11, మార్చి 2015, బుధవారం

చిద్విలాసాలు చిందిస్తాడో....!!

నేస్తం....
           కోపమనేది మనకి వస్తే నష్టం కూడా మనకే కదా... మనమేమయినా గొప్ప వ్యక్తిత్వమున్న వాళ్ళమయితే
ఎదుటి వారిని చీదరించుకున్నా కాస్తయినా అర్ధం ఉంటుంది...మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని పట్టించుకొనక పోయినా దాన్ని మనమే పట్టించుకుని కోరి కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాము.... ఒక్కోసారి ఆ కష్టాలకు కూడా విసుగు వచ్చి మనల్ని ఆనందానికి అరువుగా ఇచ్చేస్తూ ఉంటాయి .... కొన్ని సంతోషాలేమో మనకి చెప్పా పెట్టకుండానే మూసిన తలుపు తోసుకుని మరీ వచ్చేస్తుంటాయి... ఏదో సామెత చెప్పినట్టు " కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్టుగా..." మన జీవితంలో బాధలు సంతోషాలు ఒకదానికొకటి చుట్టాలైనట్టుగానే మన చుట్టూ అల్లుకున్న బంధాలు అనుబంధాలు మరొక ఎత్తు... కొన్ని బందాలేమో మనం వద్దన్నా మన వెంట పడుతూనే ఉంటాయి... మరికొన్నేమో మనం కావాలన్నా మన దగ్గరగా రాలేవు...ఎన్నో ఏళ్ళ పరిచయమున్నా అన్ని చెప్పలేము, అలా అని మనకు కావాల్సింది అడగనూ లేము.... కనీసం ఒకసారి పలకరించి వాళ్ళ నుంచి సమాధానం రాకపోతే మళ్ళి పలకరించే సాహసం కూడా చేయడానికి ముందు వెనుక చూస్తాము... మరి కొందరితో చాలా కొద్ది పరిచయమయినా జన్మ జన్మల పరిచయమున్నట్టు కలసిపోతాం... అదేనేమో మనుష్యులతోను మనసులతోను స్నేహంలో ఉన్న తేడా... మన జీవితాలతో ఆడుకునే జగన్నాటక సూత్రధారి చిరునవ్వు వెనుక మర్మం ఇదేనేమో... చూద్దాం ఇలా ఎన్ని కాలాలు ఈ జీవితాలను చూస్తూ తను రాయాలనుకున్న రాతలు రాసేస్తూ చిద్విలాసాలు చిందిస్తాడో....!!
ఎందుకో ఇలా రాయాలనిపించింది నేస్తం....
నీ నెచ్చెలి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner