26, మార్చి 2015, గురువారం

ఇతడు ఎవరో మరి.....!!

నేస్తం...
          కనుమరుగౌతున్న అనుబంధాలకు ఈనాడు మనకు కనిపిస్తున్న సాక్ష్యాలు అనేకం... మాయమౌతున్న అమ్మతనం ఓ వింత పోకడగా మారుతుంటే... ఆ అమ్మతనానికి అర్ధాన్ని పరమార్ధాన్ని చూపిన నాన్నతనం ఎప్పుడో దూరమైంది మన అనుబధపు లెక్కల్లో... ఖరీదైన జీవితాలకు, విలాసాల నాణ్యతకు నాన్నను పావుగా చేస్తున్న పసి హృదయాలకు తెలియదు... ఈ ఆట పాటల వెనుక నాన్న ఇచ్చిన ఆసరా ఎంత ఉందో... నిరంతరం శ్రమించే ఆ అవిశ్రాంత శ్రామికుడు కనీస గుర్తింపుకు తన వాళ్ళ దగ్గర నోచుకోవడం లేదని... నావాళ్ళు అని అనుకోవడమే తప్ప మనసుకు దగ్గరగా రాని అర్ధ భాగాన్ని, తన అవసరాలకు, సుఖాలకు మాత్రమే భర్త అనే బంధాన్ని పిల్లలకు తమకు మధ్యన వారధిగా చేసినా మమకారాన్ని వదులుకోలేక ... ఎవరి ప్రేమకు ఆప్యాయతకు నోచోచుకోలేక పోతున్న ఈ ఒంటరి జీవిని ఎవరని సంభోదించాలో మరి. బాహ్య ప్రపంచానికి తెలియని మరో లోకంలో జీవశ్చవంలా బతికేస్తూ పైకి నావాళ్ళ కోసమే నా జీవితం అనుకుంటున్న ఎందఱో తండ్రులు ఈ మాయ లోకంలో...
       బాధ్యతలను బంధాలను గాలికి వదిలేసి ఆధునిక అవసరాలకు బందీలుగా మారిపోతున్న ఎన్నో జంటల వెలికి రాని మనసుల మౌన భావాలు, జరుగుతున్న అంతర్మధనాలు... పక్కనే ఉన్నా చేరువ కాలేని దూరాల అర్ధం కాని ఆంతర్యాలు... మనస్థైర్యాన్ని, మానసికోల్లాసాన్ని అందుకోలేక సర్దుకుపోవాలన్న సహనాన్ని చేతగానితనంగా చూస్తున్నా పిల్లల కోసమే భరించే వినిపించని హృదయవేదన మదిని ముక్కలుగా చేస్తున్నా ఏమి యలేని నిస్సహాయతలో నలుగుతున్న ఎన్నో మనసులు... ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక అడ్డు గోడగా నిలబడిన అహాల ప్రాకారాన్ని కూల్చలేక విధిరాతని సరిపెట్టుకుంటున్న జీవితాలు బోలెడు...
     ఈనాటి భార్యాభర్తల బంధంలో బాధ్యతలు కనిపించక పోవడం హక్కుల కోసం మాత్రమే ఆరాట పడటం దానికి పిల్లలను వాడుకోవడం సర్వ సాధారణమైపోయింది... విద్యావంతులు ఎక్కువైనా ఎన్నో కుటుంబాలలో ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య... కలసి ఉంటున్నా కలవని జీవితాలు... ఎందుకీ అంతరాలు...? ఆస్థుల కోసం ఆరాటాలు ఎక్కువై ఆత్మీయతలు మరచిపోతున్న నేటి జీవితాలు.... ఈ ఆటలో ఒకప్పుడు అమ్మాయిలు పావులుగా మారితే నేటి సమాజంలో చాలా మంది అబ్బాయిలు ఈ జీవిత పరమపద సోపానంలో కొత్తగా వచ్చి చేరిన అహాల/హక్కుల  పాములకు చిక్కి బయటకు రాలేక నలిగిపోతున్నారు....తెలివి ఎక్కువగా ఉన్నా జీవితానికి ఇద్దరు సమానమే అన్న చిన్న విషయాన్ని మరచి కలతల కాపురాలు చేస్తూ కలవని దూరాల రహదారుల్లో సమాంతరంగా పయనిస్తున్నారు... ఈ అంతరాల దూరం తగ్గి ఆంతర్యాలు ఒకటిగా మారేదేన్నదో మరి...!!
ఎందరినో వేధిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటావు నేస్తం...!!
నీ నెచ్చెలి.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner