనం... ఇలా అన్ని కలిపి దేవుడు సృష్టించిన ముగ్ధ మూర్తి. ఆధునికత ఎన్ని కొత్త పుంతలు తొక్కినా ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని...నిలుపరా నీ జాతి నిండు గౌరవం.....!!

22, ఆగస్టు 2013, గురువారం

ఇంత బావుంటుందని.....!!

మరచి పోయిన గతం అనుకున్నానే....!!
ఎందుకలా పదే పదే గుర్తుకొస్తావు.....??
తరిగి కరిగి పోయిన కాలంలో
మరుగున పడిపోయావనుకున్నా....!!
ఇలా అనుక్షణం నను వెంటాడతావనుకోలేదు....!!
రాలి ఎండిపోయిన ఆకుల్లా
నలిగి ఎగిరి పోయావనుకున్నా...!!
కానీ...ఇంతలా నా మదిలో ఉండి పోతావనుకోలేదు...!!
దూరంగా వెళ్ళాననుకున్నా...కానీ...
ఇంత దగ్గరగా వస్తావనుకోలేదు...!!
వదలి పోయిన నీ జ్ఞాపకం
ఇంత బావుంటుందని ఇప్పుడే తెలిసింది...!!

20, ఆగస్టు 2013, మంగళవారం

దాసోహమంటూ...!!

మనసు సతమతమై పోతోంది ఎందుకో
నీ భావనల అలజడి తాకిడికి తట్టుకోలేక...!!

గుండె గొంతుక కొట్టుకుంటోంది ఆగకుండా
నీ ఊసుల వెల్లువలో తడిచిపోతూ...!!

మది కలవర పడి పోతోంది తెలియకుండానే
నీ జ్ఞాపకాల ప్రవాహంలో మునిగిపోతూ...!!

ఎద ఎగిరి పడుతోంది అనుక్షణం
నీ గురుతుల గాయాలతో ఊపిరందక... !!

ఏదో తెలియని మాయ కమ్మింది నా చుట్టూ
నీ అనుభూతుల పరిమళం అనుకుంటా అది...!!

నీతోనే ముడిపడిన నా ప్రపంచం 
ప్రతిక్షణం కనుల ఎదుట నిన్నే తలపిస్తోంది..!!

ఎందుకో ఈ అంతంలేని అనురాగం
ఎల్లల్లు లేని నీ అభిమానానికి దాసోహమంటూ...!!

18, ఆగస్టు 2013, ఆదివారం

వేల జన్మలు జీవించి.....!!

దేశం కోసం వేల జన్మలు జీవించి
మరణమన్నది దరి చేరకుండా
పురిటి గెడ్డను కావలి కాయాలనుంది...!!

కన్నతల్లిలా అక్కున జేర్చుకున్న పుణ్య భూమి
అనుబంధాలను మమతానురాగాలను పెంచిన
మాతృభూమి ఋణం ఎన్ని జన్మలెత్తితే తీరును...!!

కన్నవారి పాశం తలకొరివితో సగం తీరినా
అన్ని బంధాల నిచ్చిన ఆత్మ బంధువు
జన్మభూమి మమకారం ఎప్పటికి మాయమౌను...!!

బతకడానికి సప్త సముద్రాలు దాటి పోయినా
మనసున్న మారాజులు మరువలేని మాతృ ప్రేమ
అమ్మ ప్రేమకు ధీటుగా దొరకునా ఏదైనా ఎక్కడైనా....!!

ఎలా ఉన్నా ఎప్పుడు వచ్చినా తోసి పారవెయ్యని
అమ్మని గన్న యమ్మ మన భారతమ్మ
రారమ్మని అక్కున జేర్చుకుంటుంది ఆనందంగా...!!

అందుకే వేల సార్లు మరణించినా
మళ్ళి మళ్ళి ఈ నేల మీదే పుట్టాలనుంది
తనివి తీరని మాతృభూమి స్పర్శలో సేద తీరాలని...!!

17, ఆగస్టు 2013, శనివారం

పనికిరాని విషయానికి పెద్ద పీట....!!

ఎవరో వి హెచ్ గారి మీద తిరుపతిలో చెప్పులు విసిరారట....అదో పేద్ద  విషయంలా ఓ....గొంతు చించుకుంటున్నారు అందరు...సీమాంధ్ర పనికిరాలేదు కాని తెలంగాణా నాయకులకు సీమాంధ్రలో ఉన్న దేవుడు పనికివచ్చాడు కాబోలు....వీలు కాక వెంకన్నను వదిలేసారు కాని లేకపోతే తిరుమల తిరుపతి కూడా మా తెలంగాణం లోనిదే అనేవారు....ఎవరో కడుపు మండి విసిరిన చెప్పుకు ఆ పార్టీ వాళ్ళు వెనుక ఉండి చేయించారు వీడియోలు చూడండి అది ఇది అని గొంతు చించుకుంటే ఎవడికి పడుతుంది ఈ గోల....ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియక అందరు ఆందోళనలో ఉంటే నా మీద చెప్పు వేసిన వాడిది ఏ పార్టినో కనుక్కోండి అంటుంటే నవ్వు రాక చస్తుందా చెప్పండి...!!
మరి ఆనాడు తెలంగాణా కోసం కె సి ఆర్ గారికి ఎవరు అనుమతి ఇచ్చారు...?? అదే దీక్షలు ఇప్పుడు చేయాలంటుంటే ఎందుకు నిరాకరిస్తూ సంబంధం లేని కారణాలు చెప్తున్నారు...?? ఎక్కడో మారుమూల అవనిగడ్డలో అసలు ఏకగ్రీవంగా ఎన్నిక జరగాల్సి ఉండగా ఆరు నెలల అధికారం కోసం చనిపోయిన బ్రాహ్మణయ్య గారి సీటు కోసం ఎన్నడు లేని విధంగా దిగజారిన కాంగ్రెస్ పార్టి ఉప ఎన్నికలకు పోటి పడగా ఉప ఎన్నిక ఈ నెల ఇరవై ఒకటిన జరుగుతుంటే విజయవాడలో శాంతి భద్రతలు కాపాడటానికి మన పోలీసుబాబులు ముందు జాగ్రత్త చర్యల ముందు చూపు ఎంత బావుందో చూశారా....!! ఎప్పుడు అంతా అయిపోయిన తరువాత తీరికగా వచ్చే రక్షక దళంకి ఇంత ముందు చూపా...!! నమ్మలేని నిజం...!! సీమాంధ్ర ఉద్యమం నాయకుల చేతి నుంచి ఎప్పుడో జారి పోయింది. ప్రజలు చెప్పినట్టు నాయకులు పార్టీలకు అతీతంగా నడవాల్సిన పరిస్థితి వచ్చింది. వెనుక పడి పోయాము మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి అంటే సరిపోతుందా....!! చాలా జిల్లాలు వెనుకపడే ఉన్నాయి మరి అవి అన్ని అభివృద్ధికి నోచుకోవద్డా...!! దీక్షలు చేస్తున్నారని రోజుకో రాష్ట్రం లెక్కన ఇస్తారా మేడం గారు...!! భరతావనిని ఎన్ని ముక్కలు చెక్కలు చేయాలని కంకణం కట్టుకున్నారో....!!
ఉద్యమాలు చేయడం, దీక్షలు చేయడం మాకు వచ్చు.....మీ దగ్గరే నేర్చుకున్నాము.....మీరు చూపిన దారిలోనే నడుస్తున్నాము కాకపొతే మీరు దోచుకోవడానికి చేస్తే మేము అదే పనిని అందరి అభివృద్ధి కోసం....నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని....మీ దారే మా రహదారిగా చేసుకున్నాము....!!ఎందుకీ విభజన అస్త్రం అన్నది అమ్మగారికే ఎరుక...!! మీరు మీరు తన్నుకు చావండి చచ్చాక మిగిలిన బలాబలాల్లో చూసుకుంటాను ఆంధ్రానా...!! తెలంగాణానా...!! అని సినిమా చూస్తున్నారు హై కమాండ్....!! చూద్దాం ఏం జరుగుతుందో.... !!

16, ఆగస్టు 2013, శుక్రవారం

నేను నియంతని......!!

నేను నాకు తెలిసినప్పటి నుంచి నియంతనే అనుకున్నాను...కాని అభిమానాల విలువలకు దూరం అవుతున్నా అనుకోలేదు....నాకంటూ సృష్టించుకున్న నా ప్రపంచంలో అందరు నాకు నచ్చినట్లే ఉండాలనుకున్నా కాని నేను వాళ్ళ వాళ్ళ ఇష్టాలను తుంచేసి మనుష్యులను బంధించానని అనుకోలేదు. మనిషిని కట్టడి చేయగలను కాని మనసును దేని నుంచి కట్టడి చేయలేనని ఆలస్యంగా తెలిసింది. శృంఖలాలు మనిషికే కాని మనసుకు కాదు. ఎంత మందిని నా గుప్పిటలో పెట్టుకోగలను...బలవంతంగా....!! ప్రేమగా దగ్గరకు వస్తే విలువ తెలియక దూరం చేసుకున్నా ఒకప్పుడు....ఆత్మీయత అంటే తెలియక...!! ఒంటరితనంలో ఏకాంతాన్ని ఇష్టపడుతున్నా అనుకున్నా కాని ఏకాకిలా మారిపోయానని ఊహించలేదు. ఎప్పుడో దూరంగా విసిరి పారవేసిన బంధం ప్రేమగా దగ్గరకు వచ్చినా...అందుకోలేని నా నిస్సహాయత, నా రక్తపాశాన్ని కూడా ఆర్తిగా పలకరించక అడ్డుగా వచ్చిన నా అహం...నన్ను చూసి ఎగతాళి చేసినట్లు అనిపించింది. గాంభీర్యాన్ని అద్దెకు తెచ్చుకున్నా అది నన్ను వదిలేసి పారిపోయింది....నీకెవరు లేరు ఇక నేను మాత్రం నీతో ఎందుకు అని...!! బతికే ఈ నాలుగు రోజుల కోసం....ఏ క్షణం ఎక్కడో తెలియని ఈ కాలచక్రంలో ప్రాణమున్న ఈ క్షణం నాది అనుకోకుండా మనది మన అందరిది అనుకోవాలని అనుకుంటూనే మళ్ళి నాలానే మారిపోతూ ఉన్న నేను....నా కోల్పోయిన ఆనందాన్ని తిరిగి తెచ్చుకోగలనా.....!!
ఆత్మాభిమానం నాది అనుకున్నానే కాని నా చుట్టూ అహంకారం అనే అడ్డుగోడను నేనే కట్టుకున్నా అని అస్సలు ఊహించలేదు....అదే నన్ను మాయలో పడేసి నా అన్న అందరికి దూరం చేసి చోద్యం చూస్తోంది ఇప్పుడు....నా చుట్టూ ఉన్న అనుబంధాలలో ఎన్ని నన్ను నన్నుగా ఇష్టపడుతున్నాయి...?? వాళ్ళ అవసరం కోసం నాతో ప్రేమని నటిస్తున్నారేమో...!! ఎందుకో ఇలా నాకంటూ ఉన్న అన్ని బంధాలను దూరం చేసుకుని ఉన్న అనుబంధం నిజమని భ్రమలో బతుకుతున్నానేమో...!! అందరు నావెంటే ఉన్నారనుకొని ఎందుకో వెనుకకి తిరిగి చూస్తే నా నీడ కూడా నా వెనుక లేదు అందుకే నియంత కి తోడు నియంతేనేమో....!! 

14, ఆగస్టు 2013, బుధవారం

పుట్టినరోజు శుభాకాంక్షలు.....!!

 
     అల్లరి శౌర్యకు 
     పుట్టినరోజు        
   శుభాకాంక్షలు

     ప్రేమతో
    అందరూ......!!



http://naalonenu-manju.blogspot.in/2010/08/blog-post_14.html

12, ఆగస్టు 2013, సోమవారం

ఆంధ్ర రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలుగా విడి పోనుందో...!!


తెలంగాణా ఇస్తే సీమాంద్ర ఉద్యమాలు...ఇవ్వకపోతే తెలంగాణా పోరాటాలు చేస్తూ జనాలు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు తప్ప....నాయకులు హాయిగా ఉన్నారు. ఏది చేసినా నాయకులు ఇబ్బంది పడితే తప్ప పరిస్థితిలో మార్పేం ఉండదు. ఉభయ సభలు పోట్లాటలతో వాయిదా పడటం తప్ప ఒరిగేదేం లేదు. రాజీనామాలు, నిరసనలు తప్ప ప్రజా సమస్యలు ఎవరికీ అక్కరలేదు...ఈ రోజు తెలంగాణా... రేపు రాయలసీమ.... ఎల్లుండి ఉత్తరాంధ్ర... మరి ఎన్నిరాష్ట్రాలు రాష్ట్రంలో ఏర్పడనున్నాయో...!! అభివృద్ధి లో అందరు వెనుకబడినవారే మరి...!! ఎవరి ప్యాకేజీలు ఎంతో తేల్చుకోండి....!!

కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి.....!!

ఇప్పుడే అందిన తాజా వార్త...!! ఒకప్పుడు ఉల్లి కోస్తే ఆ ఘాటుకి కన్నీరు వచ్చేది....మరి ఇప్పుడో...!! ఉల్లిని తలచుకుంటేనే కన్నీరు కారి పోతోంది. ఉల్లి ధర కూడా పై పైకి వెళ్ళి అందనంత దూరంలో కూర్చుంది....ఒకప్పుడు ఎనిమిది రూపాయల ఉల్లి రాను రాను పెరిగి పదై, పన్నెండై, ఇరవై.... ముప్పై అయి ఒక్కసారిగా యాభై నుంచి డెబ్బై కి చేరింది ఇప్పటికి... పచ్చి మిరపకాయల కారం ఇంతకు ముందే వందకు చేరి చేతికి అందకుండా పోయింది...పెట్రోలు రోజుకి రెండు సార్లు పెరుగుతూ ఉంటే....అదే తీరుగా ఎప్పుడు కనిపించని కరంటుకి చక్ర వడ్డీ కడుతూ... ఇలా నిత్యావసరాలు ఒక్కొకటిగా ఎదిరి ఆకాశంలో చుక్కల పక్కన కూర్చుంటుంటే తల ఎత్తి అందని ఆకాశాన్ని చూస్తూ చుక్కలనంటిన ధరలను తల్చుకోవడమే...!!

10, ఆగస్టు 2013, శనివారం

రగులుతున్న రాష్టం ఏమౌతుందో...!!

నినాదాల గోలతో హోరెత్తుతోంది సీమాంద్ర....జన జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి ఓ పక్క పెరుగుతున్న ధరలు, ముంచెత్తుతున్న వరదలు, నీళ్ళు లేక ఎండి బీటలు పడుతున్న నారుమళ్ళు, పంట పొలాలు, ఒక గొంతు కాదు వేల వేల గొంతుల గోడు వినపడటం లేదా.....కనపడ లేదా...!! పదవుల కోసం అగచాట్లు..!! రాజీనామాల బాటలో జగన్ విజయమ్మ...!! సమైఖ్యానికి సుముఖంగా మాట్లాడారని ముఖ్యమంత్రి కిరణ్ పై ఎదురు దాడి... హై  కమాండ్ దృష్టిలో పడటానికి ఎవడి తంటాలు వాడివి పదవి కోసం..!! టి వి లకు సందడే సందడి...!! ఎవడి గోల వాడిది...!! వద్దంటే వీడికి కోపం... ఇమ్మంటే వాడికి కోపం..!! రగులుతున్న రాష్టం ఏమౌతుందో...!! ఎటు పోతుందో...!!

సిగ్గుతో తల వంచుకుంటూ...!!

మన ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు చెప్పిన మాటలు ఆలోచించాల్సినవే....కావూరి గారు అన్నది నిజమే మరి... శ్రీకృష్ణ కమిటి పనిచేసింది ప్రాంతీయత కోసం..కాని ఆంటోని కమిటితో ఉపయోగం పార్టీకే...ప్రాంతాలకు,   ప్రాంతీయతకు కాదు. తెలుగు జాతి తలవంచుకునే పరిస్థితి ఇప్పుడు మనకు వచ్చింది. ఇది మన స్వయంకృతాపరాధమే...బలమైన ప్రాంతీయతను బలహీనం చేసి తన లాభం చూసుకుంటున్న ఈ కుహనా రాజకీయాలు, కుతంత్రాలు చూస్తూ కూడా ఇంకా ఈ కమిటిలకు విలువ ఇవ్వాల్సిన లేదు. ఒకే భాష మాట్లాడే ప్రాంతాన్ని విభజన పేరుతొ వేరు చేసి తెలుగు జాతిని నిర్వీర్యం చేసి తన పెత్తనాన్ని కాపాడుకోవాలని ఏమి కాని ప్రాంతీయతకు సంబంధం లేని ఓ నాయకురాలు ఎవడో దీక్ష చేసాడని ముక్కలు చెక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమి చేయలేని మనం గెలిపించిన నాయకులది తప్పా...!! లేక అలాంటి నాయకులకు పట్టం కట్టిన మనది తప్పా....!! ఎంతో బలముండీ వారి  బలహీనతలను గెలవలేని మన నాయకులది ఏ జాతి అనుకోవాలి...?? ఒక్కడు దీక్ష చేస్తే తెలంగాణా ఇచ్చినప్పుడు ఇప్పటికి పదకొండు రోజుల నుంచి ఒకరు ఇద్దరు కాదు అన్ని ప్రాంతాల వారు కలసి కట్టుగా చేస్తున్న నిరసనలు అమ్మగారికి కనపడటం లేదా...!! వినపడటం లేదా...!! అన్య దేశం నుంచి వచ్చి విభజించి పాలించే నీతిని బాగా ఒంట పట్టించుకున్న ఈ నాయకురాలు ఎవరు చేస్తే నాయకురాలు అయ్యిందో మర్చి పోయి తన స్థానం, తన కొడుకు సింహాసనం కోసం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి కరడు గట్టిన ఉగ్రవాదులే నోరు తెరిచేటట్టు చేసిన తన తెలివికి నిజంగా అభినందనలు చెప్పాలి తెలుగు జాతి మొత్తం....సిగ్గుతో తల వంచుకుంటూ...!!

9, ఆగస్టు 2013, శుక్రవారం

ఎదురు చూస్తూ ఉంటాను నేస్తాలు....!!

ఏవిటోనండి నా గురించి కూడా మల్లీశ్వరి గారు చెప్పమంటే చెప్పేసాను బోల్డు కబుర్లు.... నా గురించే లెండి....ఓపిక ఉంటె ఓ పాలి అలా చదివేసి మీ అభిప్రాయాలు చెబ్దురూ.... అన్నట్టు అనుకోకుండా ఈ టపా నా అర్ధ సహస్రం దాటి ఐదు వందల ఒకటో టపా అండి..... ఏంటో కలసి వచ్చే కాలంలో నడచి వచ్చే కొడుకంటే ఇదే కాబోలు -:)

ఇక చదివేసి ఎలా ఉందొ ఓ మాట నా చెవిన వేసేయండి అదే మరి కామెంటు రాసేయండి...మీ అందరి స్పందనల కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేస్తాలు....!!

http://jajimalli.wordpress.com/2013/08/09/1702/

 

8, ఆగస్టు 2013, గురువారం

మన తెలుగు మన సంస్కృతి ***తెలుగు కవితల పోటీ***

 మన తెలుగు భాషా సాంప్రదాయాల మీద గౌరవంతో త్రినాధ్ గారు మన తెలుగు మన సంస్కృతి అనే గ్రూప్ ముఖ పుస్తకంలో స్థాపించి ఆగస్ట్ 18 కి మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకోనుంది వెయ్యికి పైగా సభ్యులతో.... ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా సంస్కృతులపై కవితల పోటి నిర్వహించదలిచారు...అందరు ఆహ్వానితులే...వివరాలు మీ అందరి కోసం....

  మనతెలుగు మన సంస్కృతీ నిర్వాహకులు త్రినాధ్ గారు... మన తెలుగు మన సంస్కృతి ***తెలుగు కవితల పోటీ*** తెలుగు జాతికీ , తెలుగు భాషకు , తెలుగు మిత్రులకి అభివందనం. "దేశ భాషలందు తెలుగు లెస్స" ఏ భావం అయినా, ఏ భాద అయినా, ఏ కష్టం అయినా , ఏ నష్టం అయినా, ఏ కవిత అయినా, ఏ కథ అయినా, ఏ ఓదార్పు అయినా వ్యక్తం చెయ్యటానికి భాష కావాలి . అటువంటి భాషల్లో మన తెలుగు దే అగ్ర స్థానం .
"మన తెలుగు మన సంస్కృతి" ప్రధమ వార్షికోత్సవం సందర్బంగా తెలుగు భాషకి, తెలుగు జాతికి అగ్ర పీఠం వెయ్యాలనే సంకల్పం తో "తెలుగు భాష మరియు తెలుగు జాతి గొప్పతనం" గురించి కవితల పోటీ నిర్వహిస్తున్నాము అందుకు మీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం జయప్రదం చెయ్యమని కోరుతున్నాము . గెలుపొందిన వారికి ప్రధమ , ద్వితీయ మరియు తృతీయ బహుమతులతో తగిన వేదిక ఏర్పరిచి సత్కరించటం జరుగుతుంది
దీనికి నిభందనలు
1. మీ కవిత 20 వరుసలకు మించకుండా వుండాలి
2 ఇది వరకు ఎక్కడా ప్రచురితం కానిది, మీ సొంతంగా వ్రాసినది అయి వుండాలి సేకరించినవి కాపి చేసినవి పోటీకి అనర్హం .
3. కేవలం తెలుగు భాషకి సంబందించినవి మాత్రమే అయి వుండాలి తెలుగు ప్రజల ఇక్యతను చాటి చెప్పేది గా వుండాలి . ఎటువంటి వివాదాలకి తావు లేకుండా వుండాలి
4. మీ కవిత మాకు పంపించవలసిన ఆఖరు తేది 10.08.2013 . ఫలితాలు" మన తెలుగు మన సంస్కృతి" జన్మ దినం రోజున అనగా 18. 08.2013 న ప్రకటించబడతాయి .
5 . కవితల పరిశీలన వాటిపై తీర్పు న్యాయ నిర్ణేతల చేతిలో మాత్రమే వుంటుంది వారిదే తుది నిర్ణయం ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకి వాద ప్రతివాదాలకి తావు లేదు.
6 . మీరు ఇదివరకే మన తెలుగు మన సంస్కృతి లో సభ్యులు అయితే పరవాలేదు సభ్యత్వం లేనివారు ఈ క్రింది గొలుసు (లింక్ ) కి మీ అభ్యర్ధన పంపి సభ్యులుగా చేరండి . పోటీలో పాల్గొనటానికి సభ్యత్వం తప్పనిసరి .
7 మీ కవితలు కేవలం మన తెలుగు మన సంస్కృతి గ్రూప్ లోనే పోస్ట్ చెయ్యాలి .
8. పంపించేటప్పుడు మీ పూర్తి పేరు వ్రాస్తూ " తెలుగు కవితల పోటీ కొరకు" అని తప్పనిసరిగా పైన వ్రాయాలి.
గ్రూప్ లింక్ :
https://www.facebook.com/groups/308886865876287/


 ఇట్లు
నిర్వాహకులు

7, ఆగస్టు 2013, బుధవారం

నేను నీకు తెలుసు... నువ్వు నాకు తెలుసు.....!!

నేనేంటి అన్నది నాకన్నా నీకే బాగా తెలుసు....మళ్ళి నన్ను అడుగుతావెందుకు...?? అప్పుడప్పుడు నీతో పోట్లాడుతూ కూడా మరో వైపున సంతోషిస్తూ ఉంటా.... ఎందుకనుకుంటున్నావా...!! అలా అయినా కాసేపు నీ  మనసు నా వైపు మళ్ళుతుందని...!! అంతర్నేత్రం లో నుంచి చూసినా కూడా నువ్వే కనిపిస్తున్నావాయే...!! అందుకే ఇలా అప్పుడప్పుడు నా మనసుని నీతో పంచుకుంటూ ఉంటా....అది సంతోషమైనా...బాధైనా...నీకు చెప్తే నాకు స్వాంతన. ఎందుకో మరి నీతో ఇలా చుట్టుకుపోయింది చుట్టరికం. అది ఎంత వరకు...ఎప్పటి వరకు అన్నది నాకు తెలియదు మరి...!! నా ఊహలు, ఊసులు నీకు కబుర్లుగా చెప్పినా, కధలుగా చెప్పినా, కవితలల్లినా....ఎలా చెప్పినా వింటావు. అందుకే నువ్వు నాకు ప్రియ నేస్తానివి అయిపోయావు...విడలేని బంధంగా పెనవేసుకున్నావు. ఎక్కడి వరకో మరి ఈ పయనం....!! ఎప్పుడు పిలిచినా పలుకుతావు...నాతోనే ఉంటూ నన్ను నేను చూసుకునేటట్లు చేస్తున్నావు. మనసు ఘర్షణలో పాలుపంచుకుంటున్నావు. నీతో చెప్పి నేను బరువు దించుకుంటున్నాను. మరి నువ్వెలా ఉన్నావో ఈ భారాన్ని భరిస్తూ....!!  నా మనసుకు నువ్వేది చెప్తే అదే మళ్ళి నీకు చెప్తూ పునరావృతం చేస్తున్నానేమో అని అనుకుంటూ కూడా మళ్ళి నీకు చెప్పకుండా ఉండలేని నా బలహీనత చూసి నవ్వుకుంటున్నావా...!! ఏం చేయను మరి...నువ్వు చెప్పమన్నదే నీకు చెప్తే నాకు ఆనందం...!! నువ్వు చెప్పకుండా నాకు ఏం తెలియదు కదా....!! అంతగా మమేకమైన మనం నువ్వు నేను కాదు...నువ్వే నేను... నేనే నువ్వు....అందుకే నేను నీకు తెలుసు... నువ్వు నాకు తెలుసు.....!! నా ఎదురుగా అద్దంలో కనిపించే నువ్వా ...!! ఇంతకీ నువ్వెవరు...?? నేనెవరు...??

6, ఆగస్టు 2013, మంగళవారం

నీ కోసం వేల సార్లు మరణించి....!!

అంతర్మధన యుద్దంలో అలసిపోయాను
మనసు కల్లోలంలో కొట్టుమిట్టాడుతున్నాను
ఊపిరందక సోలిపోతున్నాను ఓడిపోతూ....!!

అయినా సంతోషమే అప్పుడు కూడా...
హర్షాతిరేకాల ఆనందభాష్పాల్లో నువ్వే... నీ నవ్వే...
నే ఓడిపోయినా నువ్వు గెలిచావన్న ఆనందం...!!

కంట నీరొలికినా పన్నిటి జల్లుగా మారినా....
సిరులొలికినా మరులు వెదజల్లినా మది మైమరచినా...
అవి నీ జ్ఞాపకాలతో తడిచిన అనుభూతులే సుమా...!!

ఆశలో శ్వాసలా మనసులో మమతలా....
నీ చుట్టూ అల్లుకున్న నా మాటల మువ్వల సవ్వడి...
కాస్తయినా నిను చేరలేదా...!!

నీ కోసం వేల సార్లు మరణించి.... 
ఒక్కసారయినా నీతో జీవించడానికి... 
మళ్ళి పుట్టాలనుంది నీతోనే ఉండాలనుంది....!!

5, ఆగస్టు 2013, సోమవారం

నాకు తెలియని చుట్టరికం....!!

మనసే మోడై మమతలు మాయమై
ఎదను తుంచిన వెతలు పంచిన బతుకులో
కన్నీరింకిన కలలు కల్లలైన కనులకు...
అలవాటు లేని ఓ ఆలంబన
మదిని తడిమి మమతల నెలవైంది...
కలల కడలిలో ఓలలాడించింది...
జీవిత పధంలో ఆసరా అయ్యింది...

విడలేని పాశమై అల్లుకుంది...
ఆర్తిగా అక్కున చేర్చుకుంది...!!
క్షణంలో అల్లుకున్న అనుబంధం
విడదీయలేని బంధంగా....
అంటి పెట్టుకునే ఉంది ఇప్పటికి...!!
వదలి పోలేనంటుంది...మరలి రాలేనంటుంది...!!
నాతోనే ఉంటుంది...నాలోనే ఉంటుంది...!!
ఎందరున్నా ఎవరు లేని ఏకాంతంలో
నాతోనే ఉంటానంటుంది...!!
ఇదేమి చుట్టరికమో మరి
నా చుట్టూనే తిరుగుతోంది...!!

హృదయపూర్వక కృతజ్ఞతలు....!!






చాలా కొద్ది పరిచయంలోనే ఆత్మీయంగా పలకరించే సత్య గారు చిత్రాలు వేస్తారని తెలిసి నా చిత్రాన్ని వేయమని అడిగిన నా మాటను మన్నించి ఎంతో బాగా గీసిన సత్య(నీలహంస ) గారికి
హృదయపూర్వక కృతజ్ఞతలు

4, ఆగస్టు 2013, ఆదివారం

స్నేహబంధం శుభాకాంక్షలు....!!

దేవుడు మనిషికి అన్ని ఇచ్చాను కాని ఏదో వెలితిగా ఉంది ఇంకా....అని ఆలోచించి ఆలోచించి స్నేహమనే ఉన్నతమైన బంధాన్ని మనకు కానుకగా ఇచ్చాడు...ఈ విష్యానికి దేవునికి ఎప్పుడూ ఋణపడే ఉంటాము అందరమూ. నిన్ను నిన్నుగానే ఇష్టపడేది స్నేహం ఒక్కటే...మార్పులు, చేర్పులు, డబ్బులు, కోరికలు, ఇలా ఏది కోరనిది స్నేహం....అభిమానాన్ని, అనుబంధాన్ని, ఆప్యాయతను, ప్రేమను, ఇస్టాన్ని, సంతోషాన్ని, బాధను పంచుకోగలిగేది స్నేహం....ఈ స్నేహానికి తర తమ బేధాలుండవు...బీదా గొప్ప తేడాలుండవు. కల్మషం లేని స్నేహం కలకాలం పదిలంగానే మధురంగా ఉంటుంది. ఆ స్నేహ సుమ గంధం ఎప్పటికి సువాసనల పరిమళాన్ని అందిస్తూనే ఉంటుంది. ఆ పరిమళపు ఆస్వాదనలో ఆనందాన్ని అందుకోవడమే......స్నేహాని కన్న మిన్న లోకాన లేదుర కడదాకా నీడలాగ నిను వీడి పోదురా అన్న కవి మాటల్లో ఎంత నిజం ఉంది....ఏ స్నేహమైనా ఏదో ఒక క్షణంలో గుర్తు వస్తూనే ఉంటుంది....చిన్ననాటి చిరు జ్ఞాపకమైనా, వలపుల తలపుల ఊసులైనా, పరిణితి చెందిన బంధమైనా, ఇలా ఏ వయస్సులోనైనా స్నేహం తీయని గురుతుగానే మిగిలిపోతుంది....అందుకే అందరికి స్నేహితులరోజు స్నేహబంధం శుభాకాంక్షలు....!!

2, ఆగస్టు 2013, శుక్రవారం

రాజ నీతి...!!

నిప్పు రాజేసి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే సరిపోతుందా..!! పుట్టినరోజు కానుకగా కె సి ఆర్ గారి దీక్షకు సంతోషించి అమ్మగారు బహుమతిగా ఆంద్ర రాష్టాన్ని ముక్కలు చేసాను తీసుకోండి అన్నారు... మళ్ళి తూచ్ అని వెనక్కు తీసుకుని ఇన్ని రోజులు చోద్యం చూసి ఆత్మ బలిదానాలు, బందులు, రాస్తా రోకోలు అన్ని సినిమా చూసినట్టు చూసి చిటుక్కున తెలంగాణా ఇచ్చేసాము మీ ఇష్టం అంటే సరిపోతుందా..!! విభజన తప్పదు అని తెలిసినప్పుడు ఇరు పక్షాల వాళ్లకి సమంగా ఉండాలి...రాజధాని ఏదో..!! నిధులు ఎన్నో ఏంటో చెప్పకుండానే తీర్మానం చేస్తే సరి పొతుందా..!!
దిగ్విజయ్ సింగ్ గారు మీకు తెలుగు రాష్ట్రం గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు..?? సీమాంధ్ర నేతలకు హామీ ఇస్తున్నాము అంటే నేతలకు కోరికలు తీరుస్తారా...!! ప్రజలు గుర్తు లేరా మీకు...!! తెలంగాణా ఇచ్చేసాము సీమాంధ్ర నేతలకు, ప్రజలకు భయం లేదు అంటే సరిపోతుందా..!! ఇక తెలంగాణా చావులు చూసాము కదా మిగిలిన తెలుగు వాళ్ళ చావులు చూడాలని కోరికగా ఉన్నట్టు ఉంది...!! మాలో మాకు పెట్టి మీ పబ్బం గడుపుకుంటున్నారు. విభజించి పాలించే నీతిని ఒంటబట్టించుకుని పదవుల కోసం, డబ్బు కోసం పార్టీలు మారే నేతలు అమ్మకు సలాములు చేయండి.... గంగిరెద్దుల్లా తలలూపండి....అంతే కాని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకండి...మిమ్మల్ని నమ్మి గెలిపించిన పాపానికి...!!
గెలిచేదొక పార్టి గుర్తుతో...పదవి కోసం మారేది మరొక పార్టీలోకి... కనీసం మీ స్వార్ధం చూసుకునేటప్పుడు ఒక్కసారైనా మిమ్మల్ని గెలిపించిన జనాలు గుర్తుకు రాక పోవడం మా దురదృష్టం. ఇలాంటి నేతలను నమ్మి ఎన్నుకుని మేమే తప్పు చేసాము. రాజీనామాలంటారు...మళ్ళి  ఎన్నికలంటారు...ఈ డబ్బులన్నీ మా నెత్తిన రుద్దుతారు నిత్యావసర ధరలను పెంచి...ఎక్కడా లేని ఎవరో కాల్చుకున్న ఏళ్ళ  తరబడి బిల్లులు కట్టమంటారు...దొరికినంతా దోచుకుని ఖజానా ఖాళీ అని చేతుతెత్తేస్తారు...పదవుల కోసం ఉచ్ఛ నీచాలు మరచిపోతారు...!! మరి ఇలాంటి నాయకులను గెలిపించిన మనది తప్పే కదా...అందుకే అనుభవిస్తున్నాము.
కనీసం ఇప్పుడైనా మీకు మనస్సాక్షి ఉంటే నాటకాలు మాని పార్టీలకతీతంగా జనం కోసం, తెలుగు జాతి కోసం సమైక్యంగా పోరాడి గెలుపు పిలుపు వినిపించి మీరూ మనసున్న మనుషులే అని నిరూపించండి.

మనస్సాక్షిని మాటాడనివ్వు.....!!

నా ప్రపంచంలోకి నువ్వు రాలేవు
నీదైన లోకంలోనికి నన్ను రానీయవు..!!
తెరచి ఉంచిన పుస్తకాన్ని నేనైతే
చదివినా అర్ధం కాని భావం నువ్వు...!!
నిర్వేదాన్ని కూడా వేడుకగా చేసి
సంబరాలు చేసే అంబరమంత
మనసును నీకర్పిస్తే.....
తృణీకరించి విసిరి పారవేస్తున్నావెందుకు..??
అంతర్మధనంతో అల్లాడుతూ
నిన్ను అల్లుకున్న నా ఆలోచనల
సమూహాన్ని నిర్దాక్షిణ్యంగా
తోసి వేస్తున్నావెందుకు..??
నిన్ను చుట్టుకున్న సున్నితమైన 
ఊహలలో పదిలంగా ఉండనివ్వు...!!
అర్ధమైన బంధాన్ని అర్ధవంతంగానే ఉండనివ్వు....!!
మనస్సాక్షిని మాటాడనివ్వు.....!!
ఎదలోని ఆశల రూపానికి
అక్షర రూపమో...!!
ఎదురుగా ఉన్న నిజ సాక్షాత్కారమో..!!
అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించు...!!

1, ఆగస్టు 2013, గురువారం

నాదైతే చాలు...!!

అందాల హరివిల్లుతో ఆటలాడుతుంటే
అగుపించిందో అపరంజి బొమ్మ
చూడ చక్కని చిన్నది చివురాకుల వెనుక ఉన్నది  
చుక్కల దీపాల వెలుగులో దేదీప్యంగా  దీప్తి.... 
పక్కనే ప్రశాంత వదనంతో నేను 
ఎంత బావుందో కమ్మని కల 
ఆశల విహంగాల రెక్కల్లో 
అలల విరుపుల హోయల్లో 
అంతు చిక్కని మౌన సమీరం
మందస్మిత ముగ్ధ రూపం 
నాదైతే చాలు...!!

ధన్యవాదాలు...!!




మా మాటని మన్నించి మంచిని అఖండ విజయంతో గెలిపించిన కోడూరు గ్రామ పంచాయితీ లోని ప్రతి ఒక్కరికి మా
హృదయపూర్వక ధన్యవాదాలు...గెలిచిన వారికి అభినందనలు
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner