29, మార్చి 2015, ఆదివారం

సంఘర్షణ...!!

నేస్తం..
          ఎప్పటిలానే మరో విషయంతో ఈ లేఖ నీకు... మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి క్షణం మనతోనే ఉన్నా మనకు తెలిసిన గొప్పదనాన్ని ఇతరులు గుర్తిస్తేనే తప్ప మనకు కనపడని వింత ప్రవర్తన... తెలిసినా తెలియనట్లు నటించేయడం మనకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది.. మనకు వస్తున్న లేదా ఇస్తున్న ప్రోత్సాహాన్ని చూసుకుంటున్నాము తప్ప మనం ఎదుటివారికి చిన్న స్పందనైనా తెలియజేయక పోవడాన్ని గుర్తించలేక పోతున్నాము.. ఇది ఎంత వరకు న్యాయమంటావు...? ఎంతసేపూ మన గొప్పే కాని ఎదుటివారిలో ఉన్న మంచి లక్షణాలను ఎందుకు ఒప్పుకోలేక పోతున్నాము...? ఒక చిన్న ప్రోత్సాహాన్ని అందించే మంచి లక్షణాన్ని ఎందుకు అలవరచుకోలేక పోతున్నామో..? చెప్పుడు మాటలు చెవికి ఇంపుగా ఉంటాయి కాని నిజం మంచితనం ముందు ఎప్పటికైనా తలను వంచాల్సిందే.... చదువు ఇచ్చిన వివేకం, వయసు తెచ్చిన అనుభవం కూడా ఈ చెప్పుడు మాటల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతుంటే చూడటానికి చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కోసారి... చాలా అనుబంధాలు వీటి మూలంగా విచ్చిన్నం అవుతున్నాయి... మనం అనుకుంటాము మనం చేసే పని ఇతరులకు తెలియదులే అని కాని మన పెద్దలు చెప్పిన సామెత మరచిపోతున్నాం ఇక్కడ.." పిల్లి కళ్ళు మూసుకుని పాలుతాగుతూ నన్నెవరు చూడలేదనుకుంటే " ఎలా సరిపోతుంది లెక్క... మాటలు చెప్పి మన ప్రవర్తనను దాయాలంటే దాగుతుందా అసలు నైజం...నాలుగు రోజులకైనా బయట పడక మానదు కదా... మనసులో లేని బంధాన్ని అరువుగా తెచ్చుకుంటే అది అరువుగానే కనిపిస్తుంది.... మాట మనసు లోపలి నుంచి రావాలి కాని ఏదో అవసరానికో లేక ఎదుటివాళ్ళకి సర్ది చెప్పడానికో, లేదా మనని మనం దాచుకోవడానికో కాదు... మనకు ఇష్టం లేక పోయినా నటించడం ఎందుకు... లేనట్టుగానే ఉంటే పోలా... పిలుపు అనేది ఆత్మీయంగా ఉండాలి కాని మొక్కుబడిగా ఉండకూడదు.... ఎవరో ఏదో అనుకుంటారని మనల్ని మనం మోసం చేసుకుంటూ బతికేయడం అవసరమా...? ఎందుకో నేస్తం జీవిత వాస్తవాలు చూస్తూ ఈ నాలుగు మాటలు నీతో పంచుకోలేకుండా ఉండలేక పోతున్నా....
ఉండనా మరి ఈ సంఘర్షణ ఇంతటితో ఆపేస్తూ...
నీ నెచ్చెలి...

28, మార్చి 2015, శనివారం

వింతైన జీవిత సత్యం ఇది....!!

రాయలేని కావ్యాన్ని కదిలించి
మోయలేని భారాన్ని మదిలో
దాయలేక సతమతమౌతున్నా
కలలొలికించిన జ్ఞాపకాలను
తట్టి లేపిన వాస్తవాలను
విలపిస్తున్న మది అంతరంగాన్ని
సముదాయించాలన్న ఆతృతను
కురిపిస్తున్న కన్నీటి తెరల వెనుక
వినిపిస్తున్న హృదయ ఘోషలో
రాలుతున్న అక్షరాల జల్లులు
తాకుతున్న మనసు పొరలను
కదిలిస్తున్న భావాల ఆవేదనను
చెప్పాలన్న ఆరాటమే తప్ప
నేను నువ్వు వాటిలో ఇమిడిన
క్షణాల జీవితాన్ని చూడాలన్న
ఆశ లేని వింతైన జీవిత సత్యం ఇది....!!

ఇంతకీ ప్రేమంటే....!!

నేస్తం,
          నువ్వెలా ఉన్నావని అడగబోవడం లేదు... నేనెలా ఉన్నానో చెప్పనూ లేను...నాలోని అంతర్యాన్ని నీకు వినిపిస్తూనే ఉన్నా కనుక నేనెలా ఉన్నానో నీకు తెలుసు... నా నేస్తం ఎలా ఉందో నాకు తెలుసు..... సరే ఇక అసలు విషయానికి వస్తున్నా.... ప్రేమ అనేది ఎందుకు పుడుతుంది...? ఎలా పుడుతుంది...? ఎప్పుడు పుడుతుంది...? ఎన్ని సార్లు పుడుతుంది...? అసలు ప్రేమంటే...?
         ఎందరినో చూసాక నాలో ఈ ప్రశ్నలు తలెత్తాయి.... ఒకరంటే ఇష్టపడతాము... కొన్ని రోజులు వాళ్ళు లేకపోతే  బతకలేము అన్న భ్రమలో ఉంటాము.. ఇక్కడ భ్రమ అని ఎందుకన్నానంటే వాళ్ళ ప్రేమ దొరకకపోతే చచ్చిపోతామంటాము కాని చనిపోలేము.... మరొకరితో జీవితాన్ని పంచుకుంటాము... మళ్ళి ఎవరో తారసపడతారు... వాళ్ళంటే చాలా ఇష్టం, ప్రేమ అని అనుకుంటాము... మనిషితో పని లేదు... మనసు చాలు అని సరిపెట్టుకో చూస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాము... మనకి నచ్చిన అందాన్ని ఇష్టపడటం ప్రేమా... ఈరోజు ఒకరు... రేపు మరొకరు నచ్చుతారు.. ఎల్లుండి ఇంకొకరు.... ఇదేనా ప్రేమంటే... ? జీవితంలో ఇలా ఎంత మందిని ప్రేమిస్తామో అని తెలియని ప్రశ్నగా మిగిలి పోయింది ప్రేమ... ఇలా ఇంత మందితో ప్రేమ సాధ్యమా.... దీన్నే ప్రేమంటారా... ?
         నైతికమా... అనైతికమా.... అన్న ఆలోచన రావడం లేదేమో.... ఈ ప్రేమ మత్తులో పడి.... ఉచ్ఛనీచాలు మరచిపోతున్న ఎందఱో మానవమాత్రులు... ఇంతకీ ప్రేమ మానసికమా శారీరకమా అన్న ప్రశ్నకు సమాధానం ఎక్కడ...? ఆత్మ బంధంతో అనుసంధానమైంది ప్రేమ అని తెలియక మన అవసరాలను ప్రేమకు జతగా చేర్చుతూ అదే ప్రేమని మురిసిపోతూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఎదుటివారిని మాయ చేయడానికి యత్నించడం సబబంటావా...!! ప్రేమ రాహిత్యంలో కొట్టుకుపోయే వాళ్ళు, శారీరక వాంఛలకు దాసోహులు ఈ ప్రేమ ముసుగులో ఆడే నాటకాలు నిజంగా నిజమైన ప్రేమను చంపేస్తున్నారు... ప్రేమను ప్రేమించే ప్రేమ ఆ ప్రేమ కోసం మనసంతా ప్రేమను నింపుకుని ప్రేమలో బతికేస్తుంది కదూ...ఇంతకీ ప్రేమంటే....!!
        ఏంటో నేస్తం తెలియని ప్రశ్నగానే ఈ ప్రేమ మిగిలిపోయింది... సమాధానం నీకు తెలిస్తే నాకూ చెప్పవూ....!!
నీ నెచ్చెలి.... 

27, మార్చి 2015, శుక్రవారం

మణి మాలికలు.....!!

1) కలలొలుకుతున్నాయి
జ్ఞాపకాల బరువును మోయలేక 
2. కలలొలుకుతున్నాయి
కన్నీటికి తడిచి ముద్దౌతూ  
3.  కలలొలుకుతున్నాయి
 రేయిలో నిదురను ముద్దిడుతూ

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది ఐదవ భాగం....!!

అందరికి మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు ...... శ్రీరామ నవమి శుభాకాంక్షలు.... మన తెలుగు సాహితీ ముచ్చట్లు నిరాఘాటంగా సాగుతూ ఇరువది ఐదవ వారంలోనికి ప్రవేశించడం నాకు చాలా సంతోషంగా ఉంది... ఏదో నేను చెప్పాలి అనుకున్నది సింగిల్ పేజి కథలా చెప్పేస్తూ ఉండేదాన్ని.. అలాంటి నాతో ఇన్ని వారాలుగా ఇంత పెద్ద పెద్ద వ్యాసాలు రాయిస్తున్న ఘనత సాహితీ సేవ వారిదే... వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనాలు ...
అసలు కవిత్వం అంటే ఏమిటి... కవిత్వం పుట్టు పూర్వోత్తరాలు, కవిత్వంలో రకాలు ఎన్ని మొదలైన విషయాల గురించి ఈ వారం కాస్త తెలుసుకుందాం.. ముందుగా కవిత్వమంటే.....

కవిత్వం

కవిత్వం అనేది వైయుక్తిక సృజనాత్మక ప్రక్రియ. అన్ని కళల్లాగే కవిత్వం కూడా ఒక నిరంతర సాధన కాబట్టి. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చుకవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ. ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి తీరని హాని చేస్తాయి. చెప్పేదేదైనా బలంగా ఉండాలి. నంగి మాటలు, నత్తి చేష్టలు వద్దు. అంతా రాస్తున్నారు కాబట్టి మనమూ రాద్దామన్న కుర్రతనపు వికారాలు వద్దు. కీర్తి కాంక్ష అసలే వద్దు . ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగాని ఒక మంచి కవిత జన్మించదు. నిన్ను నువ్వు పూర్తిగా అర్పించుకుంటే తప్ప కవిత నిన్ను కరుణించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు.రసమయ ఘడియల్లో సృజించిన కవిత , కొన్నాళ్ళాగి చదివితే రాసినప్పటి మానసిక స్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో చూసుకోవాలి. అలా తీసుకువెళ్ళినట్లైతే అది కవిత అయినట్లే.

కవిత్వంలో రకాలు

  • అభ్యుదయ కవిత్వం (Revolutionary poetry)
  • దిగంబర కవిత్వం
  • బంధ కవిత్వము
  • భావ కవిత్వం (Lyrical poetry)
  • కాల్పనిక కవిత్వం (Romantic poetry)

ఈ వారం సాహితీ పద్దతులలో ఎక్కువగా వాడుకలో ఉన్న వచన కవితా సాహిత్యం గురించిన వివరణలు చూద్దాం

వచన కవిత

 పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం. ఆంగ్లంలోని ఫ్రీవర్స్ అన్నదానికి సమానార్థకంగా వచన కవిత అన్న పదం ప్రయోగింపబడుతోంది. పద్యం గేయంగా మారి, గేయం వచన ధోరణిలోకి మారిన పరిణామ దశలను గమనిస్తే తెలుగు కవిత్వ ప్రక్రియలలో ఎక్కువమందిని ఆకట్టుకున్నది వచన కవిత్వమే. తెలుగు కవిత్వానికి పద్యమే దిక్కు అన్నది అంగీకరించక, కొత్త ధోరణుల్లో తెలుగు కవితా ప్రక్రియలకు శ్రీకారం చుట్టాలన్న తపనతో యువ కవులు చేసిన ప్రొయోగమే వచన కవిత.

కుందుర్తి ఆంజనేయులు వచన కవితా పితామహుడుగా ప్రసిద్దుడయ్యాడు. పద్యమే కవిత్వమని అపోహ పడేవారికి ఆధునిక కాలానికి వచనమే తగినదని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించాడు. నగరంలోవాన కుందుర్తి రచించిన వచన కవితా కావ్యం. ఈ కావ్యాన్ని వచనకవితకు లక్షణ దీపికగా కుందుర్తి రచించాడు. వచన కవితా ఉద్యమం తెలుగు సాహిత్య లోకంలో దుమారం లేపింది. చర్చలు, వాదోపవాదాలు, తిరస్కారాలు వంటి వాటితో తెలుగు సాహిత్య లోకం హోరెత్తింది. వచనం లో రాస్తే అది కవిత్వమెట్లా అవుతుందని వచన కవులను ప్రశ్నించిన వాళ్ళున్నారు.

వచన కవితా లక్షణాలు:

  • శ్రీ శ్రీ అన్నట్లు చందో బందోబస్తులన్నీ వచన కవిత తెంచింది.
  • వచన కవితలో గేయ కవిత లాగా మాత్ర చందస్సు కూడా నిబద్దం కాదు.
  • కాలం మారిన దశలో పాత కవి సంప్రదాయలను, అలంకారాలను వచన కవిత తిరస్కరించింది.
  • సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తు నిర్మాణం వచన కవితకు ప్రత్యేకం.
  • కవి భావుకతకు, భావప్రకటనా స్వేచ్చకు చందస్సు ఆటంకం కాబట్టి చందోరహితమైన వచనం సామాన్యుడికికూడా అందుబాటులో ఉంటుందన్నది వచన కవుల అభిప్రాయం.
  • చందో విముఖతను ప్రాణంగా కలిగిన వచన కవిత, భావుకతకు ప్రాధాన్యత నిచ్చింది.
  • ఆకర్షణీయమైన అంత్య ప్రాసలు వచన కవితకు అలంకారాలయ్యాయి.
  • చమత్కారమైన అధిక్షేపణ వచన కవుల సొత్తు.

వచన కవితకు శిష్ట్లా , పఠాభి, నారాయణ బాబు, శ్రీశ్రీ వంటి వారు అద్యులు కాగా , కుందుర్తి వచన కవితా ఉద్యమాన్ని నిర్వహించి వచన కవితా పితామహుడు అని పేరు తెచ్చుకున్నాడు. వచన కవితలో భావప్రకటనకు ప్రత్యేకత ఉంది.
"ఏ గుడిసె నడిగినా పోగొట్టుకున్న శీలాన్ని
తాటి ఆకుల్తో కప్పుకుంటుంది"
---- ఇందులోని భావం ఎంత తీవ్రంగా చెప్పబడిందో వివరించనక్కరలేదు.
వచనకవిత చందో ప్రాధాన్యం లేనిది కాబట్టి అనవసర పదాలు, పదాడంబరం పట్ల ప్రత్యేక శ్రద్దా ఉండవు. జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యతనివ్వడం వచన కవుల ప్రత్యేకత. ఆధునిక కవుల్లో అద్భుతమైన వచనకవితలు రాస్తున్నవారిలో కె. శివారెడ్డి, నందినీ సిధారెడ్డి, ప్రేంచంద్, అఫ్సర్ వంటి కవులు వచన కవితా ప్రక్రియకు వన్నెలు తెస్తున్నవారు. ఇప్పుడు పద్యం రాసే వారికంటే వచన కవిత రాయడం వైపే మొగ్గు చూపేవారు ఎక్కువ. ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ వచన కావ్యానికి పురస్కారాన్ని ప్రకటించి వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేస్తోంది.
ఈనాడు వచన కవిత్వం ఎన్నో కొత్త పుంతలను తొక్కింది అనడంలో అతిశయోక్తి ఏమి లేదు... ఎంతో మంది కవులు తమ భావాలను వచనంలో సున్నితంగా, హృద్యంగా, మనసులకు హత్తుకునేటట్లు చెప్పడంలో చేయి తిరిగిన కవులయ్యారు. ఎన్నో పురస్కారాల సత్కారాలను అందుకుంటున్నారు....
ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

26, మార్చి 2015, గురువారం

ఇతడు ఎవరో మరి.....!!

నేస్తం...
          కనుమరుగౌతున్న అనుబంధాలకు ఈనాడు మనకు కనిపిస్తున్న సాక్ష్యాలు అనేకం... మాయమౌతున్న అమ్మతనం ఓ వింత పోకడగా మారుతుంటే... ఆ అమ్మతనానికి అర్ధాన్ని పరమార్ధాన్ని చూపిన నాన్నతనం ఎప్పుడో దూరమైంది మన అనుబధపు లెక్కల్లో... ఖరీదైన జీవితాలకు, విలాసాల నాణ్యతకు నాన్నను పావుగా చేస్తున్న పసి హృదయాలకు తెలియదు... ఈ ఆట పాటల వెనుక నాన్న ఇచ్చిన ఆసరా ఎంత ఉందో... నిరంతరం శ్రమించే ఆ అవిశ్రాంత శ్రామికుడు కనీస గుర్తింపుకు తన వాళ్ళ దగ్గర నోచుకోవడం లేదని... నావాళ్ళు అని అనుకోవడమే తప్ప మనసుకు దగ్గరగా రాని అర్ధ భాగాన్ని, తన అవసరాలకు, సుఖాలకు మాత్రమే భర్త అనే బంధాన్ని పిల్లలకు తమకు మధ్యన వారధిగా చేసినా మమకారాన్ని వదులుకోలేక ... ఎవరి ప్రేమకు ఆప్యాయతకు నోచోచుకోలేక పోతున్న ఈ ఒంటరి జీవిని ఎవరని సంభోదించాలో మరి. బాహ్య ప్రపంచానికి తెలియని మరో లోకంలో జీవశ్చవంలా బతికేస్తూ పైకి నావాళ్ళ కోసమే నా జీవితం అనుకుంటున్న ఎందఱో తండ్రులు ఈ మాయ లోకంలో...
       బాధ్యతలను బంధాలను గాలికి వదిలేసి ఆధునిక అవసరాలకు బందీలుగా మారిపోతున్న ఎన్నో జంటల వెలికి రాని మనసుల మౌన భావాలు, జరుగుతున్న అంతర్మధనాలు... పక్కనే ఉన్నా చేరువ కాలేని దూరాల అర్ధం కాని ఆంతర్యాలు... మనస్థైర్యాన్ని, మానసికోల్లాసాన్ని అందుకోలేక సర్దుకుపోవాలన్న సహనాన్ని చేతగానితనంగా చూస్తున్నా పిల్లల కోసమే భరించే వినిపించని హృదయవేదన మదిని ముక్కలుగా చేస్తున్నా ఏమి యలేని నిస్సహాయతలో నలుగుతున్న ఎన్నో మనసులు... ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక అడ్డు గోడగా నిలబడిన అహాల ప్రాకారాన్ని కూల్చలేక విధిరాతని సరిపెట్టుకుంటున్న జీవితాలు బోలెడు...
     ఈనాటి భార్యాభర్తల బంధంలో బాధ్యతలు కనిపించక పోవడం హక్కుల కోసం మాత్రమే ఆరాట పడటం దానికి పిల్లలను వాడుకోవడం సర్వ సాధారణమైపోయింది... విద్యావంతులు ఎక్కువైనా ఎన్నో కుటుంబాలలో ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య... కలసి ఉంటున్నా కలవని జీవితాలు... ఎందుకీ అంతరాలు...? ఆస్థుల కోసం ఆరాటాలు ఎక్కువై ఆత్మీయతలు మరచిపోతున్న నేటి జీవితాలు.... ఈ ఆటలో ఒకప్పుడు అమ్మాయిలు పావులుగా మారితే నేటి సమాజంలో చాలా మంది అబ్బాయిలు ఈ జీవిత పరమపద సోపానంలో కొత్తగా వచ్చి చేరిన అహాల/హక్కుల  పాములకు చిక్కి బయటకు రాలేక నలిగిపోతున్నారు....తెలివి ఎక్కువగా ఉన్నా జీవితానికి ఇద్దరు సమానమే అన్న చిన్న విషయాన్ని మరచి కలతల కాపురాలు చేస్తూ కలవని దూరాల రహదారుల్లో సమాంతరంగా పయనిస్తున్నారు... ఈ అంతరాల దూరం తగ్గి ఆంతర్యాలు ఒకటిగా మారేదేన్నదో మరి...!!
ఎందరినో వేధిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటావు నేస్తం...!!
నీ నెచ్చెలి.

24, మార్చి 2015, మంగళవారం

ఈమెవరో మరి.....గురించి నాలుగు మాటలు....!!

https://www.facebook.com/viramurthy?fref=ts
సత్య నీలహంస గారి కవిత  

 ఈమెవరో మరి. 
^^^^^^^^^^^^
(23-03-15)
చల్లని చూపులు వెచ్చని ఒడి
కన్నుల నిండిన వెన్నల తడి
ఇప్పుడు ఈమెలో లేవు
ఇప్పుడున్నది ఈమెవరో మరి.

అలుపెరుగని అవసరాల పోరాటంలో
ప్రదర్శణా ప్రపంచ స్త్రీరూపం! ఈమెవరో మరి.
తను చిన్నపిల్లల గుడ్డలేసుకుని
తన పసిపాపకి మాత్రం పెద్దోల్ల బట్టలేసి
జబ్బలు లేని కిటికీల డ్రెస్సులు వేయించి
విందులకై మందిలో తిప్పుతున్నది . ఈమెవరో మరి.
నెలల తరబడి బిడ్డకి డాన్సులు నేర్పించి
జనాల మధ్యలో జరిగిన ఐటెంసొంగ్ డాన్సుకి
పొంగి పోయి అందరితో కలిసి గొప్పగా
చేవ తెచ్చుకొని చప్పట్ట్లు కొడుతున్నది. ఈమెవరో మరి.
పనులన్నీ పక్కనపెట్టి
ముచ్చటగా ముస్తాబయ్యి
టివీ ప్రొగ్రాం ఆంకర్ కోసం
అద్దం ముందు ఆత్రంగా ఎదురు చూస్తున్నది.ఈమెవరో మరి.
తన్వు ప్రదర్శించి, ఆకర్శించే దుస్తులు వేయించి,
సంకోచం బిడియం విడువమని
"ఏ ప్రమాదమూ" ఉండదనీ
ఎర్రని కళ్లతో హెచ్చరిస్తున్నది. ఈమెవరో మరి.
తను కావలనుకొని కాలేక పోయిన
కరగని కోరికల దుగ్దలని
శ్రద్ద తీసుకొని, ప్రణాలికా బద్దంగా
పసి మనసులపై రుద్దుతున్నది. ఈమెవరో మరి.
అక్షరాలు ఆర్తిగా అందకముందే
అవసరంలేని అస్థిత్వాన్ని ఆపాదించి
అంబరమంటే అహాన్ని అంటగడుతూ
అక్కరకిరాని అందలమెక్కిస్తున్నది. ఈమెవరో మరి.
-సత్య

ఆత్మీయతకు, అనురాగానికి, అభిమానానికి ఇలా ఎన్నిటికో మారు పేరైన ఆ వెచ్చని ఒడి, చల్లని లాలింపు, అలిగిన వేళల బుజ్జగింపులు, వెన్నెల నవ్వుల పువ్వులు, వెల కట్టలేని ప్రేమకు చిహ్నం ఈ జగతిలో ఒక్కరే.. ఆ ఒక్కరే అమ్మ.. మాటల తొలి పాట అమ్మ... ఆటల తొలి నేస్తం అమ్మ.. నడకల నడతల అడుగుల చిరునామా అమ్మ... ఓనామాలకు ఆది గురువు అమ్మ... సహనం,  స్థైర్యం, ధైర్యం అమ్మ... అమ్మ లేనిదే మన పుట్టుక లేదు... జీవానికి జీవితానికి తీరని ఋణమే అమ్మ... ఇక్కడ కవి ఆక్రోశం ఆధునికత మత్తులో, అందలాల ఎండమావుల వెంట అమ్మదనం పరుగిడుతోందని చెప్తూ... నడత నడవడి నేర్పాల్సిన అమ్మే వ్యక్తిత్వాన్ని రంగుల హంగులకు తాకట్టు పెట్టేస్తుందని... పసితనాన్ని గుండెలకు ఆర్తిగా హత్తుకునే అమ్మ పసితనంలోని పాల బుగ్గలకు మసి పూస్తూ చెరగని మచ్చలను వేస్తుందని తెలియచెప్తూ... వలువల విలువలు తెలియ చెప్పాల్సింది పోయి ఆ వలువల చీలికల్లో చిన్నారుల జీవితాలను చిద్రం చేస్తుందని బాధతో... బిడ్డ ఆకలి కోసం జీవితాన్ని పణంగా పెట్టే అమ్మ ఆ బిడ్డనే ఈనాడు అంగడి సరుకుగా మార్చి బాల్యపు ఆనవాళ్ళను చెరిపేస్తుందని కవి మనసు పడే మధనమే ఈమెవరో మరి....!!

ఈ కవిత చదివాక ఈ మాటలు రాయకుండా ఉండలేక పోవడం నా బలహీనతేమో ....!!

23, మార్చి 2015, సోమవారం

సమాధానం తెలియక....!!

నేస్తం...
           ఎక్కడ మొదలైనా... ఎప్పుడు మొదలైనా చివరికి చేరేది ఎక్కడికి అన్న సందేహం మొదలైంది నాలో.. ఎప్పుడు లేనిది ఈ సందేహం ఎందుకొచ్చింది అంటావు... మనం ఉన్నంత వరకు మన బాధ్యతలు వెన్నాడుతూనే ఉంటాయి.. గమ్యం తెలిసినా చేరడానికి సమయం రావాలి.. రహదారులు అడ్డంకులు లేకుండా ఉండాలి... అడ్డంకులు ఉన్నా బాధ్యతలను పంచుకుంటూ... అవరోధాలను దాటటమే జీవిత విజయమని నమ్మేవాళ్ళలో నేను ఒకదానినే..
మనసు చచ్చిపోయినా మనిషి బ్రతికే ఉంటే ఆ జీవితానికి అర్ధం ఎక్కడ... మనకు కనిపించే ప్రతిదీ నిజం కాదు... మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి చాలా సార్లు.. అలానే మనకు వినిపించే ప్రతి మాట మనసు నుంచి రాదు... హృదయాతరాళం నుంచి వచ్చే పలుకులు కొన్నే.... అవే మనసుకు జీవాన్ని నింపుతాయేమో... స్నేహంలో హితాన్ని కాంక్షించడం తప్పు కాదు... కాని స్నేహాన్ని స్వార్ధంగా మార్చుకుంటే....?
        మాటలో మనసు కనిపిస్తుందా అని మరో సందేహం... మన మనసు మాట్లాడితేనే కదా గొంతు నుంచి మాట వచ్చేది... మనసు మూగదైనప్పుడు మాట వినిపించదేమో... లేదా మౌనంలో మాటల అర్ధాలు వెదకాలేమో... ఏమిటో ఈ మాటల మౌనాల మనసు గోల... ఓ పట్టాన అర్ధం కావడం లేదు... ఏం చేద్దాం... మనమూ మౌనాన్ని ఆశ్రయిస్తే పోలా... మాటల గారడిలో మనసు పడిపోతే ఎలా... ఆ మాటల మాయలో పడి నలిగి ముక్కలైతే అతుకులు వేయడం ఆ విధాత తరం కూడా కాదాయే... స్నేహానికి, బంధానికి నడుమ తారాడే మనసు పడే మధనం ఎవరికెరుక... నమ్మకం నట్టేట మునిగినా దాన్ని పైకి లేపాలన్న నిరంతర ప్రయత్నంలో ఎన్నో ఆటు పొట్ల అలజడిలో అవిశ్రాంత పయనంలో కాస్త విశ్రాంతి కోసం తపించే మనసుకి సేద దీర్చే ఆలంబన దొరికితే... సంతోషమో నిరాసక్తతో తెలియని సందిగ్ధం ఓ ప్రశ్నార్ధకంలా మిగిలిపోయింది...సమాధానం తెలియక....!!
ఏంటో నేస్తం అన్ని సమాధానాలు తెలియని ప్రశ్నలే... నీకేమైనా తెలిస్తే జవాబు చెప్పవూ....
ఉండనా మరి
నీ నెచ్చెలి...


           
        

22, మార్చి 2015, ఆదివారం

రచ్చ గెలిచి ఇంట గెలవాలనుకుంటున్న....!!

ఎక్కడో భీమవరం... సాధారణ మధ్య తరగతి జీవితం... సరస్వతీ దేవి కటాక్ష వీక్షణాలతో కరుణించి వరాలుగా 
అందించిన చదువుతో ఉన్నత చదువులను అందుకుని విదేశాలను సైతం తన ప్రతిభతో మెప్పించిన అపర మేధావి ఎం ఎన్ ఆర్ గుప్తా గారు తెలియని తెలుగు వారు ఈ రోజు లేరు అంటే అతిశయోక్తి కాదు.
ఎక్కడో పరాయి దేశంలో ఉన్నా మాతృ దేశంపై మమకారం విడువక తన సేవలు తన సొంత గడ్డకు ఉపయోగపడాలి అన్న తపనను వదలలేక తన చదువు, తెలివితేటలు, తను అపార అనుభవం గడించిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మెళకువలు అన్ని తన వారి కోసమే అంటూ చంద్రబాబు గారి పిలుపుకు స్పందించి తన వంతుగా సేవలను అందించడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన గుప్తా గారు అభినందనీయులు...
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తనదంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ మౌలిక సదుపాయాలకు, సహజ ఒనరులకు పెద్ద పీట వేస్తూ రాష్టాభివృద్దికి కావాల్సిన మొత్తంలో తమ వంతుగా చేయినందిస్తామంటూ బాబుగారికి మాట ఇచ్చి రాజధాని నిర్మాణంలో కీలకపాత్రను వహిస్తామని చెప్పి.. పెట్టుబడుల సేకరణలో సహకారాన్ని, నిర్వహణా బాధ్యతలను స్వచ్చందంగా స్వీకరిస్తామని మనస్పూర్తిగా చెప్పిన ఈ తెలుగు వెలుగుతో మన రాష్టం వెలుగులు చిమ్ముతుందని... గత పది ఏళ్ళుగా ఓ నలభై సంవత్సరాలు వెనుకకి వెళ్ళిన మన రాష్ట్రం ఈ అపర మేధావుల ఆశయ సాధనతో ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలవాలని... ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలని కోరుకుంటూ... తెలుగు'వాడి' సేవలు ప్రపంచానికి కావాలి కాని తెలుగు రాష్ట్రానికి వద్దా..? అన్న ప్రశ్నను తలెత్తనీయక ఇంట గెలిచి రచ్చ గెలవమన్న సామెతను తిరగరాసిన ఈ తెలుగు తేజాన్ని మనం సాదరంగా స్వాగతిస్తూ కనీసం రచ్చ గెలిచి ఇంట గెలవాలనుకుంటున్న తన సంకల్పానికి మన మద్దత్తునిస్తూ తెలుగు వారిగా గర్వపడదాం....!!

21, మార్చి 2015, శనివారం

మరో ఉగాది...!!

షడ్రుచుల సమ్మేళనంలో
నవరసాలు నడకలు నేర్చి
రాలే ఆకుల రంగుల్లో
వాలే పొద్దుల వర్ణాలు చూస్తూ
కొత్త చివుర్ల కోసం ఎదురు చూసే
కోయిలమ్మ కూని రాగాలకు
చెవులు రిక్కించిన మనసుని
ఊహల వ్యాపకంతో సముదాయిస్తూ 
శిశిరపు శీతలాన్ని వెక్కిరిస్తూ
వసంతాన్ని వద్దనకుండా
చైత్రంతో చెలిమిని పంచుతూ
సుఖ దుఃఖాల మిళితమైన
జీవితపు మలుపుల మరో ఉగాది...!!

20, మార్చి 2015, శుక్రవారం

ఇలా ఉండి పోనీ....!!

కాలమాగి పోనీ కథగా వెళ్ళిపోనీ
జ్ఞాపకాన్ని వదలి పోనీ
నిదుర మరచి పోనీ కలగా మిగిలి పోనీ
ఊహలా నడయాడి పోనీ
మనసు మురిసి పోనీ మౌనమై ఉండి పోనీ
మమతలే తాకి పోనీ
ఎదను తడిమి పోనీ ఎదుట నిలిచి పోనీ
ఏకాంతమే తానై పోనీ
వలపు వెల్లువై పోనీ ప్రేమ వరదై పొంగి పోనీ
చెలిమి చిరకాలముండి పోనీ
మాట మరచి పోనీ జతను వీడి పోనీ
మదిని మాయ చేసి పోనీ
చినుకులా రాలి పోనీ చిరుజల్లుగా పలకరించి పోనీ
చిత్రమై చిరకాలముండి పోనీ
రాయలేని కావ్యమై పోనీ వీడలేని బంధమై ఉండి పోనీ
కలకంఠి కన్నీరుగా కలవర పరచి పోనీ
నిశిని మరపించి పోనీ వెన్నెలను వర్షించి పోనీ
వేకువ వెలుగులా మురిపించి పోనీ
జీవితం చేజారి పోనీ జీవమే వదలి పోనీ
జీవాత్మగా  సజీవమై పోనీ
గురుతులా ఉండి పోనీ గుండె నిండా నిండి పోనీ
గతమైన వాస్తవమై ఘనంగా నిలిచి పోనీ....!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది నాలుగవ భాగం....!!

క్రిందటి వారం మన తెలుగు సాహితీ ముచ్చట్లలో ముఖ్యులైన ముస్లిం కవుల గురించి వారి రచనల గురించి చెప్పుకున్నాం... ఈ వారం నుండి మన తెలుగు సాహిత్యంలో ఉన్న కొన్ని సాహితీ పద్దతులను గురించి కాస్త వివరాల లోనికి వెళదాము... మన తెలుగు సాహిత్యంలో కూడా ప్రపంచ సాహిత్యంలో వలెనే వివిధ రకాలైన పద్దతులు ఉన్నాయి... వాటిలో మొదటిది జానపద సాహిత్యం...

జానపద సాహిత్యం

జానపదమనగా జనపదానికి సంబంధించినది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివశించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు. జానపద గీతాలు: జాన పదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. వీటినే ఆంగ్లములో folk songs అని అంటారు. తెలుగు జాన పద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసి మనల్ని ధన్యులని చేయ రాగిరేకుల పై భద్రపరిచినారు.

ఆంధ్రప్రదేశ్ లో జానపద కళలు

  • ఒగ్గు కథ , బుర్రకథ , కోలాటం , తోలుబొమ్మలాట , తప్పెటగుళ్ళు , శారదగాండ్రు , చెంచుబాగోతం , కొమ్ముకథ , వీథి నాటకం , పిచ్చుకకుంట , వీరముష్టి , దొమ్మరాట , కొఱవంజి , గొల్లసుద్దులు , జంగం కథ , జక్కుల కథ , కాటిపాపలకథ ,దాసరికథ , చెక్క భజన , యక్షగానం , పులివేషాలు ...జానపద కళాస్వరూపాలు అనే పుస్తకంలో మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు వీటిని విపులంగా చర్చించారు.

కొండవీడు మందేరా - కొండపల్లి మందేరా కాదనువాడుంటే - కటకం దాకా మందేరా
చూసినారా ఎంత వీర పదమో, ఈ పదము వెనక ఒక చిన్న కథ ఉన్నది, శ్రీ కృష్ణదేవరాయలు కటకం పై యుద్దానికి వెళ్తూ శకునం చూడగా ఒక రజకుడు ఈ పాట పాడుతూ తన బిడ్డడిని నిద్రపుచ్చుతున్నాడంట :-)
అలాగే ఈ దిగువ మాయలేడి కోలాటం పాట చుడండి

కోలాటం పాట

రామయ్య గట్టించే కోలు రత్నాల మేడ కోలు
సీతమ్మ గట్టించే కోలు సిరిపరినా సోల కోలు
సిరిపర్నసోలాలా కోలు సిత్తారీ ముగ్గు కోలు
సిత్తారి ముగ్గు పైనా కోలు రత్నాల కమ్మడీ కోలు
రత్నాల కమ్మడీ పైనా కోలు వాలు చిలకాలు కోలు
వాలు చిలుకలపినా కోలు వారిద్దరయ్యా కోలు
రామయ్యా సీతమ్మా కోలు జూదమాడంగా కోలు
ఆడుతాడుత వచ్చే కోలు అది మాయలేడి కోలు
మాయాలేడికైనా కోలు మడిమే లందమ్మూ కోలు
అటుజూడురామయ్య కోలు అటుజూడావయ్యా కోలు
.....ఇలా సాగి పోతుంది
దీనిని శ్రీ బిరుదురాజు రామరాజు గారు 1956 లో నల్లగొండ జిల్లా కేతేపల్లి గ్రాములో కట్టెకోత వృత్తివాల్ల దాగ్గర నుండి సేకరించినారు.
ఇహ జానపదాలను రకరకాలుగా విభజించ వచ్చు
  1. వివిధ రస పోషణనును బట్టి, అనగా హాస్యాది నవరస పోషణను బట్టి
  2. వివిధ వస్తు నిర్ణయాన్ని బట్టి, అనగా భక్తి, చారిత్రిక, స్త్రీల పాటలు ఇత్యాది
  3. ఇంకా వాటి లోని కవిత్వ నిర్ణయాన్ని బట్టి

కవిత్వాంశాలను బట్టి జానపద విభజనము


జానపద గాయకులు
  1. జోల పాటలు
  2. లాలి పాటలు
  3. పిల్లల పాటలు
  4. బతుకమ్మ పాటలు
  5. గొబ్బిళ్ళ పాటలు
  6. సుమ్మీ పాటలు
  7. బొడ్డేమ్మ పాటలు
  8. ఏలెస్సా, ఓలెస్సా పాట
  9. వానదేవుని పాటలు
  10. తుమ్మెద పాటలు
  11. సిరిసిరి మువ్వ పాటలు
  12. గొల్ల పాటలు
  13. జాజఱ పాటలు
  14. కోలాటపు పాటలు
  15. ఏల
  16. చిలుక
  17. సువ్వాల
  18. భ్రమర గీతాలు
  19. నాట్ల పాటలు
  20. కలుపు పాటలు
  21. కోతల పాటలు
  22. చెక్కభజన పాటలు
  23. జట్టిజాం పాటలు
  24. వీధిగాయకుల పాటలు
  25. పెళ్ళి పాటలు
  26. గ్రామదేవతల పాటలు
  27. తత్త్వాలు
  28. భిక్షుకుల పదాలు
  29. ఇంకా వర్గీకరింపబడని గీతాలు
ఈ జాన పదాల గురించి చెపుకుంటూపొతే ఒక్కొక దానికి బోలెడు కథ ఉంది... అందుకే జనం మెచ్చే పదాలు జానపదాలంటూ ఇప్పటికి అందరి నోళ్ళలో నానుతూ ఈ జాన పద పాటలు ఇంకా మిగిలున్నాయి అంటే అతిశయోక్తి కాదు ... ఈ జాన పదాలు ప్రాంతాల వారిగా ఆయా మాండలికాలను అందంగా ఇముడ్చుకుని జనంలో చేరిపోయాయి .... అందుకే జనపదాలు జానపదాలయ్యాయి...
ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

13, మార్చి 2015, శుక్రవారం

ఏక్ తారలు ....!!

9/3/15
1. ఊహలకి ఊసులెక్కువ_నిన్నే నిరంతరం జపిస్తూ
2. మారీచుల కాలం వచ్చేసింది_మాయదారి ఈ లోకంలో
 3. వింత పోకడలే_విపరీతార్ధాల జీవితాలలో
4. ఆలశ్యానికి తొందరెక్కువైంది_నిన్ను చూసినందుకేమో మరి
5. జ్ఞాపకాలన్నీ ఒకటే పోరుతున్నాయి_నీ చేరువలో నేనుండిపోయానని
6. రేయంతా రెప్ప పడనేలేదు_నీ తలపుల తాకిడికి

కలల కళలు..!!

అంతులేని మది  ఆలోచనలకు
నిదురరాని మనసు కనులకు
కనిపించే దృశ్య కావ్యాలు
ఎల్లలు లేని ఆలోచనాంతరంగాలకు
కనుపాపలలో కదలాడే కమ్మని ఊసులై
హృదయపుటద్దానికి నిలువెత్తు రూపాలు
కలవర పరచే కమ్మని ఊహలు
అలజడి రేపే అనునయాలు
అంతరంగాన్ని ఆవిష్కరించే
అద్భుత కళాఖండాలు
ఈ స్వప్నపు భాండాగారాలు
సుదూరాలను చెంతకు చేర్చి
స్వాంతన చేకూర్చే మైమరపుల
మధుర వాయనాలు
హద్దులు చెరిపేసి ఆకాశానికి నిచ్చెనలేసే
అందమైన కలవరాల కలల కావ్యం ఈ జీవితం...!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది మూడవ భాగం....!!

 వారం వారం  సాహితీ ముచ్చట్ల యానంలో ఇప్పటి వరకు మనం తెలుగు సాహిత్యంలో యుగ విభజన, కొందరు ముఖ్య కవులు, కావ్యాలు ... మొదలైనవి తెలుసుకున్నాము.. ఈ వారం మన తెలుగు సాహిత్యంలో అతి ముఖ్యులైన ముస్లిం కవులు, రచయితల గురించిన వివరాలు చూద్దాం.. సర్వ మత  సమానత్వానికి ప్రతీక మన భారతదేశం... అందులో మన తెలుగు సాహిత్యం కూడా పాలుపంచుకుందని చరిత్ర చెప్పడం మనకు గర్వ కారణం..

తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్విక, ప్రబోధాత్మక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు.తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ;
  • ముహమ్మద్‌ హుస్సేన్‌
భక్త కల్పద్రుమ శతకం(1949) మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం సుమాంజలి. హరిహరనాథ శతకము అనుగుబాల నీతి శతకము తెనుగుబాల శతకము
మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
మాతృ భాష యొండు మాన్యము గదా
మాతృ శబ్దము విన మది పులకింపదా?
వినుత ధర్మశీల తెనుగు బాల"
  • షేక్‌ దావూద్‌
1963లో రసూల్‌ ప్రభు శతకము అల్లా మాలిక్‌ శతకము
  • సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌
సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము
  • ముహమ్మద్‌ యార్‌
సోదర సూక్తులు
  • గంగన్నవల్లి హుస్సేన్‌దాసు
హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య
  • హాజీ‌ ముహమ్మద్‌ జైనుల్ అబెదీన్‌
ప్రవక్త సూక్తి శతకము,భయ్యా శతకము
  • తక్కల్లపల్లి పాపాసాహెబ్‌
వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమనియె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట
  • షేక్‌ ఖాసిం
సాధుశీల శతకము కులము మతముగాదు గుణము ప్రధానంబు దైవచింత లేమి తపముగాదు, బాలయోగి కులము పంచమ కులమయా, సాధులోకపాల సత్యశీల
  • షేక్‌ అలీ
గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో 'గురుని మాట' శతకం మానస ప్రబోధము శతకం
ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన
పాండితీ ప్రకర్ష పట్టుబడదు
పరులభాష గాన భాధను గూర్చును
గురుని మాట యశము గూర్చు బాట
దేశ భాషలెల్ల దీక్ష వహించి నీ
వభ్యసించ వలయు నర్భకుండ
మాతృ భాష నేర్చి మర్యాదలందుమా
గురుని మాట యశము గూర్చు బాట
  • షేక్‌ రసూల్‌
మిత్రబోధామృతము అనే శతకం
  • ఉమర్‌ ఆలీషా
బ్రహ్మ విద్యా విలాసము.
  • "తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారికి 1991 లో నాగార్జున యూనివర్శిటీ లో పి.హెచ్.డి వచ్చింది.
  • ఉర్దూ మాతృభాషగా గల ఎందరో ముస్లిములు కూడా తెలుగు సాహిత్యాన్ని ఉత్పత్తి చేశారు.
  • సయ్యద్ నశీర్ అహ్మద్ "అక్షర శిల్పులు" పేరుతో 333 మంది తెలుగు ముస్లిం కవులు,రచయితల వివరాలతో 2010 లో పుస్తకం ప్రచురించారు.
  • సయ్యద్ సలీం నవల "కాలుతున్న పూలతోట"కు 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

స్వాతంత్రానికి పూర్వం ముస్లిములు నడిపిన తెలుగు పత్రికలు

  • 1842-"వర్తమాన తరంగిణి "వార పత్రిక ---1842 జూన్ 8 న సయ్యద్ రహమతుల్లా మద్రాసు.సయ్యద్ రహమతుల్లా తెలుగు పత్రికా రంగంలో అడుగు పెట్టిన తొలి ముస్లిం.మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాశ్హ యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము.హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"
  • 1891-"విద్వన్మనోహారిణి " -- మీర్ షుజాయత్ అలీ ఖాన్ ,నరసాపురం.తరువాత ఈ పత్రిక వీరేశ లింగం గారు నడిపిన "వివేకవర్ధని " లో కలిసిపోయింది.
  • 1892 -- "సత్యాన్వేషిణి " -- బజులుల్లా సాహెబ్ ,రాజమండ్రి.
  • 1909 --"ఆరోగ్య ప్రబోధిని " షేక్ అహ్మద్ సాహెబ్,రాజమండ్రి.
  • 1944 -- "మీజాన్ " దినపత్రిక -- కలకత్తావాలా,హైదరాబాదు.అడవి బాపిరాజు సంపాదకుడు.

ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

12, మార్చి 2015, గురువారం

మహదానందమే....!!

తరచి తరచి చూశా
తరలి రాని మది కోసం
పిలచి పిలచి అలిశా
పలుకని పాషాణాన్ని
వలచి వలచి వేసారా
వలపు వాకిలి ముంగిట
కలల కళ్ళలో సేదదీరా
స్వప్నమై చెంతనుంటావని
మనసు పరచి మౌనానికి తెలిపా
నా మౌన భాష్యం నీవని
అక్షరాల జతను అందుకున్నా
అందమైన భావాలకు రూపమివ్వాలని
పంచుకున్నా మనసుతో బంధంగా
వేకువ వెలుగు రేకలతో  నీ కోసం పయనమై
చీకటి దుప్పటి చుట్టేసి నిశీధి తలుపు మూసేసా
నిరీక్షణకు నిలయంగా నే మారినా
చేవ్రాలుకు చిక్కని చిరునామా నీదైనా
మరులుగొన్న హృదయానికి
మమత పంచే ముచ్చట మహదానందమే....!!

11, మార్చి 2015, బుధవారం

చిద్విలాసాలు చిందిస్తాడో....!!

నేస్తం....
           కోపమనేది మనకి వస్తే నష్టం కూడా మనకే కదా... మనమేమయినా గొప్ప వ్యక్తిత్వమున్న వాళ్ళమయితే
ఎదుటి వారిని చీదరించుకున్నా కాస్తయినా అర్ధం ఉంటుంది...మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని పట్టించుకొనక పోయినా దాన్ని మనమే పట్టించుకుని కోరి కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాము.... ఒక్కోసారి ఆ కష్టాలకు కూడా విసుగు వచ్చి మనల్ని ఆనందానికి అరువుగా ఇచ్చేస్తూ ఉంటాయి .... కొన్ని సంతోషాలేమో మనకి చెప్పా పెట్టకుండానే మూసిన తలుపు తోసుకుని మరీ వచ్చేస్తుంటాయి... ఏదో సామెత చెప్పినట్టు " కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్టుగా..." మన జీవితంలో బాధలు సంతోషాలు ఒకదానికొకటి చుట్టాలైనట్టుగానే మన చుట్టూ అల్లుకున్న బంధాలు అనుబంధాలు మరొక ఎత్తు... కొన్ని బందాలేమో మనం వద్దన్నా మన వెంట పడుతూనే ఉంటాయి... మరికొన్నేమో మనం కావాలన్నా మన దగ్గరగా రాలేవు...ఎన్నో ఏళ్ళ పరిచయమున్నా అన్ని చెప్పలేము, అలా అని మనకు కావాల్సింది అడగనూ లేము.... కనీసం ఒకసారి పలకరించి వాళ్ళ నుంచి సమాధానం రాకపోతే మళ్ళి పలకరించే సాహసం కూడా చేయడానికి ముందు వెనుక చూస్తాము... మరి కొందరితో చాలా కొద్ది పరిచయమయినా జన్మ జన్మల పరిచయమున్నట్టు కలసిపోతాం... అదేనేమో మనుష్యులతోను మనసులతోను స్నేహంలో ఉన్న తేడా... మన జీవితాలతో ఆడుకునే జగన్నాటక సూత్రధారి చిరునవ్వు వెనుక మర్మం ఇదేనేమో... చూద్దాం ఇలా ఎన్ని కాలాలు ఈ జీవితాలను చూస్తూ తను రాయాలనుకున్న రాతలు రాసేస్తూ చిద్విలాసాలు చిందిస్తాడో....!!
ఎందుకో ఇలా రాయాలనిపించింది నేస్తం....
నీ నెచ్చెలి

9, మార్చి 2015, సోమవారం

అదో అద్భుతాల నిలయం...!!

http://www.manatelugutimes.com/archives/1051

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా నేను రాసిన చిరు కవిత మన తెలుగు టైమ్స్ లో .....


కాసింత ఓదార్పుకే ఆకాశమంత ప్రేమను పంచే
ముదిత మనసు అందమైన జలపాతమై
చూపరుల సంతోషమే తన జీవిత ధ్యేయమంటూ
కడగండ్ల కల్లోలాన్ని కనుపాపలలో దాచేసి
జారుతున్న కన్నీటి సహవాసాన్ని స్వీకరిస్తూ
మోసపోయిన బతుకులో మోదాన్ని మరచి
రాలుతున్న మనసు పూల రాగాలను
చిరునవ్వు చాటుగా దాచేస్తూ
అల్లుకున్న బంధాలను అందాల అల్లికగా అమర్చి
బాధ్యతల భారాన్ని బహు ఇష్టంగా మలచుకొని
కడలి అలల పాఠాన్ని కంఠతా పట్టి
తీరాన్ని తాకాలన్న ఉబలాటాన్ని
బతుకుబాటలో అన్వయించి
మది మధనాన్ని అక్షరాలలో రంగరించి
పదాల చెలిమితో పంచదార పలుకులను అందిస్తూ
జీవన పరమపద సోపానంలో పాములకు చిక్కుతూ
గెలుపు మెట్లను ఎక్కాలని నిరంతరం యత్నిస్తూ
అన్ని మరచే అతివ అంతరంగం అవగతమైతే
అదో అద్భుతాల నిలయం...!!

7, మార్చి 2015, శనివారం

మహోన్నత తెలుగు తేజం....!!

ఈనాటి యువతలో పేరుకు పోతున్న అసహనానికి కారణాలు అనేకం... కాని మీ సమస్యను నాకివ్వండి దానికి
పరిష్కారం నేను చూస్తాను అన్న ఈ అపర మేధావి గురించి మనలో ఎంత మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు... పుట్టింది పెరిగింది సామాన్య కుటుంబంలో .... చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించి తనదైన ఆలోచనలతో ముందుకు సాగుతూ కొన్ని రోజులు మన దేశంలో తన సేవలను అందించి .... తన ప్రతిభకు తగిన అవకాశాలను కల్పించలేని మాతృదేశాన్ని వదలలేక వదలి అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఒమన్ దేశంలో తన ప్రస్థానాన్ని పెట్రోలియం ప్రాజెక్టులో ఇంజనీరుగా మొదలు పెట్టి ఒమన్ సోహార్ ఇన్ ప్రాస్ట్రక్చర్ కంపెనీలో రోడ్స్ ఇంజనీరుగా పనిచేస్తూ కూడా భారత దేశం పై ఉన్న మమకారంతో తన దేశం సూపర్ పవర్ గా రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి అన్న అంశంపై దాదాపు ఐదు ఏళ్ళు కష్టపడి వేల జర్నల్స్ రూపొందించి సమాజం అభివృద్ధి చెందటానికి చాలా కీలకమైన రంగం మౌలిక సదుపాయాలు అందించడం అని బలమైన వాదన వినిపిస్తున్నారు...
'ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ ఎ లాట్' అనే సూత్రంపై ఏకంగా ప్రత్యేక టెక్నాలజీని రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందచేశారు. చంద్రబాబు ఆనాడు చాలా ఘనంగా ప్రచారం సాగించుకున్న విజన్ 2020 ప్రోగ్రాంలో గుప్త ప్రతిపాదించిన సిద్ధాంతాలను యధాతథంగా వినియోగించుకున్నారు.ఇవే కాకుండా కర్నాటక ముఖ్యమంత్రిగా ఎస్ ఎం కృష్ణ ఉన్నప్పుడు ఆయన స్వయంగా గుప్తను ఆహ్వానించి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు.ఈ గుర్తింపులతో సరి పెట్టుకొనక  దేశ ఆర్ధిక పురోభివృద్ధికి ఐటి రంగం చాలా చేయూతనిస్తుందని చెబుతూనే దానికంటే ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వాల్సిన రంగం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అని ఖచ్చితంగా తన వాదన వినిపిస్తూ దానికి తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వడం లేదని తన ఆవేదనను చాలా వేదికలపై వ్యక్త పరుస్తూ.... గడచిన అరవై ఏళ్ళ కాలమంతా అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఈ రంగం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేస్తూ... అభివృద్దికి బాటలు వేసే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశ ఆర్ధిక పురోగతికి స్థిరమైన ప్రగతికి బాటలు వేస్తుందని... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంథానం చేస్తూ విశాలమైన రహదారులు, అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, నౌకాశ్రయాలు, నీటి ప్రాజెక్టులు, నీటి పారుదల వ్యవస్థ, రైలు మార్గాలు ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనే దేశ భవితకు తిరుగులేని రాచమార్గాలని సోదాహరణంగా వివరిస్తున్నారు...ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి అభివృద్ధి చెందిన 160 దేశాల్లోని స్థితిగతులను అధ్యయనంచేసిన అనుభవాన్ని మేళవిస్తూ... భారతదేశ సహజ ఒనరులను, మానవ ఒనరులను, చక్కని ప్రతిభ ఉన్న యువతను కాస్త సానపట్టి, రాజకీయ, విద్యా రంగాలలో మార్పులు చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ.... ఏ దేశ మేగినా ఎందు కాలిడినా నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న ఆర్యోక్తిని అక్షరాలా పాటిస్తూ తెలుగు వారికి తనదైన చేయూతను అందిస్తూ... తన మాటల చాతుర్యంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ... లెక్కలేనన్ని సత్కారాలను, దేశ విదేశాల్లో అత్యన్నత గౌరవ పురస్కారాలను అందుకున్నా.... తెలుగు'వాడి' వేడిని ప్రపంచానికి చూపించిన ఈ భీమవరం మద్దుల నాగభూషణ రావు గుప్త తన మాతృ భూమికి తన సేవలు వినియోగించాలన్న తపనను వీడలేక... సరైన అవకాశం కోసం నిరీక్షిస్తున్న ఈ అపర మేధావి మేధను అభినందిస్తూ... 
భారత దేశం సూపర్ పవర్ గా నిలవాలన్న తన కోరికలో మనమూ భాగస్వాములం అవుదామని... 
ప్రభుత్వం సత్వర సహకారాన్ని అందిస్తూ గుప్త గారి సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ.... 
ఇంతటి మహోన్నత తెలుగు తేజం మనదైనందుకు తెలుగు వారిగా మనమూ గర్వపడదాము....

6, మార్చి 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది రెండవ భాగం....!!

వారం వారం నిరంతరాయంగా సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో ఈ వారం ఇప్పటిదైన ఆధునిక యుగ ప్రారంభం... దానిలోని విశేషాలు తెలుసుకుందాం...

1875 తరువాత - ఆధునిక యుగము

1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్ వర్త్ వంటి ఆంగ్ల కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు భావకవిత్వం అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), గిడుగు రామ్మూర్తి , కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం), సురవరం ప్రతాపరెడ్డి మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం, వ్యావహారిక భాషా వాదము నకు దారితీసింది.

  • తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవలు బహు శ్లాఘనీయమైనవి. "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు" అంటారు.
  • ఆధునిక యుగంలోని గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేతలు, శ్రీశ్రీ, ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసారు, చేస్తున్నారు.

తెలుగు సాహిత్యంలో 1875 తరువాతి కాలాన్ని ఆధునిక యుగము అంటారు.

రాజకీయ, సామాజిక నేపథ్యం

ఈ యుగంలో తెలుగు సాహిత్యం ప్రక్రియ, వస్తువు, శైలి తదితర అంశాల పరంగా విప్లవాత్మకమైన మార్పులకు లోనైంది. ఈ మార్పుల వెనుక పలు రాజకీయ, సామాజిక ఉద్యమాలు, ప్రభావాలు ఉన్నాయి. ఆంగ్ల భాష అధ్యయనం, పాశ్చాత్య భావాలను తెలుగు సాహితీవేత్తలు తెలుసుకోవడం వంటివి కథ, నవల వంటి కొత్త ప్రక్రియలను అభివృద్ధి చేసేందుకు ఉపకరించింది. గిడుగు రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు వంటి వ్యవహార భాషావాదులు వివిధ కష్టనిష్టూరాలకు ఓర్చి వ్యవహారభాషను విద్యాభ్యాసం, సాహిత్యసృష్టి వంటివాటికి ఉపయోగించేలా కృషిచేశారు. వస్తువు విషయంలో అభ్యుదయ వాదులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం, కమ్యూనిజం వంటి రాజకీయ ఉద్యమాలు, ఆర్యసమాజం, బ్రహ్మసమాజం తదితర సామాజిక ఉద్యమాలు తెలుగు సాహిత్యాన్ని లోతుగానూ, విస్తృతంగానూ ప్రభావితం చేశాయి. ఆంగ్ల సాహిత్యాధ్యయనం వల్ల ప్రక్రియ, వస్తువు, శైలి వంటి విషయాల్లో పాశ్చాత్య సాహిత్యం నుంచి తెలుగు సాహిత్యం ప్రభావితమైంది.

ముఖ్య పోషకులు

ఈ యుగంలో తొలినాళ్లలో జమీందారులు, సంపన్నులు, అనంతర కాలంలో పత్రికలు, రేడియోలు, వాటి ద్వారా విద్యావంతులు సాహిత్యాన్ని పోషించారు. 19వ శతాబ్ది ప్రారంభంలో కావ్యాలను రచన చేసి జమీందార్లకు, సంపన్నులకు అంకితం ఇవ్వడం, అష్టావధానాలు చేయడం ద్వారా కవులు డబ్బు గడించేవారు. పద్యకవులకు కీర్తి, ధనం దక్కిన ఈ కాలంలో కవిత్వరచనపైన, కవుల పాండిత్యం, ప్రతిభ వంటి అంశాలపైన విపరీతమైన వాదాలు, కొన్ని వాజ్యాలు కూడా నడిచాయి. అనంతర కాలంలో పత్రికలు సాహిత్యానికి ప్రధానమైన వేదికగా, సాహితీవేత్తలకు సంపాదన మార్గంగా నిలిచాయి. అలాగే అచ్చుయంత్రపు వాడకం పెరిగిన కొద్దీ పుస్తకప్రచురణ పెరిగి ప్రతుల అమ్మకం ద్వారా కూడా కవి రచయితలకు ధనసంపాదన మార్గమైంది. రేడియో రంగంలో నాటకరచన, కథారచన, గీతరచన వంటివి ఉద్యోగాలు ఉండడంతో ఆకాశవాణి కృష్ణశాస్త్రి వంటీ ప్రముఖ కవి, రచయితలకు సంస్థలో చోటుకల్పించింది. సినిమా రంగంలో శ్రీశ్రీ, సినారె, ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి పలువురు సాహితీవేత్తలు సినీకవులు, రచయితలుగా స్థిరపడ్డారు.
ఈ ఆధునిక యుగంలో మనకు తెలిసిన కొన్ని ... 
ఉద్యమాలు:  వ్యవహారిక భాషోద్యమం, గ్రంధాలయోద్యమం, హరిజనోద్దరణోద్యమం,తెలంగాణోద్యమం... 
కవితా రీతులు : దేశభక్తి కవిత్వం , భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, అవధానం, వచన కవిత్వం, మినీ కవిత్వం, సినిమా కవిత్వం, ఆశు కవిత్వం.... 
వచన రీతులు, ప్రక్రియలు: తెలుగు నవల, కథ, పద్యం, నాటకం, పత్రికారంగం, వ్యాకరణం, నిఘంటువు, విజ్ఞాన సర్వస్వం, సాహితీ విమర్శ, తెలుగులో చరిత్ర రచనలు, యాత్రా రచనలు, విద్యా బోధన, అధికార భాషగా తెలుగు, తెలుగులో అనువాద సాహిత్యం ... మొదలైనవి. 
ఈ ఆధునిక యుగంలో యువ కవులు కొత్తగా తెర తీసిన భావ కవిత్వం గురించి వివరాలు చూద్దాము 

భావ కవిత్వం

భావ కవిత్వము (Lyrical poetry) నకు తత్త్వదృష్టిలో మాతృక కాల్పనిక కవిత్వం (Romantic poetry). దీనిని ఆంగ్లములో "లిరికల్ పోయిట్రీ" అన్నారు. లైర్ (Lyre) అనే వాద్య విశేషముతో పాడే కవిత కావున దీనికి "లిరిక్ పోయిట్రీ" (Lyric poetry) అనే పేరు వచ్చినది.
భావ కవిత్వము అనుపదము శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారిచే ప్రప్రధమమున వాడబడినదని శ్రీరాయప్రోలు సుబ్బారావు గారు రాజమహేంద్రవరము (రాజమండ్రి) న జరిగిన ద్వితీయ అభినవాంధ్ర కవిపండిత సమావేశమందు చెప్పియున్నారు. ఆసమావేశమునే మాట్లాడుచు శ్రీశివశంకరశాస్త్రిగారు 'ఆత్మగౌరవము' అనుపదమునందువలనే 'భావకవిత్వం' అనుపదమునందున తమకు అభిమానము లేదనియు, ఆ పదమును ఈనాటి కవితకు వాడరాదనియు చెప్పియున్నారు.
భావకవిత్వమనుదానిని శ్రీరాయప్రోలు సుబ్బారావు గారే ప్రారంభించిరి. అటుపై శ్రీకృష్ణ శాస్త్రిగారిరందు పరమావధిని గాంచినదని చెప్పవచ్చును. వారి అనుకరించినవారు ఇప్పుడు చాలామంది యున్నారు. అటుపై కొద్ది కాలములోనే భావ కవిత్వము ప్రజాభిమతప్రాయమైనదని చెప్పవచ్చును. కానె కొంతమంది దీనిని యేవగించుకొనినారు. ఇందులకు ఒకటి రెండు కారణములు కలవు. మొదటిది అర్ధములేని పదాడంబరము ఎక్కువుగా నుండుట. రెండవది ఏవిధమయిన సందర్భము తెలియపరచకుండా అనిర్దిష్టమయినదేదియో భావమును విషయముగా చేసుకొని చెప్పుట. ఈ రెండు కారణములలో మొదటిదాని వలన పండితులయినవారలకు భావకవిత్వమునందు అనిష్టత కలగినది. రెండవ కారణమువలన జన సామాన్యమునకు భావ కవిత్వమును అర్ధము చేసుకొనుట కష్టమై దానిపై అనిష్టిత ఏర్పడినది. ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనుచున్న వారు తిక్కనాదులు చెప్పిన కవిత్వములో భావము లేదా? భావము లేని కవిత్వముండునా ? కావునా భావ కవిత్వము అను పదము నందే అర్ధము లేదని వాదించెడివారును కలరు. అది ఒక వేళాకోళపుమాట అని కొందరనుచున్నారు.
భావం అనగా అభిప్రాయము అని అర్ధము. అనగా ఒక కధా సందర్భములో చెప్పబడిన భావమేమి అని ప్రశ్నించుకొనినచో ఆ సందర్భమున ఆపద్యమునకు కల స్ఠానము మనకు సమాధానమగును. “భావ కవిత్వము” అను పదమునందలి “భావము” అనుపదమునకు అర్ధము “అభిప్రాయము” అనికాదు. రసమునకు అంగమయిన “భావము” అని అర్ధము. రసములు తొమ్మిది. ప్రతీ రసమును స్థాయిత్వమును పొందవలెనన్నచో విభావానుభావసాత్వికవ్యభిచారి భావములు అంగములుగ ఆయా సందర్భములలో వర్ఞింపబడవలెను. అప్పుడు అవి అన్నియు ఆనీయమానస్వాదువులై  ఏ రసమునకు అంగములుగా వర్ఞింపబడినవో దానికి స్థాయిత్వమును సిద్ధింప జేయును. ఇట్లు విభావాది భావములు సమగ్రముగా వర్ఞించబడిన కృతి అఖందకృతి (ప్రబంధము) అనబడును. అట్లుగాక రసమునకు అంగములయిన భావములలో ఏ ఒక్కదానినో వర్ణించి అది ఏ రసమునకు ఏ భావమో చెప్పబడక, స్వభావమును మాత్రమే వర్ణింపబడి అంతటితో వదిలివేయబడినచో స్థాయిత్వమును చెందక భావ ప్రధానమయిన ఏ రచన ఖండకృతీను పేరుతో భావ కవిత్వముగా పరిగణింప బడుచున్నది. దీనిని బట్టి చూచినచో పూర్వుల కవితను రసకవిత్వమనియు, ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనియు చెప్పుకోవచ్చును.

భావ కవులు

  • దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • రాయప్రోలు సుబ్బారావు
ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

1, మార్చి 2015, ఆదివారం

నమ్మకమే పునాదిగా...!!

నేస్తం....
           ఆగిపోయింది అనుకున్న జీవితం మళ్ళి మొదలైంది ఎందుకంటావు...? చాలా రోజులు మోసాలు ద్వేషాలు తట్టుకున్న మనసు పాపం ఇక తట్టుకోలేనంటు విశ్రాంతి కోరుకుంటే... దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్నట్టు మళ్ళి  బతికి బట్ట కట్టింది ఏదో ప్రయోజనం కోసమేనేమో...స్నేహం, అభిమానం అంటూ పై పై మాటలు చెప్పే చాలామంది స్నేహానికి అవసరం వస్తే ఎంత వరకు మొండి చేయి చూపించకుండా ఉంటున్నారు ఈ రోజుల్లో...? మన అవసరానికి అదే స్నేహాన్ని వాడుకుంటూ.... కనీసం ఓ చిన్న పలకరింపుకి కూడా మనకి సమయం లేనంతగా మన జీవితం సాగుతోందా... పలకరిస్తే ఎక్కడ ఏమి చేయాల్సి వస్తుందో అని మన భయం.... ఇది మనిషి అన్న వాడికి సహజమే... అవసరానికి చాతనయితే కాస్త సాయం చేయడంలో మన సొమ్మేం పోదుగా... మహా అయితే వాళ్ళు కాస్త బావుంటారు అంతే కదా... నా చుట్టూ ఉన్న స్నేహాల్లో కొన్నేమో ఇలా అవసరానికి మనల్ని వాడుకునేవే...  దీనిలో బంధువులకు కూడా మినహాయింపేం లేదు... చేసిన చిన్న సాయాన్ని కూడా గుర్తు పెట్టుకునే వాళ్ళు కొద్ది మంది... మరి కొందరేమో మనం అడగకుండానే మనలను ఆదుకునే వాళ్ళు... అందుకేనేమో ఎందరితో ఎన్ని దెబ్బలు తిన్నా కాస్తయినా మిగిలి ఉన్న ఆ మంచితనానికి దాసోహం అనక తప్పడం లేదు...
అడగకుండానే అవసరానికి నా దగ్గర ఇంత ఉంది ఎవరికీ ఇచ్చి పంపను అన్న ఆత్మీయురాలిని ఎన్నటికి మరువలేను... అలానే అడగకుండానే నన్ను ఆదుకున్న నేస్తాలను... నా అవసరాన్ని గుర్తించి నాకు ధైర్యాన్ని అందించి, నాకంటూ ఓ ఆసరా ఇచ్చి నా పునర్జన్మకు ఓ అర్ధాన్ని అందించిన ఆత్మీయుడికి ఎప్పటికి కృతజ్ఞురాలినే...
మాటలు అందరమూ చెప్తాము కాని ... మాటల్లో కాదు చేతల్లో చూపించడం అంటే ఇదేనేమో... ఇప్పటి వరకు నా నమ్మకం మీద దెబ్బలు పడటమే చూసాను... కాని

రేపటి నుంచి మొదలవబోయే నా జీవితపు ద్వితీయ అంకానికి ఆ నమ్మకమే పునాదిగా చేసుకుని వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచడానికి ప్రయత్నం చేస్తాను...దానికి నీ సహృదయం తోడుగా ఉంటుంది కదూ....!!
ఉండనా మరి
నీ నెచ్చెలి
 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner