29, మార్చి 2015, ఆదివారం

సంఘర్షణ...!!

నేస్తం..
          ఎప్పటిలానే మరో విషయంతో ఈ లేఖ నీకు... మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి క్షణం మనతోనే ఉన్నా మనకు తెలిసిన గొప్పదనాన్ని ఇతరులు గుర్తిస్తేనే తప్ప మనకు కనపడని వింత ప్రవర్తన... తెలిసినా తెలియనట్లు నటించేయడం మనకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది.. మనకు వస్తున్న లేదా ఇస్తున్న ప్రోత్సాహాన్ని చూసుకుంటున్నాము తప్ప మనం ఎదుటివారికి చిన్న స్పందనైనా తెలియజేయక పోవడాన్ని గుర్తించలేక పోతున్నాము.. ఇది ఎంత వరకు న్యాయమంటావు...? ఎంతసేపూ మన గొప్పే కాని ఎదుటివారిలో ఉన్న మంచి లక్షణాలను ఎందుకు ఒప్పుకోలేక పోతున్నాము...? ఒక చిన్న ప్రోత్సాహాన్ని అందించే మంచి లక్షణాన్ని ఎందుకు అలవరచుకోలేక పోతున్నామో..? చెప్పుడు మాటలు చెవికి ఇంపుగా ఉంటాయి కాని నిజం మంచితనం ముందు ఎప్పటికైనా తలను వంచాల్సిందే.... చదువు ఇచ్చిన వివేకం, వయసు తెచ్చిన అనుభవం కూడా ఈ చెప్పుడు మాటల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతుంటే చూడటానికి చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కోసారి... చాలా అనుబంధాలు వీటి మూలంగా విచ్చిన్నం అవుతున్నాయి... మనం అనుకుంటాము మనం చేసే పని ఇతరులకు తెలియదులే అని కాని మన పెద్దలు చెప్పిన సామెత మరచిపోతున్నాం ఇక్కడ.." పిల్లి కళ్ళు మూసుకుని పాలుతాగుతూ నన్నెవరు చూడలేదనుకుంటే " ఎలా సరిపోతుంది లెక్క... మాటలు చెప్పి మన ప్రవర్తనను దాయాలంటే దాగుతుందా అసలు నైజం...నాలుగు రోజులకైనా బయట పడక మానదు కదా... మనసులో లేని బంధాన్ని అరువుగా తెచ్చుకుంటే అది అరువుగానే కనిపిస్తుంది.... మాట మనసు లోపలి నుంచి రావాలి కాని ఏదో అవసరానికో లేక ఎదుటివాళ్ళకి సర్ది చెప్పడానికో, లేదా మనని మనం దాచుకోవడానికో కాదు... మనకు ఇష్టం లేక పోయినా నటించడం ఎందుకు... లేనట్టుగానే ఉంటే పోలా... పిలుపు అనేది ఆత్మీయంగా ఉండాలి కాని మొక్కుబడిగా ఉండకూడదు.... ఎవరో ఏదో అనుకుంటారని మనల్ని మనం మోసం చేసుకుంటూ బతికేయడం అవసరమా...? ఎందుకో నేస్తం జీవిత వాస్తవాలు చూస్తూ ఈ నాలుగు మాటలు నీతో పంచుకోలేకుండా ఉండలేక పోతున్నా....
ఉండనా మరి ఈ సంఘర్షణ ఇంతటితో ఆపేస్తూ...
నీ నెచ్చెలి...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner