ఎక్కడ మొదలైనా... ఎప్పుడు మొదలైనా చివరికి చేరేది ఎక్కడికి అన్న సందేహం మొదలైంది నాలో.. ఎప్పుడు లేనిది ఈ సందేహం ఎందుకొచ్చింది అంటావు... మనం ఉన్నంత వరకు మన బాధ్యతలు వెన్నాడుతూనే ఉంటాయి.. గమ్యం తెలిసినా చేరడానికి సమయం రావాలి.. రహదారులు అడ్డంకులు లేకుండా ఉండాలి... అడ్డంకులు ఉన్నా బాధ్యతలను పంచుకుంటూ... అవరోధాలను దాటటమే జీవిత విజయమని నమ్మేవాళ్ళలో నేను ఒకదానినే..
మనసు చచ్చిపోయినా మనిషి బ్రతికే ఉంటే ఆ జీవితానికి అర్ధం ఎక్కడ... మనకు కనిపించే ప్రతిదీ నిజం కాదు... మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి చాలా సార్లు.. అలానే మనకు వినిపించే ప్రతి మాట మనసు నుంచి రాదు... హృదయాతరాళం నుంచి వచ్చే పలుకులు కొన్నే.... అవే మనసుకు జీవాన్ని నింపుతాయేమో... స్నేహంలో హితాన్ని కాంక్షించడం తప్పు కాదు... కాని స్నేహాన్ని స్వార్ధంగా మార్చుకుంటే....?
మాటలో మనసు కనిపిస్తుందా అని మరో సందేహం... మన మనసు మాట్లాడితేనే కదా గొంతు నుంచి మాట వచ్చేది... మనసు మూగదైనప్పుడు మాట వినిపించదేమో... లేదా మౌనంలో మాటల అర్ధాలు వెదకాలేమో... ఏమిటో ఈ మాటల మౌనాల మనసు గోల... ఓ పట్టాన అర్ధం కావడం లేదు... ఏం చేద్దాం... మనమూ మౌనాన్ని ఆశ్రయిస్తే పోలా... మాటల గారడిలో మనసు పడిపోతే ఎలా... ఆ మాటల మాయలో పడి నలిగి ముక్కలైతే అతుకులు వేయడం ఆ విధాత తరం కూడా కాదాయే... స్నేహానికి, బంధానికి నడుమ తారాడే మనసు పడే మధనం ఎవరికెరుక... నమ్మకం నట్టేట మునిగినా దాన్ని పైకి లేపాలన్న నిరంతర ప్రయత్నంలో ఎన్నో ఆటు పొట్ల అలజడిలో అవిశ్రాంత పయనంలో కాస్త విశ్రాంతి కోసం తపించే మనసుకి సేద దీర్చే ఆలంబన దొరికితే... సంతోషమో నిరాసక్తతో తెలియని సందిగ్ధం ఓ ప్రశ్నార్ధకంలా మిగిలిపోయింది...సమాధానం తెలియక....!!
ఏంటో నేస్తం అన్ని సమాధానాలు తెలియని ప్రశ్నలే... నీకేమైనా తెలిస్తే జవాబు చెప్పవూ....
ఉండనా మరి
నీ నెచ్చెలి...
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి