ఇంతకు ముందో సారి నీకు అన్ని చెప్పినట్టు గుర్తు... అయినా నీకు ఏది పట్టదు... నాకేమో పదే పదే చెప్పే అలవాటు లేదాయే... ఎలా కూర్చాడో ఏమో ఆ దేవుడు మనల్ని ఇలా... తలచుకుంటేనే భలే ఆశ్చర్యంగా ఉంటుంది నాకైతే ఇప్పటికి.... చిన్న చిన్న వాటికే బోలెడు సంతోషపడే నేను... ఏది పట్టని నువ్వు... పుస్తకాల పురుగుని నేనైతే అస్సలు వాటి వంకే చూడని నువ్వు... ఒక్క మాటలో చెప్పాలంటే మిన్ను విరిగి మీద పడినా చలనం లేని నువ్వు... నమ్మి వచ్చానని నీకు తెలిసినా నా నమ్మకాన్ని అటకకెక్కించిన రోజున నాతో హితంగా ఉన్న కన్నీరు కూడా నాకు దూరంగా వెళ్ళిన క్షణాలు ఎన్నని చెప్పను... జీవితంలో మనం పరుగులు పెడుతూనే ఉన్నా ఎక్కడో ఓ చోట ఆగాలి.... అది మనకు కోపాన్నో, బాధనో మిగిల్చే గమ్యం కాకూడదని నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నా... బాధ్యతలను మరచి పోలేదు... బంధాలను వదిలించుకోవాలన్న కోరికా లేదు.... కాని ఒంటరి ప్రయాణం చేయాలని మాత్రం అనుకోలేదు ఎప్పుడు.... నిన్ను అడిగాను ఈ సంగతి కూడా నీకు గుర్తు లేదనుకుంటా.... నువ్వేమో అన్ని మర్చిపోయావు... నన్నేమో ఏది వదలడం లేదు ఏం చేద్దాం మరి... చివరి వరకు చేరలేని నా గమ్యం మధ్యలోనే నాకు దొరికేస్తుంటే సంతోషంగా వెళిపొదామని బంధాలను బాధ్యతలను నీకు అప్పచెప్పాలని అనుకుంటూనే ఎలా చెప్పాలో తెలియక సతమతమౌతూ చూస్తూ ఉండిపోతున్నా నేనెవరో తెలియక...!!
నువ్వు మర్చిపోయిన నేను
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి