దారులు తెలియకున్నా రహదారుల వారధికి
శూన్యంలో వెదికే గమన నిర్దేశాన్ని అందుకునే
అలవాటు కోసం యంత్రాల సాధనాలు సరిపోవునా...!!
చింతన లేని చితాభస్మం చేరిన మట్టి ముంత అడిగేనా
నీ కులమేదని మతమేదని నిను కాల్చిన కట్టెల వాసనను
ఆరడుగుల నేలైనా అడగనే లేదు ఈ ప్రశ్నలను ఎందుకనో
మోసిన ఆ నలుగురైనా భారమని అనుకోనే లేదు మరి...!!
మోహాల పాశం మదిని వీడనంత కాలం ముసుగు వేసిన మూర్తి
మౌనమై నిను నీవు చూడలేని నిలువుటద్దం నీ ఎదురుగానే
అహం అలంకారాన్ని వదలలేని నేను నా చుట్టూనే పరిభ్రమణం
బంధాల భాషలు వదలనిదే బంధుత్వాలెక్కడికి మరలును....!!
మూన్నాళ్ళ ముచ్చట మూసిన రెప్పల మాటున ఒదిగిన
ముఖాల పై పై రంగుల హంగుల హరివిల్లే అన్నట్టుగా చేరి
క్షణంలో అదృశ్యమై పోయే హరిత వర్ణాలు మనవి కావని
ఆత్మ నివేదనావలోకం ఆనంద నిలయమని నమ్మిన చాలు....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి