28, ఆగస్టు 2015, శుక్రవారం

అక్షరాల సాక్షిగా..... కవితా సంపుటి.....!!

అక్షరాల సాక్షిగా..... కవితా సంపుటి త్వరలో  మీ ముందుకు రాబోతోంది....
ఆదరించండి... ఆశీర్వదించండి

27, ఆగస్టు 2015, గురువారం

అనుబంధపు ఆనవాళ్ళై ....!!

రాలిపోయిన స్వప్నాల్లో
కాలిపోయిన జ్ఞాపకాలు
వద్దన్నా నిత్యం వెన్నాడుతూనే

మనసుని వీడని మమతల్లో
ముడేసుకుపోయిన బంధాలు
గతాన్ని వదలని వాస్తవాలకు బంధీలై

ఎటెళ్ళినా ఎదను తడిమే గురుతులతో
కొలువుదీరిన కన్నీటి చుక్కల పేరంటాండ్లు
చీకటి సీమంతానికి పిలువని పేరంటంలా

వెతల కతల వారధిగా
కలత కలల కాపురం చేస్తున్నాయి
నా అక్షరాల అనుబంధపు ఆనవాళ్ళై ....!!

26, ఆగస్టు 2015, బుధవారం

ఏక్ తారలు...!!

1. జ్ఞాపకాలు నడయాతూనే ఉన్నాయి_నీతో ఉన్న గతాన్ని మరువలేక
2. వెదురు గాయాలను ఓర్చుకున్నందుకే కదా_వేణువుగా మాధవుని చేరింది 
3. ఎండమావులని తెలియక ఆశ పడ్డా_గాయం చేసిన గతాన్ని మరచి
4. గాయాలను మరచిన గుండె_గంపెడాశతో భవితను రమ్మంది
5. గాయపడినా వేణువు గానం_శ్రావ్యంగా ఎద ఎండమావిని తడి చేసింది
6. గాంధర్వానికి గొంతెండి పోయింది_గతంలో ఎండమావులను తలపోస్తూ
7. వెలసిన రంగుల్లో బతుకు_ఎడారిలో ఎండమావై
8. రంగుల కలగానే మిగిలిపోయింది_మనసు గాయాలను మాన్పలేక
9. గతాన్ని మరచినా_గాయపు ఆనవాళ్ళు మిగిలే ఉన్నాయి
10. లేపనాలేన్ని పూసినా_గాయం జ్ఞాపకంగా ఉండి పోయింది కాలంతో పాటుగా

25, ఆగస్టు 2015, మంగళవారం

మరోసారి మూల్యం చెల్లించక తప్పదు...!!

తన వాళ్ళు అధికారంలో ఉండగా కనిపించని జనం సమస్యలు ఈ రోజు భలే కనిపిస్తున్నాయి కొందరు పెద్దలకు... ప్రకృతి వైపరీత్యాలకు, విష జ్వరాలకు కూడా ధర్నాలు చేస్తూ జనం కోసం తెగ దిగులు పడి పోతున్నారు... మరి కొందరేమో నేను పార్టీలకు అతీతం జనం కోసమే నా జీవితం అంటున్నారు... అబ్బా సామాన్య జనానిది ఎంత అదృష్టమో... ఇందరి అభిమాన సంద్రంలో ఊపిరి ఆడక కొట్టుకు పోతున్నారు... ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలతో.... పదవిలో బాబులేమో మా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలన్నా అంటూనే మీకు కావాల్సిన నిధులు ఇప్పిస్తాం అంటుంటే కనీసం మాట్లాడటానికి సమయం లేదని అంటున్నారు... ఇదండీ ఇప్పటి నాయకుల నైజం.. చూసారా మనం ఎంత గొప్ప నాయకుల సంరక్షణలో ఉన్నామో.....ఆనాడు నల్లమల అడవుల్లో అమాయకులను నక్సలైట్లు అని ముద్ర వేసి విషాహారం పెట్టి చంపించినప్పుడు జనం గుర్తుకే రాలేదు... ఈనాడు ఓదార్పు యాత్రలు, జనం కోసం నా జీవితం అంటూ ఒట్టి మాటలు.... ఎప్పుడో ఒకసారి నిద్రలో కలలా జనం గుర్తుకు వచ్చి నేను ఎవరి బానిసను కాదు రైతుల పక్షమే అని నాలుగు రోజులు ట్విట్టర్ లో ట్వీటులు.... దేశాల చుట్టూ కేంద్రం చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తూ కల్లబొల్లి కబుర్లు చెప్తూ జనం సొమ్ము వృధా చేస్తున్న వారు... ఇవండీ ఇప్పుడు జరుగుతున్న తంతులు... ఎవరికి వారికి మేము జనానికి గుర్తులో ఉండాలి అనే తప్ప జనం కోసం తపన కాదు....
సామాన్యుని నిత్యావసరాలు తీర్చలేని ఈ నాయకుల ఓదార్పులు, ధర్నాలు, పాద యాత్రలు, బొమ్మల్లో చూపించే రాజధాని ఇలాంటి సినిమాలు రేపు మళ్ళి ఎన్నికల్లో గెలవడానికి పనికిరావు ఏ ఒక్కరికి.... జనానికి కావాల్సింది వారి నిత్యావసరాలు... కనీసావసరాలు తీర్చగలిగే నాయకులు, పాలక పక్షం... నేను నా పదవి పదిలం అనుకుంటే అది పొరపాటే అవుతుంది.... దేశాలు తిరుగుతూ కాలయాపన చేస్తే మరోసారి మూల్యం చెల్లించక తప్పదు...!!

ఏక్ తారలు...!!

1. విరహం సెలవంది_అందాలకు బంధీగా మారి
2. కలల హార్మ్యాలకు రాదారి_నిదురించే మది అంతరంగం
3. అంతరంగం అనురాగమయమే_వలపుల విరహం దరి చేరితే
4. నిన్ను చూసే కాబోలు_వార్ధక్యానికి యవ్వనం వచ్చింది
5. ప్రేమామృతం అందాలంటే_విరహపు గరళం తప్పదేమో
6. వెన్నెల ఆరబెట్టుకుంటోంది_విరహపు వర్షానికి తడిసి ముద్దైనందుకు

23, ఆగస్టు 2015, ఆదివారం

సంతోషం సన్యాసం తీసుకుంది....!!

ఎప్పుడు పలకరించే
దిగులు దుప్పటిని
కాదనలేని నిస్సహాయత
కలల కళ్ళను సైతం
శూన్యానికి పరిచయిస్తూ
మదిని కప్పుతున్న చీకటి
శూలాల్లా తాకుతున్న
శరాల ఘాతాలు
చీల్చుతున్న అంతరంగపు గోడలు
ఆవృతంలో ఆనందాన్ని
నమ్ముకున్న గుండెకు
తగులుతున్న గాయాల గతాలు
మేమూ నీతోనే ఉన్నామంటూ
అప్పుడప్పుడు చెప్పాపెట్టకుండా
వచ్చి చేరే వరద గోదారులు
వలస పోయిన నవ్వుల
సంతకాలు దొరకని జీవితానికి
శెలవంటూ సంతసం సన్యానానికి చేరింది....!!

22, ఆగస్టు 2015, శనివారం

ఏక్ తారలు....!!

1. తారలెదురు చూస్తున్నాయి_కమ్ముకున్న శున్యానెప్పుడు చిదేమేద్దామా అని
2. అనుబంధాలు అల్లాడుతున్నాయి_చరమాంకంలో చేయూత లేక
3. నిద్దరోతూనే ఉన్నా_కలలు కానరావడం లేదెందుకో మరి
4. గ్రీష్మం తాపంలోనే ఉండి పోయింది_తొలకరి వలపు తెలియక
5. నిశబ్దమూ మౌనమయ్యింది_మన మధ్య తాళ లేక
6. భావ రాగాలకు దాసోహమయ్యింది మది_గువ్వలా నీ గుండెలో ఒదిగి పోతూ
7. వెలుగుల తారలు వచ్చాయిగా_ఇక చీకట్లకు సెలవే మరి
8. అబద్దం అందమైనది_అద్దంలో నీ రూపాన్ని చూపిస్తూ
9. అద్భుతమైనది జీవితం_హాయిగా అనుభవిస్తే
10. ఒక్కొ చినుకే_వేల జీవాలకు ప్రాణాధారంగా
11.  మనసు సంతసించింది చాలదూ_తన ఊపిరిని అక్షరాల్లో చూస్తున్నందుకు
12. గాలితో చేరినా_నీ జ్ఞాపకాలు అనుక్షణం నాతోనే

21, ఆగస్టు 2015, శుక్రవారం

మణి మాలికలు....!!

1. మౌనమూ మాటలు నేర్చింది
నీ స్పర్శకు పరవశమౌతూ
2. మొదటగా ముద్దిడిన ఆ స్పర్శ
అమ్మతనానికి అందిన అద్భుత కానుక
3. మనసుకు తెలుసు నీ జ్ఞాపకాల్లో
మౌనానికి మాటల వెల్లువ ఎంతో

ఏక్ తారలు....!!

1.నీ ఎడబాటూ నాకు హాయే_జ్ఞాపకాలతో ప్రతి క్షణం నాకు దగ్గరగా ఉంటూ 
2.కట్టుబడి వుంటావుగా_మనసుతో మమేకమైన చెలిమికి
3.ఆషాఢ మేఘాలు తొలగాయి_శ్రావణానికి స్వాగతమిస్తూ
4. చెలిమి చేయూత_జగడానికి వీడ్కోలు చెప్తూ

18, ఆగస్టు 2015, మంగళవారం

ఏక్ తారలు....!!

1. అలజడికి అందకుండా పోయినందుకేమో_అలుక ఎక్కువైంది
2.  ఎన్ని మాటల ముత్యాలో_నీ చిరునవ్వులో రాలుతూ
3. అక్షర లక్షలెన్ని సమకూర్చాలో_నీ భావాల ఆకృతికి
4. ఒక్క చెలిమి చాలదూ_వేల జన్మల వసంతాల రాకను గుర్తు చేయడానికి
5. ఆరు ఋతువులు అలిగాయి_ ఏడో ఋతువు ఏకాంతం ఐనందుకు
6. నిర్భయ చట్టముందిగా_సొతంత్రానికి జెంకెందుకు
7. నిశిలో వచ్చింది కదా_నిదానంగా బయటకొస్తుందేమోనని వేచి చూస్తున్నా
8. అవును మరి_అ'హింస'లో హింస ఉంది కదా
9. అర్ధ రాత్రొచ్చింది కదా_పగలు తిరగనివ్వరని భయం కాబోలు
10. మూగబోయింది మువ్వన్నెల ఝండా_స్వేచ్చను బానిసగా చేస్తున్నందుకు
11. మనం పీల్చుతున్న ప్రాణ వాయువులో_త్యాగ ధనుల జీవాలెన్నో
12. అవినీతిని ఓటుతో కొన్నా_నోటుతో పెంచి పోషిస్తూనే ఉన్నాము
13. కన్నీళ్ళు కావవి_జ్ఞాపకాల చెమరింతలు ఏకాంతానికి

15, ఆగస్టు 2015, శనివారం

నువ్వే చెప్పు ఏం చేయాలో.....!!

నేస్తం,
          నీకు తెలుసా.... ఈ రోజు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజట.. అసలు మనకంటూ ఓ స్వాతంత్ర్యం ఉంటే  కదా మన దేశానికి వచ్చేది... ఆనాడు తెల్లవాడు దేశాన్ని పాలించాడని వాడిని మన దేశం నుంచి వెళ్ళిపొమ్మని మన దేశాన్ని మనకు ఇమ్మని అడిగిన ఎందఱో మహా ధనుల త్యాగ ఫలితం ఈనాటి మన భారత దేశం... కాని వచ్చిన స్వతంత్ర్యాన్ని మనం ఎలా నిర్వచించుకోవాలో తెలియని పరిస్థితి ఇప్పుడు ...
          ఎలా చూసుకున్నా ఇప్పటికి మన మీద గెలుస్తున్నది తెల్లవాడే... మన సంప్రదాయపు పండగల కన్నా మన అందరికి గుర్తుండే పండుగ న్యూ ఇయర్... మనం ఇష్టపడే దుస్తులు జీన్స్... మాతృభాష కన్నా మనకు బాగా వచ్చిన భాష ఇంగ్లీష్...ఈ పదాలు తెలుగులో చెప్పినా అర్ధం కాని వారు ఎందఱో.. అందుకే మనం ఎంతగా పరాయితనంపై మక్కువ పెంచుకున్నామో చెప్పడానికే ఈ ఉదాహరణలు... విశిష్టమైన మన మత గ్రందాల కన్నా మనకు తెలిసిన ముఖ పుస్తకమే ఎక్కువ ఇష్టం...బానిసత్వం నుంచి విముక్తి ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పటికీ పరాయి తత్వానికి బానిసలుగా చేసుకున్న తెల్లవాడే గెలిచాడు మన మీద...
         విదేశీ మోజులో పడి వలసలు పోతున్న ఎందఱో... స్వదేశీ మేధావులను అణగదొక్కి విదేశ యంత్రాంగానికి  పట్టం కడుతున్న రోజులు... మన దేశం గుర్తించలేని మన మేధావుల తెలివితేటల్ని ఉపయోగించుకుంటున్న విదేశాలు... ఇవి అన్ని చూస్తూ కూడా మన బానిసత్వపు సంకెళ్ళు తొలగిపోయాయని నమ్ముదామా... మనమూ అందరిలానే మనకు రాని స్వాతంత్ర్యానికి స్వాతంత్ర్య శుభాకాంక్షలు చెప్పుకుందామా నలుగురితో పాటు నారాయణా అంటూ... నువ్వే చెప్పు ఏం చేయాలో.....!!

14, ఆగస్టు 2015, శుక్రవారం

జ్ఞాపకాలు.....!!

వేదించే మదికి
నివేదించే నివేదనలు
జ్ఞాపకాలు
గడచిన కాలానికి
మిగిలే గురుతులు
జ్ఞాపకాలు
వాడని సుమాల
సుగంధపు పరిమళాలు 
జ్ఞాపకాలు
గతాన్ని గుర్తుచేస్తూ
వాస్తవంలో వర్తమానాలు
జ్ఞాపకాలు
కలతల 'కల'వరానికి
స్వాంతనిచ్చే 'స్వ'గతాలు
జ్ఞాపకాలు
వేకువ పిలుపులో
తొలిపొద్దు సంతకాలు
జ్ఞాపకాలు
అమృతాన్ని వర్షించే
అక్షరలక్షల కన్నియలు
జ్ఞాపకాలు
నవ్వుల సంతకాల
వెన్నెల తుణీరాలు
జ్ఞాపకాలు
చెలిమితో చేరిన
వెన్నెల్లో ఆడపిల్లలు
జ్ఞాపకాలు
తరగని నిధుల
పెన్నిధి భాండాగారాలు
జ్ఞాపకాలు
భావాలకు అందని
మనసు ముచ్చట్లు
జ్ఞాపకాలు
అటుఇటు వెరసి
జన్మజన్మల అనుబంధాలు
జ్ఞాపకాలు.....!!

అల్లరి శౌర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు...!!



12, ఆగస్టు 2015, బుధవారం

ఏక్ తారలు...!!

1. వెన్నెల కరువైందనేమో_మబ్బులు నిన్ను దాచుకున్నాయి
2. జాబిల్లి సిగ్గు పడుతోంది_ మబ్బుల్లో దాగిన నీ నవ్వులకు
3. నీటిలో ఎలా ప్రతిబింబిస్తోందో_మబ్బుల్లో చేరిన నీ నవ్వుల వెన్నెల
4. కలానికి కాషాయం కట్టినా_అక్షరాలకు సన్యాసం తెలియడం లేదు కదా
5. మౌన బాసలు తెలిసిన మదికి_లిపి లేని కంటి బాష ఎందుకు

11, ఆగస్టు 2015, మంగళవారం

రేపటికి శెలవన్నావు...!!

మారుతున్న రేపటి పొద్దులో
నిన్నటిని మరచి పోతున్నావు
నువ్వు విదిల్చిన నిన్నల్లోని
జ్ఞాపకాల్లో నన్ను ఉండమన్నావు
కాలానికి చిక్కని గాలంలో దాగిన
కలలకు అందని ఊహల్లో తోశావు
గతమే వాస్తవంగా నాకు మార్చేసి 
నీ వర్తమానంలో చోటు లేదన్నావు
గాయపడిన గుండెకు సాయంగా
ఒలుకుతున్న కన్నీటి కథకి తోడైనావు 
అక్షరాలకు అద్దకంగా అద్దుతున్న భావాలను
నీకు  చెప్పలేని మౌన కవనాలుగా చేశావు
నే కోల్పోయిన క్షణాలన్నింటిలో నీవే ఉంటూ 
ఏకాంతాన్ని జన్మలకు జతగా పరిచయించావు
కలతలకు నెలవుగా మారిన మదికి నేస్తమై
నిన్నటి నీతో ఉండి పొమ్మంటూ రేపటికి శెలవన్నావు...!! 

9, ఆగస్టు 2015, ఆదివారం

స్నేహం...!!

నేస్తం,
         మనకు అవసరం లేనివి పలకరింపుల క్షేమ సమాచారాలు... స్నేహం అంటే మనకు తెలియదు కాని మనల్ని మనంగా  అభిమానించడం మాత్రమే మనకు తెలుసు... స్నేహం అంటే ఇష్టమో ప్రేమో ఇప్పటికీ తెలియదు కానీ ఎప్పటికీ మనతోనే ఉండిపోతే బావుండు అని మాత్రం అనిపించేది స్నేహం.... కాలాలు మారినా యుగాలు గడచిపోయినా స్నేహంలోని తీయదనం ఇప్పటికి అలానే ఉండి పోయింది... అవసరానికి స్నేహం నటించేవారు దానిలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేరు.. నీ తప్పొప్పులతో నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు, స్వాగతించేవారు నీ ప్రియ  నేస్తాలు.... స్నేహంలో గంటల తరబడి మాటలు పంచుకోనవసరం లేదు... నెలల తరబడి కలిసి ఉండనక్కరలేదు...సప్త సముద్రాల ఆవల ఉన్నా ఎన్నేళ్ళు గడచినా మనస్సులో చిరస్థాయిగా మిగిలే స్నేహం ఎక్కడో నూటికి కోటికి ఒక్కటి... దీనికి బంధాలు బంధుత్వాలు అవసరం లేదు.. ఆత్మీయ పలకరింపు ఒకటి చాలు ... ఏళ్ళ తరబడి స్నేహ సౌరభం నిలబడి పోవడానికి.. కొందరికేమో చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా జీవితాంతం నిలిచిపోతాయి... మరికొందరేమో ఈ రోజువి రేపటికి మ ర్చిపోతారు... కొందరేమో జ్ఞాపకాలోనే బతికేస్తుంటే ఇంకొందరికేమో అసలు జ్ఞాపకాలే ఉండవు...ఏమిటో ఈ జీవితాలు...
 వెన్నెల్లో చందమామను పరిచయం చేసుకున్నట్టుగా... చీకట్లో అక్కడక్కడా కనిపించే నక్షత్రాలను
ఏరుకుంటునట్లుగా బాల్యాన్ని దాటేసి ప్రాయపు పరుగుతో పోటి పడినా విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న స్నేహం చిన్ననాటి జ్ఞాపకాలది... అందుకేనేమో మన వయసు ఎంత పెరిగినా మళ్ళి బాల్యాన్ని తలచుకుంటూ ఉంటాము... కల్మషం ఎరుగని పసి వయసు స్నేహం ఎప్పటికి మధురమైనదే...
ఇంతకీ స్నేహంలో ఇష్టం ఉందంటావా... ప్రేమ ఉందంటావా.... -:)
నీ నేస్తం...

8, ఆగస్టు 2015, శనివారం

అనుకోని అతిధిలా...!!

అలుపెరుగని కాలానికి
అలసట తెలిసిందట

మరుపే తెలియని మదికి
జ్ఞాపకాల తాయిలమిచ్చిందట

వెన్నెలకు అందని వెలుగులకి
వేకువ పొద్దును చూపిందట

రాతిరి చుక్కల రాయబారానికి
కలల రాదారిని పరిచిందట

బాల్యానికి తెలియని బాసలకి
బంధాలను బహుమతిగా ఇచ్చిందట

అసంపూర్ణ జీవితానికి
అనుకోని అతిధిలా నీ స్నేహమోచ్చిందట.....!!

7, ఆగస్టు 2015, శుక్రవారం

మణి మాలికలు....!!

1. ఎడారైన ఎడదలో
  ఒయాసిస్సులా చేరింది నీ జ్ఞాపకం
2. ఏకాంతానికి ఎడారి తోడయ్యింది
ఎండమావిగా మారిన ఎదకు నీ తలపులను తోడిస్తూ
3. ఎడారి బ్రతుకుతో వేసారిన నాకు
ఎదను తాకింది ఎన్నెలంటి నీ చెలిమి చెలమ  
4. నిరీక్షణకు సైతం కాలమే తెలియలేదు
 నిన్ను చేరిన కన్నీరు పన్నీరుగా మారానని చెప్పేంతవరకు

5, ఆగస్టు 2015, బుధవారం

ఏక్ తారలు....!!

1. మనసెందుకో ఊరికే ఉండదు_ కవితాక్షరాలకు దాసోహమనకుండా
2. విరుల అందాలకు_విరహమే పాదాక్రాంతమయ్యింది
3. భరించే బంధానికి_బాసటగా నిలవాలని
4. ఏకాంతానికి తోడుగా_ఏక్ తారా సమూహం అక్షర నక్షత్రాలతో
5. వాస్తవమై నీ ఎదుటే_కలలతో కాపురమెందుకు
6. తెలిసి ఆ మాయలో పడటమే_మనసు పని
7. వాలిపోతున్నా_మలి సందెలో
8. నీ రాకను తెలుపుతూ_పరిమళపు విరులు
9. సూదంటు రాయిలా తాకింది_గత జన్మల మనసులు వెన్నాడుతున్నందుకేమో
10. నీతో ఉన్న నిన్నలే నాకు చాలు_నువ్వు లేని వాస్తవం నాది కాదు
11. నేడు వెగటుగా ఉంది_నువ్వు లేని వాస్తవాన్ని చూడాలంటే
12. రేపటి స్వప్నాలు ఎదురు చూస్తున్నాయి_నిన్నటి క్షణాలు నీకు తిరిగి ఇవ్వాలని
13. వేకువకి సంతసమే_రేపటి స్వప్నం సత్యమై ఎదుట నిలుస్తున్నందుకు
14. నా ఓటమి నీ గెలుపుగా మారిన క్షణం_అది కల కాని వాస్తవమే
15. శీతలానికి గ్రీష్మం తోడయ్యింది_వెన్నెలను వారిస్తూ
16. జ్ఞాపకాలు గతుక్కుమంటున్నాయి_గతాన్ని పారవేస్తున్నావని
17. కల'వర'మైనా కమనీయమే_విజయం  వాకిట్లో ఉంటే
18. ఘన స్వాగతానికి సమాయత్త మౌతున్నాయి జ్ఞాపకాలు_వాస్తవం వెంట పడుతూ
19. అంబరం ఆర్నవమయ్యింది_చిరునవ్వుల సంబరం తాకినందుకు

మౌన సాక్షిగా....!!

ఎన్నో ఏళ్ళుగా ఎడారి జీవితంలో
మానుతున్న గాయాలకు చేరుతున్న
చుట్టపు పరామర్శలను, వంకర నవ్వులను
దేహమంతా రక్త సిక్తమై ధారలు కట్టినా
దాచేస్తున్న వలువలు బేలగా చూస్తున్నా
అర కొరగా కనిపిస్తున్న వాస్తవాలకు
అండగా నట్టింట నిలబడిన న్యాయానికి
ఆసరా కాలేక పోతున్నందుకు
కనపడని మనసు పడుతున్న వేదనకు
కానరాని సాక్ష్యాలను చూపించలేక
ముక్కలైన మదిని అతుకులు వేయలేక
శిధిలమైన గుండెకు చికిత్స చేయలేక
మూగబోయిన గొంతుకు స్వరాలు పలికించలేక
ఆజన్మాంతమూ సజీవ సమాధిలో బంధీనై
రోజు చూస్తూనే ఉన్నా మౌన సాక్షిగా....!!

ఏక్ తారలు...!!

1. కన్నుల్లో కన్నీటి సుడిగుండాలే_మది సంద్రానికి చేయూతనిస్తూ
2. మనసంతా చిక్కని జ్ఞాపకాలే_చిలికినకొద్దీ వెన్నలాంటి గురుతులనిస్తూ
3. అద్దంలో అందం అలిగింది_అబద్దాన్ని నిజం చేసినందుకేమో
4. నీ కోమల కంఠం అలసి పోతుందని_నీ బదులుగా కూడా నేనే చెప్పేస్తున్నా
5. నిదురిస్తూనే ఉన్నా_రెప్ప తెరిస్తే నువ్వు గీసిన ఉషోదయం మాయమౌతుందని
6. తీర్చలేని వరమడుగుతాననేమో_దేవుడు కూడా కనుమాయం
7. ప్రబంధ పరిమళాక్షరాలే_అక్షర లక్షల ప్రేమ పాశాలతో
8. అన్ని ఉన్న ఆప్యాయత ఒదిగింది_పై పై మెరుగుల నటనా కౌసల్యాల ముందు
9. ఏకాంతానికి తోడుగా_జ్ఞాపకాలను గతాన్ని అడిగి పంపిందేమో
10. నిరీక్షణలో చెలి తలపే_మదిలో ఆనంద తరంగ తారంగం
11. మరెప్పుడూ చూడని సంతోషం_ఆ ఏడుపులో కలిసినందుకేమో 
12. వాదన విరహంలో పడి_సరసాన్ని విరసంగా మార్చేస్తోంది
13. సంతోషం చేరువై పోదూ_నిరీక్షణ నీరసించాక
14. ఒళ్ళంతా కళ్ళుగా మారిన క్షణాలు_వేల యుగాల నిరీక్షణకు సాక్ష్యంగా
15. చేరువగా చేరిన చెలి చెలిమి_అమరత్వాన్ని సవాలు చేస్తూ
16. వేల జన్మలుగా దూరమైనా_ఒక్క క్షణం చేరువలో యుగాల దగ్గరతనం
17. గమకాల స్వరాలే_చెలి సాన్నిహిత్యంలో క్షణాలను సైతం దోచేస్తూ
18. సరసం సరాగాలు ఆలపిస్తోంది_వేదన వరస మార్చి హర్షంగా మారిందని
19. దగ్గరతనానికి దూరం తెలియదు_చేరువగా చెంతకు చేరడం తప్ప
20. హిందోళం హితాక్షరాలు పలికింది_పల్లవించే ప్రణయ గానానికి పరవశించి
21. వలపు పంటలో పండిన తలపుల తీయదనాలు_మధుర గమనాల గమకాలే
22. వన మయూరమే వయ్యారాలు పోయింది_ప్రణయ ప్రబంధాల ప్రకృతి పరిష్వంగణంలో
23. కొలతల కొలమానాలు చిన్నబోయాయి_చెలి చేరువలో క్షణాలను చేరలేక
24. వలపు వాయులీనమైంది_మోవిపై వాలిన మురళి మోహన రాగంలో
25. చెలి సుందర వదనే_సెల ఏటి అద్దంలో చంద్రబింబంలా మెరిసిపోతూ
26. పిలుపు పిల్లన గ్రోవిలో సాగి_మోహంలో మైమరపించింది
27. పిలుపుల ప్రియ గానంలో_తలపుల తాధాత్మ్యం

4, ఆగస్టు 2015, మంగళవారం

ఇదేనా పల్లెల అభివృద్ధి, పురోగతి... !!

నేస్తం,
          నువ్వెలా ఉన్నావని అడగబోవడం లేదు కాని నా మనసేం ఆలోచిస్తోందో నీకు చెప్పాలని ఈ లేఖ....
అనగనగా ఓ చిన్నది పెద్దది కాని పాడి పంటలతో కళ కళలాడే పచ్చని పల్లె సీమ ఒకప్పుడు... చదువు గురించి పెద్దగా తెలియని రోజుల్లోనే ఆ ఊరిలో నూటికి 95మంది విద్యావంతులు అదీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు... ఓ ఏభై ఏళ్ళ నాడే అమెరికా వెళ్ళిన వాళ్ళు కొందరు, వైద్య వృత్తి చేపట్టి ఇప్పటికి తమ ఊరికి సేవలు అందిస్తున్న మంచి మనసున్న వారు మరికొందరు... ఎక్కువమంది పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించే ఉపాద్యాయ వృత్తిలో స్థిరపడి చక్కని సేవలు అందిస్తున్నారు..ఏ చిన్న తప్పు జరిగినా ఊరి పెద్దలు రామాలయం వద్ద తపొప్పుల విచారణ చేసి తప్పుకి శిక్ష వేసేవారు ... ఏది జరిగినా ఊరి లోపలే ఉండేది.. వర్గాలు వేరుగా ఉన్నా అవసరానికి అందరు ఒకటిగా నిలబడేవారు... అప్పట్లో మా ఊరు అంటే చాలా గర్వంగా ఉండేది మా అందరికి ... ఇది మా  చిన్నప్పటి మా ఊరు .... ఇక మా తరం మా తరువాతి  తరం విషయానికి వచ్చే సరికి ఊరిలో సగం ఇళ్ళు ఖాళీ... పోనీ ఉన్న వారు బావున్నారా అంటే చదువుల కోసం వలసలు వెళ్ళిన వారు వెళ్ళగా మిగిలి ఉన్న వారిలో నైతిక విలువలు తగ్గిపోయాయి... హంగులు ఆర్భాటాలు, అహంకారాలు పెరిగి పోయాయి... ఎవరికి వారికి నా పెత్తనం ఉండాలంటే నాది ఉండాలి అన్న పట్టింపు... చదువు విలువ తెలియని నిశానీల చేతుల్లో పడి... తాగుడు, జూదం, పతనమైన జీవితపు విలువలు ఈ రోజు ఆ ఊరిలో నిత్య కల్యాణం పచ్చ తోరణంగా వెలుగొందుతున్నాయి... ఇంట్లో పెళ్ళాం మాట వదిలేయండి కనీసం పిల్లల పుట్టినరోజులు గుర్తు ఉండవు కాని ఊరిలో వెధవల పుట్టినరోజులకి పుట్టినరోజు కేకులు, బిరియాని పార్టీలు, ఒక్కోడేమో సంవత్సరానికి రెండు మూడు పుట్టినరోజులు చేసుకుంటూ... మూడు బిరియానీలు ఆరు మందు  సీసాలుగా ఉంది ఇప్పుడు... ఇదేనా పల్లెల అభివృద్ధి, పురోగతి... మా ఊరు ఒకప్పుడు చదువులకు పుట్టినిల్లు అని గర్వంగా చెప్పుకున్న మేము ఈ రోజు అదే ఊరు కూడు గుడ్డా ఇవ్వని పనికి మాలిన రాజకీయాలకు అడ్డాగా, ఎయిడ్స్ రోగులకు చిరునామాగా మారిందని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాము... చదువు విలువ తెలియని రోజుల్లోనే సరస్వతి కొలువున్న మా ఊరు ఈ రోజు ఇలా మారడానికి కారణం ఏమిటో...!!
ఓట్ల కోసం రైతు పేరు చెప్పుకుంటూ పల్లెల్లో పాద యాత్రలు చేయడం కాదు, ఏదో కంటి తుడుపు కోసం పల్లెలు దత్తత తీసుకుంటున్నాము అంటే సరి పోదు.. నెలవారీ కోటా సర్కారు ఇస్తోంది.. పెన్షన్లు ఇస్తోంది అని సరిపెట్టుకుంటే చాలదు.ంఉసలి ముతకా ఉంటారు వాళ్ళకి వేరే ఊరు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎలా వీలౌతుంది... అసలే ఇప్పుడు అంతా కంప్యూటరు మహిమ కదా ఆధునికీకరణ పేరుతో... తెలిసిన వారికి అందుబాటులో ఉంటే అందంగా ఉంటుంది.. తెలియని వారిని చేతి ముద్రలు పడలేదు, వేలి ముద్రలు పడలేదు అని రోజుల తరబడి మీ సర్కారీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటే అది సిగ్గు చేటు... రాజకీయ నాయకుల గెలుపు కోసం డబ్బు, మద్యం వాడకాల మూలంగానే చాలా పల్లెల్లో ఇదే పరిస్థితి... నాయకులు తీయగా మాట్లాడి గెలిచిన తరువాత వారి స్వలాభాన్నే చూసుకుంటున్నారు తప్ప జనం ఏమై పోయినా వారికి లెక్క లేదు.. మళ్ళి ఐదు ఏళ్ళకు మనకు కనిపిస్తారు నాగలి పట్టి నేను రైతు కుటుంబంలో నుంచి వఛ్చిన వాడినే అని... మనకు డబ్బు, మందు కావాలి వారికి ఓటు కావాలి ... చరిత్ర ఇలా పునరావృతం అవుతూనే ఉంటుంది ఏళ్ళు గడిచినా మారని బతుకులతో....!!
చూసావా నేస్తం రోజులు ఎలా మారిపోతున్నాయో... జీవితపు విలువలు ఎంతగా దిగజారుతున్నాయో...!!
నీ నేస్తం...

తెలుగు నేల పులకరిస్తోంది సంతోషంతో....!!

ఈనాటి యువతకు రేపటి నవతకు దిశా నిర్దేశకులు, స్పూర్తిదాయకులు అయిన శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్తా గారు దేశ విదేశాల్లో అందుకున్న ప్రశంసలు, అవార్డుల, రివార్డుల జాబితాలు పరిశీలిస్తే వారి ప్రతిభ గురించే చెప్పడానికి మాటలు చాలని పరిస్థితి...నిజంగా చెప్పాలంటే మన దేశంలో కన్నా విదేశాల్లో ఆయన చూపిన ప్రతిభకు ఒక తెలుగు వాడిగా ఎవరికి దక్కని ప్రతిష్టాత్మక గుర్తింపు విదేశీయులు ఇచ్చారంటే వారి మేధకు కొలమానం ఏమిటో మనకు తెలుస్తుంది... ఎక్కడో మారుమూల భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి కష్టనష్టాలను భరించి చదువులో మెండుగా రాణించి ఉన్నత శిఖరాలను అందుకుని ఈనాడు ప్రపంచ మేధావులతో శబాష్ అనిపించుకున్న ఈ అతి పిన్న వయసు అపర మేధావి మనోగతంలో తన దేశం, తన రాష్ట్రం ప్రపంచంలో ప్ర ప్రధమ స్థానంలో ఉండాలన్న చిన్న కోరిక  పెరిగి పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బలీయమై తను ఎన్నో పరిశోధనలు చేసిన ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగంలో మెళకువలు తనవారికే ఉపయోగపడాలన్న బలీయమైన కోరికతో స్వదేశానికి తన సేవలను అందించడానికి ముందుకు వచ్చిన ఈ తెలుగు తేజం... ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం అన్న నడవడితో విదేశాల్లో సైతం తెలుగు వారికి అజాత శత్రువై తన అండ దండలు అందిస్తూ... అందరి అభివృద్ధితో పాటుగా తన దేశం, రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుండాలని ఆరాటపడుతూ... ప్రపంచానికి తెలుగువాడి సత్తా ఏంటో నిరూపించిన శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్తా గారు చరిత్రలో చిరస్మరణీయులు... రాబోయే రోజుల్లో ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగంలో తన పేరును సువర్ణాక్షరాలతో
లిఖించదగ్గ చరిత్ర సృష్టిస్తారనడంలో ఏమాత్రము సందేహం లేదు... ఎన్నో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు, సత్కారాలు విదేశీయుల చేతుల మీదుగా పొంది స్వదేశ కీర్తిని ప్రపంచానికి తెలియజెప్పి భారతీయత విలువతో పాటు తెలుగు'వాడి' మేధోసంపత్తిని తేటతెల్లం చేసి పిన్న వయసులోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ తెలివితేటల భాండాగారం మన తెలుగు వారిదే అని.. తెలుగు నేల పులకరిస్తోంది సంతోషంతో....!!

మన వాడైన తెలుగు'వాడి' వేడి...!!

అనితర సాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచ మేధావులతో శభాష్ అనిపించుకున్న మన తెలుగు'వాడి' సత్తా ప్రపంచం అంతా గుర్తించాక మనం గుర్తించడం కాస్త బాధాకరమే... లెక్కలేనన్ని సత్కారాలు, సన్మానాలు, మరెన్నో పురస్కారాలు అందుకున్న యువ మేధావి శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్తా గారు ఎందరికో మార్గ నిర్దేశకులు... నిరంతరం జనించే కొత్త ఆలోచనలకు వైవిధ్యంగా రూప కల్పన చేస్తూ తన మాతృ భూమి ప్రపంచంలో అత్యున్నతంగా ఉండాలని కాక్షించే వివేకానందుని బోధనల ప్రభావితుడు... అత్యంత  ప్రతిభాశాలి.
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహా పురుషులౌతారు అన్న మాటలకు అక్షరాలా సరిపోతారు శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్తా గారు... అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ఆటు పోట్లను తట్టుకుని సమస్యకు సమాధానం చెప్పగలిగిన ధీశాలిగా ఈ రోజు మన ముందుకు వచ్చారంటే ఆ మనః స్థైర్యం వెనుక ఎంత అలజడి ఉందో... అవమానాలు ఉన్నాయో... ఎన్ని నిద్ర లేని రాత్రులు ఉన్నాయో... ఎన్ని కోల్పోయిన జ్ఞాపకాలు వెన్నాడుతున్నాయో... అయినా మొక్కవోని ధైర్యం, నిరంతర శ్రమ, దానికి తగిన అకుంఠిత దీక్ష, కసి . పట్టుదల... ఇలా ఎన్నో ఆలోచనల రూపమే ఈ రోజు మన ముందు ఉన్న ఎం ఎన్ ఆర్ గుప్తా గారు.
పట్టువదలని కార్యదీక్ష ఆయన సొంతం... అదే గుప్తా గారు సాధించిన విజయాలకు మూలం... ఎంతో మంది యువత ఎంతసేపు నా వాళ్ళు  చేశారు లేదా ఈ దేశం నాకేం ఇచ్చింది అనే వాళ్ళే కాని వారి ఎదుగుదలకు సోపానాలుగా మారిన కుటుంబాన్ని కాని దేశాన్ని కాని గుర్తు పెట్టుకున్న వారు ఈ రోజుల్లో చాలా అరుదు. ఆ అరుదైన వ్యకిత్వం అది మన తెలుగువాడు కావడం నిజంగా తెలుగు జాతి చేసుకున్న అదృష్టం అని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు.
భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి చదువులో అత్యున్నత స్థానాలను అందుకుని ట్రాన్స్పోర్టేషన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించి అప్పట్లో చంద్రబాబు గారికి విజన్ 2020 లో చక్కని సూచనలు అందించి మన పక్క రాష్ట్రమైన కర్నాటకకు సలహాలను అందించి తన సేవలను వినియోగించారు...
తన ప్రతిభకు మెరుగులు దిద్దుకోవడానికి విదేశాలు వెళ్ళి పరాయి వాడిని మెచ్చుకోలేని పర జాతీయులతో శభాష్ అనిపించుకున్న నేటి మేటి భారతీయుడు మన గుప్తా గారు. ఎంతో మంది యువతకు స్పూర్తి ఈనాడు. 
నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు గారి పిలుపుకు స్పందించి స్వచ్చందంగా ముందుకు వచ్చి తను దేశ విదేశాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గడించిన అపార అనుభవాన్ని మాతృభూమికి అందించాలని ఆరాటపడుతూ సహజ ఒనరుల వినియోగం, రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు... పర్యాటక రాబడుల గురించి వివరాలు అందించి... నేను సైతం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, నిర్వహణకు సిద్దం అని పెట్టుబడుల సేకరణకు నడుం బిగించారు... రేపటి రోజున అత్యున్నత ప్రమాణాలతో మన రహదారులు, ప్రభుత్వ నిర్మాణాలు గుప్తా గారి ముద్రతో పది కాలాలు నిలవాలని ప్రపంచానికే తలమానికం కావాలని... ఆకాంక్షిస్తూ... మన వాడైన తెలుగు'వాడి' తెలివిని మనం గుర్తిస్తూ గర్విద్దాం తెలుగు వారిగా...!!

మాతృభూమికి...!!


కాలాన్ని  తోడుగా తీసుకుని
బాంధవ్యాలను వదులుకుని, బంధాలను దాటుకుని
కన్నపేగును వదలి కాసుల కోసం పరుగులెట్టాను
మమకారాన్ని మరచి మాయలో పడిపోయాను
ఆశల విహంగాల రెక్కలతో కోర్కెల గాలాలకు చిక్కి
ఎక్కడో ఆవలి తీరాలకు తరలి పోయాను...
అలసిన నా మది తల్లడిల్లింది నిజాలను గ్రహించి
కానరాని ఆత్మీయత కోసం ఆర్రులు చాసాను కన్నీటి ధారలలో కన్నవాళ్ళ రూపాలు మసకబారాయి
రూకలకు బంధిలయినాయి రుధిరపు చుక్కలు
రక్తాశ్రువుల్లో రాలాయి రక్త సంబంధాలు
పలకరింపుల పల్లకీలు మౌనమైనాయి
వేదనల చుట్టాలు పక్కనే చేరాయి
వాస్తవాలు వద్దన్నా వెంట పడ్డాయి
అమ్మ ఒడిలో సేదదీరాలన్న ఆతురత అక్కునజేరి
పరుగు పరుగున పయనమయ్యాను మాతృభూమికి...!!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖల నమూనా....!!

అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న నూతన రాజధాని నిర్మాణానికి ప్రాజెక్ట్ ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ ( పి పి పి ) సహకారంతో తయారు చేశామని భీమవరం వాస్తవ్యులు, ఒమన్ లో ప్రముఖ ప్రాజెక్ట్ నిర్వహణా నిపుణులు శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్త గారు భీమవరంలో సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఒమాన్ దేశ ఎన్ ఆర్ ఐ అయిన తను 50 మంది అంతర్జాతీయ నిపుణులతో ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్ ను తయారు చేసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి అందజేశామని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం సుమారుగా 3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని చెప్పారు. ప్రస్తుతం ఒమన్ నుంచి సౌది అరేబియాకు జరుగుతుతన్న హైవే నిర్మాణానికి ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నానని చెప్పారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మ్యాప్ మాత్రమే అందజేశారని తాము మాత్రం ఏ ఏ ప్రాంతాల్లో బిల్డింగులు నిర్మించాలి అనే వాటిపై ప్రాజెక్ట్ ల ద్వారా ప్లాన్ తయారు చేసి సి ఎమ్ కు ఇచ్చామని తెలిపారు. భీమవరానికి చెందిన తను 12 ఏళ్లలో అతి ప్రతిష్టాత్మకమైన 20 అవార్డులు సాధించానని ముఖ్యంగా రైల్వే కాన్ఫరెన్స్ అవార్డు 2014 ను అందుకున్నానని చెప్పారు. రాజధాని ప్రాజెక్ట్ ల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

వర్ణాలు...!!

వర్ణాలు....!!
వేవేల వర్ణాల అందాలు
వర్ణించనలవి కాని భావాలు
కులాలకు అతీతమైన కలల కావ్యాలు
మతాలకు చిక్కని మనసున్న వర్ణాలు
భాషలకందని భావనా జలపాతాలు
వసుదైక కుటుంబానికి నిర్వచనాలు
రుధిరావేశాలకు చరమ గీతాలు
కాల్పనిక జీవితానికి సందేశాలు
మారుతున్న కాలానికి నిలువుటద్దాలు
 జాత్యహంకారానికి తలవంచని విజయ కేతనాలు
ప్రపంచ శాంతికై ప్రార్ధిస్తున్న సర్వ మత సమ్మేళనాలు
కలిసిన ఈ రంగులు వేరైన ఒకే రక్త వర్ణాలు...!!

1, ఆగస్టు 2015, శనివారం

సాహితీ సేవ వారి "తెలుగు సాహితీ ముచ్చట్లు "

సాహితీ సేవలో నా తెలుగు సాహితీ ముచ్చట్లను e పుస్తకంగా నా మొదటి e పుస్తకాన్ని రూపొందించాను ...
ఈ సాహితీ ప్రయాణంలో నాకు సహకరించిన, నన్ను ప్రోత్సహించిన అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు... ఈ శీర్షిక రాయడానికి నాకు అవకాశాన్ని ఇచ్చిన కంచర్ల సుబ్బానాయుడు గారికి కృతజ్ఞతలు
https://issuu.com/manju13/docs/____________________________________048f4edc365cee/3?e=0
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner