27, మార్చి 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది ఐదవ భాగం....!!

అందరికి మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు ...... శ్రీరామ నవమి శుభాకాంక్షలు.... మన తెలుగు సాహితీ ముచ్చట్లు నిరాఘాటంగా సాగుతూ ఇరువది ఐదవ వారంలోనికి ప్రవేశించడం నాకు చాలా సంతోషంగా ఉంది... ఏదో నేను చెప్పాలి అనుకున్నది సింగిల్ పేజి కథలా చెప్పేస్తూ ఉండేదాన్ని.. అలాంటి నాతో ఇన్ని వారాలుగా ఇంత పెద్ద పెద్ద వ్యాసాలు రాయిస్తున్న ఘనత సాహితీ సేవ వారిదే... వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనాలు ...
అసలు కవిత్వం అంటే ఏమిటి... కవిత్వం పుట్టు పూర్వోత్తరాలు, కవిత్వంలో రకాలు ఎన్ని మొదలైన విషయాల గురించి ఈ వారం కాస్త తెలుసుకుందాం.. ముందుగా కవిత్వమంటే.....

కవిత్వం

కవిత్వం అనేది వైయుక్తిక సృజనాత్మక ప్రక్రియ. అన్ని కళల్లాగే కవిత్వం కూడా ఒక నిరంతర సాధన కాబట్టి. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చుకవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ. ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి తీరని హాని చేస్తాయి. చెప్పేదేదైనా బలంగా ఉండాలి. నంగి మాటలు, నత్తి చేష్టలు వద్దు. అంతా రాస్తున్నారు కాబట్టి మనమూ రాద్దామన్న కుర్రతనపు వికారాలు వద్దు. కీర్తి కాంక్ష అసలే వద్దు . ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగాని ఒక మంచి కవిత జన్మించదు. నిన్ను నువ్వు పూర్తిగా అర్పించుకుంటే తప్ప కవిత నిన్ను కరుణించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు.రసమయ ఘడియల్లో సృజించిన కవిత , కొన్నాళ్ళాగి చదివితే రాసినప్పటి మానసిక స్థితిలోకి తీసుకువెళ్తోందో లేదో చూసుకోవాలి. అలా తీసుకువెళ్ళినట్లైతే అది కవిత అయినట్లే.

కవిత్వంలో రకాలు

  • అభ్యుదయ కవిత్వం (Revolutionary poetry)
  • దిగంబర కవిత్వం
  • బంధ కవిత్వము
  • భావ కవిత్వం (Lyrical poetry)
  • కాల్పనిక కవిత్వం (Romantic poetry)

ఈ వారం సాహితీ పద్దతులలో ఎక్కువగా వాడుకలో ఉన్న వచన కవితా సాహిత్యం గురించిన వివరణలు చూద్దాం

వచన కవిత

 పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం. ఆంగ్లంలోని ఫ్రీవర్స్ అన్నదానికి సమానార్థకంగా వచన కవిత అన్న పదం ప్రయోగింపబడుతోంది. పద్యం గేయంగా మారి, గేయం వచన ధోరణిలోకి మారిన పరిణామ దశలను గమనిస్తే తెలుగు కవిత్వ ప్రక్రియలలో ఎక్కువమందిని ఆకట్టుకున్నది వచన కవిత్వమే. తెలుగు కవిత్వానికి పద్యమే దిక్కు అన్నది అంగీకరించక, కొత్త ధోరణుల్లో తెలుగు కవితా ప్రక్రియలకు శ్రీకారం చుట్టాలన్న తపనతో యువ కవులు చేసిన ప్రొయోగమే వచన కవిత.

కుందుర్తి ఆంజనేయులు వచన కవితా పితామహుడుగా ప్రసిద్దుడయ్యాడు. పద్యమే కవిత్వమని అపోహ పడేవారికి ఆధునిక కాలానికి వచనమే తగినదని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించాడు. నగరంలోవాన కుందుర్తి రచించిన వచన కవితా కావ్యం. ఈ కావ్యాన్ని వచనకవితకు లక్షణ దీపికగా కుందుర్తి రచించాడు. వచన కవితా ఉద్యమం తెలుగు సాహిత్య లోకంలో దుమారం లేపింది. చర్చలు, వాదోపవాదాలు, తిరస్కారాలు వంటి వాటితో తెలుగు సాహిత్య లోకం హోరెత్తింది. వచనం లో రాస్తే అది కవిత్వమెట్లా అవుతుందని వచన కవులను ప్రశ్నించిన వాళ్ళున్నారు.

వచన కవితా లక్షణాలు:

  • శ్రీ శ్రీ అన్నట్లు చందో బందోబస్తులన్నీ వచన కవిత తెంచింది.
  • వచన కవితలో గేయ కవిత లాగా మాత్ర చందస్సు కూడా నిబద్దం కాదు.
  • కాలం మారిన దశలో పాత కవి సంప్రదాయలను, అలంకారాలను వచన కవిత తిరస్కరించింది.
  • సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తు నిర్మాణం వచన కవితకు ప్రత్యేకం.
  • కవి భావుకతకు, భావప్రకటనా స్వేచ్చకు చందస్సు ఆటంకం కాబట్టి చందోరహితమైన వచనం సామాన్యుడికికూడా అందుబాటులో ఉంటుందన్నది వచన కవుల అభిప్రాయం.
  • చందో విముఖతను ప్రాణంగా కలిగిన వచన కవిత, భావుకతకు ప్రాధాన్యత నిచ్చింది.
  • ఆకర్షణీయమైన అంత్య ప్రాసలు వచన కవితకు అలంకారాలయ్యాయి.
  • చమత్కారమైన అధిక్షేపణ వచన కవుల సొత్తు.

వచన కవితకు శిష్ట్లా , పఠాభి, నారాయణ బాబు, శ్రీశ్రీ వంటి వారు అద్యులు కాగా , కుందుర్తి వచన కవితా ఉద్యమాన్ని నిర్వహించి వచన కవితా పితామహుడు అని పేరు తెచ్చుకున్నాడు. వచన కవితలో భావప్రకటనకు ప్రత్యేకత ఉంది.
"ఏ గుడిసె నడిగినా పోగొట్టుకున్న శీలాన్ని
తాటి ఆకుల్తో కప్పుకుంటుంది"
---- ఇందులోని భావం ఎంత తీవ్రంగా చెప్పబడిందో వివరించనక్కరలేదు.
వచనకవిత చందో ప్రాధాన్యం లేనిది కాబట్టి అనవసర పదాలు, పదాడంబరం పట్ల ప్రత్యేక శ్రద్దా ఉండవు. జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యతనివ్వడం వచన కవుల ప్రత్యేకత. ఆధునిక కవుల్లో అద్భుతమైన వచనకవితలు రాస్తున్నవారిలో కె. శివారెడ్డి, నందినీ సిధారెడ్డి, ప్రేంచంద్, అఫ్సర్ వంటి కవులు వచన కవితా ప్రక్రియకు వన్నెలు తెస్తున్నవారు. ఇప్పుడు పద్యం రాసే వారికంటే వచన కవిత రాయడం వైపే మొగ్గు చూపేవారు ఎక్కువ. ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ వచన కావ్యానికి పురస్కారాన్ని ప్రకటించి వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేస్తోంది.
ఈనాడు వచన కవిత్వం ఎన్నో కొత్త పుంతలను తొక్కింది అనడంలో అతిశయోక్తి ఏమి లేదు... ఎంతో మంది కవులు తమ భావాలను వచనంలో సున్నితంగా, హృద్యంగా, మనసులకు హత్తుకునేటట్లు చెప్పడంలో చేయి తిరిగిన కవులయ్యారు. ఎన్నో పురస్కారాల సత్కారాలను అందుకుంటున్నారు....
ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner