23, ఫిబ్రవరి 2014, ఆదివారం

నీ చిరునవ్వుల్లో...!!




వేవేల వర్ణాలన్నీ వెల వెల బోయాయి
నీ చిరునవ్వుల్లో జారిపడిన హరిత వర్ణాల ముందు

22, ఫిబ్రవరి 2014, శనివారం

వెన్నెల వెలుగులే సుమా....!!



జారిపడుతున్నముత్యాల సరాల బారులు
నీ నవ్వుల రవ్వల ఆల్చిప్పలై  దాచిన
ముచ్చటైన ఆకృతుల స్వచ్చమైన అలంకారాలుగా
రహదారుల పహారాలో లెక్కలేనన్ని
జ్ఞాపకాల అనుభూతులుగా కదులుతూ
నా దారంతా పరచుకుని స్వాగతాంజలి అందిస్తున్న
నీ అనుబంధాల ఆనవాలులు
స్వాతి చినుకుల సమ్మేళనంలో
సరాగాలాడే వెన్నెల వెలుగులే సుమా....!!


21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

పోగొట్టుకున్నా.....!!



గతంలో పోగొట్టుకున్నా అనుకున్నా
జ్ఞాపకంగా నాలోనే ఉన్నావని తెలియక...!!

ఈ జంట పయనం...!!

నిలకడగా నడుస్తూ పడి పోనివ్వని ఆసరాతో
ఒకరి కొకరం చేయూతగా నిలిచి
సమాతరంగా కలసి నడిచే దారి మనది
చేరాల్సిన మజిలి కోసం అలుపెరగక అవిశ్రాంతంగా....!!

నీవో దరిన నేనో దరిన చేరినా
జతగా సాగే ఈ పయనం ఏ గమ్యం కోసమో 
కలసిన మన ఇరువురి పరిచయం
ఏ దూర తీరాలకు చేరాలని చేరువ అయ్యిందో...!!

ఊసుల ఊహల ఆశల రెక్కల చాటుగా
మాటలు కలసిన మనసుల మౌనాల మాటుగా
దాగిన ఆంతర్యాల అనుబంధం అర్ధమైన
చెలిమి కలిపిన చివురు తొడిగిన ప్రణయం ఇదేనేమో...!!!

చేరలేని దూరం మన మధ్యన ఉన్నా
చేయి విడలేని సంబంధం మనది
ఎప్పటికి దగ్గర కాలేని సు'దూరం' ఉన్నా
విడలేని జన్మల బంధానికి సాక్ష్యంగా....
ఈ జంట పయనం కడవరకు తోడుగా ...!!

19, ఫిబ్రవరి 2014, బుధవారం

మనకు ఇష్టం ఉన్నా లేక పోయినా...!!

తెంచుకోలేని ప్రేమను బంధాలను పెంచుకుంటున్న కొద్ది సంతోషం బదులుగా బాధ కోపం పెరుగుతుంటాయి
ఎక్కువగా... అనుబంధాలను అటు వదిలేయనూ లేము అలా అని ఇటు ఉండనూ లేము... ఇది మనసు చిత్రమో మనిషి మాయాజాలమో ఏది తెలియని పరిస్థితి...!! మనుష్యులు దూరంగా ఉన్నా మనసులు వారి ఇష్టమైన వారి చుట్టూనే పరిభ్రమిస్తూ ఆలోచనలను వారికి సమీపంలోనే ఉంచుతాయి...మనకు తెలియకుండానే...!!  దూరంగా ఉన్నా అమ్మకు బాలేదని కొడుకు....కొడుకు ఎలా ఉన్నాడో అని ఆ తల్లి వేదన పడుతూనే ఉంటారు.... దగ్గరగా లేని ప్రతి ప్రేమకు ఇష్టానికి ఈ బాధ ఉంటుంది....!! ఈ విడి పోవడాలు కలుసుకోవడాలు ఏమిటో ఈ అనుబంధాల ప్రయాణం...!! పొగ బండిలా ఈ జీవిత ప్రయాణం.... ప్రతి కలయికా విడి పోవడానికే... అలానే ప్రతి వీడుకోలు మరో కొత్త కలయికకు నాంది అని ఎవరో చెప్పేసారుగా ముందే...!! కాల గమనంలో కాలంతో పాటుగా గతాన్ని దాటుకుంటూ.. వాస్తవంలో బతుకుతూ... వర్తమానం మీద కొండంత ఆశతో... రాబోయే సంతోషాన్ని అందుకోవాలన్న ఆరాటాన్ని ఆలంబనగా చేసుకుని మనవైన మనసైన జ్ఞాపకాలను ఇష్టంగా మోసుకుంటూ కాలం వేగాన్ని అందుకోవడమే మన పని.... లేదా మన జీవితచదరంగంలో వెనుకే ఉండి పోతూ ఓటమినే చిరునామాగా చేసుకోవాల్సి వస్తుంది మనకు ఇష్టం ఉన్నా లేక పోయినా...!!

తన వెంట తీసుకు వెళ్తూ.....!!

ఎప్పుడో తగిలిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది
వేసిన మాత్రలు రాసిన లేపనాలు సరిపోలేదేమో
మానుతున్నట్టుగా అనిపిస్తూ అంతలోనే రేగుతూ
అటు ఇటు ఎటూ కాకుండా అలానే ఉండి పోతోంది
కాలానికి చిక్కని మనసు రగులుతున్న కొలిమిలో 
నిప్పుల కుంపటిలా సెగలు కక్కుతూనే ఉంది
తగిలిన దెబ్బలకు సాక్ష్యాలుగా చెరిగిపోని
నెత్తుటి చారికల ఆనవాలు కూడా పచ్చబడింది
నలిగిపోయిన జీవితం నవ్వుతూనే వెళిపోతోంది అన్ని చూస్తూ
నిన్ను వదిలేసి నన్ను మాత్రం తన వెంట తీసుకు వెళ్తూ.....!!

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

తీయని నీ స్నేహం.....!!




తెర తీయని నీ స్నేహం జలతారు వెన్నెలలా
మురిపిస్తోంది నన్ను...... 

ఎన్నికలు అవసరమంటారా...!!

ఈ బందులు, ఉపన్యాసాలు, రాజకీయ సన్యాసాలు, చివరి వరకు పోరాడాము, రాజీనామాలు, వాకౌట్ లు ఇలా
వీటిలో ఒక్కదాని వల్ల అయినా ఉపయోగం ఉందా...!! జరగాల్సిన నష్టం రెండు ప్రాంతాలకు జరిగింది....నాయకులకే లాభం ఎప్పుడు... ఇక మళ్ళి ఎన్నికల మానిపెస్టోలు మొదలు.... సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూస్తాము అంటూ వాగ్దానాలు గెలిచే వరకు.... తరువాత విలీనాలు ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా ఎందరు నాయకులు మారినా అధికారం, డబ్బు రాజ్యమేలుతున్న నేటి రోజులలో వారిదే  మరో సారి నిరూపితం అయ్యింది... మేడం గారు వారు కోరుకున్న పాదాభివందనాలు చేయించుకుంటున్నారు... యువరాజా వారికి పట్టాభిషేకానికి అడ్డంకులను తొలగిస్తూ..... ఎంత చక్కని ప్రజాస్వామ్యం మనది...ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన చక్కని ప్రజాస్వామ్యం.... అందరు చూసారుగా రాష్ట్రంలో, పార్లమెంట్లో ఎంత హుందాగా నాయకులు, ఆ నాయకులు పట్టం కట్టిన పార్టీల అధినేతలు ఎలా చేశారో....
ప్రపంచం మొత్తం చూసిన మన విలువలు ఎంత గర్వకారణంగా ఉన్నాయో... ఒక్క అధినేత్రి భారత రాజ్యాంగాన్ని శాసిస్తోంది... తన కుటుంబానికి అనుకూలంగా మలచుకుంది...కనీసం ఇప్పుడయినా ఓటు అడిగే వాళ్ళను ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి.... మన ఓటుకు విలువ లేనప్పుడు అసలు ఇక ఎన్నికలు అవసరమంటారా...!! వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసే అధికారం వాళ్ళు తీసుకున్నప్పుడు ఈ కంటి తుడుపు ఎన్నికలు... రాజీనామాల డ్రామాలు, కొత్త పార్టీలు ఎందుకు... జనాన్ని పిచ్చోళ్లని చేయడానికి మాత్రమే పనికి వస్తున్నాయి....!!




17, ఫిబ్రవరి 2014, సోమవారం

వేల జన్మల నుంచి.....!!




నాకు తెలియని మదిని నిన్ను పరిచయం చేయమని
పదే పదే అడుగుతూ వెంటపడుతూనే ఉన్నా వేల జన్మల నుంచి.....!!


బంగరు లేడి కూనా...!!

అందాల బంగరు లేడి కూనా...
చెంగున దూకే సిత్రాల సంబరమే నీది
రామ రావణ యుద్దానికి ఆద్యం నీవు
అమ్మ సీతమ్మ మనసు దోచిన చందమే నీది
రివ్వున సాగే నీ పయనం కాలంతో పోటి
అడవి తల్లి ఒడిలో ముద్దు బిడ్డవు
సొగసు సౌకుమార్యాలకు పట్టుగొమ్ము నీ రూపం
అతివల నయనాలు వివరించు నీ పోలికలే
పడతుల ప్రణయ కావ్యాల కధలు నీ చుట్టూనే
పురాణ ఇతిహాస ప్రబంధాలు నీ వర్ణనలే
లలిత లావణ్య సుకుమార సౌందర్యం
కలబోసిన సున్నితం సృష్టికర్త చేతిలో నీ రూపం
మనోల్లాస భరితం నీ చర్విత చలనం...!!

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

నీలోని ప్రేమకు.....!!




బాహ్య సౌందర్యం గుర్తెరగని నా మనసు
నీలోని  ప్రేమకు దాసోహమైంది

నంద కిశోరా...!!



యోగమైనా భోగమైనా
ఆది అంతాలైనా అది నీవే...
సకల చరాచర సృష్టిలో
ప్రాణము ప్రణవము నీవే...
పంచ భూతాల జీవ నాదాలు
మా కర్త కర్మల కారకుడవు నీవే...
ఏమి ఎరుగని బాల గోపాలా
నటనల నంద కిశోరా నీ చిరునవ్వు
చిత్రానికి పరమార్ధము తెలుపుమయా...!!

15, ఫిబ్రవరి 2014, శనివారం

ఒకింత గర్వంగా.....!!

"అందరిని మనం కావాలని అనుకుంటే ఎప్పుడో ఒకరోజు అందరు మనల్ని కావాలని అనుకుంటారు....."  నా పెద్ద కొడుకు మౌర్య కొన్ని క్షణాల క్రిందట చెప్పిన మాట... చిన్న వాడయినా ఎంత మంచి మాట చెప్పాడు అనిపించింది... వాడు ఆ మాట అనగానే మనం అక్కరలేని వాళ్ళు మనకి వద్దు అని అన్నాను కాని వాడిని ఈ మాట చెప్పినందుకు అభినందించకుండా ఉండలేక పోయాను...చిన్న వాడయినా పెద్ద మనసుతో ఆలోచించాడు అనిపించింది... చెప్పక పోవడమెందుకు ఒకింత గర్వంగా కూడా అనిపించింది.... ఇంత మంచి మనసు వాడికి ఇచ్చినందుకు ఆ దైవానికి నా కృతజ్ఞతలు....

మనసు చిత్రాన్ని.....!!




మనిషి రూపాన్ని గీయలేని నా చేయి
మనసు చిత్రాన్ని ఎంత అందంగా చిత్రించిందో చూసావా....!!

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

స్నేహాభినందనలు .....!!

నా కోసమే అరుదెంచిన అద్భుతానివి
నాలో నిలిచిన నిత్య వసంతానివి
చెప్పకనే మనసెరిగిన మౌనానివి
కన్నీటిని దాచినా పన్నీరుగా మార్చినావే
వేదన తీర్చిన వారధి సంతకానివే
కడ వరకు నను వీడని నా బంధానివి
వెతల కతల వెంట చేయూత నీ సన్నిధి
 అన్ని బంధాల కన్నా మిన్న ఈ ఆత్మ బంధం
చెలిమి కలిమికి సాటి లేని పెన్నిధి
లేదు ఈ జగాన మరొకటి...!!
నేస్తమా కుశలమా రెండు వసంతాలు  దిగ్విజయంగా పూర్తీ చేసుకుని మూడవ వాసంతం లోనికి అడుగిడుతున్న శుభ సమయాన మా హృదయ పూర్వక అభినందనల స్నేహాభినందనలు ..... ఇలానే మరెన్నో వసంతాలు మళ్ళి మళ్ళి రావాలని కోరుకుంటూ నేస్తమా కుశలమా సమూహపు మూల కర్తలకు, సభ్యులందరికీ మనఃపూర్వక శుభాకాంక్షలు

ప్రేమను ప్రేమించే ప్రేమ....!!

ఎక్కడో వినిపించింది ఓ పిలుపు
మనసు కదిలిస్తూ మదిని మురిపిస్తూ
వేల జన్మల బంధంగా ముడి పడినట్టుగా
మరణాన్ని సైతం దరి చేరనివ్వని
నిన్ను నిన్నుగా స్వచ్చంగా ప్రేమించే
హృదయంతరాళంలో చేరిన అరుదైన చెలిమి
ప్రేమ పాశాన్ని ఏర్చి కూర్చి పెంచుకున్న
మమతావేశపు చిరుజల్లుల తాకిడితో
తొలకరి వలపుల తాయిలం అందించిన
ఆ మధుర సంతకాల వసంతాలు
ఎన్నటికి మాయని ఆ జ్ఞాపకాలు
ప్రేమ కోసమే జీవించే జీవితాలు
మనసుల మౌన భాష్య తరంగాలు
ప్రేమను ప్రేమించే ప్రేమ ఆ ప్రేమ కోసమే
ఎప్పటికి వసి వాడని కుసుమపరాగాలే
నిత్య నూతన వాసంత తిమిరాలే...!!

13, ఫిబ్రవరి 2014, గురువారం

నాకుగా నేను రాసుకున్న....!!

కాలమే కక్ష కట్టిందో
విధి చిన్న చూపు చూసి
విధాతతో నొసటి రాతను
వంకరగా రాయించిందో....
ఆ అయోమయంలోనే
అర్ధ జీవితం గడిచి పోయింది
నాకు తెలియకుండానే...
కన్నీటి ముసురులో అది
మోదమో...అంతులేని ఖేదమో
రెండు కలసిన జీవధార
మనసును తేలిక చేస్తూ
వెలువడిన ఈ కడలి కెరటం
తాకిడి వెల్లువకు కొట్టుకుపోతున్న
ప్రాణాన్ని నిలువరించే ఆయుధం
వెదికే ప్రయాణంలో నిరంతరం
శోధనలో శ్రమిస్తూ...
బంధాలను తెంచుకోలేని
ప్రతి క్షణం మరణిస్తూ జీవించే
జీవితాన్ని నాకుగా నేను రాసుకున్న 
నా తలరాతను నేను నిందించుకోవాలేమో...!!

12, ఫిబ్రవరి 2014, బుధవారం

పరమేశుని ప్రతి రూపం....!!

ఈ చిత్ర కవితకు కృష్ణా తరంగాలు సమూహంలో నన్ను ఓ విజేత గా చేసిన నా భావాలు .....

నర్తనమే జీవితం నాద వినోదమే మోదం
అభినయాల అవపొసనల ఆహార్యం
మోద ఖేదాల ముగ్ధ సింగార చందం
అరుణ వర్ణాల హరివిల్లు నయగారం

నవ నాడుల నటరాజ నృత్య విన్యాసం
సృష్టి స్థితి లయల జీవన చైతన్యం
ముచ్చటైన భంగిమల నాట్య విలాసం
పరమేశుని ప్రతి రూపం....అర్ధనారి తత్వం...!!

Manju Yanamadala పరమేశుని ప్రతి రూపం....!!
నర్తనమే జీవితం నాద వినోదమే మోదం
అభినయాల అవపొసనల ఆహార్యం..... ప్రతిదీ భగవత్ సంబంధం తో సరిపోల్చుతూ క్రొత్త వరవడి లో పయనించారు....చక్కని మీ విశ్లేషణ కోసం కృష్ణా తరంగాల కవితా పోటికి కవితలను పంపాలనిపిస్తోంది పార్ధ సారధి గారు...
విజేతలు కవి మిత్రులందరికీ నా మనఃపూర్వక అభినందనలు ... విజేతలను చేసిన అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదాలు 

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

నీ మువ్వల....!!








మది వాకిట ఎద సవ్వడి
అది...నీ మువ్వల నవ్వుల సందడే....!!

10, ఫిబ్రవరి 2014, సోమవారం

మనసంతా నువ్వే...!!




మనసంతా నువ్వే నిండి ఉంటే మాటల ముత్యాలు  దాగున్నాయి నీ అలికిడికి భయపడి..!!

జీవితం అంటే తెలియని కొన్ని జీవాలు....!!

మంచికో చెడుకో ఒకసారి చేయి పట్టుకున్నాక చివరి వరకు విడువను అది తప్పైనా ఒప్పైనా...!!  ఇంత మంచి
మనసు ఎంత మందికి ఉంటుంది..?? పెళ్ళి  అంటే అదో తంతు, మన గొప్పతనాన్ని చాటుకోవడానికి ఓ ఆడంబరమైన వేదికగా కళ్యాణ వేదికను,  మన వెనుక ఉన్న డబ్బును హోదాను చూపించుకోవడానికి మాత్రమే అని అనుకుంటున్న రోజులు ఇవి... పాణిగ్రహణాన్ని, వేద మంత్రాలను వాటి అర్దాల ప్రమాణాలను మరచి పోయి, మన అవసరం కోసమో లేదా ఓ నమ్మకానికి చావు వీలునామా రాయడానికో, మనలోని మరో రూపాన్ని చూపించడానికో, పంతం నెగ్గించుకోవడం కోసం మంచితనం నటించి ఆ నటనలో నలుగురిని నమ్మించి, జతగా వచ్చిన బంధం ఏమైనా పర్లేదు మనం, మన వాళ్ళు బావుంటే చాలు, ఆ మనసు మనిషి ఏమైపోతే మనకెందుకు....మన డాబు దర్పం నలుగురికి కనబడితే సరిపోతుంది...అనుకుంటే ఇక ఈ బంధానికి విలువ, అర్ధం ఉండాలా....!!
ఇచ్చిన మాట తప్పడం అంటే చావుతో సమానం.... అది ఏ విషయంలోనైనా ఒక్కటే....మాట నిలుపుకోలేనప్పుడు అస్సలు మాటే జారకూడదు...కాకపొతే ఇప్పుడు ప్రమాణాలకు ప్రామాణికాలు లేకుండా పోయాయి...డబ్బు,హోదాల కోసం ఒకటేంటి ఆలుబిడ్డలను కూడా అవసరానికి వాడుకునే ఎందరో జాతి రత్నాలు మనకు తారస పడుతూనే ఉన్నారు...మంచితనం ముసుగులో అయిన వాళ్ళను పరాయి వాళ్ళుగా చేసి తామే ప'రాయిగా' అయిపోతూ...  తన చుట్టూ చేరే నలుగురు వాళ్ళ అవసరానికి వేసే దండలు గంధపు మాలలుగా మురిసిపోతూ జీవితంలో తామేం కోల్పోతున్నామో....తన కోసం ఎదురుచూసే వారికి ఎంతటి సంతోషాన్ని ఇస్తున్నారో తెలుసుకోకుండా.... కోల్పోతున్న అనుబంధాన్ని తెలుసుకోకుండా... నిరర్ధకమైన జీవితాన్ని చాలా గొప్పగా బతికేస్తున్నా అని సరిపెట్టుకుంటూ అసలు జీవితం అంటే తెలియని కొన్ని జీవాలు....!! మనసును మర్చిపోయిన మనుష్యులు ఎదుటివారి మనసులను కూడా చిద్రం చేసి చోద్యం చూస్తూ నేనే గెలిచాను అనుకుంటే.. అది గెలుపో... లేక తన ఓటమో కూడా తెలియని ఆ మూర్ఖుల మానసిక స్థితిని చూసి నవ్వుకోవడం తప్ప చేయగలిగినది ఏమి లేదు...!!

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

నీ తలపు....!!




రేయిని కప్పిన చీకటి పరదా
వెన్నెల వాకిట నీ నవ్వుల వరద.....!! 

మనసు శరాన్ని...!!



ఒంటరిని నేనైనా అనితర సాధ్యం నా మార్గం
రహదారులన్నీ బంధించినా గగన యానం నా ప్రయాణం
గమ్యమే లక్ష్యం నిరంతరం విజయమే నా విలాసం
వేసిన మొదటి అడుగే నాదైనా శిలల శిధిలాలు
నా సోపానాలుగా ఓటమి పిలుపులు
గెలుపు ఆయుధాలుగా నిరంతర పోరాటం
నిశ్చల సమరంతో నింగి కెగిరే
మనసు శరాన్ని నిరాఘాటంగా...!!

8, ఫిబ్రవరి 2014, శనివారం

పాణిగ్రహణం...!!




చేసిన బాసలు చెప్పిన ఊసులు
కళ్యాణ ఘడియల కన్యాదానం
వధూవరుల వసంతోత్సవం
ఒనగూడిన చక్కని అనుబంధం
అంబరాన్ని తాకిన ఆనందం
పది కాలాలు నిలవాలి ఈ కాపురం ...!!

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

నీ ప్రేమ కోసమేనని... !!

రేయి వాకిట చీకటి పరదా
నా మదిని దాటని నువ్వులా...!!
వెన్నాడుతున్న చాయల నీలి నీడలు
నను వదలని నువ్వులా...!!

మరచి పోదామనుకున్న గతాన్ని
మరువనివ్వని జ్ఞాపకంగా నువ్వు....!!
రాలిపోతున్న రాతి స్వప్నం శిధిలాలు
ఆ ముక్కల్లో ఎక్కడ చూసినా నువ్వే...!!

అందరాని చందమామ అచ్చంగా నీ ప్రేమలా
ఆకాశంలో కూర్చుంది నీలానే సు'దూరంగా'...
మాటేసిన మాయా రక్కసి దాచేసింది నిన్ను
నిదుర రాని మనసుకు కలల తీరం లేదంటూ...!!

నీ కోసం నే ఓడిపోయిన ప్రతి క్షణం చిందిన
నీ విజయ చిద్విలాసం చాటున నేనేనని నా గర్వం
అందుకోలేని ఆశల శిఖరాన్ని తాకాలన్న ఆరాటంలో
వేలసార్లు మరణించినా మరుజన్మ నీకేనని... నీ ప్రేమ కోసమేనని... !!

6, ఫిబ్రవరి 2014, గురువారం

రంగుల జ్ఞాపికలు...!!

మదిని వదలలేని మమతలు
మాటల మాటున దాచలేని బంధాలు
చెప్పకనే చెప్పే చిరునవ్వు చాటు సరాగాలు
దోబూచులాడే మనసుల మధ్యన వారధులు

ఆంతర్యాల ఆపేక్షలను దాచేసే అహాల అడ్డు గోడలు
తరిగి పోతున్న అనుబంధాలకు ప్రతీకలు
పెరిగి పోతున్న నాగరికతకు పరాకాష్టలు
రాలి పోతున్న సంస్కారానికి సాక్ష్యాలు

ఓనమాలు దిద్దించిన పలకా బలపాలు
ఎ బి సి డి లు నేర్పించిన ఆధునికత పాఠాలు
సంగీత సాహిత్యాల సౌరభాల సుగంధాలు
పబ్బుల పార్టీల పై పై మెరుగుల పూతలు


అటు ఇటు ఎటు పోలేని మధ్య తరగతి సంసారాలు
నోట్లలో బతుకులు కాలిపోతున్నా సరదాలు స్వర్గ తుల్యాలు
సగంలో మిగిలి పోయిన జీవితాలకు ఆనవాలు 
ఈ తీపి చేదుల కలయికల కమ్మని జ్ఞాపికలు

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

పసి మనసులు...!!

కృష్ణాతరంగాలు  సమూహంలో పార్ధసారధి గారు నిర్వహిస్తున్న చిత్ర కవిత పోటిలో ఈ చిత్రానికి నా అక్షర భావాలు ......
కల్మషం తెలియని పసి మనసులు
చేరువైన స్వచ్చమైన చేయూతలు
ఏమి ఆశించక అక్కరకు తీసే ఆత్మీయత
ఉన్నది పంచుకునే పసి హృదయాలు
కలసి మెలసిన చెలిమికి చిరునామా
అందమైన ఈ అనుబంధపు అభిమానం... !!


నచ్చిన మెచ్చిన నన్నువిజేతగా నిలిపిన అందరికి నా మనఃపూర్వక ధన్యవాదాలు ... కృష్ణాతరంగాలు  సమూహం బృందానికి నా కృతజ్ఞతలు 





2, ఫిబ్రవరి 2014, ఆదివారం

నావైన నా జ్ఞాపకాలు...!!

అక్షరాల నీలి నీడలు
అద్దంలో ముఖ చిత్రాలు
మనసుని తట్టే మౌనాలు
మాటల కందని భాష్యాలు
కన్నుల కందని స్వప్నాలు
స్వరం మరచిన సప్త స్వరాలు
పెదవులనే దాటని భావాలు
పలికించే ఎద వైనాలు
వినిపించే మురళీ గానాలు
విని పరవశించే ప్రణయాలు
అందించే ఆనందాలు
కురిపించే హిమ వసంతాలు
మురిపించే ముగ్ధ మోహాలు
కలతలు మరచిన హృదయాలు
రేయిని దాచిన వేకువలు
వేకువ మాటున వెన్నెలలు
తొలి పొద్దు అందాలు చందాలు
ఆనాటి చెలిమి సంతకాలు
తాకిన మలయ సమీరాలు
నా వెన్నంటి తిరుగాడే తిమిర సంహరణాలు
పద లయల సవ్వడుల మువ్వల నాదాలు
మురిపించి మెరిపించే తొలకరి చినుకులు
అనునిత్యం నాతోనే నావైన నా జ్ఞాపకాలు...!!

1, ఫిబ్రవరి 2014, శనివారం

వెన్నాడుతూనే ఉంటుంది....!!

నీ కంట పడకుండా నా దోసిట్లో
దాగున్న కన్నీరు పారి పోతోంది
ఇక ఉండలేనంటూ ప్రవాహంలా
జారి పోతూ నీ కోసమై పరుగిడుతూ
నీ మదిని తడి చేయక మునుపే
వాటికి అందని తీరాలని
నువ్వు చేరావని తెలియదు....
ఆ అనంత జల వాహినిలో
నా మనసు కలసి నిన్ను చేరాలని
జల జలా జారిపోయి ఆ తొందరలో
నీ కందకుండా రాలి పోయింది
అనాఘ్రాత పుష్పంలా....
భాష్యం చెప్పలేని భావం
పలకలేని మౌనం నిశ్చలంగా
వెన్నాడుతూనే ఉంటుంది
ఎప్పటికి జ్ఞాపకమై
చేరుకోవాలన్న చేరువను వెదకుతూ.... !!

ప్రకృతి పరవశం...!!


చిన్నారి పొన్నారి  చిలుకల జంట
ముచ్చట్లు అచట్లు ముద్దుల మూటలు
చిగురాకుల చిటారు కొమ్మన సయ్యాటలు
చూడ ముచ్చటైన సొంపైన సోయగాలు
కోపాల తాపాల కలికి విరహాలు
అందమైన సాయంత్రానికి ఆహ్వాన అందాలు
అపురూపమమ్మా ఈ ప్రకృతి పరవశం...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner