తొలి గురువు అమ్మ ... అమ్మతో మొదలై అ ఆ లు దిద్ది ణ రాయడం రాక దెబ్బలు తిని తరువాత ఆచారి మష్టారితో తెలుగు మొదలై విష్వక్సేనుడుతో కష్టాల కడలి దాటి కాస్త ముందుకు వెళ్ళి భగవద్గీత, హనుమాన్ చాలీసా, శివ స్తోత్రాలు పింగళి మాష్టారు నేర్పించగా.... నాగలక్ష్మి గారి వద్ద హింది అక్షరాలు దిద్ది, వేంకటేశ్వర శుప్రభాతంతో మరికాస్త మెరుగులు దిద్దుకుంటూ పెద్ద తెలుగు మాష్టారి సంస్కృత పాఠాలు వల్లె వేస్తూ శ్రీలత గారి పాటలు నేర్చుకుంటూ... ఆర్ధిక శాస్త్రంలో అక్షరాభ్యాసం చేసి భూగోళ చరిత్రలు వల్లె వేస్తూ సామాజిక న్యాయాలు చదివేస్తూ, కమల గారి బొమ్మలు వేసేస్తూ, లెక్కల ఎక్కాలు పై నుండి కిందికి, కింది నుండి పైకి గబ గబా చెప్పేస్తూ అప్పుడే కొత్తగా వచ్చిన ఆల్జీబ్రా ఎక్స్ వై లతో ఆటలు మొదలు మొదలు పెట్టించిన లెక్కల మాష్టారు, జీవ శాస్త్రంలో తన కన్నా బాగా బొమ్మలు వేస్తున్నా అని మళ్ళి వేయించిన వసంతరావు గారు, మీసాలు మెలిపెట్టి అందరిని ఆటలాడించిన మీసాల మాష్టారు, మనిషి చిన్నగా ఉన్నా స్కూలు మొత్తాన్ని తన ఆహార్యంతో భయపెట్టి ఆంగ్లం నేర్పిస్తూ వ్యాకరణం బాగా నేర్పించిన ప్రదానోపాద్యాయులు రత్నారావు గారు.... ఇవి శ్రీ గద్దె వెంకట సత్యన్నారాయణ శిశువిద్యామందిరం అవనిగడ్డలో ..... తరువాత.....
ఏమి రాకుండానే అందరిని భయపెడుతూ బాగా కొట్టే అప్పారావు గారు, వెంకట్రావు గారు, చక్కగా తెలుగు చెప్పిన చిన్న తెలుగు మాష్టారు, హిందితో పాటుగా బోలెడు కబుర్లు చెప్పిన రత్న కుమారి గారు..... లెక్కలు చాలా బాగా చెప్పిన లెక్కల మాష్టారు విశ్వేశ్వర రావు గారు,నాలో నాకే తెలియని మరో కోణాన్ని ... నాయకత్వాన్ని గురించి వాళ్ళ పిల్లలకు చెప్పిన నేనంటే బాగా ఇష్టపడిన సైన్స్ మాష్టారు..... అల్లరి చేసినా భరించిన సోషల్ మాష్టారు, తెలుగులో ఒక్కసారి కూడా ప్రధమ స్థానం వేయకుండా ఏది చేసినా ఎప్పుడు నన్ను తిడుతూనే తెలుగును చక్కగా చెప్పిన పెద్ద తెలుగు మాష్టారు, ఇంగ్లీషు, ప్రపంచ పటాన్ని వివరించిన హెడ్ మాష్టారు, ఇలా అందరి ఆసరాతో అతి సుందరంగా గడిచిపోయిన బాల్యం జొన్నవలస ప్రభుత్వ పాతశాలలో ......
మరో రెండు ఏళ్ళు .....
కాలేజ్ అయినా అల్లరి మామూలే అన్నట్లు మహారాజ మహిళా కళాశాలలో మరో అధ్యాయం అందరి ఆశీస్సులతో ఆడుతూ పాడుతూ ఐపోయింది.... అలానే ఇంజనీరింగ్ కూడా కర్ణాటకలో..... ఇక జీవిత పాఠాలు నేర్పిన తొలిగురువు మా పెద్ద ఆడపడుచు.... ఆమెతో మొదలై అది అలా ఎందరితోనో ఇప్పటికీ నేర్చుకుంటూనే జీవితాన్ని గడిపేస్తున్నా.... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆది అంతిమ గురువు భగవంతుడైనా మధ్యలో వచ్చిన ఈ గురువులందరికీ నా పాదాభివందనాలు....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి