1875 తరువాత - ఆధునిక యుగము
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్ వర్త్ వంటి ఆంగ్ల కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు భావకవిత్వం అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), గిడుగు రామ్మూర్తి , కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం), సురవరం ప్రతాపరెడ్డి మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం, వ్యావహారిక భాషా వాదము నకు దారితీసింది.
- తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవలు బహు శ్లాఘనీయమైనవి. "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు" అంటారు.
- ఆధునిక యుగంలోని గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేతలు, శ్రీశ్రీ, ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసారు, చేస్తున్నారు.
తెలుగు సాహిత్యంలో 1875 తరువాతి కాలాన్ని ఆధునిక యుగము అంటారు.
రాజకీయ, సామాజిక నేపథ్యం
ఈ యుగంలో తెలుగు సాహిత్యం ప్రక్రియ, వస్తువు, శైలి తదితర అంశాల పరంగా విప్లవాత్మకమైన మార్పులకు లోనైంది. ఈ మార్పుల వెనుక పలు రాజకీయ, సామాజిక ఉద్యమాలు, ప్రభావాలు ఉన్నాయి. ఆంగ్ల భాష అధ్యయనం, పాశ్చాత్య భావాలను తెలుగు సాహితీవేత్తలు తెలుసుకోవడం వంటివి కథ, నవల వంటి కొత్త ప్రక్రియలను అభివృద్ధి చేసేందుకు ఉపకరించింది. గిడుగు రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు వంటి వ్యవహార భాషావాదులు వివిధ కష్టనిష్టూరాలకు ఓర్చి వ్యవహారభాషను విద్యాభ్యాసం, సాహిత్యసృష్టి వంటివాటికి ఉపయోగించేలా కృషిచేశారు. వస్తువు విషయంలో అభ్యుదయ వాదులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం, కమ్యూనిజం వంటి రాజకీయ ఉద్యమాలు, ఆర్యసమాజం, బ్రహ్మసమాజం తదితర సామాజిక ఉద్యమాలు తెలుగు సాహిత్యాన్ని లోతుగానూ, విస్తృతంగానూ ప్రభావితం చేశాయి. ఆంగ్ల సాహిత్యాధ్యయనం వల్ల ప్రక్రియ, వస్తువు, శైలి వంటి విషయాల్లో పాశ్చాత్య సాహిత్యం నుంచి తెలుగు సాహిత్యం ప్రభావితమైంది.ముఖ్య పోషకులు
ఈ యుగంలో తొలినాళ్లలో జమీందారులు, సంపన్నులు, అనంతర కాలంలో పత్రికలు, రేడియోలు, వాటి ద్వారా విద్యావంతులు సాహిత్యాన్ని పోషించారు. 19వ శతాబ్ది ప్రారంభంలో కావ్యాలను రచన చేసి జమీందార్లకు, సంపన్నులకు అంకితం ఇవ్వడం, అష్టావధానాలు చేయడం ద్వారా కవులు డబ్బు గడించేవారు. పద్యకవులకు కీర్తి, ధనం దక్కిన ఈ కాలంలో కవిత్వరచనపైన, కవుల పాండిత్యం, ప్రతిభ వంటి అంశాలపైన విపరీతమైన వాదాలు, కొన్ని వాజ్యాలు కూడా నడిచాయి. అనంతర కాలంలో పత్రికలు సాహిత్యానికి ప్రధానమైన వేదికగా, సాహితీవేత్తలకు సంపాదన మార్గంగా నిలిచాయి. అలాగే అచ్చుయంత్రపు వాడకం పెరిగిన కొద్దీ పుస్తకప్రచురణ పెరిగి ప్రతుల అమ్మకం ద్వారా కూడా కవి రచయితలకు ధనసంపాదన మార్గమైంది. రేడియో రంగంలో నాటకరచన, కథారచన, గీతరచన వంటివి ఉద్యోగాలు ఉండడంతో ఆకాశవాణి కృష్ణశాస్త్రి వంటీ ప్రముఖ కవి, రచయితలకు సంస్థలో చోటుకల్పించింది. సినిమా రంగంలో శ్రీశ్రీ, సినారె, ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి పలువురు సాహితీవేత్తలు సినీకవులు, రచయితలుగా స్థిరపడ్డారు.ఈ ఆధునిక యుగంలో మనకు తెలిసిన కొన్ని ...
భావ కవిత్వం
భావ కవిత్వము అనుపదము శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారిచే ప్రప్రధమమున వాడబడినదని శ్రీరాయప్రోలు సుబ్బారావు గారు రాజమహేంద్రవరము (రాజమండ్రి) న జరిగిన ద్వితీయ అభినవాంధ్ర కవిపండిత సమావేశమందు చెప్పియున్నారు. ఆసమావేశమునే మాట్లాడుచు శ్రీశివశంకరశాస్త్రిగారు 'ఆత్మగౌరవము' అనుపదమునందువలనే 'భావకవిత్వం' అనుపదమునందున తమకు అభిమానము లేదనియు, ఆ పదమును ఈనాటి కవితకు వాడరాదనియు చెప్పియున్నారు.
భావకవిత్వమనుదానిని శ్రీరాయప్రోలు సుబ్బారావు గారే ప్రారంభించిరి. అటుపై శ్రీకృష్ణ శాస్త్రిగారిరందు పరమావధిని గాంచినదని చెప్పవచ్చును. వారి అనుకరించినవారు ఇప్పుడు చాలామంది యున్నారు. అటుపై కొద్ది కాలములోనే భావ కవిత్వము ప్రజాభిమతప్రాయమైనదని చెప్పవచ్చును. కానె కొంతమంది దీనిని యేవగించుకొనినారు. ఇందులకు ఒకటి రెండు కారణములు కలవు. మొదటిది అర్ధములేని పదాడంబరము ఎక్కువుగా నుండుట. రెండవది ఏవిధమయిన సందర్భము తెలియపరచకుండా అనిర్దిష్టమయినదేదియో భావమును విషయముగా చేసుకొని చెప్పుట. ఈ రెండు కారణములలో మొదటిదాని వలన పండితులయినవారలకు భావకవిత్వమునందు అనిష్టత కలగినది. రెండవ కారణమువలన జన సామాన్యమునకు భావ కవిత్వమును అర్ధము చేసుకొనుట కష్టమై దానిపై అనిష్టిత ఏర్పడినది. ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనుచున్న వారు తిక్కనాదులు చెప్పిన కవిత్వములో భావము లేదా? భావము లేని కవిత్వముండునా ? కావునా భావ కవిత్వము అను పదము నందే అర్ధము లేదని వాదించెడివారును కలరు. అది ఒక వేళాకోళపుమాట అని కొందరనుచున్నారు.
భావం అనగా అభిప్రాయము అని అర్ధము. అనగా ఒక కధా సందర్భములో చెప్పబడిన భావమేమి అని ప్రశ్నించుకొనినచో ఆ సందర్భమున ఆపద్యమునకు కల స్ఠానము మనకు సమాధానమగును. “భావ కవిత్వము” అను పదమునందలి “భావము” అనుపదమునకు అర్ధము “అభిప్రాయము” అనికాదు. రసమునకు అంగమయిన “భావము” అని అర్ధము. రసములు తొమ్మిది. ప్రతీ రసమును స్థాయిత్వమును పొందవలెనన్నచో విభావానుభావసాత్వికవ్యభిచారి భావములు అంగములుగ ఆయా సందర్భములలో వర్ఞింపబడవలెను. అప్పుడు అవి అన్నియు ఆనీయమానస్వాదువులై ఏ రసమునకు అంగములుగా వర్ఞింపబడినవో దానికి స్థాయిత్వమును సిద్ధింప జేయును. ఇట్లు విభావాది భావములు సమగ్రముగా వర్ఞించబడిన కృతి అఖందకృతి (ప్రబంధము) అనబడును. అట్లుగాక రసమునకు అంగములయిన భావములలో ఏ ఒక్కదానినో వర్ణించి అది ఏ రసమునకు ఏ భావమో చెప్పబడక, స్వభావమును మాత్రమే వర్ణింపబడి అంతటితో వదిలివేయబడినచో స్థాయిత్వమును చెందక భావ ప్రధానమయిన ఏ రచన ఖండకృతీను పేరుతో భావ కవిత్వముగా పరిగణింప బడుచున్నది. దీనిని బట్టి చూచినచో పూర్వుల కవితను రసకవిత్వమనియు, ఈనాటి కవిత్వమును భావ కవిత్వమనియు చెప్పుకోవచ్చును.
భావ కవులు
- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- రాయప్రోలు సుబ్బారావు
సేకరణ : వికీపీడియా నుండి
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి