24, మార్చి 2015, మంగళవారం

ఈమెవరో మరి.....గురించి నాలుగు మాటలు....!!

https://www.facebook.com/viramurthy?fref=ts
సత్య నీలహంస గారి కవిత  

 ఈమెవరో మరి. 
^^^^^^^^^^^^
(23-03-15)
చల్లని చూపులు వెచ్చని ఒడి
కన్నుల నిండిన వెన్నల తడి
ఇప్పుడు ఈమెలో లేవు
ఇప్పుడున్నది ఈమెవరో మరి.

అలుపెరుగని అవసరాల పోరాటంలో
ప్రదర్శణా ప్రపంచ స్త్రీరూపం! ఈమెవరో మరి.
తను చిన్నపిల్లల గుడ్డలేసుకుని
తన పసిపాపకి మాత్రం పెద్దోల్ల బట్టలేసి
జబ్బలు లేని కిటికీల డ్రెస్సులు వేయించి
విందులకై మందిలో తిప్పుతున్నది . ఈమెవరో మరి.
నెలల తరబడి బిడ్డకి డాన్సులు నేర్పించి
జనాల మధ్యలో జరిగిన ఐటెంసొంగ్ డాన్సుకి
పొంగి పోయి అందరితో కలిసి గొప్పగా
చేవ తెచ్చుకొని చప్పట్ట్లు కొడుతున్నది. ఈమెవరో మరి.
పనులన్నీ పక్కనపెట్టి
ముచ్చటగా ముస్తాబయ్యి
టివీ ప్రొగ్రాం ఆంకర్ కోసం
అద్దం ముందు ఆత్రంగా ఎదురు చూస్తున్నది.ఈమెవరో మరి.
తన్వు ప్రదర్శించి, ఆకర్శించే దుస్తులు వేయించి,
సంకోచం బిడియం విడువమని
"ఏ ప్రమాదమూ" ఉండదనీ
ఎర్రని కళ్లతో హెచ్చరిస్తున్నది. ఈమెవరో మరి.
తను కావలనుకొని కాలేక పోయిన
కరగని కోరికల దుగ్దలని
శ్రద్ద తీసుకొని, ప్రణాలికా బద్దంగా
పసి మనసులపై రుద్దుతున్నది. ఈమెవరో మరి.
అక్షరాలు ఆర్తిగా అందకముందే
అవసరంలేని అస్థిత్వాన్ని ఆపాదించి
అంబరమంటే అహాన్ని అంటగడుతూ
అక్కరకిరాని అందలమెక్కిస్తున్నది. ఈమెవరో మరి.
-సత్య

ఆత్మీయతకు, అనురాగానికి, అభిమానానికి ఇలా ఎన్నిటికో మారు పేరైన ఆ వెచ్చని ఒడి, చల్లని లాలింపు, అలిగిన వేళల బుజ్జగింపులు, వెన్నెల నవ్వుల పువ్వులు, వెల కట్టలేని ప్రేమకు చిహ్నం ఈ జగతిలో ఒక్కరే.. ఆ ఒక్కరే అమ్మ.. మాటల తొలి పాట అమ్మ... ఆటల తొలి నేస్తం అమ్మ.. నడకల నడతల అడుగుల చిరునామా అమ్మ... ఓనామాలకు ఆది గురువు అమ్మ... సహనం,  స్థైర్యం, ధైర్యం అమ్మ... అమ్మ లేనిదే మన పుట్టుక లేదు... జీవానికి జీవితానికి తీరని ఋణమే అమ్మ... ఇక్కడ కవి ఆక్రోశం ఆధునికత మత్తులో, అందలాల ఎండమావుల వెంట అమ్మదనం పరుగిడుతోందని చెప్తూ... నడత నడవడి నేర్పాల్సిన అమ్మే వ్యక్తిత్వాన్ని రంగుల హంగులకు తాకట్టు పెట్టేస్తుందని... పసితనాన్ని గుండెలకు ఆర్తిగా హత్తుకునే అమ్మ పసితనంలోని పాల బుగ్గలకు మసి పూస్తూ చెరగని మచ్చలను వేస్తుందని తెలియచెప్తూ... వలువల విలువలు తెలియ చెప్పాల్సింది పోయి ఆ వలువల చీలికల్లో చిన్నారుల జీవితాలను చిద్రం చేస్తుందని బాధతో... బిడ్డ ఆకలి కోసం జీవితాన్ని పణంగా పెట్టే అమ్మ ఆ బిడ్డనే ఈనాడు అంగడి సరుకుగా మార్చి బాల్యపు ఆనవాళ్ళను చెరిపేస్తుందని కవి మనసు పడే మధనమే ఈమెవరో మరి....!!

ఈ కవిత చదివాక ఈ మాటలు రాయకుండా ఉండలేక పోవడం నా బలహీనతేమో ....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner