1, మార్చి 2015, ఆదివారం

నమ్మకమే పునాదిగా...!!

నేస్తం....
           ఆగిపోయింది అనుకున్న జీవితం మళ్ళి మొదలైంది ఎందుకంటావు...? చాలా రోజులు మోసాలు ద్వేషాలు తట్టుకున్న మనసు పాపం ఇక తట్టుకోలేనంటు విశ్రాంతి కోరుకుంటే... దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్నట్టు మళ్ళి  బతికి బట్ట కట్టింది ఏదో ప్రయోజనం కోసమేనేమో...స్నేహం, అభిమానం అంటూ పై పై మాటలు చెప్పే చాలామంది స్నేహానికి అవసరం వస్తే ఎంత వరకు మొండి చేయి చూపించకుండా ఉంటున్నారు ఈ రోజుల్లో...? మన అవసరానికి అదే స్నేహాన్ని వాడుకుంటూ.... కనీసం ఓ చిన్న పలకరింపుకి కూడా మనకి సమయం లేనంతగా మన జీవితం సాగుతోందా... పలకరిస్తే ఎక్కడ ఏమి చేయాల్సి వస్తుందో అని మన భయం.... ఇది మనిషి అన్న వాడికి సహజమే... అవసరానికి చాతనయితే కాస్త సాయం చేయడంలో మన సొమ్మేం పోదుగా... మహా అయితే వాళ్ళు కాస్త బావుంటారు అంతే కదా... నా చుట్టూ ఉన్న స్నేహాల్లో కొన్నేమో ఇలా అవసరానికి మనల్ని వాడుకునేవే...  దీనిలో బంధువులకు కూడా మినహాయింపేం లేదు... చేసిన చిన్న సాయాన్ని కూడా గుర్తు పెట్టుకునే వాళ్ళు కొద్ది మంది... మరి కొందరేమో మనం అడగకుండానే మనలను ఆదుకునే వాళ్ళు... అందుకేనేమో ఎందరితో ఎన్ని దెబ్బలు తిన్నా కాస్తయినా మిగిలి ఉన్న ఆ మంచితనానికి దాసోహం అనక తప్పడం లేదు...
అడగకుండానే అవసరానికి నా దగ్గర ఇంత ఉంది ఎవరికీ ఇచ్చి పంపను అన్న ఆత్మీయురాలిని ఎన్నటికి మరువలేను... అలానే అడగకుండానే నన్ను ఆదుకున్న నేస్తాలను... నా అవసరాన్ని గుర్తించి నాకు ధైర్యాన్ని అందించి, నాకంటూ ఓ ఆసరా ఇచ్చి నా పునర్జన్మకు ఓ అర్ధాన్ని అందించిన ఆత్మీయుడికి ఎప్పటికి కృతజ్ఞురాలినే...
మాటలు అందరమూ చెప్తాము కాని ... మాటల్లో కాదు చేతల్లో చూపించడం అంటే ఇదేనేమో... ఇప్పటి వరకు నా నమ్మకం మీద దెబ్బలు పడటమే చూసాను... కాని

రేపటి నుంచి మొదలవబోయే నా జీవితపు ద్వితీయ అంకానికి ఆ నమ్మకమే పునాదిగా చేసుకుని వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచడానికి ప్రయత్నం చేస్తాను...దానికి నీ సహృదయం తోడుగా ఉంటుంది కదూ....!!
ఉండనా మరి
నీ నెచ్చెలి
 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner