30, ఏప్రిల్ 2014, బుధవారం

చెప్పడానికి మాటలు దొరకవేమో....!!

నాకు అత్యంత ఇష్టమైన ఒక వ్యక్తీ గురించి చెప్పాలని ఉంది....మనసు విప్పాలని ఉంది...-:) .... నన్ను చాలా బాగా చూసుకున్న ఆ అక్కని ఎప్పుడు కాదు కాదు ఎప్పటికి మర్చిపోను. నేను ఏంటో తెలియనప్పుడే నా కోసం తను చేసిన వాదనలు...నేను తనని వదలి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాతోపాటు తను ఎంత బాధ పడిందో చెప్పుకోలేక పోయినా మా ఇద్దరికీ తెలుసు.  తన కూతురు తిన్నదో లేదో పట్టించుకోక పోయినా నా కోసం తను చేసిన ప్రతి పని నాకు ఎప్పటికి గుర్తులుగానే మిగిలి పోయాయి... ఈ రోజుకి తనని తలచుకుంటునే ఉంటాను....నేను అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళని వదలి వెళ్ళాక ఏదో పని ఉండి అక్క వాళ్ళ ఆయన నా పేరు మీద తీసుకున్న దానికి ఏదో ఇబ్బంది నాకు వస్తే వాళ్లకు తెలిసిన ఒకాయనకు చెప్పాను ... అప్పుడు వాళ్ళ పరిస్థితి బాలేదని తెలిసినప్పుడు ఎంత బాధ పడ్డానో....వెంటనే నా దగ్గరికి రమ్మని పిలవాలి అనిపించింది... ఫోన్ నెంబరు ఇస్తాను మాట్లాడు అని ఒక పెద్దాయన చెప్పినా మాట్లాడటానికి ఆయనతో మాట్లాడనప్పుడు అక్కతో మాట్లాడలేను అని చెప్పాను ... కాకపొతే కనీసం అక్కతో మాట్లాడటానికి కూడా వాళ్ళ ఆయనతో మాట్లాడనప్పుడు అక్కతో మాట్లాడకూడదని మాట్లాడకుండా ఉండి పోయాను...ఆయన చేసిన మోసం మూలంగానే అక్కని వదలి వెళ్ళాల్సి వచ్చింది...అంతకుముందు కూడా అక్కని ఏదో అన్నారని ఆయనతో మాట్లాడటం మానేసాను... అది అక్కకి ఎప్పటికి చెప్పలేను... అక్క ఇండియా వచ్చిందని తెలిసినా ... అక్కకి బాలేదని తెలిసినా మనసు బాధ పడుతున్నా నా ప్రాణం ఉన్నంత వరకు అక్క మీద ఇష్టం ఎప్పటికీ అలానే ఉంటుంది... అది అక్కకి తెలియదు మర్చిపోయిన మనుష్యుల ఖాతాలో నా పేరు కూడా జమ చేసుకుని ఉంటుంది....!! ఎందుకో ఈ రోజు బాగా గుర్తుకు వచ్చి ఆ మధ్య నా దగ్గరరికి వచ్చినట్లు కల కూడా వచ్చింది ... కాని కలలు నిజాలు కావు... అయినా కొన్ని కలలు నిజాలుగా మన ముందు నిలిస్తే ఆ ఆనందం ఎంత బావుంటుందో చెప్పడానికి మాటలు దొరకవేమో.అమ్మ బొజ్జలోని పాపాయిలా...!!

మౌనంగా రోధిస్తున్న....!!

విలువల వలువలు వలుస్తూ
ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి
అందలాలు ఎక్కాలనుకునే
నాయకుల అవసరం మనకు ఉందా...??
గెలుపు గుర్రాల కళ్ళాల కోసం
పదవుల పోరాటాల ఆరాటంతో
అధికారం కోసం పార్టీలు మార్చే
నేతల మాటలకు మరోసారి మోసపోదాం..!!
ఉపన్యాసాల మాటల తూటాలు వింటూ
ఒకరి మోసాన్ని మరొకరు తెలుపుతున్నా
మద్యం మత్తులో రూపాయల వివ్యాసానికి
బలి పోతూ కూడా తెలుసుకోలేని అమాయకత్వమో
అస్సహాయతో నిస్సహాయతో అర్ధం కాకుండానే
మరోసారి మనం పట్టం కడుతున్న ప్రజాస్వామ్యానికి 
సాక్షిగా ఉంటూ మౌనంగా రోధిస్తున్న భరతభూమి ఇది....!!

29, ఏప్రిల్ 2014, మంగళవారం

ఈ అర్ధం కాని....!!

పెదవి దాటి రాని మది మాటలను చెప్పడానికి మౌనాన్ని
ఆసరాగా అడిగితే నా వల్ల కాదంటూ.... మరో  దారి చూసుకోమంది...!!
నింగిని అడిగినా నేలను తడిమినా నీ జ్ఞాపకాలే నా చుట్టూ
చెప్పలేని నా ఆరాటాన్ని చెప్పినా అర్ధం కాని నీకు
కనీసం కడసారి చూపమని అనంత విశ్వాన్నిఅర్ధించా...!!
మొరనే విన్నదో మనసునే చదివిందో తెలియదు కాని
ఓ చిన్న ఓదార్పు నీ ఆలంబనగా అందించింది...
ఆ చిన్న సంతసాన్ని అద్భుతంగా ఆస్వాదించినా
ఎక్కడో తెలియని సన్నని అనుబంధపు మమకారాన్ని
వదలలేక సరి పెట్టుకుంటూ సర్దుకుపోతూ
ఈ జన్మకు చాలని అనుకున్నా మరు జన్మకు
మరో రూపం మరో జీవితం మళ్ళి మళ్ళి కావాలని
ఎందుకో ఈ అర్ధం కాని వ్యర్ధమైన తపన నీ కోసమే...!!

27, ఏప్రిల్ 2014, ఆదివారం

మా అందరి కోరిక. .....!!

తాతయ్యల తెలివితేటలు అమ్మ ముక్కుసూటితనం నాన్న చురుకుతనం అన్ని కలిపి పెంచిన అమ్మమ్మ జేజమ్మ బేబమ్మల మమకారం అక్క తమ్ముడు చెల్లి ఇలా అన్ని బంధాలు కలిపి పెరిగిన మౌర్యకు అందరి ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు.... 
నేను ఎంతో ఇష్టపడి పెట్టిన పేరు మౌర్య....నీకు నేను చదివిన అధినేత పుస్తకంలో ఆత్మీయతకు దూరంగా ఉండి ఎన్నో ఇబ్బందులు అధిగమించి అనుకున్నది సాధించిన ఆ మౌర్యలా అంత గొప్పవాడివి కావాలని....ఒకరితో గొప్ప అని పోల్చుకోకుండా నీ తెలివితేటలు మంచికి ఉపయోగపడాలని వందలో ఒకడిగా కాకుండా పదిమందిలో ఒకడిగా నిలవాలని మా అందరి కోరిక.

26, ఏప్రిల్ 2014, శనివారం

అసంపూర్తి ఆకారాలు....!!

అసంపూర్తి ఆకారాలు....!!

విధి ఆడిన వింత నాటకమో
విధాత చేసిన విడ్డూరమో
అమ్మ ఒడిలో ఆడుతూ
నాన్న నడకలు నేర్పించే
ఆ పసి బతుకులు అటు ఇటు కాని
విధి వంచితులుగా మధన పడే జీవితాలు
సమాజంలో దేనికి నోచుకోని నవ్వులాటగా
మిగిలిన ఈ అసంపూర్తి ఆకారాలు
మమతల మాటున దాగిన వేదనాభరిత
దృశ్య  కావ్యాలుగా మన ముందు నిలిచిన
మిగిలి పోయిన ప్రశ్నలుగా ఉండిపోతుంటే
ఎందుకీ కన్నీటి బతుకులు నిర్మించావని
విరించిని వివరణ అడగాలని ఉంది...!!

నేను అడిగిన వెంటనే ఈ సామాజిక సమస్యకు స్పందించిన మనతెలుగు మన సంస్కృతి నిర్వాహకులు త్రినాధ్ గారికి ప్రతేక కృతజ్ఞతలు..... కనీసం విధి  చేసినా వీరి పేరు చెప్పి ఎవరు ఎవరిని మోసం చేయవద్దని కోరుకుంటూ ఈ నా చిరు కవిత వారికే అంకితం

23, ఏప్రిల్ 2014, బుధవారం

మనసు శకలం....!!

ఘడియలు కలసిన గంటల కాలాన్ని
దూరం  చేసిన విధిని నిందించాలా...!!
నీతో కలసిన జీవితంలో నే కోల్పోయిన
ఆ క్షణాల అనుభూతిలో నన్ను నేను
మరచిపోయిన అనుభవాన్ని నా... 
తిరిగిరాని ఆ కాలాన్ని దూరం చేసిన
మనసు మమత తెలిసినా తెలియని
అర్ధం కాని నిన్ను నిందించాలా....!!
మరో లోకం చూసిన ఆ ఆనందాన్ని
శాశ్వతంగా అలా ఉండనివ్వని
నా తలరాతను తలచుకుని
ఇంకా మిగిలిన ఈ ఏది తెలియని
మదిని ఎలా సమాధాన పరచాలో
తెలిసినా తెలియని నన్ను నేను
అయోమయంలో నిందించుకోవాలో...
ఎటు తేల్చుకోలేని జాగ్రదావస్థలో
ఉండి పోయిన మనసు శకలం
స్వప్నంలోలా ఇలా మిగిలింది....!!

21, ఏప్రిల్ 2014, సోమవారం

ఇదే మన మనస్తత్వం కాదంటారా...!!

ఆత్మ బంధం...ఆత్మ స్నేహం ఇలాంటివి చెప్పుకోవడానికి కానీ నిజంగా ఎంత మంది ఇలా ఉండగలుగుతున్నారు...?? మనలోని అహాన్ని కాస్త ఇటు సర్దుబాటు చేస్తే చాలా జీవితాలు అసంపూర్ణ చిత్రాలుగా మిగిలి పోవు...సాహచర్యంలో చాలా సర్దుబాట్లు దిద్దుబాట్లు లేక పొతే మనతో పాటు పిల్లల మనసులు వాళ్ళ జీవితాలు కూడా ఎటు కాకుండా అయిపోతాయి. ఎవరో ఒకరు చిన్న చిన్న ఆలోచనలు మార్చుకుంటే ఎన్ని జీవితాలు బావుంటాయో..!! ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్ని మనసుల సంఘర్షణకు కారణాలు అవుతున్నాయో రోజు మనం చూస్తూనే ఉన్నాము.
అమెరికాలో జీవితాలు వేరు..వాళ్ళు అలా అలవాటు పడిపోయారు పిల్లలు పెద్దలు కూడా...!! మనం  కూడా  బంధాలు అలా తెంచుకుంటే ప్రపంచం అంతా గౌరవించే మన వివాహ వ్యవస్థకు అర్ధం లేదు...ఎదుటి వారిలో మంచిని తీసుకోవడానికి ఎన్నో ఆలోచిస్తాము కాని చెడుని తొందరగా అలవాటు చేసేసుకుంటాం...బహుశా ఇది మనిషి నైజం కావచ్చు...అమెరికన్స్  ఎవరిని చూసినా వాళ్ళకు తెలియక పోయినా చక్కని పలకరింపుతో నవ్వుతూ పలకరిస్తారు చాలా వరకు...మనలో ఎంతమందిమి అలా చేయగలుగుతున్నాము..?? ఏ సంస్కృతిలో అయినా మంచి చెడు ఉంటాయి కాని చెడుకి అలవాటు పడినంతగా  మంచికి అలవాటు పడలేము..!!
ఆత్మ బంధాలు ఆత్మీయతను పంచాలి కాని అనుబంధాలను తెంచకూడదు....ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి ఆలోచనా ఒకటిగా ఉండదు...కొన్ని కొన్ని కలుస్తాయి అలా అని ఒకటిగా ఉన్నా ఎక్కడో ఒక చోట ఈ అహం అడ్డు గోడగా నిలిచి వరకు ఇష్టపడిన ఆ అనుబంధంలో లోపాలు వెదకడానికి ప్రయత్నిస్తుంది....!! ఇదే మన మనస్తత్వం కాదంటారా...!! అప్పటి వరకు కనిపించిన మంచి అయిష్టంగా మారి పోతుంది ఎందుకంటారు...?? జీవితంలో ఆటు పోట్లు ఎవరికీ తప్పవు...కాస్త అనుబదాలకు  ఆప్యాయతలకు విలువలు ఇస్తూ బతకడానికి డబ్బు అవసరానికి మాత్రమే అనుకుంటూ ఆ డబ్బే మన జీవితాలను శాసించకుండా బతకడం అలవాటు చేసుకుంటే ఎన్ని జీవితాలు ప్రశాంతంగా ఉంటాయో...!!

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఒక్కసారైనా జీవిస్తా నేస్తమా...!!

మనసు లేని మర బొమ్మని
మారుతున్న కాలానికి చిరునామాగా
మారలేని గత కాలపు జ్ఞాపకాన్ని....
మరచి పోవాలన్న యత్నంలో
కొత్త నెలవు కోసం వెదుకుతూ
ఆరని మనసు తడిలో....
రేగిన గుండె మంటను చల్లార్చుకునే
ఆరాటంలో నిరీక్షించే మది వాకిట
మలయ సమీరంలా నీ చెలిమి తాకితే...
వేల క్షణాలు మరణించినా కనీసం
ఒక్కసారైనా జీవిస్తా నేస్తమా...!!

16, ఏప్రిల్ 2014, బుధవారం

కృతజ్ఞతాపూర్వక వందనాలు.....!!

దైవం చూసిన చిన్న చూపుకు సమాజంలో నవ్వుల పాలౌతు పుట్టినందుకు బతుకులీడుస్తున్న ప్రాణాలకు చక్కని న్యాయాన్ని చూపిన మానవతాదృక్పధాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన న్యాయాన్ని చెప్పిన మహోన్నత న్యాయస్థానానికి ఆ న్యాయమూర్తులు శ్రీ ఎస్ రాధాకృష్ణన్, శ్రీ ఎ కె సిక్రి గారికి మానవత్వవం ఉన్న ప్రతి ఒక్కరు చెప్పే కృతజ్ఞతాపూర్వక వందనాలు.....!!

పక్కన చిత్ర కవితలో మీ కవి హృదయాలను ఈ సామాజిక విషయం మీద కూడా చెప్పగలిగితే మా ఈ ప్రయత్నం సఫలమైనట్లే .....!!
https://www.facebook.com/groups/308886865876287/ ఈ లింక్ లో మీ మనోభావాలను పదిలపరచండి...!!

14, ఏప్రిల్ 2014, సోమవారం

ఒంటరి బతుకే అవుతుంది....!!

నిజంగా చెప్పాలంటే మనలో చాలా మందికి అసలు ఆప్యాయతలు అనుబంధాలు ఎలా ఉంటాయో తెలియదనే చెప్పాలి.....ఉండటానికి పదిమంది కుటుంబ సభ్యులు ఉన్నా అహంకారం ధన దాహంతో దూరంగా ఉండే వాళ్ళే ఎక్కువ. మనం అన్నం తిన్నా అమ్మ పళ్ళెంలో అడిగి తిన్న ముద్ద రుచి మనలో ఎంత మందికి తెలుసు..?? ఆ ముద్ద తినడంలో ఉన్న ఆనందం ముందు కోట్లు సంపాదించినా దిగదుడుపే...!! గంపెడు మంద ఉన్నా ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప నీ అన్న కష్టాన్ని సుఖాన్ని పంచుకోలేని ఆ మంద ఎందుకు...?? మనకు ఎనలేని కోట్లు ఉన్నా పూటకు సంపాదించుకుని ఉన్న నలుగురు కలసి కలో గంజో పంచుకుని అదే అమృతంలా ఆనందంగా తిని తాగే వారిలోని సంతోషం  దొరుకుతుందా....!!
మా చిన్నప్పుడు కొన్ని రోజులు మేము వేరే ఊరు ఆర్ టి సి బస్సులో స్కూలుకు వెళ్ళి రావాల్సి వచ్చేది... అమ్మ అన్ని చేస్తుంటే అమ్మమ్మ నాకు మా మామయ్యకు అన్నం కలిపి రెండు భాగాలు చేసి ఒకే పళ్ళెంలో పెట్టేది...నాకు ఎక్కడ ఎక్కువ పెట్టేస్తుందో అని నేనే అలా చేయమనే దాన్నిలెండి...తరువాత ఇంటరు చదివేటప్పుడు విజయనగరంలో మేము అద్దెకు ఉన్న ఇంటిలో ఇంటివారు చాలా మంచివారు..మొత్తం ఐదు కుటుంబాలు ఇంటివారితో కలసి...అంటి అక్కకు అన్నకు అన్నం కలిపి ముద్దలు పెడుతూ నన్ను రమ్మని పిలిచేది తినిపించుకోవడం అలవాటు పోయి చేతిలో పెట్టమనేదాన్ని...అమ్మమ్మ గారు పొద్దున్నే జడ కూడా వేసేవారు...అందరం కలిపి ఎవరి పుట్టినరోజు అయినా సెకెండ్ షో సినిమాకి వెళ్ళడం అల్లరి అల్లరి  చేయడం ఎంత బావుండేవో ఆ రోజులు....నేను ఒక్కదాన్నే అయినా ఇలా అన్ని అనుబదాల రుచి.... ఆప్యాయతల విలువా బాగా తెలుసు....!!
మనకు తెలియని దొరకనివి ఎదుటివాళ్ళకు దొరుకుతుంటే చూసి సంతోషించాలి కాని...అమ్మ తినే ముద్దలో పిల్లలు భాగం పంచుకుంటుంటే లేబరు తిండి అనకండి దయచేసి ఇక్కడ ఆ పదం వాడినందుకు నన్ను క్షమించండి...ఎప్పుడు ఎదుటివారిలో తప్పులు వెదకడమే పనిగా కాకుండా మన భాద్యత మనం ఎంత వరకు సరిగా చేస్తున్నామో చూసుకుంటే అందరిలో మంచే కనిపిస్తుంది... నేనే గొప్ప నాకే అన్ని తెలుసు అన్న అహం మన కళ్ళను కప్పినంత వరకు మన చుట్టూ ఎందరున్నా ఎవరు లేని ఒంటరి బతుకే అవుతుంది....!!

13, ఏప్రిల్ 2014, ఆదివారం

అమ్మకండి....అమ్ముడు పోకండి....!!

అనుకున్నంత తేలికగా ఎన్నికల బరిలో దిగడానికి వీలుకాదు...రాజకీయంగా అనుభవం ఉండాలి లేదా డబ్బులు మాత్రమే గెలుపును శాసిస్తున్న ఈ రోజుల్లో అవి ఏమి లేకుండా ఏదో మార్పు మనమూ తెచ్చేద్దాం అంటే మనకు ఓటు వేసే వారు ఎవరూ ఉండరు...కనీసం మనం తెలిసిన నలుగురు కూడా మనకు ఓటు వేయరు కాదంటారా....!! కనీసం అంతా తిరిగి మన గుర్తు చెప్పడానికి అయినా ఉండాలి కదా...!! ఏమి లేకుండా ఆవేశంగా అనడానికి పోటి చేయడానికి తేడా ఉండదు... ఇదేమైనా సైనికుడు సినిమానా....!! ఈ కుళ్ళు కుతంత్రాల రాజకీయాలలోకి రావాలని ఎవరికీ ఉంటుంది....పదవుల కోసం సీట్ల కోసం గెలుపు కుర్చీల కోసం ఎదురు చూసే ఎందరో నాయకుల ముందు ఓటు హక్కు మాత్రమే ఉన్న సామాన్యులం... మధ్య తరగతి కుటుంబీకులం ఎంత చెప్పండి....చీపురు పుల్ల అంత...!! కోపం ఆవేశం మనలో చాలా మందికి ఉంది ఈ నాయకుల నాటకాల మీద కానీ....ప్రధాన మంత్రి...ముఖ్య మంత్రి పదవి కోసం అన్ని వదిలేసి పాకులాడుతున్న గొప్ప వారు కొందరు... ఏదో ఒక సీటు కోసం పార్టీలు మార్చేసి పాకులాడుతున్న విలువలు లేని వారు మరి కొందరు....మనకు వారి గురించి ఏమి తెలియక పోయినా వారికి వారే తిట్టుకుని వారి మోసాలు బయట పెట్టుకుని ఈ రోజు ఒక్కటై పోతున్న ఈ అన్ని పార్టీల నాయకులకు బుద్ది చెప్పడానికి ఒంటరి అభ్యర్ధులకు మీ ఓటు వేయండి.....!! ఓ కొత్త ప్రజాస్వామ్యానికి రధసారధులు కండి... !! కనీసం చదువుకున్న విజ్ఞులు కాస్తయినా ఆలోచించండి...గుర్తులకు మోసపోకండి....విలువల వలువలు మరచి అమ్మకండి... అమ్ముడు పోకండి....!!

12, ఏప్రిల్ 2014, శనివారం

నేను పోటి చేయాలేమో అనుకుంటున్నా....!!

ఏమిటో మరి ఈ సారి ఎన్నికలలో ఇండిపెండెంట్ గా నేను పోటి చేయాలేమో....!!  అనుకుంటున్నా....!! సరైన నాయకునికి స్థానం ఇవ్వక పొతే ఈ లెక్కల మొక్కుబడులలో చెప్పే సర్వేలను నమ్మి సీటు ఇస్తే నాకు తప్పేటట్టు లేదు...పార్టీ అంటే అభిమానం  ఉంటుంది కాని నాయకత్వ లోపం ఉండకూడదు....నియంత నిర్ణయాలు ఉండకూడదు....!! జనం ఎప్పుడు నాయకుల కన్నా తెలివిగల వాళ్ళే కాని ఈ ఎన్నికల విషయంలో మాత్రం డబ్బుకో.... మందుకో... పార్టీ మీద అభిమానం తోనో మోసపోతూనే ఉన్నారు.... ఒక్క క్షణం కాస్త ఆలోచించి ఐదు ఏళ్ళ ఓటు హక్కును సరిగా వినియోగించ గలిగితే....జరిగే అద్భుతం ఎంత బావుంటుందో....!! నాయకులను పార్టీలను తిట్టడం మన తప్పు...ఇక్కడ తప్పు చేస్తుంది మనం...!! అందరు విద్యావంతులే....విద్యలు చెప్పే గురువులే....వారే ఇలా అమ్ముడు పోతూ ఉంటే ఏమి తెలియని సామాన్యుల సంగతి ఏమిటి..?? అందరము నాకెందుకులే అని మన కుటుంబం మన వారు అని చూసుకుంటూ ఊరుకోవడంలోనే ఇలా జరుగుతోంది!....!!
పెద్దలు చెప్పినట్టు ఎవరో ఒకరు ఎపుడో అపుడు మొదటి అడుగు వేయాలి...వెనుక ఎవరు ఉండదు నమ్మిన న్యాయం కోసం నీతి కోసం.....!! మేధావులకు నిలయమైన మన భరతావని ఎందుకు ఇలా ఉంది..?? నిలబడిన నాయకునిలో లక్షణాలు చూసి ఓటు వేయండి....క్షమించాలి ఈ మాటను అంటున్నందుకు అది మీ వృత్తి... బతకడానికి మీకున్న అవకాశం...ముష్టివాళ్ళ కన్నా హీనంగా అమ్ముడు పోకండి....!! మీ విజ్ఞతను ఈ సారి అయినా చాటుకోండి ఓటరు మహాశయులు....!! మళ్ళి  మోసపోకండి....!!

కడవరకు ఇలానే ఉండిపోతే....!!

మనసుతో శిలను మలచిన శిల్పి చేతన
జీవాన్ని సంతరించుకున్న ఆ చైతన్యం
చూసే మది పొందే సంతోషం తెలిపే
భావనల తాకిడి వెల్లువలా తడుముతుంటే
ఆ హర్షాతి వర్షాలలో తడిచిన హృదయం
విషాదాన్ని మరపించే స్వాంతనలో పొందిన
సంతసాల సంబరాన్ని పంచుకోవాలన్న ఆత్రం
ఆగనివ్వని ఆరాటం అలల కలల అక్షరాల్లో
నన్ను నేను చూసుకుంటుంటే ఎందుకో.....
నాకు నేనే కొత్తగా అనిపించిన ఈ క్షణాలు
నాకు తెలియని నన్ను నాకు పరిచయమే చేసాయో
నాతో స్నేహాన్ని పంచుకుంటూ ఆ ఆస్వాదనను
అందిస్తూ కడవరకు ఇలానే ఉండిపోతే....!!

7, ఏప్రిల్ 2014, సోమవారం

చివరికి మిగిలే మిధునం.....!!

సమాంతరంగా సహజీవనం చివరి మజిలి వరకు
భావాలు భాద్యతలు ఒక్కటైనా కలవని జీవితాలు
ఆటుపోట్ల అలసట ఆనంద విషాదాలు సమానమే
పక్క పక్కనే ఉంటూ చేరువ కాలేని నిరంతర పయనం
మనిషి జీవితానికి అద్దం పట్టే ఎన్నో మనసుల చిత్రం
మానవ సంబంధాలకు అనుబంధాలకు ప్రతిరూపం
ఎక్కడికో తెలియని ఈ జంట పయనం ఎన్నో అనుభవాల
ఆలింగనాలతో నీ నా తేడా లేక ఒడి దుడుకులు తెలియకుండా
ఎవరి గమ్యాలకు వారిని చేరుస్తూ విశ్రాంతిని మరచిన
ఈ రైలు పట్టాల కధనం చివరికి మిగిలే మిధునం.....!!




6, ఏప్రిల్ 2014, ఆదివారం

జాతి ఎప్పుడు ఋణపడే ఉంటుంది....!!

"అణచివేత నుంచే ప్రతిఘటన పుట్టుకొస్తుంది . 
కాలం కలకాలం ఒకే రకంగా కొనసాగదు....కాలాన్ని ఎవరు శాశ్వతంగా శాసించలేరు...అణచివేతకు గురయిన శక్తులే తిరగబడి చరిత్రను సృష్టిస్తాయి ... తరతరాల మానవ జాతి చరిత్ర చాటి చెబుతున్న సత్యం ఇది.... "
నాకు అంతగా తెలియని ఓ గొప్ప వ్యక్తి చెప్పిన మాటలు అనడం కంటే నేను తెలుసుకోలేక పోయిన ఓ అరుదైన వ్యక్తిత్వం అంటే బావుంటుందేమో...!!
చిన్నప్పటి నుంచి నాకు కాస్త ఈ కమ్యునిజం భావాలు ఎందుకనో ఉండేవి...మా చిన్నప్పుడు ఆ పాటలు అవి నచ్చేవి...పిల్లలు అందరు అప్పట్లో కాంగ్రెస్ ది ఆవు దూడ గుర్తు దానికి అంటూ ఉంటే నేను ఒక్కదాన్నే కత్తి సుత్తి నక్షత్రం అనేదాన్ని మా ఊరిలొ...-:)....కాకపోతే నాకు నచ్చని విషయం ఒక్కటే మనకు నచ్చి మనం ఇష్టపడి పార్టీలకయినా.... దేవాలయాలకయినా... మరోదానికయినా డబ్బులు ఇవ్వాలి కాని ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని జులుం చెలాయించ కూడదు...అలా అడిగితే వారు ఎంత గోప్పవారయినా నాకు కోపం వచ్చేది...
చల్లపల్లి శ్రీనివాసరావు గారు తన ఉద్యమమే ఊపిరిగా .... రాసిన పుస్తకం లోని పై మాటల్లో ఎంత నిజం ఉందో మన అందరికి తెలిసిన విషయమే....ఎవరి భావాలు అభిప్రాయాలు వారివి...వాటిని కాదనే శక్తి ఎవరికీ లేదు..చక్కని భావాలు... ఆయన అనుభవాలు... ఆయన అందరితో పంచుకున్న అనుభూతుల హారాలు.. కష్ట సుఖాలు చాలా బాగా రాశారు...ఎందుకో వారి సతీమణి శ్రీమతి వసుమతి గారు అంటే నాకు ప్రత్యేక అభిమానం..నేను ఆవిడను చూడను కూడా లేదు...కాని ఈ రోజుకి ఇంటికి ఎవరు వెళ్ళినా అన్నం పెట్టే ఆ అన్నపూర్ణమ్మ పది కాలాలు చల్లగా సంతోషంగా బ్వేల్లిన వారికి భోజనం పెడుతూనే ఉండాలి...!!
ఉద్యమం ఏదైనా మనసా వాచా ఖర్మణా నమ్మి దాని కోసం జనం కోసం జీవితాలను త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి జాతి ఎప్పుడు ఋణపడే ఉంటుంది....!! జాతి కోసం జనం కోసం ప్రాణాలొడ్డిన ప్రతి ఒక్కరికి మా వందనాలు....!!

5, ఏప్రిల్ 2014, శనివారం

మనఃపూర్వక అభినందనల సుమమాలలు.....!!

ఉగాది కవితా పోటీలలో పాల్గొన్న బహుమతులు గెలుచుకున్న ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక అభినందనల సుమమాలలు..... పేరు పేరునా చెప్పలేను మన్నించండి.....

పెద్ద మనసు చేసుకుని మన్నించండి...!!

ఎలా మొదలు పెట్టాలో తెలియని పరిస్థితి చెప్పక పొతే నా మనసు ఊరుకోదు...అయినా నాకు అనిపించిన నిజాలు అని నేను నమ్మిన విషయాలు ఎవరు ఎలా తీసుకున్నా చెప్పకుండా ఉండలేను..మరి ఇదే నా బలహీనతేమో....!! ఎవరైనా డాక్టర్ దగ్గరకు ఎందుకు వెళతారు బాలేక పోతేనే కదా.. చిన్న చిన్న వాటికి కూడా స్పెష్సలిస్ట్ దగ్గరకి వెళ్ళేంత అవసరం బాగా డబ్బులు ఏం చేసుకోవాలో తెలియని వారు మరి వెళతారేమో....ఎవరమైనా మనకి పని పాటు లేక డాక్టర్ దగ్గరికి లాయర్ల దగ్గరికి వెళ్ళము నాకు తెలిసి.... మహాత్మాగాంధీ, వివేకానందుడు ఫోటోలు పెట్టేసుకుని....నాలుగు నీతి వాఖ్యాలు గోడలకు అంటించేసి అబ్బో నేను చాలా మంచి వాడినే అనుకుంటే సరిపోదు...మంచితనం ప్రజలకు లేని వారికి సేవ చేయాలనే మంచి మనస్థత్వం మీకు ఉండి ఉండొచ్చు....దానికి మా శతకోటి వందనాలు...మానవ బంధాలన్నీ ఆర్ధిక బంధాలు అన్న మంచి సూక్తులు గోడలకు పరిమితం కాకుండా జీవితాలకు కూడా అన్వయించుకోగలగాలి....మహాత్ముల ఫోటోలు గోడలకు తగిలించుకుంటే సరి పోదు... కనీసం వారిలో కాస్తయినా సహనం అన్నది వైద్యునికి ఉండాలి...మీరు గొప్ప చదువులు చదివి ఉండొచ్చు కాదని ఎవరు అనరు కాని ప్రతి దానికి ఎదుటి వారిలో తప్పులు వెదకకుండా వారి బాధను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి....మీకున్నంత వైద్య పరిజ్ఞానంలో చెప్పగలిగే భాష వారికీ ఉండక పోవచ్చు... కళ్ళు తిరిగాయి అని చెప్పాము అనుకోండి ఏమి కనపడలేదా.... అని మీరు అడిగితే శ్వాస కూడా అందలేదు అని చెప్తే అయితే అలా చెప్పాలి కాని ఇలా చెప్తే ఎలా అంటే ఏం చెప్పగలం చెప్పండి... మెదడుకి సరిపోయినంత గాలి అందక పోతేనే కదా అలా అవుతుంది... వాడుక భాషలో కళ్ళు తిరిగాయనే చెప్తాము... నాకు తెలిసి...!! కావాలని ఎవరి ప్రతి చిన్న దానికి స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లి అక్కడ పడిగాపులు పడరు....మీకు మీరు చేసే వైద్యంలో బాగా అనుభవం ఉందనే మీ మీద నమ్మకం తోనే వస్తారు....
ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మీ అందరితో పంచుకోవాలని నాకు రాసే ఓపిక లేక పోయినా రాస్తున్నా... దయచేసి డాక్టర్లు ఎవరు నా మీద కోపం తెచ్చుకోకండి.... నాకు విటమిన్ బి 12 తేడా ఉంది... అది నేను అమెరికాలో ఉన్నప్పుడు చేయి నొప్పి కోసం వెళితే ఆయన ఇది కూడా టెస్ట్ చేయించమంటే చేయించాను... 180 అప్పుడు ఉంది... ఆ డాక్టర్ అప్పుడు వివరంగా చెప్పారు ఇది తక్కువ ఉంది మాములుగా మన శరీరానికి మనం తినే ఆహారంలో రోజు చాలా తక్కువ మోతాదు లోనే బి 12 కావాలి.... కాకపొతే నీ శరీరం దాన్ని ఉంచుకోవడం లేదు బయటకు వదలి వేస్తుంది.... ఇది 50 కి వెళితే నరాలు సరిగా పని చేయవు... తరువాత నీకు అది 400 కాదు 600 కు వచ్చినా ఉపయోగం ఉండదు అని చెప్పారు... అప్పటి నుంచి ఆ ఇంజక్షన్స్ చేయించుకుంటూ ఉంటే నేను ఇండియా వచ్చే ముందు అక్కడే టెస్ట్ చేయించుకుంటే 298 ఉంది.. అప్పటికి 2 ఇయర్స్ నుంచి చేయించుకుంటున్నా... జీవితాంతం చేయించుకోవాలి అని చెప్పారు నెలకి ఒకటి చొప్పున ముందు రోజు  చేసి తరువాత వారానికి ఒకటి 15 రోజులకి ఒకటి ఇలా చేసి...ఇండియా వచ్చాక నేనే కాస్త అశ్రద్ధ చేసాను కొన్ని చోట్ల ఆ టెస్ట్ గురించి అడిగితే లేదని చెప్తే అలా ఊరుకున్నా రెండున్నర్ర ఏళ్ళు చేయించుకోలేదు... నాకు బాగా తేడా తెలుస్తోంది ... నేను పని చేసే ఆఫీసులో రమేష్ అని వాళ్ళ చెల్లెలు కేర్ లో పని చేస్తుంది... అయ్యా ఈ టెస్ట్ ఉందేమో కనుక్కో అంటే వెంటనే కనుక్కుని నన్ను తనే తీసుకువెళ్ళి టెస్ట్ చేయించాడు.. ఫాంలో డాక్టర్ అన్న చోట సెల్ఫ్ అని రాశాను... ఇలా ఎవరు చేయించుకోరు అండి అంటే నాకు అది బ్లడ్ లో ఎంత ఉందో కావాలి అని వివరాలు చెప్తే చేసి ఇచ్చారు... 98 ఉంది... అది తీసుకుని చినకాకాని లో ఎన్ ఆర్ ఐ హాస్పటల్ కి వెళ్ళి అక్కడ చూపిస్తే అమెరికాలో ఆయన ఏం చెప్పారో అదే మాట చెప్పి మళ్ళి ఇంజక్షన్స్ మొదలు పెట్టాను....ఇది ఒక కధ....
ఈ మధ్య కాస్త కాళ్ళు వేళ్ళు నొప్పులు కొంగర్లు పోతున్నాయి అని ఒక పేరున్న ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.. ఇలా నాకు బి 12 తక్కువ ఉంది అని చెప్తే నువ్వేం స్పెషల్ కాదు అది అసలు ఎవరికీ ఉండదు అన్నాడు....అది అయి పోయింది నా ఇంజక్షన్స్ నా గోలా మామూలు గానే సాగుతోంది...ఒక ఆరువారాల క్రిందట నాకు బాగా తేడా చేసింది కాసేపు ఏమి తెలియలేదు తరువాత బాగా ఫిట్స్ లా వచ్చాయంట...మా చిన్నబాబు ఆ టైం లో ఇంట్లోనే ఉన్నాడు ఎప్పుడు ఉండదు లెండి వాడు ఆడుకుంటూ ఉంటాడు అ రోజు నా కోసమే ఉండి ఉంటాడు... చూసి భయపడి పక్క పిల్లలని పిలిచి ఎదురుగుండా మా వాళ్ళే ఉంటారు వాళ్ళని పిలవమని....మొత్తానికి మా ఇంటి వారు కూడా చాలా మంచి వారు అందరు కలసి దగ్గరలోని హాస్పటల్ కి తీసుకువెళ్ళి మళ్ళి పునర్జన్మని ఇచ్చారు... కాకపొతే ఒక గంట వరకు జరిగినది నా మైండ్ లోకి వెళ్ళలేదు.. సి టి స్కాన్ చేసారు.. మొత్తానికి వైద్యం బానే చేసారు... మరుసటి రోజు విజయవాడలో బాగా పేరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాము....చూసి చెప్పారు... ఎక్స్ రేలు తీసారు... వెన్నెముకలో తేడా ఉందని మళ్ళి ఎం ఆర్ ఐ చేయించారు...ఇవి అన్ని అవసరాన్ని బట్టి మాత్రమే చేయిస్తారు...డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టించరు...కాని నాకు తెలిసిందే వేదం అనే రకం... ఏం జరిగింది అంటే కళ్ళు తిరిగాయని చెప్పాను. సి టి స్కాన్ చూసి బ్రెయిన్ డెడ్ అయింది కాసేపు అని చెప్పి ఒక్కోసారి అలానే గుండె ఆగి పోతుంది అని చెప్పారు .... మందులు ఇంజక్షన్స్ అన్ని ఇచ్చారు... అసలు చాలా రోజుల వరకు పూర్తిగా ఏం జరిగింది అని నాకు తెలియదు...అంటే ఏం కనిపించలేదా అని అడిగితే శ్వాస కూడా అందలేదు అని చెప్పా అయితే అది చెప్పాలి చెప్పడం రాక పొతే ఎలా... ఇక అది ఇది అని కాసేపు మాట్లాడారు... నాకు బి 12 తేడా ఉంది అని చెప్తే అసలు అది లేదు అమెరికా వాళ్ళు అలానే చెప్తారు అని ఏదేదో మాట్లాడారు...

విటమిన్ బీ12 వికీపీడియా నుండి



మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, కుంగుబాటు, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలాల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలాకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్టు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాలా త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది...... 
మళ్ళి  నేను చూపించుకున్న ఇద్దరు డాక్టర్లు ఎముకలు నరాలలో బాగా పేరున్న వారు... ఇంత చిన్న విషయం వారికి తెలియక పోవడం అనేది మరి రోగి దురదృష్టం అనుకోవాలి...నాలుగు రోజుల  నుంచి బాగా బాలేక మళ్ళి వెళితే అంటే నాకు రమ్మని చెప్పిన సమయం కన్నా ముందు వెళ్ళాను మామూలు ఎం బి బి ఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి... మీ అందరికి ఇలా అలవాటు అయిపొయింది అని మరో పెద్ద క్లాసు :) వార్డు మెంబర్ తో అయ్యే పనికి ప్రసిడెంట్ దగ్గరికి రాకూడదు...నేను చెప్పాను మా మామయ్యకి ఫోన్ చేసి ఇలా ఉందని చెప్పాను అండి వేరే టెస్ట్ చేయించారు...మిమ్మల్నే కలవమన్నారు అని కూడా చెప్పా...ఇదేమన్నా అమెరికానా ఫోన్ లో వైద్యం చేయడానికి అంటూ ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూ కనీసం మనం చెప్పే సమయం కూడా ఇవ్వరు.... మళ్ళి బయట చాలా చక్కగా మాట్లాడతారు...!!
మా పెదనాన్న చాలా గొప్ప డాక్టర్..... ఆయన చదివింది ఆ రోజుల్లో ఎం బి బి ఎస్ మాత్రమే... ఆయనా దేశాలు తిరిగి వచ్చారు... మనం పది రూపాయలు ఖర్చు పెట్టుకు వెళితే 3 రూపాయల మందులతో తగ్గించేవారు. మనం ఎం చెప్పనక్కర లేదు నాడి పట్టుకుని అన్ని ఆయనే చెప్తారు...ఆయన  ఆరోగ్యం సహకరించక ఇప్పుడు ఊరికినే ఉండలేక హోమిహోలో చూస్తున్నారు... మా మామయ్య అని చెప్పాను ఆయన కూడా చక్కని వైద్యం చేస్తారు..ఇద్దరు కలసి చాలా రోజులు చేసారు అందరికి అందుబాటులో... ఆయనా దేశాలు వెళ్లి వచ్చారు...కాకపొతే కొద్దిగా కోపం ఉండేది ఆయనకు చెప్పిన సమయానికి రాక పోయినా మందులు సరిగా వేసుకోక పోయినా....!!
అమెరికాలో వైద్యం గురించి ఇక్కడ మన వాళ్ళలో చాలా చిన్న చూపు ఉంది కాని వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఆ సహనం ఒక డాక్టర్ అనే కాదు హాస్పటల్ లో ప్రతి ఒక్కరు పాటిస్తారు కాక పొతే వైద్యం చేయడానికి కాస్త సమయం తీసుకుంటారు....!!
మా ఉరికి ఎర్ర బస్ లేక పోయినా సరస్వతికి పుట్టినిల్లు....మీరు ఎంత గొప్ప పేరున్న డాక్టర్ అయినా మీకు తెలియనిది ఎదుటి వారు చెప్పినప్పుడు విని నిజం ఉందో తేదో తెలుసుకోండి...మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకు వచ్చే రోగి జీవితంతో ఆడుకోకండి....దయచేసి సహృదయంతో అర్ధం చేసుకోండి...మేము ఎప్పుడు వైద్యో నారాయణో హరీ...అని మిమ్మల్నే తలచుకుంటాము...మీకు ఒపిక లేనప్పుడు వైద్యం మానేయండి...మా జీవితాలతో మాత్రం ఆడుకోకండి....!! నాకు ఆరోగ్యం ఇలా అవడానికి కారణం అయిన ప్రతి  ఒక్కరు ఇకనయినా ఎవరిని ఇలా బాధపెట్టకండి....ఈ నా మనసు మాటలు ఎవరినైనా ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని బాధ పెట్టి ఉంటే పెద్ద మనసు చేసుకుని మన్నించండి...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner