నువ్వెలా ఉన్నావని అడగబోవడం లేదు... నేనెలా ఉన్నానో చెప్పనూ లేను...నాలోని అంతర్యాన్ని నీకు వినిపిస్తూనే ఉన్నా కనుక నేనెలా ఉన్నానో నీకు తెలుసు... నా నేస్తం ఎలా ఉందో నాకు తెలుసు..... సరే ఇక అసలు విషయానికి వస్తున్నా.... ప్రేమ అనేది ఎందుకు పుడుతుంది...? ఎలా పుడుతుంది...? ఎప్పుడు పుడుతుంది...? ఎన్ని సార్లు పుడుతుంది...? అసలు ప్రేమంటే...?
ఎందరినో చూసాక నాలో ఈ ప్రశ్నలు తలెత్తాయి.... ఒకరంటే ఇష్టపడతాము... కొన్ని రోజులు వాళ్ళు లేకపోతే బతకలేము అన్న భ్రమలో ఉంటాము.. ఇక్కడ భ్రమ అని ఎందుకన్నానంటే వాళ్ళ ప్రేమ దొరకకపోతే చచ్చిపోతామంటాము కాని చనిపోలేము.... మరొకరితో జీవితాన్ని పంచుకుంటాము... మళ్ళి ఎవరో తారసపడతారు... వాళ్ళంటే చాలా ఇష్టం, ప్రేమ అని అనుకుంటాము... మనిషితో పని లేదు... మనసు చాలు అని సరిపెట్టుకో చూస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాము... మనకి నచ్చిన అందాన్ని ఇష్టపడటం ప్రేమా... ఈరోజు ఒకరు... రేపు మరొకరు నచ్చుతారు.. ఎల్లుండి ఇంకొకరు.... ఇదేనా ప్రేమంటే... ? జీవితంలో ఇలా ఎంత మందిని ప్రేమిస్తామో అని తెలియని ప్రశ్నగా మిగిలి పోయింది ప్రేమ... ఇలా ఇంత మందితో ప్రేమ సాధ్యమా.... దీన్నే ప్రేమంటారా... ?
నైతికమా... అనైతికమా.... అన్న ఆలోచన రావడం లేదేమో.... ఈ ప్రేమ మత్తులో పడి.... ఉచ్ఛనీచాలు మరచిపోతున్న ఎందఱో మానవమాత్రులు... ఇంతకీ ప్రేమ మానసికమా శారీరకమా అన్న ప్రశ్నకు సమాధానం ఎక్కడ...? ఆత్మ బంధంతో అనుసంధానమైంది ప్రేమ అని తెలియక మన అవసరాలను ప్రేమకు జతగా చేర్చుతూ అదే ప్రేమని మురిసిపోతూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఎదుటివారిని మాయ చేయడానికి యత్నించడం సబబంటావా...!! ప్రేమ రాహిత్యంలో కొట్టుకుపోయే వాళ్ళు, శారీరక వాంఛలకు దాసోహులు ఈ ప్రేమ ముసుగులో ఆడే నాటకాలు నిజంగా నిజమైన ప్రేమను చంపేస్తున్నారు... ప్రేమను ప్రేమించే ప్రేమ ఆ ప్రేమ కోసం మనసంతా ప్రేమను నింపుకుని ప్రేమలో బతికేస్తుంది కదూ...ఇంతకీ ప్రేమంటే....!!
ఏంటో నేస్తం తెలియని ప్రశ్నగానే ఈ ప్రేమ మిగిలిపోయింది... సమాధానం నీకు తెలిస్తే నాకూ చెప్పవూ....!!
నీ నెచ్చెలి....
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి